తెలంగాణ ఏర్పడిన తర్వాత ఊహలకు అందని రీతిలో, అత్యంత తక్కువ వ్యవధిలో పారిశ్రామిక రంగంలో ఎంతో అభివృద్ధి సాధించాం: కేటీఆర్

తెలంగాణ రాష్ట్రం పారిశ్రామికంగా అప్రతిహతంగా పురోగమిస్తున్నది. అమెజాన్‌.. గూగుల్‌.. మైక్రోసాఫ్ట్‌.. ఇటీవలే వెల్సన్..విభిన్న రంగాలకు చెందిన ప్రఖ్యాత కంపెనీలకు నెలవుగా మారుతున్న హైదరాబాద్‌ నగరానికి మరిన్ని ప్రపంచ ప్రసిద్ధ సంస్థలు వస్తున్నాయి. అయితే ప్రస్తుత వరుస పెట్టుబడుల వెల్లువలో, రంగారెడ్డి జిల్లా శంకర్‌ పల్లి మండలం, కొండకల్‌ గ్రామంలో రూ. 1000 కోట్ల పెట్టుబడితో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీని నెలకొల్పేందుకు మేధా సర్వోడ్రైవ్స్‌ కంపెనీ ముందుకొచ్చింది.


ఇంకోవైపు, మెడికల్‌ పరికరాల తయారీలో ప్రపంచ ప్రఖ్యాత సంస్థ మెడ్‌ ట్రానిక్స్‌, సుమారు 1200 కోట్ల రూపాయలతో తన పెట్టుబడులకు అనువైన స్థావరంగా మన రాష్ట్రాన్ని ఎంచుకుంది. అమెరికా అవతల తన రెండో అతిపెద్ద డెవలప్‌మెంట్‌ కేంద్రాన్ని హైదరాబాద్‌ లో ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఇక మరోవైపు, ఏస్టర్‌ ఫిల్మ్‌ టెక్‌ లిమిటెడ్‌ కంపెనీ, రూ.1350కోట్ల పెట్టుబడితో, ప్యాకేజింగ్‌ ఫిల్మ్‌ మాన్యుఫాక్చరింగ్‌ ప్లాంట్‌ ను ఏర్పాటు చేయబోతోంది. చందన్వెల్లి పారిశ్రామికవాడలో ఏస్టర్‌ కంపెనీ అడ్వాన్డ్స్‌ పాలిస్టర్‌ ఫిల్మ్‌ ఉత్పత్తి కేంద్రాన్ని త్వరలో ప్రారంభించనున్నది.

తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏ ఒక్కరి ఊహకు అందని రీతిలో, అత్యంత తక్కువ వ్యవధిలో పారిశ్రామిక రంగంలో ఎంతో అభివృద్ధి సాధించామని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే.తారకరామారావు పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం, కొండకల్‌ గ్రామంలో మేధా సర్వోడ్రైవ్స్‌ కంపెనీ ఆధ్వర్యంలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ నిర్మాణ పనులకు మంత్రి కేటీఆర్‌ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పడితే కొత్తగా పెట్టుబడులురావు అనే సంశయాల నడుమ ఆరేళ్ళ క్రితం రాష్ట్రం ఆవిర్భవించింది. కానీ ఈనాడు ఇక్కడ రైలు బోగీలే కాదు.. హెలికాప్టర్ల విడిభాగాలు కూడా తయారవుతున్నాయని చెప్పారు. రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో విమానాల, అపాచి హెలికాప్టర్ల విడిభాగాలు తయారవుతున్నాయని, జహీరాబాద్‌ లో ట్రాక్టర్లు, బస్సులు తయారవుతున్నాయని వివరించారు. ఇప్పుడు రైలు కోచ్, బోగీలు, వ్యాగన్లు కూడా తయారుకానున్నాయని చెప్పారు. మూడేండ్ల క్రితం హైదరాబాద్‌ లో మెట్రో రైలు ప్రారంభమైంది. అప్పుడు ఆ రైళ్లను కొరియన్‌ కంపెనీలు తయారుచేసి పంపింది. అయితే ఆ మెట్రో రైళ్లను ఇపుడు మనదగ్గరే తయారు చేసుకునే స్థాయిలో తెలంగాణ అభివృద్ధి సాధించిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు.


గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే రైళ్లు మన రాష్ట్రంలో రావాలని మంత్రి కేటీఆర్‌ అభిలాషించారు. ఇలాంటి రైళ్లు అందుబాటులోకి వస్తే ప్రజల జీవన సరళిలో పెనుమార్పులు వస్తాయన్నారు. గంటలో కరీంనగర్‌, రెండు గంటల్లో విజయవాడ, నాలుగు గంటల్లో బెంగళూరుకు చేరుకోవచ్చని చెప్పారు. అప్పుడు హైదరాబాద్‌ లో పనిచేసే వ్యక్తులు నగరంలోనే నివసించాల్సిన అవసరం ఉండదని తెలిపారు. ఇల్లు ఆదిలాబాద్‌లో వున్నా, అక్కడి నుండి రోజూ హైదరాబాద్‌ వచ్చి పని చూసుకొని తిరిగి వెళ్లిపోవచ్చని చెప్పారు. హైస్పీడ్‌ రైల్‌ నెట్‌వర్క్‌తో అద్భుతాలు జరుగుతాయన్నారు. మేధా సంస్థ వల్ల తెలంగాణకు రైల్వే ఫ్యాక్టరీ వచ్చిందని మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తంచేశారు. స్థానికులకు ఉపాధి అవకాశాలను కల్పించాలని ఎమ్మెల్యే యాదయ్య కోరారని మంత్రి కేటీఆర్‌ గుర్తుచేస్తూ.. ఆ దిశగా ఇటీవలే తమ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నదని చెప్పారు. తమ రాష్ట్రంలో ఫ్యాక్టరీలు పెట్టినప్పుడు తమకే ఉద్యోగాలివ్వాలంటూ కొన్ని రాష్ట్రాల తిరోగమన విధానాలు అవలంభిస్తున్నాయని తెలిపారు. కొత్తగా పరిశ్రమలు పెట్టేవారు స్థానిక యువతకు 60-70 శాతం ఉద్యోగాలు ఇస్తే.. స్కిల్‌ క్యాటగిరీ, సెమీ స్కిల్డ్‌ క్యాటగిరీలోగానీ అదనపు ప్రోత్సాహకాలు ఇస్తామని తమ ప్రభుత్వం పురోగమన విధానాన్ని తీసుకొచ్చిందని చెప్పారు. దీనివల్ల పెట్టుబడిదారులు సానుకూలంగా స్పందించే అవకాశముందని తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా ఎలక్ట్రిక్‌ వాహనల పాలసీని తీసుకొచ్చామని చెప్పారు. చాలామంది టూ, త్రీ వీలర్‌ ఎలక్ట్రిక్‌ వాహనాలను తయారుచేస్తామంటూ ముందుకొస్తున్నారని తెలిపారు. ఈ రంగంలో పెట్టుబడులకు ప్రయత్నించాలని మేధా సంస్థలను కోరారు.

