రాష్ట్రపతి-పాలన-పెడితేనే-చర్చలుప్రధాని ఇందిర ఆదేశంతో 1969 జూన్‌ 7న హైదరాబాద్‌కు వచ్చిన దేశీయాంగమంత్రి వై.బి.చవాన్‌ ముందుగా ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డితో, రాష్ట్ర మంత్రులతో తెలంగాణ సమస్యపై, ఇక్కడి పరిస్థితిపై చర్చించారు. మంత్రుల్లో కొందరు ముఖ్యంగా వి.బి. రాజు ‘తెలంగాణ రక్షణలు`అమలు కావాలని, ‘తెలంగాణ నిధులు ఆంధ్రకు మళ్ళించరాద’ని కోరినారు. ‘కొండా లక్ష్మణ్‌ ప్రభృతులు పోటీ కాంగ్రెస్‌ పెట్టడానికి కారణం ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌లోని తెలంగాణ సంఘాన్ని మొదట్లోనే పనిచేయకుండా చేసినందువలన తెలంగాణలోని 90 శాతం కాంగ్రెస్‌ వాదులు ‘‘ప్రత్యేక రాష్ట్రం కోరుతున్నందువలననే’’ అని వి.బి. రాజు చవాన్‌కు చెప్పినారు.

మంత్రులతో సమావేశం ముగిసిన తర్వాత కాసేపటికి తెలంగాణ ప్రజాసమితి సారథి డా॥ మర్రి చెన్నారెడ్డితో వై.బి. చవాన్‌ ఒక గంటసేపు సమావేశమైనారు. వీరి సంభాషణ ఆసక్తికరంగా సాగింది. ‘‘ప్రస్తుత ఆందోళనను విరమిస్తే ప్రత్యేక తెలంగాణ సహా అన్ని విషయాలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది’’అని చవాన్‌ చెప్పగా… ‘‘తక్షణం రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టినట్లయితే ఇలాంటి చర్చలకు వీలుకలుగుతుంది’’ అని చెన్నారెడ్డి సూచించారు. ‘‘రాష్ట్రపతి పాలన ఎప్పుడు రావాలని మీరు కోరుతు న్నాం’’అని చవాన్‌ ప్రశ్నించగా, డా॥ చెన్నారెడ్డి తమ చేతి గడియారం వంక చూచి ‘‘ఇప్పుడు 7 గంటలకు పది నిముషాలు తక్కువగా ఉంది. 7 గంటలకు రాష్ట్రపతిపాలన వస్తే నేను ఆనందిస్తాను. అయితే ఇందుకు భౌతికమైన పరిమితులు ఉన్నవి గనుక, కొన్ని వారాలలో రాష్ట్రపతిపాలన రావాలని మేము కోరుతున్నాం’’అని చవాన్‌తో అన్నారు.

‘‘దౌర్జన్య చర్యలమూలంగా ప్రజల దైనందిన జీవితానికి ఇబ్బంది కలుగకుండా ఉండే నిమిత్తం ప్రజాసమితి ఆందోళన విరమిస్తుందా?’’ అన్న చవాన్‌ ప్రశ్నకు ‘‘దౌర్జన్యకాండకు ముఖ్యమంత్రే బాధ్యులు’’అని బదులిచ్చారు చెన్నారెడ్డి. ‘‘ఇంతవరకు 10వేల మందికి పైగా సత్యాగ్రహులు ఆందోళనల్లో పాల్గొన్నారు. వారంతా శాంతియుతంగా వ్యవహరించారు’’ అని డా॥ చెన్నారెడ్డి చవాన్‌తో అన్నారు.

‘‘ఆందోళనకారులను కొట్టించడానికి, విధ్వంసం సృష్టించడానికి ముఖ్యమంత్రి గుండాలను తీసుకువచ్చి నారు’’అని చవాన్‌కు వివరించారు.

చర్చల అనంతరం డా॥ చెన్నారెడ్డి పత్రికల వారితో మాట్లాడుతూ ‘‘రాష్ట్రంలో ప్రశాంత పరిస్థితి విషయమై చవాన్‌, నేను అందరమూ ఆత్రంగానే ఉన్నాం కానీ రాష్ట్ర పతి పాలన వస్తే తప్ప మామూలు పరిస్థితిరాదు. అంత వరకు ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదు’’అని అన్నారు..

