”మొక్కలు నాటండి, నాటిన మొక్కలను కన్న బిడ్డల్లాసాకండి..” ఇది తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తారకమంత్రం.బహుశా దేశంలో మరే ముఖ్యమంత్రి పదే పదే ఇలా చెప్పిఉండరు. ఓటు బ్యాంకు రాజకీయాలు, ఓటర్లను ఆకర్షించే పథకాలతో పోటీ పడుతున్న ప్రభుత్వాలు, పర్యావరణాన్ని దాని ప్రాముఖ్యతను పట్టించుకోవడం ఎప్పుడో మర్చిపోయాయనేది నిపుణుల మాట. కానీ నాలుగేళ్ల పసి ప్రాయంలో తెలంగాణ ప్రభుత్వం పునర్ నిర్మాణంలో భాగంగా అభివద్ది సంక్షేమ పథకాలకు ఎంతటి ప్రాధాన్యతను ఇచ్చిందో, రేపటి తరాలు స్వచ్ఛమైన వాతావరణంలో పెరగాలని అంతే ఆకాంక్షిస్తోంది.
వానలు వాపస్ రావాలి, కోతులు మళ్లీ అడవులకు వాపస్ పోవాలంటూ నినదిస్తోంది. మన పిల్లలకు ఆస్తులు, అంతస్తుల కంటే మంచి వాతావరణం ఇద్దామంటూ కేసీఆర్ పదే పదే చెబుతున్నారు. ప్రపంచమంతా అభివద్ధి వెనకాల పరుగులు పెడుతూ, దాని మాటున పర్యావరణాన్ని పణంగా పెడుతోందని, కూర్చొన్న కొమ్మనే నరుక్కుంటున్నామనే వాదనలు ఉన్నాయి. గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ వల్ల పర్యావరణ మార్పులకు ప్రపంచమంతా గురౌతోంది. దీనికి విరుగుడు ఉన్న అటవీ సంపదను కాపాడుకోవటం, కొత్తగా మంచి ప్రమాణాలతో పచ్చదనాన్ని పెంచుకోవటం. ఈ సత్యాన్ని తొలినాళ్లలోనే గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం హరితహారానికి అంకురార్పణ చేసింది.
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న అటవీ విస్తీర్ణం 24 శాతం, పచ్చదనం భారీగా పెంచుకోవటం ద్వారా దీనికి 33 శాతానికి పెంచుకోవాలనే లక్ష్యమే హరితహారం పథకం ఉద్దేశ్యం. ఏడాదికి 40 కోట్ల మొక్కల చొప్పున 230 కోట్ల మొక్కలు నాటాలనే భారీ లక్ష్యాన్ని పెట్టుకుంది. ఇందులో అడవుల్లో మొక్కలు నాటడం, సహజంగా అటవీ పునరుజ్జీవన ప్రక్రియల ద్వారా 100 కోట్ల మొక్కలను నాటడం, ఇక అడవుల బయట, అన్ని జిల్లా ప్రాంతాలు, జీహెచ్‌ఎంసీ, హెచ్ ఎం డీ ఏ ప్రాంతాల్లో కలిపి మిగతా 130 కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయించారు. ప్రతీ గ్రామ పరిధిలో కనీసం నలభై వేల మొక్కలు నాటాలనేది సంకల్పం.పథకం మొదలైన 2015-16లో వాతావరణం అనుకూలించపోవటంతో కేవలం 15.86 కోట్ల మొక్కలను నాటగలిగాం. ఇక మరుసటి ఏడాది మంచి వర్షాలు పడటంతో 2016-17లో 31.67 కోట్ల మొక్కలు రాష్ట్ర వ్యాప్తంగా నాటుకున్నాం. ఇక మూడో యేడాది 2017-18 లో ఈ సంఖ్య 34.07 కోట్ల కు చేరుకుంది.
