ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అధ్యక్షతన ప్రగతిభవన్ లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పలు అంశాలకు మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.
రాష్ట్రంలో బీసీ జనాభా గణన వెంటనే ప్రారంభించాలని నిర్ణయించారు. ప్రస్తుతమున్న బి.సి రెసిడెన్షియల్స్ కు తోడుగా 2019-20 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 కొత్త బి.సి రెసిడెన్షియల్స్ ఏర్పాటు టేయాలని, ఈ రెసిడెన్షియల్స్ లో 4,284 మంది సిబ్బంది నియమించాలని మంత్రివర్గం నిర్ణయించింది.
రాష్ట్రంలో కొత్తగా 9,355 మంది గ్రామ కార్యదర్శులను నియమించాలని, రాష్ట్రంలోని 12,751 గ్రామాల్లో ప్రతీ గ్రామానికి ఖచ్చితంగా ఒక గ్రామ కార్యదర్శి నియామకం జరపాలని నిర్ణయించారు. పదవీ కాలం ముగుస్తున్న సర్పంచ్ ల స్థానంలో ప్రత్యేక అధికారుల నియామకం, కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలకు కూడా ప్రత్యేకాధికారుల నియామకం జరపాలని నిర్ణయించారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీలు అత్యంత కీలకం కాబట్టి, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు వంద రూపాయలకు గజం చొప్పున, జిల్లా కేంద్రాల్లో ఎకరానికి మించకుండా పార్టీ కార్యాలయాల నిర్మాణం కోసం స్థలాల కేటాయింటాలని, ఆ పార్టీ కార్యాలయాలకు ఆస్తి పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. గత ప్రభుత్వాలు అనుసరించిన విధానం ప్రకారమే టి.ఆర్.ఎస్. పార్టీకి 29 జిల్లా కేంద్రాల్లో కార్యాలయాల నిర్మాణం కోసం స్థలాల కేటాయించాలని నిర్ణయించారు.
ఆగస్టు 15 న రాష్ట్ర వ్యాప్తంగా కంటివెలుగు కార్యక్రమం ప్రారంభించాలని నిర్ణయించారు.
గతంలోమందుపాతర పేలుడులో మరణించిన మాజీ మంత్రి మాధవరెడ్డి కుటుంబానికి హైదరాబాద్ నగరంలోని షేక్ పేటలో 600 గజాల ఇంటి స్థలం కేటాయిస్తూ నిర్ణయించా రు. అలాగే, భారత్-పాక్ సరిహద్దులో జరిగిన పోరాటంలో మరణించిన వీర జవాను ఫిరోజ్ ఖాన్ కుటుంబానికి కూడా షేక్ పేటలో 200 గజాల స్థలం కేటాయించారు.
గట్టు ఎత్తిపోతల పథకంలో భాగంగా 4 టి.ఎం.సిల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణం, ప్రతీ నియోజకవర్గానికి ఖచ్చితంగా ఒక అగ్నిమాపక కేంద్రం ఉండాలనే విధానం మేరకు, రాష్ట్రంలో కొత్తగా 18 అగ్నిమాపక కేంద్రాల ఏర్పాటు కు నిర్ణయించారు.
రాష్ట్ర పోలీస్ శాఖకు కొత్తగా 11,577 వాహనాల కొనుగోలు చేయాలని, సూర్యాపేటలో మెడికల్ కాలేజీ ఏర్పాటు, సిబ్బంది నియామకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జూనియర్ కాలేజీ విద్యార్థులకు మద్యాహ్న భోజనం పెట్టే అవకాశాలను పరిశీలించాలని నిర్ణయించారు.