డాక్టర్ జాకీర్ హుస్సేన్ మరణంతో రాష్ట్రపతి పదవికి అధికార కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిని నిర్ణయించే విషయంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ రెండువర్గాలుగా చీలిపోయింది. కాంగ్రెస్ అధ్యక్షుడు నిజలింగప్ప లోకసభ సభాపతి నీలం సంజీవరెడ్డిని కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించగా, ప్రధాని ఒకవైపు పార్టీ అభ్యర్థికి మద్ధతుగా ఒక సెట్టు నామినేషన్ పత్రాలు తానే స్వయంగా దాఖలుచేసి మరోవైపు ఉపరాష్ట్రపతిగా వున్న వి.వి.గిరిని రాష్ట్రపతి పదవికి పోటీలో స్వతంత్ర అభ్యర్థిగా నిలిపింది. నిజలింగప్ప ‘విప్’ జారీచేయాలని ప్రధానిని కోరగా ఆమె తిరస్కరించింది. అంతరాత్మసాక్షిగా సభ్యులు ఓటువేయాలన్నది. అప్పటికి కొద్దిరోజుల ముందే ఉపప్రధాని మొరార్జీ దేశాయ్‌కి మాటమాత్రం చెప్పకుండా ‘ఆర్థికశాఖ’ను తొలగించింది. దీనితో అవమానభారంతో మొరార్జీ దేశాయ్ ఉపప్రధాని పదవికి రాజీనామా చేసారు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో బ్రహ్మానందరెడ్డికున్న ”పలుకుబడి”ని చూసి ఈరాష్ట్ర ప్రజాప్రతినిధుల ఓట్లకోసం అటు నిజలింగప్ప ఇటు ఇందిరాగాంధీ ఇద్దరూ కూడా బ్రహ్మానందరెడ్డిని మంచి చేసుకునే క్రమంలో తెలంగాణ సమస్య విషయంలో ఆయనకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. తెలంగాణలో విచ్చలవిడిగా ప్రజలను కాల్చివేస్తున్నా ఈ అగ్రనేతలు మౌనం వహించారు. కమిటీలు వేస్తూ కాలం గడిపారు. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రధానికి, కాంగ్రెస్ అధ్యక్షునికి ”అధిష్టానం’గా బ్రహ్మానందరెడ్డి వ్యవహరించారు.
1969 ఆగస్టు 14న కాంగ్రెస్ శాసనసభా పార్టీ సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థియైన నీలం సంజీవరెడ్డికి కాంగ్రెస్ సభ్యులు ఓటువేయాలని కోరినారు. కాంగ్రెస్‌కు 195 మంది శాసనసభ్యులు, 66 మంది శాసనమండలి సభ్యులుండగా వీరిలో 180 మంది హాజరైనారు. కాంగ్రెస్ సభ్యులకు నీలం సంజీవరెడ్డికి ఓటు వేయాలని ‘విప్’ జారీ చేసినట్లు సి.ఎం.చెప్పారు. రెండవ ఓటు వేయనక్కరలేదని నిర్ణయించారు. ఆగస్టు 16న పోలింగ్ జరిగింది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 269 మంది ఎం.ఎల్.ఏ.లు ఓటింగ్‌లో పాల్గొన్నారు. మొత్తం సభ్యులసంఖ్య 286. గైర్హాజరైన 17 గురిలో 13 మంది తెలంగాణ శాసనసభ్యులు జైల్లో వుండడం వలన వారికి పోస్టుద్వారా ఓటువేసే అవకాశాన్ని ఎన్నికల కమీషన్ కల్పించింది. మరో ఎం.ఎల్.ఏ., ప్రజాసమితి కార్యదర్శి పి.నర్సింగరావుపై వారంట్ ఉన్నందున అజ్ఞాతంలో వున్నారు.
ఈ ఎన్నికల్లో ప్రధాని బలపర్చిన స్వతంత్ర (ఇండిపెండెంట్) అభ్యర్థి వి.వి.గిరి రాష్ట్రపతిగా 14,650 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 285 మంది సభ్యుల్లో, 131 మంది వి.వి.గిరికి, 118 మంది సంజీవరెడ్డికి ఓటు వేసారు.(మిగిలినవారు ఇతర అభ్యర్థులకు వేసినారు). కాంగ్రెస్ అధికార అభ్యర్థి నీలం సంజీవరెడ్డి ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో ప్రత్యేక తెలంగాణ కోరుతున్న శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు నీలం సంజీవరెడ్డికి వ్యతిరేకంగా వి.వి.గిరికి ఓటువేసారు(ఈ ఎన్నికల్లో జనసంఘ్, స్వతంత్ర పార్టీ, సి.డి.దేశ్‌ముఖ్‌ను అభ్యర్థిగా నిలిపినాయి. 17 రాష్ట్రాల్లో దేశ్‌ముఖ్‌కు 408 మంది ఎం.ఎల్.ఏ.లు ఓట్లు వేసారు.)
