పేద దేశాల ప్రజలకు అందించడానికి తక్కువ ధర కలిగిన వ్యాక్సిన్లు తెలంగాణనుంచి ఎగుమతి కావడం రాష్ట్రానికి గర్వ కారణమని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అన్నారు. శాంతా బయోటెక్నిక్స్ తయారు చేసిన ‘శాన్-5’ వ్యాక్సిన్ల మొదటి ఎగుమతి ప్యాక్ సీఎం చేతులమీదుగా డిసెంబర్ 23న ఆఫ్రికా దేశాలకు పంపారు. ప్రగతిభవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో శాంతా బయోటెక్నిక్స్ ఛైర్మన్ వరప్రసాద్‌రెడ్డి, ఈడీ డాక్టర్ మహేష్‌భల్గట్, వివిధ విభాగాధిపతులు డాక్టర్ అమిత్‌కుమర్, డాక్టర్ నాగార్జున ఆకుల, జీ.రవికుమార్, ఫాల్గుణ, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుడు రాజీవ్‌శర్మ, ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రపంచంలోని పలు బహుళ జాతి సంస్థలు అందించే వ్యాక్సిన్లకన్నా చాలా తక్కువ ధరలో శాంతా బయోటెక్నిక్స్ తయారుచేసే వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూనిసెఫ్ సంస్థలు కూడా శాంతా బయోటెక్నిక్స్ ఉత్పత్తులను గుర్తించి, పేద దేశాలకు వీటిని ఎగుమతి చేయడం రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణమన్నారు. గతంలో అనేక ప్రాణోపయోగకరమైన వ్యాక్సిన్లను ప్రపంచానికి అందించిన సంస్థ… ఇప్పుడు ఒకే వ్యాక్సిన్‌తో ఐదురకాల వ్యాధులను అరికట్టే రోగ నిరోధక మందును అందించడం ఎంతో ఉపయోగకరమని సీఎం అన్నారు. టీఎస్ ఐపాస్ చట్టం ద్వారా తెలంగాణలో పరిశ్రమలకు ఎంతగానో ప్రోత్సాహం అందిస్తున్నామని, తెలంగాణలోని పరిశ్రమలు, ఫ్యాక్టరీలో ప్రపంచానికి ఉపయోగపడే ఉత్పత్తులు అందించడం ఆనందంగా ఉందని సీఎం చెప్పారు.
మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని ముప్పిరెడ్డిపల్లిలో శాంతా బయోటెక్నిక్స్ రెండో మాన్యఫాక్యరింగ్ యూనిట్లో ‘శాన్-5’ వ్యాక్సిన్ తయారైంది. డి.టి.పి. హైపటైటిస్-బి, హిట్ అనే ఐదురకాల వ్యాధులు రాకుండా ఈ ఒకే వ్యాక్సిన్ ద్వారా రోగ నిరోధకశక్తిని అందిస్తారు. చిన్న పిల్లలకు ఆరు, పది, పద్నాలుగు వారాల్లో మూడు డోసుల్లో ఈ వ్యాక్సిన్ వేయాలి. దానివల్ల ఐదురకాల జబ్బులు జీవితంలో దరిచేరవు. భారతదేశంలో ఇలాంటి వ్యాక్సిన్ తయారు కావడం ఇదే మొదటిసారి. ప్రపంచంలోని వేరే దేశాలు తయారుచేసే వ్యాక్సిన్ల ధరలో శాంతా బయోటెక్నిక్స్ అందించే వ్యాక్సిన్ ధర ఏడో వంతు మాత్రమే. ప్రపంచ ఆరోగ్య సంస్థ, భారత ఔషధ నియంత్రణ సంస్థలు ఈ వ్యాక్సిన్‌ను గుర్తించాయి. నాణ్యత, ధర విషయంలో ఈ వ్యాక్సిన్ ఎంతో ఉపయోగకరమైనది కావడంతో యూనిసెఫ్ ఈ వ్యాక్సిన్‌ను కొనుగోలు చేసి పేద దేశాలకు అందించడానికి నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆఫ్రికా దేశాలైన నైజీరియా, మొరాకో రువాండా దేశాలకు ఈ వ్యాక్సిన్ పంపాలని నిర్ణయించింది. మేడిన్ తెలంగాణ (ఇండియా) లేబుల్‌తో రూపొందించిన వ్యాక్సిన్ మొదటి ప్యాక్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా ఈ మూడు దేశాలకు పంపారు.