మన రాష్ట్రంలో కొత్తగా 1350 కిలోమీటర్ల మేరకు జాతీయ రహదారుల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది.న్యూఢిల్లీలో అక్టోబర్ 27న తనను కలసిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావుకు కేంద్రరవాణా శాఖామంత్రి గడ్కరీ ఈ మేరకు స్పష్టమైన హామీనిచ్చారు.
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఢిల్లీ పర్యటనలో భాగంగా అక్టోబర్ 27న గడ్కరీతోపాటు, ఆర్థిక శాఖా మంత్రి అరుణ్ జైట్లీని కూడా కలసి , తెలంగాణ రాష్ట్రంలో వివిధ అభివద్ధి పథకాల అమలుకు ఆర్థికంగా సహకరించాలని కోరారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పలు పథకాలకు నిధులు కేటాయించాలని కోరారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఎఫ్.ఆర్.బి.ఎం రుణపరిమితిని 3 నుంచి 3.5 శాతానికి పెంచాలని కేంద్ర ఆర్థిక మంత్రిని ముఖ్యమంత్రి కోరారు.
అదేరోజు సాయంత్రం ప్రధాని మోదీని నీతి ఆయోగ్ సబ్ కమిటీ ప్రతినిధి బృందంలో భాగంగా కె.సి.ఆర్ కలుసు కున్నారు.కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల హేతుబద్ధీకరణపై అధ్యయనం చేసి సబ్ కమిటీ రూపొందించిన నివేదికను సభ్యులతోకలసి అందజేశారు.
కేంద్ర రవాణా శాఖామంత్రి గడ్కరీని కలసిన సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో రహదారుల పరిస్థితి, జాతీయ రహదారుల నిర్మాణ ఆవశ్యకత, అవసరాలపై ఒక విజ్ఞాపన పత్రాన్ని ముఖ్యమంత్రి కె.సి.ఆర్ అందజేశారు. ఇరుగుపొరుగు రాష్ట్రాలతో పోల్చినా తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారుల సంఖ్య తక్కువగా వున్నదని, రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అభివ ద్ధిచేయాలని ముఖ్యమంత్రి కోరారు. భద్రాచలం- వెంకటాపురం- ఏటూరు నాగారం తుపాకుల గూడెం- మహదేవ్‌పూర్ కాళేశ్వరం చెన్నూరులను కలుపుతూ గౌదావరి తీరంలో ఒక జాతీయ రహదారిని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు కోరారు. ఇది అద్భుతమైన యోచన అని ప్రశంసించిన కేంద్రమంత్రి గడ్కరీ , దీనికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక ( డి.పి.ఆర్) ను పంపాలని కె.సి.ఆర్ కు సూచించారు. గత ఏడాది మంజూరైన జగిత్యాల- కరీంనగర్ -వరంగల్ జాతీయ రహదారి 563ని ఖమ్మం వరకూ పొడిగించడానికి కూడా గడ్కరీ అంగీకరించారు. దీనితోపాటుగా సిరిసిల్ల -సిద్ధిపేట -దుద్దెడ-చేర్యాల -జనగాం -సూర్యాపేట – మిర్యాలగూడ రహదారిని, హైదరాబాద్ -నర్సాపూర్ -మెదక్ -ఎల్లారెడ్డి -బాన్సువాడ -బోధన్ -బాసర -భైన్సా రహదారి, హైదరాబాద్ -బీజాపూర్ వయా మొయినాబాద్ -చేవెళ్ళ -మన్నెగూడ – కొండగల్ రహదారి, కోదాడ – మిర్యాలగూడ -దేవరకొండ -కల్వకుర్తి -జడ్చర్ల రహదారి, నిర్మల్ జగిత్యాల -వయా ఖానాపూర్, మల్లాపూర్, రాయకల్ రహదారి, అశ్వారావుపేట -ఖమ్మం -సూర్యాపేట రహదారి, కరీంనగర్ -సిరిసిల్ల -కామారెడ్డి -యల్లారెడ్డి- పిట్లం రహదారి, ఇలా మొత్తం 1350 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులుగా అభివ ద్ధి చేయాలని గడ్కరీని ముఖ్యమంత్రి కె.సి.ఆర్ కోరారు. బీదర్ -నిజాంపేట రహదారిని కూడా జాతీయ రహదారిగా అభివద్ధి చేయాలని కోరారు. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎం.పిలు జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర రెడ్డి, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రుడు తేజావత్ తదితరులు ముఖ్యమంత్రి వెంట వున్నారు.
ఆర్థిక మంత్రితో భేటీ
తెలంగాణ రాష్ట్రంలో అమలుచేస్తున్న వివిధ అభివ ద్ధి, సంక్షేమ పథకాల అమలుకు అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చుకొనేందుకు వివిధ ద్రవ్య సంస్థల నుంచి రుణాల రూపేణా సమకూర్చుకొనేందుకు ఫెనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్ మెంట్ (ఎఫ్.ఆర్.బి.ఎం) పరిమితిని ప్రస్తుతమున్న 3 శాతం నుంచి 3.5 శాతానికి పెంచాలని కేంద్ర ఆర్థిక శాఖామంత్రి అరుణ్ జైట్లీకి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు విజ్ఞప్తిచేశారు.ప్రజా సేవారంగంగా ఉన్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్.ఎం.డి.ఎ) ని ఆదాయపన్ను నుంచి మినహాయించాలని కూడా సి.ఎం కోరారు.
హామీలు అమలుచేయండి
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీలు వెంటనే అమలుచేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు కేంద్ర హోం మంత్రి రాజనాథ్ సింగ్ ను కోరారు. ముఖ్యమంత్రి కె.సి.ఆర్ ఢిల్లీ పర్యటనలో భాగంగా అక్టోబర్ 28న రాజనాథ్ సింగ్ ను, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలుసుకున్నారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై వీరితో చర్చించారు. హైకోర్టు విభజనపై కేంద్ర న్యాయశాఖామంత్రి సదానందగౌడ పార్లమెంటులో ఇచ్చిన హామీని వెంటనే అమలుచేయాలని, రాష్ట్రంలో ఐ.ఏ.ఎస్, ఐ.పి.ఎస్ అధికారుల సంఖ్యను పెంచాలని హోం శాఖామంత్రిని ముఖ్యమంత్రి కె.సి.ఆర్ కోరారు. ఢిల్లీ పర్యటనను ముగించుకొని అక్టోబర్ 28 రాత్రి ముఖ్యమంత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు.