భారత్‌లో దక్షిణాఫ్రికా హైకమీషనర్ సిబుసిసో ఏన్డెబెలో
నేతృత్వంలోని ఒక ప్రతినిధి బృందం కె.టి.ఆర్ ను కలుసుకొని చర్చింది. ఈ సందర్భంగా, తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను మంత్రి కె.టి.ఆర్ వారికి వివరించారు. దక్షిణాఫ్రికా కంపెనీలు భారత దేశంలో పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నాయని, అందులో భాగంగా పెట్టుబడి అవకాశాలను పరిశీలించడానికి తమ బృందం తెలంగాణలో పర్యటిస్తున్నట్టు హైకమీషనర్ తెలిపారు.రెండు రోజులుగా తమ బృందం పర్యటిస్తూ, రాష్ట్రంలోని పారిశ్రామికాధిపతులను కలుస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా, తెలంగాణ ప్రభుత్వం అమలుపరుస్తున్న టి.ఎస్.ఐపాస్‌ను ఆయన ప్రశంసించారు.
పారిశ్రామిక రంగంలో మహిళలకు గల అవకాశాలను వివరిస్తూ, రాష్ట్రంలో మహిళా పారిశ్రామిక వేత్తలను తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, మహిళలకోసం ప్రత్యేకంగా ప్రభుత్వం వీ-హబ్ నిర్వహిస్తోందని మంత్రి కె.టి.ఆర్ వివరించారు.
భారత్‌లో లక్సెంబర్గ్ దేశ రాయబారి జీన్ క్లాడ్ కుగెనర్ కూడా మంత్రి కె.టి.ఆర్ ను కలుసుకొని నిర్దిష్ట రంగాలలో పెట్టుబడులు పెట్టడానికి తమ దేశం సంసిద్ధంగా ఉన్నదని, రాష్ట్రానికి తమ దేశం కంపెనీలను రప్పించడానికి తెలంగాణ ప్రభుత్వంతో కలసి పనిచేయాలని భావిస్తున్నామని ఆయన తెలిపారు.
బెంగుళూరులో ఉండే ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్ మార్జరీ వాన్ బేలిగమ్ కూడా మంత్రి కె.టి.ఆర్ ను లాంఛనప్రాయంగా కలుసుకొన్నారు.బెంగుళూరులో బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆమె తొలిసారిగా తెలంగాణకు వచ్చారు. పరిశోధనా రంగంలో పరస్పర సహకారం విషయమై వీరు చర్చించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఫ్రాన్స్ పెట్టుబడులను వివరిస్తూ, మరిన్ని పెట్టుబడులు రాష్ట్రానికి రావడానికి సహకరించాలని మంత్రి కె.టి.ఆర్ ఆమెను కోరారు. ఫ్రాన్స్ నుంచి తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే కంపెనీలకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారాన్ని అందిస్తుందని మంత్రి తెలిపారు. ఐ.టి శాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
న్యూ జెర్సీతో ద్వైపాక్షిక ఒప్పందం
అమెరికాలో మన తెలుగువారు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో న్యూజెర్సీ ఒకటి. ఈ న్యూజెర్సీ రాష్ట్రం, మన రాష్ట్రం పరస్పర భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ రాష్ట్రం ఎన్నో అంశాల్లో ఆదర్శంగా నిలుస్తూ వస్తున్నది. వాటన్నింటిని అందిపుచ్చుకొని తెలంగాణను అన్ని రంగాల్లో ముందంజలో నిలపాలని ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్టు, రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ సమక్షంలో న్యూజెర్సీ రాష్ట్రంతో తెలంగాణ ప్రభుత్వం భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, న్యూజెర్సీ గవర్నర్ ఫిల్ మర్ఫీలు దీనిపై సంతకాలు చేశారు.
ఈ ఒప్పందం ద్వారా విద్య,వ్యాపార వాణిజ్య అవకాశాల్లో ఇరు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుంటాయి. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ”తెలంగాణపై అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతికి, విశ్వసనీయతకు ఇది నిదర్శనం” అని అన్నారు. ఆ తర్వాత న్యూజెర్సీ గవర్నర్ ఫిల్‌మర్ఫీ మాట్లాడుతూ.. గతంలో తమ బృందంతో రెండు రోజులు పర్యటించామని, అలాగే వివిధ ప్రభుత్వ, పారిశ్రామికవర్గాలతో సమావేశం అయ్యామని తెలిపారు. పెట్టుబడిదారులకు ఇక్కడ స్నేహపూర్వక వాతావరణాన్ని అమర్చిపెట్టారని ప్రశంసించారు. బయోటెక్, ఐటీ, ఫిన్టెక్, డాటా సెంటర్లు, క్లీన్ ఎనర్జీ, పర్యాటకం,
ఉన్నతవిద్య, ఫార్మా, లైఫ్ సైన్సెస్, వంటి రంగాల్లో రెండు రాష్ట్రాల సంబంధాలను మరింత ముందుకు తీసుకెళతామన్నారు.
ఈ రెండు రాష్ట్రాలలో జియోథర్మల్, థర్మల్ ఎనర్జీ స్టోరేజీ విభాగాల్లో మరింత పురోగతి సాధిస్తామని ఆశాభావం వ్యక్తంచేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సౌరవిద్యుత్తు ద్వారా 20.41 గిగావాట్లు, పవనవిద్యుత్ ద్వారా 4.2 గిగావాట్ల శక్తితో కలిపి మొత్తం 4.36 వేల మెగావాట్ల పునరుత్పాదక శక్తిని సాధించిందని తెలిపారు.ఈ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్‌మిశ్రా, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సుల్ జనరల్ అధికారులు పాల్గొన్నారు. టీహబ్ కూడా రెండు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చున్నది. చూజ్ న్యూజెర్సీ, వెంచర్లింక్ సంస్థలతో త్రైపాక్షిక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్టు టీ-హబ్ ప్రకటించింది. ఈ ఒప్పందంలో భాగంగా స్టార్టప్లనుంచి ఎంపికైన ఇద్దరు సభ్యులకు న్యూజెర్సీ టెక్నాలజీ సంస్థలోని వెంచర్లింక్ కమ్యూనిటీ హబ్‌లో రెండు నెలలు ఉచితంగా స్థలాన్ని కేటాయిస్తారు.