కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ‘ఉదయ్’ పథకంలో తెలంగాణ రాష్ట్రం తాజాగా చేరింది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒక అవగాహన ఒప్పందం కూడా కుదిరింది. రాష్ట్రంలోని విద్యుత్ పరిస్థితి, విద్యుత్ సంక్షోభంనుండి గట్టెక్కడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు, వచ్చిన ఫలితాలు, ‘ఉదయ్’ పథకంలో చేరడంవల్ల కలిగే ప్రయోజనాలపై జనవరి 4న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు శాసనసభలో ఒక ప్రకటన చేశారు.
ముఖ్యమంత్రి ప్రకటన ఇలా..
విద్యుత్‌రంగంలో నేడు తెలంగాణ రాష్ట్రం చాలా ముందడుగు వేసింది. ఉమ్మడి రాష్ట్రంలో అనుసరించిన వివక్ష, విధానాల ఫలితంగా ఏర్పడిన సమస్యలను విజయవంతంగా అధిగమించింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి విద్యుత్‌రంగంలో తీవ్ర సంక్షోభం నెలకొని ఉంది. గంటలకొద్దీ విద్యుత్ కోతలతో జనం నానా అగచాట్లు అనుభవిస్తున్నారు. పవర్ హాలిడేలతో పారిశ్రామిక ప్రగతి కుంటుపడింది. వ్యవసాయానికి చాలినంత విద్యుత్ అందించకపోవడంవల్ల రైతాంగం ఎన్నో కష్ట, నష్టాలకు గురవుతున్నారు. మేము అధికారంలోకి వచ్చిన తొలి అడుగులోనే విద్యుత్ కొరత ఒక పెను సవాల్‌గా మా ప్రభుత్వానికి ఎదురైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి మనం ఎదుర్కొంటున్న విద్యుత్ కొరత 2,700 మెగావాట్లు.
మరోవైపు రాష్ట్రంలోని రెండు డిస్కమ్‌లు 11,897 కోట్ల రూపాయల అప్పుల ఊబిలో కూరుకునిపోయి ఉన్నాయి. ఈ సంక్షోభానికి మూలాలు సమైక్య రాష్ట్రంలో అనుసరించిన విద్యుత్ విధానంలో ఉన్నాయి. రాష్ట్రంలో ఏర్పడే విద్యుత్ డిమాండ్‌కు సంబంధించిన సరైన అంచనా, ప్రణాళిక లేకుండా ఆనాటి విద్యుత్ విధానం కొనసాగింది. దీంతో ప్రజలు రోడ్డెక్కి నిరసనలకు దిగవలసిన పరిస్థితి ఏర్పడింది. పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గించాలని, మెరుగైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ, రోడ్డెక్కిన రైతాంగంమీద సమైక్య పాలకులు కాల్పులు జరిపితే, ఇద్దరు రైతులు ప్రాణాలు కోల్పోయిన బషీర్‌బాగ్ దుర్ఘటన సమైక్య రాష్ట్ర చరిత్రలో ఒక మాయని మచ్చ. ఈ దమనకాండకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమం పెల్లుబికింది. ప్రజా ఉద్యమం విజయం సాధించి తెలంగాణ ఏర్పడింది. మేము అధికారంలోకి రాగానే విద్యుత్ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించాం.
విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని భారీగా పెంచేందుకు స్వల్ప కాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక వ్యూహాలను రూపొందించాం. ముందుగా సంస్థాగత సామర్థ్యం పెంచడంపై ప్రధానంగా దృష్టిని కేంద్రీకరించాం. సరఫరాలో, పంపిణీలో కలుగుతున్న నష్టాలను 16.83 శాతం నుంచి 15.98 శాతానికి తగ్గించాం. జెన్‌కో ద్వారా అయ్యే విద్యుత్ ఉత్పత్తిని గణనీయంగా పెంచాం.