డా॥ చెన్నారెడ్డి వెంటవచ్చిన టి.పి.ఎస్‌. కార్యవర్గ సభ్యులను కూడా చవాన్‌ కలిశారు. విడిగా డా॥ చెన్నారెడ్డితో గంటసేపు చర్చించారు.

తెలంగాణ పోటీ ప్రజాసమితి అధ్యక్షులు శ్రీధరరెడ్డితోబాటు పలువురు నేతలు చవాన్‌ను కలిసి ‘‘మంత్రివర్గాన్ని బర్తరఫ్‌ చేసి, శాసనసభను తాత్కాలికంగా కాక పూర్తిగా రద్దు చేయాలి, రాష్ట్రపతిపాలన పెట్టి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి’’ అని చవాన్‌ను కోరినారు. ఈ ప్రతినిధివర్గంలో తెలంగాణ ఉద్యమ ప్రారంభకులైన ప్రతాప్‌కిశోర్‌, రఘువీర్‌రావు, పి.ఎన్‌.స్వామి, ఇ.వి. పద్మనాభన్‌, జి.ఎం. అంజయ్య, కెప్టెన్‌ అన్సారీ తదితరులున్నారు.

నగరపాలకసంఘం అధ్యక్షులు కుముదినీ నాయక్‌ అధ్యక్షతన పదిహేనుమంది చవాన్‌ను కలిసి, తెలంగాణ వారిని రెండో శ్రేణి పౌరులుగా ఆంధ్రపాలకులు చూశారని, తెలంగాణ వారికి అన్యాయాలు జరిగినాయని, అధికారులకు జరిగిన అన్యాయాలకు అంతేలేదని, పోలీసు జులుం హెచ్చిందని, ఇక్కడి పరిస్థితిని కళ్ళకు కట్టినట్లు వివరించారు. ఈ ప్రతినిధుల్లో తెలుగువచ్చినవారు ఇద్దరు, ముగ్గురే ఉన్నారు. వీరిలో కోటీశ్వరులు, కాయస్థులు, కొందరు ముస్లింలు, ఉద్యోగాలనుంచి తప్పుకున్న డాక్టర్లు, గుజరాతీలు, యు.పి.నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వ్యాపారవేత్తలు ఉన్నారు.

కొత్తగా ఏర్పాటు చేయబడిన తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌కు గుర్తింపు లభింపచేయవలసిందని కొండా లక్ష్మణ్‌ బాపూజీ చవాన్‌ను కోరినారు.

రెండో రోజైన జూన్‌ 8న కూడా వై.బి. చవాన్‌ పలువురు ముఖ్య నేతలతో సుమారు 12 గంటలు చర్చలు జరిపినారు.
చవాన్‌ నగరానికి వచ్చిన 7వ తేదీన విద్యుచ్ఛక్తి బోర్డు తదితర సంస్థలకు, పరిశ్రమలకు చెందిన సుమారు రెండున్నర లక్షల మంది కార్మికులు తెలంగాణ రాష్ట్రం కోరుతూ సమ్మె ప్రారంభించగా, పదకొండవ తేదీ నుండి నిరవధిక సమ్మె చేయాలని తెలంగాణా ఎన్జీవోల సంఘం (ఏ.ఆర్‌. ఆమోస్‌ నాయకత్వంలో) పిలుపునిచ్చింది.
టి.ఎన్‌.జీ.ఓ.ల సమ్మె తగదని దేశీయాంగ మంత్రి చవాన్‌ ఉద్యోగులకు చేసిన విజ్ఞప్తిని వారు తిరస్కరించారు.
రెండురోజుల పర్యటన అనంతరం ఢల్లీికి తిరిగి వెళ్ళేముందు దేశీయాంగమంత్రి చవాన్‌ పత్రికలకు జారీచేసిన ప్రకటన పూర్తి పాఠం….

‘‘నేను హైదరాబాద్‌కు వచ్చినప్పటినుండి వివిధ రంగాల ప్రతినిధులను, వివిధ సంస్థల ప్రతినిధులను, పార్లమెంటు సభ్యులను, శాసనసభ్యులను, స్థానిక సంస్థలతో సంబంధమున్న వారిని, ఇతర నాయకులను కలుసుకొని చర్చలు జరిపాను.

