మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా, తాను పుట్టిన గడ్డమీద మమకారం మాసిసోదు. తన పూర్వీకుల గురించి తెలుసుకోవాలన్న తపన అందరికీ ఉంటుంది. తన ప్రాంత చరిత్ర, సంస్కృతి సంప్రదాయాలు, గత వైభవాల స్మృతులను సమీక్ష చేసుకోవాలన్న ఆరాటం అంతర్లీనంగా ఎందుకో మెదులుతూనే ఉంటుంది. ఒకనాడు మహావైభవంగా తేజరిల్లిన నగరాలు, చక్రవర్తుల శౌర్య ప్రతాపాలు, అద్భుతంగా పరిఢవిల్లిన శిల్పాకళా సౌందర్యాలు, అనాటి రాజులు అభేద్యంగా నిర్మించిన అద్భుతమైన కోటలు, అబ్బురపరిచే రాతి కట్టడాలు, అనాటి రాచరిక వ్యవస్థకు సంబంధించిన ఆనవాళ్ళు, అటు నాటి కవుల కావ్యాల్లోనే కాక ఇటు రాజుల శాసనాల్లో, రాగి రేకుల్లో, దేవాలయాల్లో, కోట బురుజుల్లో నిక్షిప్తమైన మనకు గతకాలపు వారసత్వ సంపదగా నేటికీ లభిస్తోంది.
అలాంటి చారిత్రక సంపదకు ఆలవాలంగా మన తెలంగాణ రాష్ట్రంలో అనేక గిరి దుర్గాల, స్థల దుర్గాలు, జల దుర్గాలు, వన దుర్గాలు శిథిలాలుగా, నేటికీ మనకు అక్కడక్కడా దర్శనమిస్తాయి. అలాంటి ఒకానొక గిరి దుర్గం, మారుమూల కొండపై శత్రుదుర్భేద్యంగా నిర్మించిన ‘రామగిరి ఖిల్లా’.
తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరానికి 230 కి.మీ. దూరంలో కరీంనగర్ జిల్లా పెద్దపల్లి నుండి మంథనికి వెళ్ళే రహదారిలో బేగంపేట శివార్లలో ఈ ఖిల్లా నిర్మించబడింది. అటు ప్రజల నిరాదరణకు ఇటు గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురైన ఈ ఖిల్లాను గమనిస్తే రాతిగుండెలు సహితం ద్రవించిపోతాయి. చారిత్రక సంపదను పరిరక్షించుకోవాలన్న అవగాహన లేని కొందరు, నిధులుంటాయనో లేక మరే ప్రయోజనానికో అనాటి తీపి గుర్తుల్ని ధ్వంసం చేయటం మన దురదృష్టం.
బేగంపేట గ్రామం నుండి రెండు-మూడు కిలో మీటర్ల దూరం కాలి నడకన బయలుదేరితే నాడు శతృదుర్భేద్యంగా నిర్మించిన ఈ కోట దగ్గరికి చేరుకుంటాం. ఎటుచూసినా పెరిగిన మొక్కలతో, కూలిన రాతిగోడలతో శిథిలమైన ప్రవేశ ద్వారం చూస్తే హృదయం మూగబోతుంది.
ప్రధాన ప్రవేశ ద్వారం నుండి ఎత్తయిన కొండపైకి ఏమాత్రం అనువుగాలేని బండరాళ్ళనెక్కుతూ మరో 5 ప్రవేశ ద్వారాలను దాటితేగాని సువిశాలమైన కోట పై భాగానికి చేరుకోలేం.
గజఫీుంకారాలతో, అశ్వ ఘోషలతో, సైనికుల పద ఘట్టనలతో, వందిమాగధుల కైవారాలతో, నర్తకుల నృత్యశోభతో, కవిగాయకుల అమరగానంతో వైభవోపేతంగా అలరారిన ఒకప్పటి కోట, నేడు కూలిన బురుజులతో శిథిలమైన దైన్యస్థితిలో ఎటు చూసినా ప్రాభవం కోల్పోయిన ప్రాకారాలతో కనిపిస్తూ హృదయాన్ని ద్రవింపజేస్తుంది.
నేటికీ ప్రకృతి సోయగాల మధ్య సమున్నతంగా మనకు దర్శనమిచ్చే ఈ ఖిల్లా పరిసరప్రాంతాల్లో అమూల్యమైన వనమూలికలకు, అరుదైన వృక్షాలు మనకు కనిపిస్తాయి. ఆనాటి వైభవానికి ఆనవాళ్ళుగా నిలిచిన అద్భుతమైన రాతి కట్టడాలు నాటి శిల్పుల అద్భుత ప్రతిభకు తార్కాణంగా, శిథిలాల సౌందర్యం మనల్ని ఉత్తేజపరుస్తుంది. ఏ సాంకేతిక పరిజ్ఞానం లేకుండానే అంత ఎత్తయిన కొండలమీద నిర్మించిన నాటి సౌధ నిర్మాణ కౌశలం మనల్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది.