స్వల్పకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నాం. నత్తనడకన సాగుతున్న విద్యుత్ ప్లాంట్లను వేగంగా పూర్తిచేసే దిశగా అడుగులు వేశాం. ఈ చర్యల ఫలితంగా భూపాలపల్లి కేటీపీపీ ద్వారా 600 మెగావాట్లు, జైపూర్ సింగరేణి పవర్ ప్లాంటు ద్వారా 1200 మెగావాట్లు, థర్మల్ పవర్‌టెక్ ద్వారా 840 మెగావాట్లు, సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్స్ (సీజీఎస్)ద్వారా 550 మెగావాట్లు, జూరాల హైడ్రో పవర్ ప్రాజెక్టుద్వారా 240 మెగావాట్లు, పులిచింతల ప్రాజెక్టు ద్వారా 30 మెగావాట్లు, సోలార్‌పవర్ 1080 మెగావాట్లు, విండ్ పవర్ 99 మెగావాట్లు.. మొత్తం 5039 మెగావాట్లు ఈ రెండున్నరేళ్ళ తక్కువ కాలంలో అందుబాటులోకి తేగలిగాం. 2014 జూన్ 2 నాటికి రాష్ట్రంలో 5,683 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం ఉంటే, ఈ రెండున్నరేళ్ళలోనే అదనంగా 5,039 మెగావాట్లు అందుబాటులోకి తేగలిగాం. ఈ రోజు తెలంగాణా రాష్ట్రంలో 10,902 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉంది. అయితే, ఇక్కడో విషయం చెప్పాలి. 10,902 మెగావాట్ల విద్యుత్‌లో జల విద్యుత్ (హైడల్ పవర్), సౌరశక్తి (సోలార్ పవర్), పవన విద్యుత్ (విండ్ పవర్) ద్వారా వచ్చేది 3,531 మెగావాట్లు. కానీ ఈ మూడు మార్గాలద్వారా వచ్చే విద్యుత్ అంతగా ఆధారపడదగిందికాదు. అంటే.. 10,902 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్నప్పటికీ, స్థిరంగా అందుబాటులో ఉండేది 7,371 మెగావాట్లు. ఈ రోజుకు మనకున్న విద్యుత్ డిమాండ్ గరిష్టంగా 8,284 మెగావాట్లు. అంటే మన రాష్ట్రంలో ఇంకా డిమాండ్‌కు, ఉత్పత్తికి మధ్య వెయ్యి మెగావాట్లకు పైన వ్యత్యాసం ఉంది. అయినా, మా ప్రభుత్వం రాష్ట్రంలో విద్యుత్ కోతలు విధించకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఆరో నెల నుంచే అంటే… 2014 నవంబర్ 20 నాటినుంచే కోతల్లేని విద్యుత్ ప్రజలకు అందిస్తున్నాం. గృహావసరాలకు, పరిశ్రమలకు, వాణిజ్య అవసరాలకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నాం. వ్యవసాయానికి 9 గంటల త్రీఫేజ్ కరెంటు అందిస్తున్నందుకు పారిశ్రామిక వర్గాలతోపాటు విద్యుత్ వినియోగదారులందరూ ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మన రాష్ట్రంలో నేడు జనరేటర్ల అవసరం చాలా వరకు తగ్గిపోయింది. ఈ రోజు రాష్ట్రంలో ఇన్వర్టర్లు పోయి, ఇన్వెస్టర్లు వచ్చే కాలం వచ్చింది.
గ్యారంటీతో బాండ్స్ ఇచ్చే వెసులుబాటు డిస్కమ్‌లకు లభిస్తుంది. దీంతో డిస్కమ్‌లకు రుణభారంనుంచి విముక్తి కలుగుతుంది. అప్పులను రాష్ట్ర ప్రభుత్వమే తీర్చడంవల్ల డిస్కమ్‌లు ప్రతీ ఏటా 890 కోట్ల రూపాయల వడ్డీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. డిస్కమ్‌లు తిరిగి కొత్తగా అప్పు పొందేందుకు అవకాశం కలుగుతుంది. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో డిస్కమ్‌లకు 4,584 కోట్ల రూపాయలను అందిస్తున్నది. ఈ నిర్ణయాలవల్ల వినియోగదారులకు ఎంతో మేలు కలుగుతుంది.
ఈ రోజు విద్యుత్ రంగంలో రాష్ట్రం ఇంతటి ప్రగతి సాధించడం వెనుక విద్యుత్ శాఖలోని వివిధ సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగుల కృషి ఎంతో ఉంది. వీరిలో ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తూ విద్యుత్ సంస్థలకు సేవలందిస్తున్న ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం సానుభూతితో అర్థం చేసుకుంది. దాదాపు 20వేలమంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించాలని నిర్ణయం తీసుకుంది. 1175మంది కాంట్రాక్టు జేఎల్‌ఎంలను ఇప్పటికే రెగ్యులరైజ్ చేశాము. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల శ్రమను గౌరవించి, సర్వీసులను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడంతో వీరికి ఉద్యోగ భద్రతతోపాటు మెరుగైన జీతభత్యాలు లభిస్తాయి.