‘‘తెలంగాణలో నానాటికీ దిగజారిపోతున్న పరిస్థితిని చక్కబరిచేందుకు అనేక సూచనలు నాకు చెప్పారు. వివిధ వర్గాలు వివిధ అభిప్రాయాలు వెలిబుచ్చాయి. తెలంగాణ సమస్యల గురించి వున్న బలమైన అభిప్రాయాలను నేను గుర్తిస్తున్నాను. ఈ సమస్యలను సత్వరమే పరిష్కరించవలసిన ఆవశ్యకత వుందని నాకు తెలుసు. అయితే ఈ సమస్యలు తీవ్రమైనవి, జటిలమైనవి కాబట్టి వీటిని ప్రధాని, కేంద్ర మంత్రివర్గము పరిశీలించవలసి ఉన్నది. ద్వేషం, క్రోధం లేకుండా సమస్యలను ప్రశాంతంగా ఆలోచించటానికి మామూలు పరిస్థితులు నెలకొనటం అవసరం.
‘‘అందుచేత అన్నిరకాల ఆందోళనలు విరమించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రస్తుత పరిస్థితులలో ఆందోళనా కార్యక్రమాలు దౌర్జన్యానికి దారితీసి ఆ తరువాత ప్రజలకు, దేశానికి తీరని నష్టం కలిగించే అనేక సంఘటనలకు అవి దారితీస్తాయి.

‘తెలంగాణ ఎన్‌.జి.వోలు జూన్‌ 10 నుండి సమ్మె జరుపదలచినట్లు నాకు తెలిసింది. తమ కోర్కెలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని కోరే హక్కు తెలంగాణ ఎన్‌.జి.ఓలకు ఉన్నది. అయితే రాజకీయ లక్ష్యాలు సాధించటానికై ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రతిష్టంభింపజేయ ప్రయత్నించడం తప్పు. సమ్మె ప్రయత్నం విరమింపజేయాలని కోరుతున్నాను.

‘‘తెలంగాణలో నివసించే ఆంధ్రప్రాంతం ప్రజల్లో భయం, ఆందోళన నెలకొని వున్నదని నాకు తెలియవచ్చింది. కొన్ని సంఘటనలు జరిగినట్లు నాకు తెలిసింది. తమ రాజకీయ భావాలు ఎలా ఉన్నప్పటికీ సోదరులైన ఆంధ్ర ప్రజలపై దౌర్జన్యం జరుపనీయమనీ, వారితో స్నేహ సంబంధాలు నెలకొల్పుకోగలమనీ నన్ను కలుసుకున్న పలువురు నాయకులు స్పష్టం చేయటం నాకు సంతోషం కలిగిస్తున్నది.

రాష్ట్రపతి-పాలన-పెడితేనే-చర్చలు2ప్రశాంత వాతావరణంలో నాయకులతో చర్చలు జరిపి యీ సమస్యలకు పరిష్కారమార్గం కనుగొనటానికి వీలుగా మామూలు పరిస్థితులు ఏర్పడటానికి తోడ్పడవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను..

‘ఇటీవల అల్లర్లలో గాయపడినవారిని నేను ఆసుపత్రికి వెళ్ళి చూశాను. అల్లర్లలో కొందరు ప్రాణాలు కోల్పోవడం, అనేకమంది నష్టపడడం నాకు ఎంతో విచారం కలిగిస్తున్నది. నష్టపడినవారి కుటుంబాలకు నా సానుభూతి తెలుపుతున్నాను.

‘‘ప్రశాంత వాతావరణంలో నాయకులతో చర్చలు జరిపి యీ సమస్యలకు పరిష్కారమార్గం కనుగొనటానికి వీలుగా మామూలు పరిస్థితులు ఏర్పడటానికి తోడ్పడవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను’’.

ఈ ప్రకటన తెలంగాణ ఉద్యమకారుల్లో కొంత నిరాశనే మిగిల్చింది. ప్రధాని ఇందిర ఖచ్ఛితంగా ఏదో ఒక పరిష్కారాన్ని చవాన్‌ద్వారా సూచిస్తుందని, కనీసం రాష్ట్రపతి పాలనకై స్పష్టమైన ఆదేశాలు ఆమెనుండి చవాన్‌ పొంది వుండవచ్చునని తొలుత చెన్నారెడ్డివంటి పెద్దలు సైతం భావించారు. కానీ అదేమీ జరుగలేదు. ఢల్లీినుండి రాగానే చవాన్‌ పత్రికలవారితో మాట్లాడుతూ.. అరమరికలులేని మనస్సుతో చర్చలు జరుప టానికి తాను యిక్కడికి వచ్చానని చెప్పారు. ఇక్కడ జరుగుతున్న ఆందోళన కేవలం సంఘ విద్రోహశక్తుల వల్లనేనన్న వాదనతో చవాన్‌ అంగీకరించలేదు. ‘‘తెలంగాణ సమస్య ఒక రాజకీయ సమస్య’’ అని చెప్పారు.

