కవులకు రాష్ట్ర ప్రభుత్వం సముచిత గౌరవం ఇచ్చి సత్కరిస్తున్నదని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ప్రశంసించారు. సాహిత్యపరంగా ఉన్నత భావాలున్న వ్యక్తి, దేశభక్తుడు, విమర్శకుడు దేవులపల్లి రామానుజరావు శతజయంతిని అధికారికంగా నిర్వహించడం కవులకు ప్రభుత్వం ఇస్తున్న గౌరవానికి నిదర్శనమని పేర్కొన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో రాష్ట్ర భాషా, సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో దేవులపల్లి రామానుజరావు శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని గ్రంథావళి అనే పుస్తకాన్ని కేంద్రమంత్రి ఆవిష్కరించారు.
ధనిక కుటుంబం నుంచి వచ్చి మాతృభాష ఔన్నత్యాన్ని చాటిచెప్పిన కవి రామానుజరావు అని దత్తాత్రేయ తెలిపారు. తెలంగాణ భాషను అభివృద్ధి చేయాలంటే రాష్ట్రప్రభుత్వం ఉత్తర, ప్రత్యుత్తరాలను తెలుగు భాషలోనే జరుపాలని, తెలుగు ఉపాధ్యాయ పోస్టులను త్వరగా భర్తీ చేయాలని కోరారు. రామానుజరావు అలుపెరుగని యోధుడని, ఉస్మానియా యూనివర్సిటీ ఉపకులపతిగా వ్యవహరించారని ప్రభుత్వ కార్యదర్శి అనితా రాజేంద్ర తెలిపారు. పట్టుదలకు మారుపేరని, నమ్మిన సిద్ధాంతం కోసం పోరాటడం ఆయన వ్యక్తిత్వమని తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి అన్నారు.
సాహిత్య అకాడమీ ఏర్పాటుకు కృషిచేసిన వారిలో మొదటి వ్యక్తి రామానుజరావు అని తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షుడు ఎల్లూరి శివారెడ్డి పేర్కొన్నారు. గోదావరి పరీవాహక ప్రాంతమైన వరంగల్‌లో పుట్టిన అచ్చమైన తెలుగుబిడ్డ, తెలుగుభాషా ఔన్నత్వాన్ని కాపాడిన ఆణిముత్యం రామానుజరావు అని శాసన మండలి చీఫ్ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి చెప్పారు. కార్యక్రమంలో సాంస్కృతికశాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, ఆకాశవాణి, దూరదర్శన్ ప్రసార మాధ్యమం డైరెక్టర్ మధుసూదన్‌రావు, డాక్టర్ చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. తొలుత రామానుజరావు కుటుంబ సభ్యులకు శాలువాతో ఆత్మీయ సత్కారం చేశారు.