magaభారత 14వ రాష్ట్రపతిగా రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రమాణ స్వీకారానికి ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు హాజరైనారు. అనంతరం రెండు రోజులపాటు ఢిల్లీ పర్యటనలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని, ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ, హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలపై చర్చించారు. పర్యటన చివరి రోజున రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందలు తెలిపారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని సీఎం కేసీఆర్‌ కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ, రక్షణ భూముల అప్పగింతకు ప్రధాన మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. దీంతో పాటు హైకోర్టు విభజన పై సీఎం కేసీఆర్‌ ప్రధాన మంత్రికి వివరించారు. ముస్ల్లిం రిజర్వేషన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన చట్టానికి త్వరగా ఆమోదం తెలపాలని కోరారు. వెనుకబడిన జిల్లాలకు అందించాల్సిన నిధులలో రెండు విడుతలుగా 450 కోట్ల రూపాయల నిధులు అందాయని, మరో 400 కోట్ల రూపాయల నిధులు పెండింగ్‌లో ఉన్నాయని వాటిని వెంటనే విడుదల చేయాలని కోరారు. చిన్నతరహా గ్రానైట్‌ పరిశ్రమపై జిఎస్‌టి తగ్గించాలని విజ్ఞప్తి చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన సచివాలయం నిర్మాణానికి సికింద్రాబాద్‌లోని బైసన్‌ పోలో గ్రౌండ్‌ను రాష్ట్రానికి అప్పగించేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. అలాగే రాష్ట్రంలో కొత్తగా 21 జిల్లాలను ఏర్పాటు చేసినందువల్ల ఆయా జిల్లాల అవసరాలకనుగుణంగా ఐపిఎస్‌ల కేటాయింపు పెంచాలని హోం మంత్రికి విజ్ఞప్తి చేశారు. పోలీసు శాఖ ఆధునికీకరణకు నిధులు విడుదల చేయడంతో పాటు గతంలో పంపిన ప్రతిపాదనలకు అనుగుణంగా ప్రత్యేక బెటాలియన్‌ మంజూరు చేయాలని కోరారు. శాంతి భద్రతల పరిరక్షణకై తెలంగాణలో తీసుకుంటున్న చర్యలను కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు వివరించారు.

అనంతరం ఆర్ధిక మంత్రి అరుణ్‌ జైట్లీని కలిసి రాష్ట్రానికి రావలసిన పెండింగ్‌ నిధులు విడుదల చేయాలని కోరగా దీనిపై కూడా ఆర్ధిక మంత్రి సానుకూలత వ్యక్తం చేసినట్లు భేటీ అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. 450 కోట్ల రూపాయల వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు మంజూరు చేయాలని ఆర్ధిక మంత్రిని కోరగా త్వరలో ఆ నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

ఢిల్లీలో కేసీఆర్‌ విలేకరులతో మాట్లాడుతూ… శాంతి భద్రతల్లో తెలంగాణ నెంబర్‌ వన్‌గా ఉందని పేర్కొన్నారు. విద్యుత్‌ సంక్షోభాన్ని అధిగమించామని ఇప్పుడు రాష్ట్రం మిగులు విద్యుత్‌తో ఉందన్నారు. వృద్ధిరేటు అత్యధికంగా ఉందని సీఎం పేర్కొన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలలో లేనివిధంగా ఆర్ధిక వృద్ధిరేటు 27 శాతం ఉందని తెలిపారు. దేశాన్ని పోషిస్తున్న 6 రాష్ట్రాలలో తెలంగాణ స్థానం సంపాదించుకుందన్నారు. మిషన్‌ భగీరథ ప్రాజెక్టును ఈ సంవత్సరాంతానికి పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. రెవెన్యూ శాఖలో అవినీతిని ప్రక్షాళన చేస్తామన్నారు. రైతులపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి ప్రతి ఎకరాకు పంట సీజన్‌కు నాలుగు వేలు సమకూరుస్తున్నట్లు సీఎం వివరించారు. టిఎస్‌ ఐ పాస్‌ వల్ల రాష్ట్రానికి 4వేల పరిశ్రమలు వచ్చాయని, తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నదని, దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామని ఆయన పేర్కొన్నారు.

Other Updates