ప్రముఖ సాహితీవేత్త రామా చంద్రమౌళికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రగతి భవన్‌లో కాళోజీ సాహిత్య పురస్కారం ప్రదానం చేశారు. కాళోజి పురస్కారానికి రామా చంద్రమౌళి సంపూర్ణ అర్హుడని సిఎం అన్నారు. కాళోజీ సాహిత్య పురస్కారం కింద రూ. 1,01,116 నగదు, జ్ఞాపిక అందించి, శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస గౌడ్‌, ప్రభుత్వ సలహాదారు కె.వి. రమణాచారి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రొఫెసర్‌ రామా చంద్రమౌళి జీవిత విశేషాలు సంక్షిప్తంగా
1950 లో జన్మించిన ప్రొఫెసర్‌ రామా చంద్రమౌళి మెకానికల్‌ ఇంజనీరింగ్‌ లో పోస్ట్‌ గ్రాడ్యుఏషన్‌ పూర్తి చేసి ప్రస్తుతం వరంగల్లులోని ‘గణపతి ఇంజనీరింగ్‌’ కాలేజ్‌లో వైస్‌ ప్రిన్స్‌పాల్‌గా పనిచేస్తున్నారు. ఆయన ప్రసిద్ధ కవి, కథలకు, నవలాకారులు మరియు విమర్శకులు. ఇంతవరకు 53 గ్రంథాలను ప్రచురించిన చంద్రమౌళి 32 నవలలు, 356 కథలు, 12 కవిత్వ సంపుటాలు, 3 నాటకాలు, 4 విమర్శా గ్రంథాలను వెలువరించారు. 2011లో గ్రీస్‌ లో జరిగిన ‘11 వ ప్రపంచ కవుల సదస్సు’ లో భారత ప్రతినిధిగా పాల్గొన్నారు. 2016లో తైవాన్‌ లో జరిగిన ‘ప్రపంచకవుల సదస్సులో కూడా భారత ప్రతినిధిగా పాల్గొని తన కవితను వినిపించారు. తన ‘భూమి దుఃఖం’ కథను దూరదర్శన్‌, హైదరాబాద్‌ ‘టెలీఫిల్మ్‌’ గా నిర్మిస్తే అది ‘2011 వ సంవత్సరపు ఉత్తమ టెలిఫిల్మ్‌’ గా ఎంపిక చేయబడి ‘స్వర్ణ నంది’ పురస్కారాన్ని పొందింది.

రాష్ట్ర స్థాయి అత్యున్నత సాహిత్య పురస్కారం ‘తెలుగు విశ్వవిద్యాలయ కవితా పురస్కారం – 2007’లో, ప్రతిష్టాత్మక ‘సినారె కవిత్వ పురస్కారం – 2008 ‘డా. ఆవంత్స సోమసుందర్‌ కవిత్వ పురస్కారం – 2012,’ గుంటూరు శేషేంద్రశర్మ కవిత్వ పురస్కారం – 2015, ప్రతిష్టాత్మక ‘ఫ్రీ వర్స్‌ పురస్కారం – 2012’, కొకూరి భాగీరథీ కవిత్వ పురస్కారం – 2012, వంటివి కోకొల్లలు సాధించారు.

ఇవిగాక ఫిలిప్పీన్స్‌ ప్రభుత్వ జీవిత సాఫల్య పురస్కారం – 2017 – ‘ది ఆంధ్ర మహాసభ , ముంబై జీవిత సాఫల్య పురస్కారం – 2015’, ‘కళారత్న – 2018,’ ‘స్వర్ణలేఖిని – 2018’ పురస్కారం వంటివి ఎన్నో పొందారు. ఇంజనీరింగ్‌ విద్యార్థులకు 6 పాఠ్య గ్రంథాలను రచించడం వల్ల 2000 లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి నుండి ఉత్తమ ఇంజనీరింగ్‌ అధ్యాపక పురస్కారాలను స్వీకరించారు. చంద్రమౌళి గారి కథలు, కవిత్వం, నవలలు అనేకం పంజాబి, తమిళ, కన్నడ, బెంగాలి. హిందీ వంటి తెలుగేతర భారతీయ భాషల్లోకి అనువదించబడి జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతిని సమకూర్చిపెట్టాయి.

Other Updates