సార్వత్రిక ఎన్నికలలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్‌సభా నియోజకవర్గాలకు తొలిదశలో ఏప్రిల్ 11న ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. దేశవ్యాప్తంగా ఏడు దశలలో పోలింగ్ జరుగుతుండగా, తెలంగాణ రాష్ట్రంలో ఒకే దశలో పోలింగ్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 62.69 శాతం పోలింగ్ నమోదయినట్టు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోక పోవడం విశేషం.
నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే అత్యధికంగా ఖమ్మం లో 75.28 శాతం, అత్యల్పంగా హైదరాబాద్ లో 44.75 శాతం పోలింగ్ జరిగింది. నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే, ఆదిలాబాద్ (ఎస్.టి) 71.44 శాతం, పెద్దపల్లి (ఎస్.సి) 65.43 శాతం, కరీంనగర్ 69.45 శాతం, నిజామాబాద్ 68.33 శాతం, జహీరాబాద్ 69.67 శాతం, మెదక్ 71.72 శాతం, మల్కాజిగిరి 49.40 శాతం, సికింద్రాబాద్ 46.26 శాతం, హైదరాబాద్ 44.75 శాతం, చేవెళ్ళ 53.22 శాతం, మహబూబ్ నగర్ 65.39 శాతం, నాగర్ కర్నూల్ (ఎస్.సి) 62.29 శాతం, నల్లగొండ 74.39 శాతం, భువనగిరి 74.39 శాతం, వరంగల్ ( ఎస్.సి) 63.65 శాతం, మహబూబాబాద్ 68.79 శాతం, ఖమ్మం 75.28 శాతం పోలింగ్ జరిగింది.
పురుషులు 62.82 శాతం, మహిళలు 62.55 శాతం, థర్డ్ జండర్ కు చెందినవారు 15.43 శాతం పోలింగ్ లో పాల్గొన్నారు. నిజామాబాద్ లోక్ సభా స్థానానికి అత్యధికంగా 185 మంది అభ్యర్థులు పోటీలో ఉండటంతో ఇక్కడ అత్యాధునిక పెద్ద ఈవీఎంలతో పోలింగ్ నిర్వహించారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 12 ఈవీఎంలను వినియోగించారు. 185 మంది అభ్యర్థులు బరిలో నిలచిన నిజామాబాద్ లోక్ సభా స్థానంలో ఎన్నికను సవాలుగా స్వీకరించి నిర్వహించామని, ఈ నియోజకవర్గంలో 27 వేల అత్యాధునిక ఈవీఎంలు వినియోగించామని సీఈఓ రజత్ కుమార్ తెలిపారు. ఈ ఎన్నికను నిర్వహించడం చరిత్రాత్మక ఘట్టంగా ఆయన అభివర్ణించారు. అత్యధిక ఈవీఎంలతో నిర్వహించిన ఈ ఎన్నికను గిన్నీస్ బుక్‌లో నమోదుచేయడానికి ఆ సంస్థను సంప్రదించినట్టు ఆయన తెలిపారు. ప్రపంచంలోనే ఒక ఎన్నికకు ఇన్ని ఈవీఎంలను వినియోగించడం ఇదే ప్రథమమన్నారు. ఓటింగ్ లో పాల్గొన్న ప్రజానీకానికి సీఈఓ కృతజ్ఞతలు తెలిపారు. శాంతిభద్రతలను సజావుగా నిర్వహించిన పోలీసులను ఆయన అభినందించారు.
చింతమడకలో ఓటువేసిన సి.ఎం
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తన స్వగ్రామమైన సిద్ధిపేట జిల్లా చింతమడక గ్రామంలో సతీసమేతంగా ఓటుహక్కు వినియోగించుకున్నారు. రాష్ట్ర గవర్నర్ ఈ.ఎస్.ఎల్. నరసింహన్ ఖైరతాబాద్ లోని రాజ్‌నగర్ కమ్యూనిటీ హాలులో ఓటువేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం పోచారం గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే తెలంగాణ రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎన్నికలుగానీ, ప్రస్తుత లోక్ సభ ఎన్నికలు గానీ ప్రశాతంగా ముగిశాయి. రాష్ట్ర పోలీసులు, కేంద్ర బలగాలు సమన్వయంతో అత్యంత పటిష్టంగా చేపట్టిన భద్రతాచర్యలు సత్ఫలితాలనిచ్చాయి.
పోలింగ్ అనంతరం ఈవీఎంలను భద్రపరచిన స్ట్రాంగ్ రూముల వద్ద మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈవీఎంలు ఉన్న గదులవద్ద తొలి వలయంలో కేంద్ర సాయుధ బలగాలు, రెండో వలయంలో రాష్ట్ర టి.ఎస్.ఎస్సీ సిబ్బంది, మూడో అంచెలో పోలీసులను ఏర్పాటుచేశారు. మే 23న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అప్పటివరకూ డేగకళ్ళతో వాటికి పోలీసులు పహరా కాస్తున్నారు.