అయితే అటవీ శాఖ ప్రధాన సంధానకర్తగా మిగతా శాఖల సమన్వయంతో ఈ బహత్ కార్యాన్ని తెలంగాణ ప్రభుత్వం తలపెట్టింది. గత మూడేళ్ల అనుభవాలతో నాలుగో యేట హరితహారం సందర్భంగా ఇక్కడ కొన్ని విషయాలు సమీక్షించుకోవాలి. గత
మూడేళ్లుగా ఎన్ని కోట్ల మొక్కలు నాటాం అనేదానికన్నా నాటిన వాటిల్లో ఎంత శాతం బతికించుకోగలిగాం, ఎన్నింటికి సంరక్షణ కల్పించ గలిగామనేది ముఖ్యం. పౌరసమాజంతో పాటు, అధికార యంత్రాంగం కూడా ఈ దిశగా మరింత శ్రద్ధ చూపాల్సిన అవసరం ఖచ్చితంగా కనిపిస్తోంది. ఇటీవల కలెక్టర్ల సదస్సులోనూ ముఖ్యమంత్రి, ఆ తర్వాత తనను కలిసిన అధికారులతో చీఫ్ సెక్రటరీ కూడా మొక్కల రక్షణ, బతికే శాతం పెంపుపై చర్చించారు.
హరితహారం సిద్ధిపేట, మెదక్ జిల్లాల్లో మంచి ఫలితాలను ఇస్తుండటంతో కలెక్టర్లు అందరూ ఆ ప్రాంతాల్లో స్వయంగా పర్యటించాలని కేసీఆర్ కోరారు. ధరిత్రీ దినోత్సవం 22 ఏప్రిల్‌న సిద్ధిపేట, జిల్లాలో పర్యటించిన కలెక్టర్లు అందరూ భూమాతకు పచ్చని ఆభరణమైన తెలంగాణకు హరితహారాన్ని విజయవంతం చేస్తామంటూ ప్రతినబూనారు. గజ్వేల్, కోమటిబండ ప్రాంతాల్లో హరితహారంతో పాటు, అటవీ పునరుద్ధరణ, పునరుజ్జీవన చర్యలను స్వయంగా పరిశీలించిన కలెక్టర్లు తమ జిల్లాల్లో కూడా మరింత సమర్ధవంతంగా ఈ పథకాలను అమలుచేసే చర్యలను అటవీ శాఖ అధికారుల నుంచి తెలుసుకున్నారు. తెలంగాణకు హరితహారం మెరుగైన పర్యావరణం కోసం, మంచి వాతావరణం కోసం, రేపటి మనందరి భవిష్యత్ కోసం రూపొందించిన పథకం, నాటిన మొక్కల్లో 30 శాతం బతికినా గొప్ప ఫలితాలు ఉంటాయని అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి చెప్పారు. అయితే నాటిన ప్రతీ మొక్క బతకాలన్న లక్ష్యంతో పనిచేస్తేనే అనుకున్న హరిత తెలంగాణ సాధ్యమవుతుంది.
ఇందుకోసం ప్రతీ ఒక్కరూ, ప్రతీ ప్రభుత్వ శాఖ నడుంబిగించాలి. కేవలం వర్షాల సీజన్ లో హడావిడి పడటం కాకుండా, ఆ తర్వాత మొక్కల సంరక్షణ బాధ్యతను కూడా ఒక ఉద్యమం లాగా కొనసాగిస్తేనే ఆకుపచ్చని తెలంగాణ స్ఫూర్తి నిలుస్తోంది. ఇందుకోసం ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తెలంగాణ అటవీ శాఖ మరింత పకడ్బందీచర్యలు తీసుకుంటోంది. ఆయా ప్రభుత్వ శాఖలు నాటిన మొక్కల సంరక్షణ బాధ్యతలు కూడా వారే చూసేలా, వారంలో ఒక రోజు గ్రీన్ డే ను పాటిస్తూ ఆ మొక్కలకు నీళ్లు పోయటం, ప్రతీ నెలా వాటి ఎదుగుదలను నమోదు చేయటంతోపాటు, సంబంధిత ప్రభుత్వ వెబ్‌సైట్‌లో రికార్డు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇక ఇప్పటికే ముప్పైఒక్కవేల టీమ్ లతో సుమారు ఐదు లక్షల మందితో రాష్ట్ర వ్యాప్తంగా గ్రీన్ బ్రిగేడ్ లు