కోటకు వాయవ్య దిశలో కొద్ది మైళ్ళ దూరంలో తొలి తెలుగు రాజు ఏలిన శాతవాహనుల రాజధాని కోటిలింగాల శిథిలాలు దర్శనమిస్తాయి. రామగిరి చుట్టుప్రక్క గ్రామాలైన ధూళికట్ట, బొంకూరులో నాటి రాజు బంగారు, వెండి, రాగి నాణాలు, వారు వాడిన పనిముట్లు, కొన్ని శాసనాలు పురావస్తు శాఖ వారి త్రవ్వకాల్లో బయటపడ్డాయి. గొప్ప చరిత్రాత్మక సంపదకు, రాచరిక వైభవానికి సాక్ష్యంగా మిగిలిన రామగిరి ఖిల్లా కూడా శాతవాహనుల కాలంలోనే కట్టబడి వుంటుందని స్థానికుల అభిప్రాయం. చాళుక్యులు, రాష్ట్ర కూటులతోపాటు ఎన్నెన్నో రాజవంశాలు ఈ కోటపై ఆధిపత్యం వహించిన దాఖలాలు చరిత్రలో మనకు కనిపిస్తాయి. కాని ఈ కోట మహావైభవం మాత్రం కాకతీయుల కాలం నుంచే మనకు ప్రస్ఫుటంగా ఖిల్లాకు సంబంధించిన చరిత్ర ద్వారా తెలుస్తున్నది.
కాకతీయుల, ముసునూరి నాయకులు అనంతరం స్వాతంత్య్రం ప్రకటించుకొని ఓరుగల్లు కోటనేలిన రేచర్ల అనపోతానాయుడి కాలంలో ‘సబ్బిసాయిర’ మండలంగా పిలువబడే కరీంనగర్ ప్రాంతంలోని రామగిరి కోటకు ముప్ప భూపాలుడు అధిపతి అయినట్లు శాసనాల ద్వారా, లభిస్తున్న చరిత్ర ద్వారా తెలుస్తోంది.
ముప్ప భూపాలుని మంత్రి కేసనామాత్యుడు. కేసనా మాత్యుడి సోదరుడు కందనా మాత్యుడు. ఈయన వెలిగందల కోటకు రాజప్రతినిధి. ముప్ప భూపాలుని ఆస్థానకవి మడికి సింగన తన ‘పద్మపురాణోత్తర ఖండాన్ని’ వెలిగందల కందనామాత్యునికి అంకితం ఇచ్చాడు. కృతిపతి చరిత్రకు సంబంధించిన పద్యాల్లో కృతిపతి వంశావళిలో, ముప్ప భూపాలుని ప్రసక్తి, రామగిరి విశేషాలు ప్రస్ఫుటంగా తెలుస్తాయి.
అనంతర కాలంలో బహమనీ సుల్తాన్ అహ్మద్‌షా ఈ ప్రాంతంపై ఆధిపత్యం కోసం దండెత్తటంతో ‘రామగిరి ఖిల్లా’ మహమ్మదీయుల పాలనలోకి వెళ్ళింది. ఆ తరువాత గోల్కొండ సింహాసనాన్ని అధిష్టించిన కుతుబ్‌షాహీ వంశ స్థాపకుడు సుల్తాన్ కులీకుతుబుల్ ముల్క్ స్వాతంత్య్రం ప్రకటించుకున్న ఎల్గందల ఖిలేదార్ ఖివాముల్ ముల్క్ పై పెద్ద సైన్యంతో దండెత్తి వచ్చాడు. యుద్ధం నుండి అర్థాంతరంగా బెరార్ పారిపోయిన ఖివాముల్ ముల్క్, బెరారు పాలకుడు ఇమాదుల్ ముల్క్ సేనతో తిరిగిరాగా సుల్తాన్ కులీసేను బెరార్ సేనను ఈ రామగిరి ఖిల్లా వద్ద ఎదిరించాయట. భీకరంగా జరిగిన ఆ యుద్ధంలో రక్తపుటేరులు ప్రవహించాయని చెబుతారు. యుద్ధంలో విజయం సాధించిన సుల్తాన్ కులీ ఈ రామగిరి ఖిల్లాను వశపరచుకున్నాడు. కుతుబ్‌షాహీ కాలంనాటి శాసనం ఒకటి ప్రవేశ ద్వారానికి కుడివైపు గోడపై నేటికీ మనకు కనిపిస్తుంది. ఈ శాసనం ఎనిమిది పంక్తులు కలిగి తెలుగులో లిఖించబడింది. తుమ్మీఖాన్ అనే వ్యక్తి కోట దర్వాజా కట్టించినట్లు ఈ శాసనం ద్వారా తెలుస్తున్నది.
1656లో జరిగిన యుద్ధంలో గోల్కొండ సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్‌షా ఔరంగజేబుకు చెందిన దక్కను రాజప్రతినిధి సేన చేతిలో ఓడిపోయినపుడు అతని కుమార్తెను ఔరంగజేబు కుమారుడైన మహమ్మద్‌కిచ్చి వివాహం చేశాడు. ఆ సమయంలో వరకట్నం కింద రామగిరి ఖిల్లాని మొగులులకు గోల్కొండ సుల్తాన్ అప్పగించాడు. ఔరంగజేబు ఒకసారి షేక్ మొహియుద్దీన్ (ఉర్ప్‌నసీరొద్దీన్) తో సహా ఈ ఖిల్లాను సందర్శించి ఈ కోట సౌందర్యానికి ముగ్ధుడయిపోయాడట. గోదావరి, మానేరు నదులను చూసి వారు ఆనందమనుభవించారట. అప్పుడు అక్కడి పండితులు దీనిని రాంగీర్ బదులుగా ఆరాంగీర్ అనిపిలిస్తే బాగుంటుందని వారికి సూచించారట. అప్పటి నుండి వారి కాలంలో రామగిరి ఖిల్లా ఆరాంగీర్‌గా పిలువబడింది అని చెబుతారు. క్రమంగా రామగిరి మొగులుల నుండి ఆసఫ్‌జాహీ నవాబు పాలనలోకి వచ్చింది. తరువాత కాలంలో దేశ్‌పాండేలు, దేశ్‌ముఖ్ లు ఈ ఖిల్లాని పాలించారు.
రామగిరిపై అనేక సందర్శనీయ స్థలాలున్నాయి. సీతారాముల ఆలయం, శ్రీరామస్థాపితలింగం, శ్రీరామ పాదచిహ్నాలు, జానకీ మాత పాదచిహ్నాలు, సీతమ్మ కొలను మొదలగునవి వుండటంతో శ్రీరాముడు ఈ కొండను సందర్శించినందున ఈ ప్రదేశాన్ని ‘రామగిరి’గా పిలువబడుతున్నదని కొందరు పెద్దలు అంటారు.
ఈ కోటలో రాతి కట్టడాలు, కోటగోడలు, బురుజులు, భవనాలు, సమాధులు, మసీదులు, బావులు, మంచినీటి కొలనులు ఉన్నాయి. దుర్గాంతర్భాగంలో ప్రతాపరుద్రదేవుని కోట, అశ్వశాల, దర్బార్, చెరశాల, గజశాల, భోజనశాలతోపాటు రహస్యమార్గాలు, సొరంగాలు, తోపులు, ఫిరంగులు, ఫిరంగి గుండ్లను మనం నేటికీ చూడవచ్చు. ఈ దుర్గంలో వున్న ఫిరంగిలో నుండి దూరితే పిల్లలు కలుగుతారని ఇక్కడి ప్రజల విశ్వాసం. ఈ ఫిరంగీని ‘పిల్లల ఫిరంగీ’ అని పిలుస్తారట. ఇంకా చిత్రకోట, త్రాటికోట, నిమ్మకోట, నగరాలఖానా మందుగదులు, తోపుదారి, నలకయ్య బావి, పసరుబావి, హరిబావి, అచ్చమ్మబావి, అమ్మగారిబావి, దేవస్థలము, సప్తద్వారము, చౌకీలు మొదలగునవి ఇక్కడ ఉన్నాయని చెబుతారు. అవన్నీ చూడాలంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకోవటమే అవుతుంది. ఎక్కి దిగటమే అత్యంత కష్టతరంగా వున్న ఈ ఖిల్లాను చూడాలంటే కోట గురించి బాగా తెలిసిన గైడు చాలా అవసరం. గైడుతో పాటు కనీసం ఐదారుగురు కలిసి మాత్రమే ఈ మారుమూల ప్రదేశానికి వెళితే మంచిది. అడవిలో జనావాసాలకు సుదూర ప్రాంతంలో ఉండటం వల్ల క్రూర జంతువులకు ఈ ప్రదేశం ఆవాసంగా మారింది. గుట్టపైనే కొన్ని మైళ్ళు నడవటం, ఎగుడు దిగుడు రాళ్ళ దారి ఉండటంతో సరైన వసతులు, ఏర్పాట్లు లేకుండా ఖిల్లా సందర్శించడం కష్టతరం. ఇప్పటికైనా రామగిరి ఖిల్లాని పరిరక్షించటానికి ప్రభుత్వం చొరవ తీసుకుంటే ఇది గొప్ప పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందటమేగాక భావి తరాలకు ఒక గొప్ప చారిత్రాత్మక వారసత్వ సంపదగా మిగిలిపోతుంది.
వేలాది సంవత్సరాల వైభవాన్ని చవిచూసిన ‘రామగిరి ఖిల్లా’ని మధురమైన జ్ఞాపకంగా దర్శించుకోవటం నిజంగా గొప్ప అనుభూతి.