భవిష్యత్తులోనూ రాష్ట్రంలో నిరంతరాయంగా, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు, రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అంకితభావంతో కృషి చేస్తామని, తెలంగాణ ప్రజల జీవితంలో నిత్యం విద్యుత్ కాంతులు నింపుతామని సభకు సవినయంగా తెలియజేస్తున్నాను.
ఢిల్లీలో కుదిరిన ఎంవోయూ..
కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ‘ఉదయ్’ (ఉజ్వల్ డిస్కమ్ ఎష్యూరెన్స్ యోజన) పథకంలో ఇప్పటికే 19 రాష్ట్రాలు చేరగా తాజాగా తెలంగాణ కూడా సభ్యురాలైంది. కేంద్ర విద్యుత్‌శాఖ కార్యదర్శి పి.కె. పూజారి, తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ముఖ్య కార్యదర్శి అజయ్‌మిశ్రాల మధ్యన ఒప్పంద పత్రాలపై జనవరి 4న ఢిల్లీలో సంతకాలు జరిగాయి. రాష్ట్రంలోని ఉత్తర, దక్షిణ డిస్కమ్‌లు ఎదుర్కొంటున్న రూ. 11,897 కోట్ల నష్టాల్లో రూ. 8,923 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనుంది. మిగిలిన మొత్తం బాండ్ల రూపంలో సమకూరనుంది. ఈ ఒప్పందం ద్వారా సుమారు రూ. 6116 కోట్ల మేరకు రెండు డిస్కమ్‌లకు ప్రయోజనం చేకూరనుంది.
నష్టాల్లో ఉన్న రాష్ట్రంలోని రెండు డిస్కమ్‌లను సమర్థవంతంగా పనిచేయించేందుకుగాను కేంద్ర ప్రభుత్వ ‘ఉదయ్’ పథకంలో రాష్ట్రం చేరింది. సుమారు రూ. 7392 కోట్ల మేరకు ఎస్పీడీసీఎల్, 4505 కోట్ల మేరకు ఎన్పీడీసీఎల్ డిస్కమ్‌లు నష్టాల్లో ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకంలో భాగంగా రూ. 8929 కోట్ల మేరకు సమకూర్చనుంది. మిగిలిన రూ. 8923 కోట్ల మేరకు రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీతో పునర్వ్యవస్థీకరించిన బాండ్ల రూపంలో రెండు డిస్కమ్‌లకు సమకూరనుంది. దీనివల్ల రెండు డిస్కమ్‌లకు ప్రతి సంవత్సరం సుమారు రూ. 890 కోట్ల మేరకు అప్పులపై వడ్డీల రూపేణా చెల్లించే భారం తగ్గిపోతుంది. ఫలితంగా వినియోగదారులకు మెరుగైన సేవలను అందించే వీలు కలుగుతుంది. కేంద్ర విద్యుత్ మంత్రి పీయూష్‌గోయల్, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి, రెండు డిస్కమ్‌ల సీఎండీలు రఘుమారెడ్డి, గోపాలరావుల సమక్షంలో ఢిల్లీలో కేంద్ర విద్యుత్‌శాఖ కార్యదర్శి పి.కె. పూజారి, రాష్ట్ర విద్యుత్‌శాఖ కార్యదర్శి అజయ్‌మిశ్రాల మధ్య ఉదయ్ ఒప్పందానికి సంబంధించి సంతకాలు జరిగాయి.
అనంతరం మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ, ఇప్పటివరకు 19 రాష్ట్రాలు ‘ఉదయ్’ పథకంలో చేరాయని, ఇప్పుడు తెలంగాణతో కలిపి ఇరవైకి చేరుకుందని, సుమారు పదిహేనువేల కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్న డిస్కమ్‌లకు ఈ పథకంలో చేరడంద్వారా రాజస్థాన్ రాష్ట్రం ఎక్కువగా ప్రయోజనం పొందిందని, త్వరలోనే లాభాలను కూడా ఆర్జించనుందని తెలిపారు. హర్యానా సైతం ఈ పథకంలో చేరిన తర్వాత సుమారు 175 గ్రామాలకు 24 గంటల విద్యుత్‌ను సరఫరా చేసే స్థాయికి డిస్కమ్‌లు అభివృద్ధి చెందాయని గుర్తు చేశారు. ఈ పథకంలో చేరడంద్వారా సుమారు 90 శాతం మేర నష్టాలనుంచి బైటపడే అవకాశం ఉందని, మిగిలిన రాష్ట్రాలు కూడా చేరతాయని తాము భావిస్తున్నామని తెలిపారు. ఇందుకోసం మార్చి 31 వరకు గడువు విధించుకున్నట్లు తెలిపారు.
