రాష్ట్రంలో అమెజాన్ వేర్‌హౌస్
ఆన్‌లైన్ వ్యాపారంలో ప్రపంచస్థాయిలో అగ్రగామిగా వెలుగొందుతున్న అమెజాన్ సంస్థ తెలంగాణ రాష్ట్రంలో భారీ వేర్‌హౌస్ నెలకొల్పడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. మన రాష్ట్రంలో తమ వ్యాపార విస్తరణ ప్రణాళికలపై చర్చించేందుకు అమెజాన్ రియల్‌ఎస్టేట్ హెడ్ జాన్ షాట్లెర్ నేతృత్వంలోని ఆ కంపెనీ ప్రతినిధి బృందం ఫిబ్రవరి 4న రాష్ట్ర ఐ.టి. శాఖామంత్రి కె. తారకరామారావుతో చర్చలు జరిపింది.
సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో పరిశ్రమలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్ర, ఐ.టి.శాఖ కార్యదర్శి హరిప్రీత్‌సింగ్, ఐ.ఐ.సీ. ఎండీ జయేష్‌రంజన్ తదితరులు పాల్గొన్నారు.
రాగల రెండు మాసాలలలోనే రాష్ట్రంలో ఈ-రిటైలింగ్ వేర్‌హౌస్ కార్యకలాపాలను ప్రారంభించనున్నట్టు అమెజాన్ కంపెనీ ప్రతినిధులు వెల్లడిరచారు.తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన నూతన పారిశ్రామిక విధానం ప్రకారం అవసరమైన సహాయాన్ని అందజేస్తామని మంత్రి కె. తారకరామారావు ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారు.అమెజాన్ తన ఆన్‌లైన్ వ్యాపారం ద్వారా తెలంగాణ హస్తకళలని ప్రోత్సహించాలని మంత్రి చేసిన సూచనకు అమెజాన్ బృందం సుముఖత వ్యక్తం చేసింది. త్వరలోనే ఈ విషయంపై ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడానికి సానుకూలంగా స్పందించింది. ఇందులో భాగంగా, తెలంగాణ రాష్ట్రంలోని స్వయం సహాయక బృందాల ఉత్పత్తులు, నిర్మల్ కళాకారులు తీర్చిదిద్దుతున్న నిర్మల్ బొమ్మలు, పోచంపల్లి చీరెలు, బిద్రీ ఉత్పత్తులవంటి హస్తకళలను మార్కెటింగ్ చేసేందుకు అమెజాన్ కంపెనీ ప్రతినిధులు ఆసక్తి కనబరిచారు.
తెలంగాణలోని చిన్న, మధ్య తరహా సంస్థల ఉత్పత్తులు అమ్ముకొనేందుకు, ఆన్‌లైన్ సంస్థతో ఒప్పందం చేసుకొనేందుకు, శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు అమెజాన్ కంపెనీ ప్రతినిధులు మంత్రికి తెలిపారు.
అమెరికాలోని సియాటెల్‌లోని తమ కంపెనీ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించడానికి రావలసిందిగా మంత్రి కె. తారకరామారావును ప్రతినిధివర్గం ఆహ్వానించింది. ఈ ఆహ్వానాన్ని మన్నించి ఏప్రిల్ రెండో వారంలో అక్కడికి వెళ్ళేందుకు మంత్రి సుముఖత వ్యక్తం చేశారు.