చవాన్‌ ప్రకటనపై డా॥ చెన్నారెడ్డి వ్యాఖ్యానిస్తూ… ‘‘ఆందోళనాపూరితమైన కార్యకలాపాలు కొంతకాలంపాటు నిలిపివేయడానికి వీలుగా వెంటనే రాష్ట్రపతిపాలనను విధించాలి’’ అన్నారు.

‘‘ప్రస్తుత ప్రభుత్వంపట్ల ప్రజలు విశ్వాసాన్ని కోల్పోయారు’’ అని డా॥ చెన్నారెడ్డి చెప్పారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలన్న కోర్కె విషయంలో తెలంగాణ ప్రజల మనోభావ బలాన్ని చవాన్‌ గుర్తించగలిగినందుకు, ఈ సమస్యను లక్ష్యపూరితంగా, శ్రద్ధగా ప్రధాని, కేంద్రమంత్రివర్గం చర్చించవలసి ఉన్నదని అభిప్రాయపడినందుకు తనకు చాలా సంతోషంగా వున్నదన్నారు.

హైదరాబాద్‌లో ఇదే రోజు జరిగిన పట్టభద్రుల సమావేశంలో డా॥ చెన్నారెడ్డి ప్రసంగిస్తూ… ‘‘చవాన్‌ ఢల్లీి వెళ్ళేలోగా రాష్ట్రపతిపాలన ప్రవేశపెట్టగలమని విస్పష్ట ప్రకటన చేయాలి’’ అని విజ్ఞప్తి చేశారు. ‘‘రాష్ట్రపతిపాలన విధించబడగలదని కనుక దేశీయాంగమంత్రి హామీ ఇచ్చే పక్షంలో మేము వెంటనే మామూలు పరిస్థితిని పునరుద్ధరించగలమని ఆయనకు హామీ ఇస్తున్నానని’’ డా॥ చెన్నారెడ్డి అన్నారు.

ముఖ్యమంత్రి, ఆయన అనుయాయులు తెలంగాణా ప్రజలను శాంతియుతంగా జీవించనివ్వరని, అందుచేతనే రాష్ట్రపతి పాలన విధించాలని తాము పట్టుబడు తున్నామని డా॥ చెన్నారెడ్డి చెప్పారు.

‘‘దేశీయాంగమంత్రి ప్రకటన (రాష్ట్రపతి పాలన విధిస్తూ) చేయకపోయినట్లయితే, ముఖ్యమంత్రి ప్రతిష్ట అడ్డువచ్చినట్లయితే వచ్చే కొద్ది రోజుల్లో సంభవించే పరిణామాలకు తాము మాత్రం బాధ్యులం కాబోమని’’ ఆయన పేర్కొన్నారు. తెలంగాణా సమస్యపై రౌండ్‌టేబుల్‌ చర్చలు జరుపడానికి ప్రజాసమితి సిద్ధంగా ఉందన్నారు.

తెలంగాణా సమస్యపై జనాభిప్రాయసేకరణ జరుపాలని డాక్టర్‌ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరినారు.

‘‘తెలంగాణ ఆందోళన శాంతియుతమైన ప్రజా ఉద్యమం, దానిని దౌర్జన్యపూరిత మైన ఆందోళనగా దేశంలోని ఇతర ప్రాంతాలవారు భావించడం పొరపాటు’’ అని అన్నారు. పూర్తిగా అహింసాయుతంగా, గాంధీమార్గంలో నడుపబడుతున్న తమ ఆందోళనను తప్పుగా అర్థం చేసుకోవద్దని చవాన్‌కు చెన్నారెడ్డి విజ్ఞప్తి చేశారు.

‘‘రాష్ట్రపతి పాలన రాదని మాకు అనుమానంగా ఉన్నది. వచ్చే కొద్దిరోజులు తెలంగాణాకు గడ్డు సమయం. అణచివేత చర్యలు చాలా జరుగవచ్చును. నాయకులను అరెస్టు చేయడం జరుగవచ్చు’’అని డా॥ చెన్నారెడ్డి పట్టభద్రులసభలో అభిప్రాయపడినారు.

ఢల్లీికి వెళ్తున్న ప్రత్యేక విమానంలో దేశీయాంగమంత్రి చవాన్‌ ‘‘హైదరాబాద్‌ యాత్ర ఫలితంపై పెద్ద ఆశగానీ, నిరాశగానీ లేద’’ని విలేకర్లతో అన్నారు.

చవాన్‌ ఢల్లీి వెళ్ళిన మరుసటిరోజునుండి ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని ప్రజాసమితి, ఇతర ప్రజా సంఘాలు నిర్ణయించినాయి. 80వేల మంది దాకా టి.ఎన్‌.జి.ఓలు విధులను బహిష్కరించి జూన్‌ 10నుండి నిరవధిక సమ్మెలో పాల్గొన్నారు. బ్రహ్మానందరెడ్డి కుటిల ఎత్తుగడలతో ఏర్పడ్డ పోటీ ఎన్‌.జీ.ఓల సంఘాన్ని ఉద్యోగులు పెద్దగా పట్టించుకోలేదు.

బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గాన్ని వెంటనే బర్తరఫ్‌ చేయాలని సి.పి.ఐ. నాయకులు చండ్ర రాజేశ్వరరావు, నీలం రాజశేఖరరెడ్డి, ఎం.ఎల్‌.సి. మఖ్దూం మొహినుద్దీన్‌ తదితరులు చవాన్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ సమస్యకు సత్వరమే పరిష్కారం చూపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ అనేక జిల్లాల్లో, నగరంలో సి.పి.ఐ. ఉద్యమ కార్యక్రమాన్ని ప్రకటించింది.

కాసు మంత్రివర్గాన్ని తొలగించాలని బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య విజ్ఞప్తి చేసింది. ఈ సమాఖ్య రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పబ్లిక్‌, ప్రైవేట్‌, సహకార బ్యాంకులలో పనిచేస్తున్న సుమారు 7వేలమంది సిబ్బందికి ప్రాతినిధ్యం వహిస్తున్నది.
ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉద్యోగుల సంయుక్త కార్యాచరణ మండలి తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదాకా నిరవధిక సమ్మెకు జూన్‌ 11నుండి పిలుపునిచ్చింది.

బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గాన్ని వెంటనే బర్తరఫ్‌ చేయాలని కొండా లక్ష్మణ్‌ బాపూజీ ఆధ్వర్యంలోని తెలంగాణ పి.సి.సి. కార్యవర్గం తీర్మానించింది.

‘‘శాంతి భద్రతలు నెలకొల్పవలసిందని చవాన్‌ విజ్ఞప్తిని పురస్కరించుకొని ప్రజలు చాలావరకు ప్రశాంతంగా ప్రవర్తిస్తూ ఉంటే, దేశీయాంగమంత్రి నగరంలో వుండగానే శాంతి యుతంగావున్న ప్రజలపై ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పి, మూసివున్న నివాసగృహాల తలుపులు పగులగొట్టి, స్త్రీలను, పిల్లలను కొట్టడం, విచక్షణారహితంగా ఇంట్లోని వారిని అరెస్టుచేసి వారిని అవమానించడానికి వారిచేత పనిచేయించడం వంటి అమానుష పద్ధతులు ఎన్నో జరిగినాయి’’ అని పి.సి.సి. ప్రకటన వెల్లడిరచింది. ‘‘చవాన్‌ వెళ్ళిన తర్వాత ఈ చర్యలు మరీ ఎక్కువైనాయి, ప్రజలు ఇక ఈ ఆటవిక పద్ధతులను సహించజాలరు. ప్రజాగ్రహం విజృంభిస్తే ఎవ్వరూ ఆపజాలరు. ఇట్టి చర్యలకు, ప్రతిచర్యలకు బాధ్యత కేవలం బ్రహ్మానందరెడ్డి, ఆయన ప్రభుత్వానిదే’’ అని పి.సి.సి. తీర్మానం పేర్కొన్నది.

Other Updates