తెలంగాణలో టీఎస్‌ఐపాస్ ద్వారా అనేక పరిశ్రమలు నెలకొల్పడం త్వరితగతిన జరుగుతున్నది. కేవలం రెండు వారాల వ్యవధిలోనే పరిశ్రమలకు అనుమతులు లభిస్తున్నాయి. ఈ విధానం ప్రపంచ వాణిజ్యవేత్తలను విశేషంగా ఆకర్షిస్తున్నది. ఇందుకు ప్రబల తార్కాణంగా న్యూకాన్ ఏరో స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ, అంతరిక్ష, రక్షణరంగ విడిభాగాల తయారీ కేంద్రాన్ని నాదర్‌గుల్ పారిశ్రామిక పార్కులో ఏర్పాటు చేయడం.
న్యూకాన్ ఏరోస్పేస్‌వారి అంతరిక్ష, రక్షణరంగ విడిభాగాల తయారీకేంద్రాన్ని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, కేంద్ర రక్షణశాఖ మాజీ మంత్రి పల్లంరాజులతో కలిసి రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖలమంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమం పూర్తయిన వెంటనే న్యూకాన్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ హేమంత్ జలాన్‌తో కలిసి మిసైల్ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, ఇప్పటికే హైదరాబాద్‌లో ఆదిభట్ల, శంషాబాద్ ప్రాంతాలలో ఒక్కో ఏరోస్పేస్ సెంటర్లున్నాయి. అతి త్వరలో మరో ఏరోస్పేస్ సెంటర్‌ను ఏర్పాటు చేయబోతున్నామని పేర్కొన్నారు. రక్షణ, వైమానికరంగ విడిభాగాల పరిశ్రమలు రాష్ట్రానికి వెల్లువలా వస్తున్నాయని, రాష్ట్రం ఎలక్ట్రానిక్స్, జీవశాస్త్రాలు, ఐటీరంగాల్లో ముందంజలో వుందని తెలిపారు. ఇదంతా కూడా తెలంగాణ టిఎస్‌ఐపాస్ పాలసీ వల్లనే జరుగుతున్నదని తెలియజెప్పారు. కేవలం రెండేళ్ళ వ్యవధిలోనే 4100 పరిశ్రమలకు అనుమతులివ్వడం ద్వారా 1000 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. వీటి ద్వారా 2.30 లక్షల మందికంటే ఎక్కువగా ఉపాధి అవకాశాలు లభించాయని అన్నారు.
హైదరాబాద్‌లో సాంకేతిక నిపుణులు, శాస్త్రవేత్తలను తీర్చిదిద్దేందుకు లండన్‌కు చెందిన ట్రాన్స్‌ఫీల్డ్ విశ్వవిద్యాలయంతో వైమానిక విశ్వవిద్యాలయం ఏర్పాటుకోసం తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నదని కేటీఆర్ పేర్కొన్నారు. అనంతరం రక్షణశాఖ సలహాదారు జీ సతీష్‌రెడ్డి మాట్లాడుతూ, న్యూకాన్ క్షిపణుల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయడంతోపాటు పరిశోధన, అభివృద్ధికోసం 60మంది ఇంజినీర్లను ఉపయోగించుకోవడం అభినందించదగిన అంశమని పేర్కొన్నారు. దేశరక్షణ అవసరాలను తీర్చడం డీఆర్‌డీవో చేసే కృషితోనే తీరదన్నారు. ఇందుకోసం ఇతర సంస్థలు ఎన్నో రావాలని అభిప్రాయపడ్డారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ తెలంగాణాలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు కేంద్రం తగిన సహకారాన్ని అందిస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల చొరవతోనే కొత్త పరిశ్రమలు ఎన్నో తరలివస్తున్నాయని అన్నారు.
బయ్యారం ఉక్కు తయారవ్వాలి
హైదరాబాద్‌కు వచ్చిన కేంద్ర గనులశాఖ కార్యదర్శి అరుణ్‌కుమార్‌తో మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. కొత్తగూడెం-మహబూబాబాద్ జిల్లా సరిహద్దులోని బయ్యారంలో వెంటనే ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్ అడిగారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలలో ఒక్కటికూడా అమలు జరుగడంలేదని, వాటిల్లో ఉక్కు పరిశ్రమ గురించి ప్రస్తావించినా ఇప్పటివరకు ఏమాత్రం స్పందనలేదని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణలో అవసరం మేరకు ఖనిజ నిల్వలున్నా పరిశ్రమను స్థాపించడం లేదని పేర్కొన్నారు. ఇందుకు స్పందించిన కేంద్రమంత్రి ఈ అంశాన్ని తాను కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని అన్నారు.