ఏర్పాటయ్యాయి. వీటి సేవలను మరింతగా వినియోగించుకునే దిశగా చర్యలు తీసుకోనున్నారు. ఇక ఈ యేడాది హరితహారంలో వెదురు, టేకు మొక్కలను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వెదురు కొట్టివేత మీద ఉన్న ఆంక్షలను కేంద్రం సడలించిన నేపథ్యంలో రైతులకు ఆదాయ వనరుగా వెదురును మార్చాలనే ప్రయ త్నాలు ఊపందుకున్నాయి. వెదురు ద్వారా ఉత్పత్తులను ప్రోత్సహించటం, వాటికి మెరుగైన మార్కెటింగ్ సౌకర్యం కోసం అటవీ శాఖ అధ్యయనం చేస్తోంది. ఇందుకోసం అటవీ శాఖ మంత్రి జోగు రామన్న, అధికారుల బందం ఇప్పటికే త్రిపురలో పర్యటించింది. ఇక టేకు మొక్కలను కూడా గతంలో వేర్ల రూపంలో కాకుండా, అటవీ శాఖ నర్సరీల్లోనే మొక్కలుగా పెంచి వీలున్నంతగా సరఫరా చేసే ప్రయత్నం జరుగుతోంది. పట్టణ ప్రాంతాల్లో ప్రజలు కోరిన మొక్కలు, పూలు, పండ్లు, అలంకార నేపథ్యం ఉన్నవి సరఫరాకు చర్యలు తీసుకుంటు న్నారు. వీటికి తోడు ఇటీవల మార్పులు చేసిన పంచాయితీ రాజ్ చట్టం కూడా హరిత తెలంగాణ సాధన దిశగా మరింత బలోపేతం అయ్యింది. గ్రామాల వారీగా నర్సరీల ఏర్పాటు, ఆయా గ్రామాల్లో నాటిన మొక్కల సంరక్షణ బాధ్యత సంబంధిత సర్పంచ్, కార్యదర్శి వహించేలా చట్ట రూపకల్పన చేశారు. అంతేకాదు నాటిన మొక్కలను సరిగా సంరక్షించని వారిపై ఆస్తిపన్నుకు సమానమైన రూపంలో జరిమానా వేసేలా నిబంధనలు మార్చారు. ఈ చర్యలన్నింటి లక్ష్యం కూడా ఒక్కటే .. అదే ఉమ్మడి పర్యావరణ బాధ్యత కూడా .. మెరుగైన తెలంగాణ రాష్ట్రం.. ఎన్నో ఆశలు.. ఆకాంక్షలతో ఏర్పాటైన ప్రత్యేక రాష్ట్రం అభివద్ది, సంక్షేమంతో పాటు అత్యంత నివాసయోగ్యమైన ప్రాంతంగా తీర్చిదిద్దాలనే సంకల్పం.
రహదారి వనాలు
హరితహారంలో భాగంగా చేస్తున్న ఇతర కార్యక్రమాలు కూడా లక్ష్యం దిశగా మంచి ఫలితాలు సాధిస్తున్నాయి. రహదారి వనాలు ( అవెన్యూ ప్లాంటేషన్ ) ఏర్పాటు వేగంగా కొనసాగుతోంది. తెలంగాణలో అన్ని జాతీయ రహదారులు, ముఖ్యమైన రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటాలని సీఎం ఆదేశించారు. రోడ్లపై ప్రయాణం ఆహ్లాదకరంగా ఉండటంతో పాటు, ప్రయాణీకులకు నీడను ఇచ్చేలా ఈ రహదారి వనాల పెంపకం కొనసాగుతోంది. ఇక అటవీ ప్రాంతమై ఉండి, పట్టణ ప్రాంతాలకు దగ్గరగా ఉండే వాటి అర్బన్ ఫారెస్ట్ పార్కులుగా ఏర్పాటుచేసే ప్రక్రియ కూడా కొనసాగుతోంది. హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా వీలున్నన్ని అర్బన్ ఫారెస్ట్ పార్కుల ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఈ పాటికే ప్రజలకు అందుబాటులోకి వచ్చిన ఈ రకమైన పార్కులకు మంచి స్పందన కూడా వస్తోంది.
బందు శ్రీకాంత్ బాబు