magaభారత దేశ 14వ రాష్ట్రపతిగా రామ్‌నాథ్‌ కోవింద్‌ జూలై 25న ప్రమాణస్వీకారం చేశారు. పార్లమెంట్‌ సెంట్రల్‌ హాలులో సంప్రదాయబద్ధంగా జరిగిన కార్యక్రమంలో కోవింద్‌ తో సుప్రీంకోర్టు ప్రధాన న్యామూర్తి జస్టిస్‌ జె.ఎస్‌.ఖేహర్‌ ప్రమాణం చేయించారు. అంతకు ముందు రాష్ట్రపతిగా వున్న ప్రణబ్‌ ముఖర్జీ అధికారిక వాహనంలో కోవింద్‌ ను రాష్ట్రపతి భవన్‌ నుంచి పార్లమెంటుకు తోడ్కొనివచ్చారు. పార్లమెంట్‌ సెంట్రల్‌ హాలులో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ఎన్నికల్లో కోవింద్‌ ఎన్నికైనట్టు ఈసి విడుదలచేసిన ప్రకటనను కేంద్రహోమ్‌ శాఖ కార్యదర్శి చదివి వినిపించారు. అనంతరం మధ్యాహ్నం 12.15 గంటలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఖేహర్‌ రాష్ట్రపతిగా కోవింద్‌ తో ప్రమాణస్వీకారం చేయించారు. వెంటనే 21 తుపాకులను పేల్చి సైన్యం గౌరవ వందనం సమర్పించింది. అనంతరం కొత్త రాష్ట్రపతి కోవింద్‌ను ప్రణబ్‌ ముఖర్జీ తన ఆసనంలో కూర్చోబెట్టారు. ఈ ప్రమాణస్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్రమోదీ, తదితర ప్రముఖులతోపాటు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకూడా హాజరై కోవింద్‌ కు అభినందనలు తెలిపారు.

రాష్ట్రపతి పదవికి జరిగిన ఎన్నికల్లో యు.పి.ఏ పక్షాన పోటీచేసిన రామ్‌నాథ్‌ కోవింద్‌కు మొత్తం ఎలక్టోరల్‌ కాలేజీలో 65 శాతానికిపైగా ఓట్లతో ఘనవ విజయం లభించింది. కాగా, ప్రతిపక్షాల తరఫున పోటీచేసిన లోక్‌ సభ మాజీ స్పీకర్‌ మీరా కుమార్‌ కు 34 శాతం ఓట్లు మాత్రమే లభించి ఓటమి చెందారు. మొత్తం 4896 ఓట్లలో కోవింద్‌ కు 2,930 ఓట్లు లభించాయి. వీటి విలువ 7,02,044. కాగా, మీరా కుమార్‌ కు 3,67,314 విలువ గల 1,844 ఓట్లు లభించాయి. 20,942 విలువైన 77 ఓట్లు చెల్లలేదు.

రామ్‌నాథ్‌ కోవింద్‌ ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ దేహాత్‌ జిల్లా దేరాపూర్‌ తాలూకా పారాంఖ్‌ గ్రామంలో 1945 అక్టోబర్‌ 1న దళిత (ఎస్సీ) కోలీ కుటుంబంలో జన్మించారు.కాన్పూర్‌ విశ్వవిద్యాలయం నుంచి బీకాం, ఎల్‌.ఎల్‌.బి పట్టాలు పొందారు.1971లో న్యాయవాదిగా స్థిరపడ్డారు.1977-79 మధ్య ఢిల్లీ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేశారు. 1978లో సుప్రీం కోర్టులో అడ్వకేట్‌ ఆన్‌ రికార్డు హోదా పొందారు. 1980 నుంచి 1993 వరకూ సుప్రీంకోర్టులో కేంద్రప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు.ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో 16 ఏళ్లపాటు న్యాయవాదిగా పని చేశారు. 1977 నుంచి కొంతకాలం అప్పటి ప్రధాని మొరార్జీదేశాయ్‌కి ఆర్థిక శాఖ వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. రైతు కుటుంబంలో పుట్టిన కోవింద్‌కు 1974 మే 30న సవితతో వివాహమైంది,. వీరికి కుమారుడు ప్రశాంత్‌ కుమార్‌, కుమార్తె స్వాతి ఉన్నారు.

ఆర్‌.ఎస్‌.ఎస్‌ నేపథ్యం వున్న కోవింద్‌ తొలిసారి 1994లో రాజకీయాలలోకి ప్రవేశించి 1994 ఏప్రిల్‌ లో ఉత్తరప్రదేశ్‌ నుంచి రాజ్యసభ సభ్యునిగా ఎన్నిక య్యారు. వరుసగా రెండు పర్యాయాలు పెద్దల సభకు ప్రాతినిధ్యం వహించారు.1998-2002 మధ్య భారతీయ జనతాపార్టీ దళితమొర్చా అధ్యక్షునిగా పనిచేశారు.అభిల భారత కోలీ సమాజ్‌ అధ్యక్షునిగా పనిచేశారు. 2015 ఆగస్టు 8న బీహార్‌ గవర్నర్‌గా నియమితులై రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికయ్యేవరకూ ఆ పదవిలో కొనసాగారు.

Other Updates