దేశంలోనే అతిపెద్ద రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీ: మేధా గ్రూపు ఎండీ
తాము నెలకొలపబోయే రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ మనదేశంలోని ప్రైవేటురంగంలో అతి పెద్దదని మేధా గ్రూపు ఎండీ కశ్యప్‌ రెడ్డి చెప్పారు. ఇక్కడి తమ ఫ్యాక్టరీలో కోచ్‌లు, మెట్రోరైళ్లు, మోనోరైళ్లు తయారవుతాయని తెలిపారు. మేధా సర్వోడ్రైవ్స్‌ ను 1984లో హైదరాబాద్‌లో ఏర్పాటుచేశామని, 1990లో రైల్వే రంగంలో అడుగు పెట్టామని తెలిపారు. తమకు 7 అనుబంధ సంస్థలు సహా 12 సంస్థలు ఉన్నట్లు చెప్పారు. వీటిలో రెండు ఐరోపా, రెండు అమెరికా, రెండు దక్షిణ అమెరికా, భారత్‌ లో ఏడు జాయింట్‌ వెంచర్లు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు హరీశ్‌ రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ డాక్టర్‌ గడ్డం రంజిత్‌ రెడ్డి, కొత్త ప్రభాకర్‌ రెడ్డి, పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్‌, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్‌ రెడ్డి, భూపాల్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, మెతుకు ఆనంద్‌, జిల్లా పరిషత్తు ఛైర్‌ పర్సన్లు తీగల అనితారెడ్డి, మంజుశ్రీ, టీఎస్‌ఐఐసీ ఛైర్మన్‌ గ్యాదరి బాలమల్లు, వైస్‌ ఛైర్మన్‌ వెంకటనర్సింహారెడ్డి, మేధా కంపెనీ ఈడీ శ్రీనివాస్‌ రెడ్డి, జిల్లా కలెక్టర్లు అమయ్‌ కుమార్‌, హన్మంత్‌ రావు, అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌ సేన్‌ పాల్గొన్నారు.


మెడ్‌ టెక్‌ హబ్‌గా హైదరాబాద్‌
1200 కోట్ల పెట్టుబడితో హైదరాబాదుకు మెడికల్‌ డివైజెస్‌ తయారీలో ప్రపంచ ప్రసిద్ధ సంస్థ మెడ్‌ట్రానిక్‌ ఆర్‌ అండ్‌ డీ సెంటర్‌ ఏర్పాటు కానున్నది. మెడికల్‌ డివైజెస్‌ తయారీలో ప్రఖ్యాతిగాంచిన మెడ్‌ట్రానిక్‌ సంస్థ.. హైదరాబాద్లో తన పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించేందుకు సిద్ధమని ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మెడికల్‌ డివైజెస్‌ హబ్‌ దిశగా మెడ్‌ట్రానిక్‌‌ పెట్టుబడులు కీలకంగా మారబోతున్నాయి. 2016లో మంత్రి కే.తారకరామారావు అమెరికా పర్యటన సందర్భంగా మెడ్‌ట్రానిక్‌‌ సంస్థతో మొదలైన సంప్రదింపుల ప్రక్రియ ఫలించి నిర్ణయాత్మక రూపం దాల్చింది. తెలంగాణ ప్రభుత్వం, మెడ్‌ట్రానిక్‌ కంపెనీ ఈ ప్రాజెక్టుపై రెండేండ్లుగా చర్చులు జరుపుతూ వస్తున్నాయి. వైద్య పరికరాల తయారీలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెడ్‌ట్రానిక్‌ సంస్థ హైదరాబాద్‌లో భారీగా పెట్టుబడులు పెట్టనున్నది. అమెరికా అవతల తన అతిపెద్ద పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని హైదరాబాద్‌లో స్థాపించాలని నిర్ణయించింది. ఇందుకుగాను రానున్న ఐదేండ్లలో రూ.1200 కోట్ల పెట్టుబడులను పెట్టనున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోయే ఈ పెట్టుబడుల ద్వారా హైదరాబాద్‌ మెడికల్‌ డివైజెస్‌ హబ్‌గా కూడా మారనున్నది.

మెడ్‌ట్రానిక్‌ కంపెనీ హైదరాబాద్‌ను తమ అతిపెద్ద ఆర్‌ అండ్‌ డీ సెంటర్‌కు గమ్యస్థానంగా ఎంచుకోవడం పట్ల మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తంచేశారు. ఈ పెట్టుబడి ద్వారా పెద్దఎత్తున ఉద్యోగాల కల్పనతో పాటు ఈ రంగంలో మరిన్ని కొత్త పెట్టుబడులు వస్తాయని ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ కంపెనీ పెట్టుబడి ద్వారా హైదరాబాద్‌, భారతదేశపు మెడికల్‌ డివైజెస్‌ హబ్‌గా మారుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తంచేశారు. మెడ్‌టెక్‌ రంగ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, మెడ్‌ట్రానిక్‌తో ఒప్పందం దీనిని సూచిస్తున్నదని తెలిపారు. మెడికల్‌ డివైజెస్‌ కంపెనీతో కలిసి ప్రపంచ ఆరోగ్య రంగంలో సానుకూల మార్పు దిశగా పనిచేస్తామని మంత్రి కేటీఆర్‌ చెప్పారు.

మెడ్‌ట్రానిక్‌ కంపెనీ భారత ఉపఖండ ఉపాధ్యక్షుడు మదన్‌కృష్ణ మాట్లాడుతూ.. దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న రోగులకు ఉపశమనం కల్పించాలన్న ఉద్దేశంతో తమ కంపెనీ ఇన్నోవేషన్‌కి అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని తెలిపారు. ఇక్కడి ఇంజినీరింగ్‌ విద్యార్థులు తమ సంస్థతో కలిసి పనిచేసేందుకు వీలు కలుగుతుందని, తద్వారా హెల్త్‌ కేర్‌ రంగంలో అనేక మార్పులకు కారణం అయ్యే అవకాశం ఉన్నదని చెప్పారు. ఈ పెట్టుబడి భారత్‌ పట్ల మా చిత్తశుద్ధికి నిదర్శనం. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు మేం తీసుకున్న నిర్ణయాన్ని సూచిస్తుంది. రోగుల బాధను దూరం చేసి, వారికి ఆరోగ్యాన్ని ప్రసాదించాలన్న కంపెనీ లక్ష్యాలతోపాటు ఆరోగ్యరంగాన్ని మరింత విస్తరించాలన్న ప్రభుత్వ లక్ష్యాల మేరకు ఈ భాగస్వామ్యం వుంటుందని’’ మెడ్‌ట్రానిక్స్‌ సంస్థ ఛైర్మన్‌ ఒమర్‌ ఇస్రాక్‌ అన్నారు. సమావేశంలో ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌, టీఎస్‌ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి, లైఫ్‌ సైన్సెస్‌ డైరెక్టర్లు పాల్గొన్నారు.

స్థానిక యువతకు 60-70 శాతం ఉద్యోగాలు ఇస్తే.. స్కిల్‌ క్యాటగిరీ, సెమీ స్కిల్డ్‌ క్యాటగిరీలోగానీ అదనపు ప్రోత్సాహకాలు ఇస్తామని తమ ప్రభుత్వం పురోగమన విధానాన్ని తీసుకొచ్చిందని చెప్పారు. దీనివల్ల పెట్టుబడిదారులు సానుకూలంగా స్పందించే అవకాశముందని తెలిపారు.

మెడ్‌ట్రానిక్‌ కంపెనీ హైదరాబాద్‌ను తమ అతిపెద్ద ఆర్‌ అండ్‌ డీ సెంటర్‌కు గమ్యస్థానంగా ఎంచుకోవడం పట్ల మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తంచేశారు. ఈ పెట్టుబడి ద్వారా పెద్దఎత్తున ఉద్యోగాల కల్పనతోపాటు ఈ రంగంలో మరిన్ని కొత్త పెట్టుబడులు వస్తాయని ఆశాభావం వ్యక్తంచేశారు.

ఏస్టర్‌ ఫిల్మ్‌టెక్‌ లిమిటెడ్‌ సంస్థ తెలంగాణలో ప్యాకేజింగ్‌ ఫిల్మ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్‌ వెల్డిడించారు. రూ.1350 కోట్ల పెట్టుబడితో కంపెనీని ఏర్పాటు చేస్తున్నారని మంత్రి తెలిపారు. ఏస్టర్‌ ఫిల్మ్‌టెక్‌ సంస్థ ఛైర్మన్‌ అరవింద్‌ సింఘానియాతో మంత్రి కేటీఆర్‌ ఇటీవల వర్చువల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏస్టర్‌ కంపెనీ రాక పట్ల మంత్రి కేటీఆర్‌ సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఏస్టర్‌ కంపెనీ అడ్వాన్స్డ్‌ పాలిస్టర్‌ ఫిల్మ్‌ ఉత్పత్తి కేంద్రాన్ని త్వరలో ప్రారంభించనున్నది.

Other Updates