ఈ పథకంలో భాగంగా విద్యుత్ పంపిణీ, సరఫరా వ్యవస్థ మెరుగు పడుతున్నందువల్ల ుుఇప్పటివరకూ జరుగుతున్న విద్యుత్ లీకేజీలని అరికట్టడంద్వారా సుమారు రూ. 1476 కోట్ల మేరకు ఆదా అవుతుందని తెలిపారు. విద్యుత్‌ను తక్కువగా వినియోగించే తరహా పరికాలను, ఉపకరణాలను అటు గృహరంగంలోనూ, ఇటు పారిశ్రామిక, వాణిజ్యరంగాల్లోనూ ప్రవేశ పెట్టడంద్వారా సుమారు రూ. 1200 కోట్ల మేరకు లాభం చేకూరుతుందని మంత్రి వివరించారు. అన్నిరకాలుగా చూసుకున్నప్పుడు ఉదయ్ పథకంలో చేరడంద్వారా తెలంగాణకు సుమారు రూ. 2250 కోట్ల మేరకు లబ్ధి చేకూరినట్లయిందని అన్నారు.
సీఎండీ రఘుమారెడ్డి మాట్లాడుతూ, ఉదయ్‌లో చేరడంద్వారా సెప్టెంబరు 2015నాటికి డిస్కమ్‌లకు ఉన్న రూ. 11,897 కోట్ల అప్పుల్లో 75 శాతం మేరకు రాష్ట్రం సమకూరుస్తుందని అన్నారు. ఈ పథకంలో భాగంగా దీనదయాళ్ ఉపాధ్యాయ యోజన పథకం, మరికొన్ని స్మార్ట్‌గ్రిడ్ ప్రాజెక్టుల్లో భాగంగా కేంద్రం కొంత పెట్టుబడి పెడుతుంది. ఇప్పటికే తెలంగాణకు రెండు పథకాలు (ఐపీడీఎస్, డీడీయూజేవై) ద్వారా రూ. 1000 కోట్లు మంజూరైతే అందులో 75శాతం మేరకు గ్రాంటుగా అందిందని, దీన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని, ఆ విధంగా ప్రయోజనం చేకూరిందని వివరించారు.
ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి మాట్లాడుతూ, ప్రజలకు విద్యుత్ సేవలను మెరుగ్గా అందించడానికి, భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలు పెరుగకుండా ఉండడానికి, నష్టాల్లో ఉన్న డిస్కమ్‌లను బైటపడేయడానికి, రాష్ట్రం లేదా కేంద్ర ప్రభుత్వాలు వివిధ రూపాల్లో ఆదుకోవడానికి ఉదయ్ పథకం దోహదపడుతుందని తెలిపారు.
2014 జూన్ 2 నాటికి రాష్ట్రంలో 5,683 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం ఉంటే
ఈ రెండున్నరేళ్ళలోనే అదనంగా 5,039 మెగావాట్లు అందుబాటులోకి వచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా
భూపాలపల్లి కేటీపీపీ ద్వారా 600 మెగావాట్లు
జైపూర్ సింగరేణి పవర్ ప్లాంటు ద్వారా 1200 మెగావాట్లు
థర్మల్ పవర్‌టెక్ ద్వారా 840 మెగావాట్లు
సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్స్ (సీజీఎస్)ద్వారా 550 మెగావాట్లు
జూరాల హైడ్రో పవర్ ప్రాజెక్టుద్వారా 240 మెగావాట్లు
పులిచింతల ప్రాజెక్టు ద్వారా 30 మెగావాట్లు
సోలార్‌పవర్ 1080 మెగావాట్లు
విండ్ పవర్ 99 మెగావాట్లు..
ఈ రోజు తెలంగాణా రాష్ట్రంలో 10,902 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉంది.