రాష్ట్రానికి-ఢోకా-లేదు..-ఉగాది-వేడుకల్లో-సి.ఎం.-కె.సి.ఆర్‌‘‘తెలుగు సంవత్సరాలలో మన్మథనామ సంవత్సరం 29వది. దేశంలో 29వ రాష్ట్రం తెలంగాణ. అంటే ఈ ఏడాది తెలంగాణకు అంతా మంచే జరుగుతుంది’’ అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అన్నారు. మార్చి 22న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో అధికారికంగా నిర్వహించిన మన్మథనామ సంవత్సర ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.

‘‘నాది కర్కాటకరాశి. కర్కాటక రాశి వారికి ఈ ఏడాది ఆదాయం 5, వ్యయం 5 ఉన్నట్టు పంచాంగకర్తలు చెప్పారు. అందుకని ‘సున్నకు సున్న హల్లికి హల్లి’. ఆర్థికమంత్రి రాజేందర్‌పై పైసా బాకీ పడకుండా చూస్తా’’ అని ముఖ్యమంత్రి చమత్కరించారు.

ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న కె.సి.ఆర్‌. తొలుత రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

పేదలు కడుపునిండా తిన్నప్పుడే నిజమైన పండుగ అని, పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం అగ్రతాంబూలం ఇస్తోందని సి.ఎం. చెప్పారు.

‘‘రాష్ట్రాన్ని సస్యశ్యామల తెలంగాణగా మార్చుకుందాం. సుక్షేత్రాలతో విలసిల్లే విత్తన భాండాగారంగా, నిరంతరం విద్యుత్‌కాంతుల వెలుగు జిలుగులు చిమ్మే గొప్ప రాష్ట్రంగా ఆవిష్కరించుకుందాం’’ అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. మంచి మనసుతో మంచి జరగాలని కోరుకుంటే, అది తప్పక సాకారమవుతుందన్నారు.

వ్యవసాయ రంగానికి మరింత ప్రాధాన్యం ఇస్తామని, ప్రపంచంలో ఎక్కడాలేనివిధంగా నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించామని, దీనివల్ల హైదరాబాద్‌కు ప్రపంచస్థాయి కంపెనీలు క్యూ కడతాయని సి.ఎం. ఆశాభావం వ్యక్తం చేశారు.

సంక్షేమం, వ్యవసాయం, పారిశ్రామికీకరణను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళనున్నామని కె.సి.ఆర్‌. స్పష్టం చేశారు.

ప్రభుత్వానికి ఆధ్యాత్మికశక్తి

ఈ వేడుకలలో వర్గల్‌లోని సరస్వతి దేవాలయం వ్యవస్థాపక ధర్మకర్త యాయవరం చంద్రశేఖరశర్మ సిద్ధాంతి పంచాంగ శ్రవణం చేశారు. ‘‘తెలంగాణ ప్రభుత్వం భగీరథ ప్రయత్నాన్ని ప్రారంభించింది. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు గొప్ప కృషి జరుగుతోంది. ఈ కృషిని విజయవంతం చేసేందుకు రాష్ట్ర ప్రజలంతా దైవ ప్రార్థనలు చేసి ప్రభుత్వానికి ఆధ్యాత్మిక శక్తిని అందించాలి’’ అని ఆయన చెప్పారు.

మన్మథనామ సంవత్సరంలో రాజు శని, మంత్రి కుజుడు అయ్యారని, నవగ్రహాలు శుభాశుభ ఫలితాలను సమానంగా అందిస్తాయని సిద్ధాంతి వెల్లడిరచారు. జూలై 14నుంచి గోదావరి పుష్కరాలు వస్తున్నాయన్నారు.
ఈ సందర్భంగా పలువురు వేద పండితులను ముఖ్య మంత్రి కె.చంద్రశేఖరరావు చేతులమీదుగా సత్కరించారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ఉగాది పురస్కా రాలు అందజేశారు.

Other Updates