ఆగస్టు15న ఉద్యమకారులపై పోలీసుల దౌర్జన్యం
శాసనసభ్యురాలికి గాయాలు
హైదరాబాద్‌లోని వి.వి. కళాశాలలో సుమారు 6 వేలకు పైగా జనం నిషేదాజ్ఞలు ఉల్లంఘించి తెలంగాణ సభ నిర్వహించారు. సభలో మాజీ ఉపముఖ్యమంత్రి కె.వి.రంగారెడ్డి తెలంగాణ ప్రజాసమితి, విద్యార్థి కార్యాచరణ సంఘం నేతలు, శాసనసభ్యులు, విద్యార్థులు, యువకులు, బాలబాలికలు పాల్గొన్నారు.
సభలో స్వాతంత్య్రదినం సందర్భంగా జాతీయ జెండా, తెలంగాణ జెండాలు ఎగురవేసారు. సభ ముగిసిన తర్వాత కళాశాల ఆవరణలోకి వచ్చి ఊరేగింపు తీయాలనుకుంటున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జీ చేసారు. భాష్పవాయువు ప్రయోగించారు. విద్యార్థులను పోలీసులు కొడుతుంటే విద్యార్థులు వారిపై రాళ్ళు విసిరారు. ఈ గొడవలో శాసనసభ్యురాలు సుమిత్రా దేవిని పోలీసులు లాఠీలతో కొట్టడం వలన గాయాలై రక్తం కారింది. ప్రజాసమితి నేత సదాలక్ష్మీ కె.వి.రంగారెడ్డి తదితరులు కాలేజి లోపలే ఉండిపోయారు. కాలేజీ లోపల వున్న శ్రీమతి సదాలక్ష్మీకి భాష్పవాయువు ‘షెల్’ తగిలి గాయమైంది. సుమిత్రాదేవిపై లాఠీచార్జీ జరపడం గురించి శాసనసభలో కె.రాజమల్లు ప్రభుత్వాన్ని నిలదీసారు. రక్తంతో తడిసిన తన దుస్తులను సుమిత్రాదేవి సభ ముందుంచారు.
ప్రత్యేక తెలంగాణా ఉద్యమంలో
ప్రాణాలు కోల్పోయిన వారికి శాసనసభ సంతాపం
1969 జనవరి నుండి తెలంగాణ ప్రాంతంలో జరిగిన ఆందోళనల్లో, ఉద్యమాలలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రశాసనసభ ఆగస్టు 16న సంతాపాన్ని ప్రకటిస్తూ, సభ్యులంతా రెండు నిముషాలు నిలబడి మౌనం పాటించారు. అమరుల కుటుంబాలకు సానుభూతిని వెల్లడిస్తూ తీర్మానించారు. ఉపముఖ్యమంత్రి జె.వి.నరసింగ్‌రావు తీర్మానాన్ని ప్రతిపాదించగా సభ్యులందరు మౌనం పాటించారు. ఆ సమయంలో స్పీకర్‌గా బి.వి.సుబ్బారెడ్డి వున్నారు.
తెలంగాణ ఉద్యమంలో బాంబుల ప్రయోగం
తెలంగాణ ఉద్యమాన్ని అణచడానికి విచ్చలవిడిగా పోలీసు కాల్పులు జరిపించడం, ఆంధ్ర గుండాలచే దాడులు చేయించడం వంటి ఫాసిస్ట్ చర్యలకు బ్రహ్మానందరెడ్డి పాల్పండంతో అశాంతికి గురైన కొందరు యువకులు స్థానికంగా అందుబాటులో వున్న పరిజ్ఞానంతో చిన్నచిన్న ఉల్లిగడ్డ సైజు బాంబులను తయారుచేసి వినియోగించారు. అవతలివారిని భయంభ్రాంతులను గురిచేయడానికి, కొద్దిస్థాయిలో ఆస్తినష్టానికి ఇవి ఉపయోగించేవారు.
తెలంగాణ ఉద్యమంలో పలుమార్లు ఈ బాంబులను ప్రయోగించడం వల్ల ఒక కానిస్టేబుల్ మే 4న మరణించాడు. ఒక దశలో మాజీమంత్రి టి.ఎన్.సదాలక్ష్మీగారు కూడా ఈ రకమైన చర్యలను ప్రోత్సహించారు. బ్రహ్మానందరెడ్డి కుట్రలకు విసిగిపోయి ఆమె యువకులను ప్రోత్సహించారు. చెన్నారెడ్డి ఇంటిపైన కూడా 1970లో సమైక్యవాదులు బాంబులు వేశారు.
తెలంగాణా శాసనసభ్యులెవరూ మంత్రి పదవులు తీసుకోవద్దని మంత్రివర్గ పునర్నిర్మాణం సందర్భంగా తెలంగాణ విద్యార్థి కార్యాచరణ సంఘం హెచ్చరించినా వినకుండా ఏకంగా ఉపముఖ్యమంత్రి పదవిని జె.వి.నరసింగ్‌రావు తీసుకోవడంతో ఆయన ఇంటిపై బాంబులు వేసారు. 1969 ఆగస్టు 15 రాత్రి 10 గం.టకు సికింద్రాబాద్ శివార్లలోని అల్వాల్‌లో వున్న రవాణామంత్రి డాక్టర్ ఎం.ఎస్.లక్ష్మీనరసయ్య ఇంటిమీద నాటు బాంబు విసిరారు. ఆ ఇంటి మొదటి అంతస్తు వెనకభాగపు కిటికీ చూరుకు తగిలి పగిలింది. లక్ష్మీనరసయ్య ఇంటి మీద బాంబు విసరడం ఆగస్టు నెలలో ఇది రెండోసారి.
ఇలాంటి బాంబులను పోలీసు బలగాలు ప్రయాణించే వాహనాలపై విసిరినారు.
1969 ఆగస్టు 17న హైదరాబాద్ పోలీసు కంట్రోల్ రూము వెనుక 20 గజాల దూరంలో ఫతేమైదాన్ ఆవరణలో ఒక నాటుబాంబు విసిరినారు. పెద్ధశబ్దంతో ఈ బాంబు ప్రేలడంతో కంట్రోల్ రూములోని పోలీసులు, అధికారులు భయపడినారు. బాంబు విసిరిన వారి వెంటపడగా, సైకిళ్ళమీద పారిపోతున్న వారిలో నరసింహాచార్యులు అనే మెడిసిన్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కింగ్‌కోటి వద్ద పట్టుకున్నారు. పోలీసులు నర్సింహాచార్యులు తలపై కొట్టడంతో తలకు గాయమై నెత్తురు చిందింది. ఆయన విసిరిన బాంబు వలన నేలమీద గుంటపడటం తప్ప ఆస్తులకు నష్టం జరగలేదు, వ్యక్తులకూ గాయాలు కాలేదు. (ఆంధ్రపత్రిక, 18-8-1969)
రాష్ట్రపతిరోడ్‌లో పోలీసువాహనంపై బాంబులు విసరగా ఒక పోలీసు గాయపడిన సంఘటనలో సికింద్రాబాద్ విద్యార్థి కార్యాచరణ సంఘం అధ్యక్షుడు పి.జె.సూరిపై మే 6న కేసు పెట్టారు. ఆయనకు ఈ సంఘటనకు సంబంధంలేదు. ఆ తర్వాత ఆర్.టి.సి.లో పనిచేసే కుమార్‌ను అరెస్ట్ చేసి ఈ కేసులో జైలుకు పంపించారు. మే 6న అరెస్టు చేసిన పి.జె.సూరిని విడుదల చేయవలసిందిగా ఆగస్టు 22న హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ”దగ్గర ప్రేలుడు పదార్థాలున్నంత మాత్రాన శాంతిభద్రతల సంఘటనతో దానిని ముడిపెట్టడానికి వీలులేద”ని హైకోర్టు ఉత్తర్వులలో పేర్కొన్నది.
శాసనసభలో, లోకసభలో తెలంగాణ
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం శాసనసభలో ఆగస్టు 18న కాంగ్రెస్ సభ్యుడు పి.నరసారెడ్డి ప్రతిపాదిస్తూ, తెలంగాణ సమస్యపై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటుకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించేందుకు డిటెన్యూలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని, ఆందోళన విరమించాలని ఉద్యమనేతలను కోరినారు. తెలంగాణ పాఠశాలలను ప్రభుత్వం తెరిపించాలని కోరినారు.
రాజకీయ పరిపాలనా రంగాలలో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఆంధ్రుల ప్రాబల్యం అమితంగా ఉన్నదన్న విమర్శను ప్రస్తావించి, తెలంగాణా ప్రజల్లో గల భయాలను చెదరగొట్టేందుకు విద్యుశ్చక్తి బోర్డు, ఆర్.టి.సి. మొదలైన ప్రభుత్వ సంస్థలలో తెలంగాణ ప్రాంతంవారికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కోరినారు. ప్రత్యేక తెలంగాణను ఆయన వ్యతిరేకించారు. విభజన ప్రయోజనకరం కాదన్నారు.
తెలంగాణ ఉద్యోగులకు జరిగిన అన్యాయాలను తొలగించే కార్యక్రమం చాలా నెమ్మదిగాను, అసంతృప్తికరంగానూ ఉన్నదన్నారు. తెలంగాణ రక్షణలను అమలు చేయకపోవడమే ఆందోళనలకు మూల కారణమన్నాడు. ఇండిపెండెంట్ శాసనసభ్యుడు (ఆంధ్ర) చప్పిడి వెంగయ్య ప్రసంగిస్తూ ”తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పరచి బంధువులుగాను, స్నేహితులుగాను విడిపోవడం తప్ప గత్యంతరం లేదని గత ఏడు మాసాలుగా జరిగిన సంఘటనలు రుజువు చేశాయ”ని అన్నారు.