తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ఖరారు చేసింది. ఈ జాబితాకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. ఓటర్ల జాబితా సవరణ తరువాత రాష్ట్రంలో మొత్తం 2,73,18,603 మంది ఓటర్లు ఉన్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది. వీరిలో పురుష ఓటర్లు 1,37,87,920, మహిళా ఓటర్లు 1,35,28,020, థర్డ్ జెండర్ 2,663 ఉన్నారు. వీరుగాక, అదనంగా సర్వీస్ ఓటర్లు (త్రివిధ దళాలు, విదేశీ వ్యవహారాలు) 9,451 మంది ఉన్నారు. ముసాయిదా ఓటర్ల జాబితా జారీతరువాత జరిపిన సవరణ అనంతరం 4.52 శాతం మంది ఓటర్లు పెరిగారు.
జాబితాలో బోగస్ ఓటర్లను తొలగించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఈఆర్వో నెట్ పేరుతో ప్రత్యేక సాఫ్ట్ వేర్ ను రూపొందించింది. తెలంగాణతో సహా శాసన సభ ఎన్నికలు జరుగనున్న ఐదు రాష్ట్రాలలో ఈ సాఫ్ట్ వేర్ ను వినియోగించి నకిలీ ఓటర్లను గుర్తించారు. ఓకే పేరుతో ఉన్నవారిని, ఒకే ఫోటోతో వేర్వేరు పేర్లతో ఉన్న ఓటర్లు, వందేళ్ళు
వయసుదాటిన వారిని ఈ సాఫ్ట్ వేర్ గుర్తిస్తుంది. ఈఆర్వో నెట్‌ను ఉపయోగించి ఓటర్ల జాబితా రూపొందించిన తొలి రాష్ట్రం తెలంగాణ. తెలంగాణలో ఆయా విభాగాలలో 4,91,810 మంది ఓటర్లను ఈ సాఫ్ట్‌వేర్ గుర్తించింది. ఈ సాఫ్ట్‌వేర్‌ను జనన, మరణాల రిజిస్టరుతో అనుసంధానించడంతో జాబితాలో ఉండి, ఇప్పటికే మతి చెందినవారిని కూడా గుర్తించారు. ఈ వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆ పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించారు.
2018 జనవరి నాటి ఓటర్ల జాబితాతో పోల్చితే, 11,81,827 మంది నూతన ఓటర్లు పెరిగారు. ముసాయిదా ఎన్నికల జాబితా ప్రచురించిన అనంతరం, 2018 సెప్టెంబరు 10 నుంటి అక్టోబరు 4 వరకు రాష్ట్ర, జిల్లా ఎన్నికల అధికారులు విస్తతంగా చేపట్టిన చర్యల ఫలితంగా 17,68,873 మంది ఓటర్లుగా చేరగా, 5,87,046 మంది ఓటర్లను తొలగించడం జరిగింది. వీరిలో 1,93,586 మంది రెండుచోట్ల ఓటర్లుగా నమోదయినందున తొలగించారు. వేరే ప్రాంతాలకు తరలివెళ్ళడం, అడ్రసు మార్పుల కారణంగా 91,737 మందిని , మరణించిన కారణంగా 3,01,723 మంది పేర్లు ఓటర్ల జాబితానుంచి తొలగించారు. పెద్దమొత్తంలో ఓటర్లకు సంబధించి ఫోటోలు, లింగ వివరాలు, వయసు కు సంబంధించి జరిగిన పొరపాట్లను సరిచేయడం జరిగింది. 1,56,835 మంది ఓటర్ల వివరాలను సరిచేయడం జరిగింది. తమ నియోజకవర్గం పరిధిలోని పోలింగ్ కేంద్రం మార్చవలసిందిగా కోరుతూ 1, 48,269 మంది దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న పట్టణీకరణ దష్ట్యా ,
ఏ ఒక్కరూ ఓటుహక్కు కోల్పోరాదన్న లక్ష్యంతో అర్హతగల దరఖాస్తులన్నింటినీ పరిశీలించడం జరిగింది.
కొత్త ఓటర్లలో 18-19 వయసు వారు 5,75,506 మంది వున్నారు. వీరిలో పురుషులు 3,22,141, మహిళలు 2,53,247, థర్డ్ జెండర్ 112 ఉన్నారు.