tsmagazine
స్వాతంత్య్ర సంగ్రామానంతరం భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఆవిర్భవించాయి. అన్ని రాష్ట్రాలకంటే ‘తెలంగాణ’ రాష్ట్రావిర్భావం విలక్షణమైంది. సుదీర్ఘ పోరాటాలకు నెలవైంది. అనేక సంవత్సరాల ఉదాసీనతతో రగిలిన జీవితాల నిరసనలతో ఆవిర్భవించిన మహోద్యమం ఇది. వెనుకబాటుతనం, అమాయకత, అవిద్య, పేదరికం వంటి అనేక సమస్యల సుడిగుండంలో తెలంగాణ జనపదాలు దశాబ్దాలపాటు చిక్కుకొని పోయాయి. ఉక్కిరిబిక్కిరైపోయి గమ్యం తెలియక, కర్తవ్యం తెలియక, కొట్టుమిట్టాడాయి. తమకు సాంత్వనం కలిగించే వెలుగురేఖకోసం ఏండ్ల తరబడి ప్రజా సమూహాలు ఎదురుచూశాయి. తొలినాళ్లలో చెలరేగిన ఉద్యమాలు రాజకీయాల విషపరిష్వంగంలో నలిగి నీరుగారిపోగా, తెలంగాణ జనావళికి అప్పటిదాకా కనబడిన ఆశాదీపాలు ఆరిపోయాయి. మళ్లీ అదే వివక్ష! మళ్లీ అదే అవమానం! మళ్లీ అదే దగా! మళ్లీ అదే తిరోగమనం! మళ్లీ నిరాశలోనే దశాబ్దాలు ఆహుతైపోయాయి. చివరికి

ఉవ్వెత్తున ఎగసిన కడలికెరటంలా తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమం అలుపెరుగని ఉద్యమనేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేతృత్వంలో ప్రారంభమైంది. ఇది గతంలోని విఫలోద్యమాలవంటిదికాదు. ఈ ఉద్యమానికి ఏ ప్రలోభాల పరిష్వంగాలు లేవు. స్వార్థచింతనలు లేవు. పదవీ లాలసలు లేవు. మారుమూల పల్లెలనుండి ప్రారంభమైన మహోద్యమం ఇది. సామాన్యుడే మాన్యుడుగా సాగిన జైత్రయాత్ర ఇది. ఈ ఉద్యమంలో ఊరూవాడా ఏకమైంది. కులాలూ, మతాలూ కలిసిపోయాయి. ఆ వర్గం, ఈ వర్గం అంటూ ఏ వర్గమూలేని నిర్మలినోద్యమంగా రాష్ట్ర సాధనోద్యమం దృఢంగా వేళ్లూనుకొన్నది.

పల్లెపల్లెనూ పలుకరిస్తూ, గల్లీగల్లీని ఏకంచేస్తూ, దగాపడిన జనమానసాలలో ధైర్యాన్ని నింపుతూ, అందరూ ఏకమైతే ప్రపంచాన్నే మార్చవచ్చుననే దృఢసంకల్పంతో కొనసాగిన మహోద్యమం ఇది. రాష్ట్ర సాధన తప్ప మరేదీ తమకు ఆమోదయోగ్యంకాదని ఢిల్లీదాకా చాటిచెప్పిన ఈ ఉద్యమంలో సమిధలై అసువులు బాసిన వీరులెందరో? వారి బలిదానాలు రాష్ట్ర సాధన చరిత్రలో సువర్ణాధ్యాయాలైనాయి. ఇళ్లనూ, వాకిళ్లనూ వీడి, వీధులే నివాసాలుగా, జాతీయ రహదారులే పాకశాలలుగా సాగిన జనవాహినిని చూసి ప్రపంచమే నివ్వెరపోయింది. ఆ మహోద్యమాన్ని తిలకించిన యావత్తు ప్రపంచం తెలంగాణ ప్రజలపట్ల చిరకాలంగా ఎంతటి వివక్ష ప్రదర్శితమైందో తేటతెల్లమైంది.
tsmagazine

బిందువు సింధువులా మారినట్లు తొలిదశలో చిన్నగా ప్రారంభమైన జనుల నిరసనలు క్రమంగా విస్తరించి సకలజనుల సమ్మెలరూపంలో ఉప్పెనలా ముంచెత్తాయి. ఈ ప్రజా నిరసనల ఉప్పెనలనుచూసి కేంద్ర ప్రభుత్వం వణికిపోయింది. ప్రజా వ్యతిరేకతను ఉదాసీనం చేస్తే జరిగే ప్రమాదాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అప్పటిదాకా మీనమేషాలు లెక్కిస్తూ, ఉదాసీనం చేస్తూ కాలహరణం చేసిన కేంద్రానికి చాపకిందినీరులా తమ ఉనికికే ప్రమాదం ఏర్పడబోతున్నదనే స్పృహ కలిగి, నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించింది. సంప్రదింపులతో అగ్నిని చల్లార్చే ప్రయత్నం చేసింది. కానీ దృఢ సంకల్పుడైన

ఉద్యమనాయకుని సారధ్యంలో ముందుకు కదులుతున్న జనసముద్రం ముందు వారి ఆటలు సాగలేదు. రాష్ట్రావతరణంతప్ప మరేదీ తమకు అంగీకారం కాదని కోట్లాదిమంది తెలంగాణ ప్రజలు కేంద్రానికి గర్జిస్తూ ప్రబోధించారు. గత్యంతరంలేని పరిస్థితులలో, ఇంకా ఆలస్యం చేస్తే జరుగబోయే దుష్పరిణామాలను ఊహించుకొని ప్రజాభీష్టాన్ని మన్నించక తప్పదని అనివార్యంగా లోకసభలో తెలంగాణా రాష్ట్ర విభజన బిల్లును ప్రవేశపెట్టి, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణను చట్టబద్ధం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఆవిర్భవింపజేసింది. ఇలా 2014 జూన్‌ 2న ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన ‘తెలంగాణ’ ఒక సువర్ణాధ్యాయానికి నాంది పలికింది.

కేవలం రాష్ట్ర సాధనతోనే సమస్యలన్నీ పరిష్కృతం కాలేదు. అప్పటిదాకా కొనసాగిన వివక్షా శాసనవిషబీజాలు ఇంకా నిర్మూలితం కాలేదు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నో సవాళ్లు స్వాగతం పలికాయి. పరిష్కరించడానికి దుస్సాధ్యమైన సమస్యలెన్నో ఎదుట నిలిచాయి. వాటిని సున్నితంగా ఎలా పరిష్కరించాలో నూతన ప్రభుత్వానికి సవాలు విసిరాయి. అయితే ప్రజల హృదయాలలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకొన్న ఉద్యమనేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఈ సమస్యలన్నీ భారంగా అనిపించలేదు. ప్రజల ఆమోదపు అమృత ప్రవాహంలో వాటిని సునాయాసంగా అధిగమించడం తనకు సమస్యేకాదని ఆచరణపూర్వకంగా నిరూపించిన ధీశాలి ఆయన. పూర్వాపరాలను చక్కగా బేరీజు వేయడం, అడుగు వేసేముందే అప్రమత్తతను పాటించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. జఠిల సమస్యలను చూసి జడుసుకునే స్వభావం కాదు ఆయనది. ఎంతటి జఠిల సంఘటననైనా ప్రశాంతంగా మలచి, పురోగతిని సాధించడం చంద్రశేఖరరావు సహజ ప్రకృతి! ఆ దృఢసంకల్పమే, ఆ అపార ధైర్యగుణమే రాష్ట్రాన్ని ఏ సమస్యా లేకుండా నడిపించడానికి దోహదం చేస్తోంది. హృదయ దౌర్బల్యం నీచమైందనీ, ఎన్నడూ బలహీన మనస్సుతో నడువరాదనీ ఆయన నేర్చుకొన్న పాఠం. తెలంగాణ రాష్ట్ర సారథ్యంలో అనేక విజయాలకు కారణం అయింది. అందుకే పరిపాలన చేపట్టిన నాటినుండి అనుక్షణం, అనుదినం ప్రజా సంక్షేమమార్గాల అన్వేషణలో ఆయన ఏనాడూ స్తబ్ధంగా కూర్చోలేదు. తెలంగాణ జనపదాలను పట్టిపీడిస్తున్న సాగునీటి సమస్య, తాగునీటి సమస్య అత్యంత ప్రధానమైందని భావించి, కాళేశ్వరం వంటి ఎన్నో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ప్రతినిత్య సమీక్షతో పురోగమిస్తున్నారు. త్రాగునీటి అవసరాలను తీర్చేందుకు మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయవంటి ఆదర్శవంతమైన పథకాలను తక్షణమే అమల్లోకి తెచ్చారు. ప్రజలకు చేరువగా నిలుస్తూ, పరిపాలన సౌలభ్యంకోసం కొత్తగా 21 జిల్లాలను ఏర్పరచి, తెలంగాణ జిల్లాల సంఖ్యను 31కి విస్తరించారు. సామాజికంగానూ, ఆర్థికంగానూ వెనుకబడిన వర్గాలకు అండగా నిలిచి, ఎన్నో పథకాలను అమలు చేశారు. పరిపాలనలో పారదర్శకతకోసం దళారీలులేని, అవినీతిలేని వ్యవస్థలకు రూపకల్పన చేశారు. నేరుగా ప్రజలకే సంక్షేమ ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకొన్నారు. పరిపాలనను ఒక గాడిలో పెట్టారు. చట్టాన్ని ధిక్కరించేవారి భరతం పట్టారు. నీతిదాయకమైన, సమాన న్యాయంతోకూడిన పరిపాలనను అంతటా విస్తరింపజేశారు. నూతన విద్యాలయాలనూ, వైద్యాలయాలనూ స్థాపించి ప్రజల అవసరాలను పరిపూర్ణంగా తీర్చేందుకు కృషి చేస్తున్నారు.

అవిద్యను రూపుమాపి, ప్రజలలో అక్షరాస్యతను, విద్యను పెంచేందుకు అనేక కార్యక్రమాలను రూపొందించారు. సమాజంలోని ఏ వర్గమూ, ఏ కులమూ వివక్షకు గురికాకుండా అనేక పథకాల ద్వారా లబ్ధి చేకూర్చారు. వృద్ధులకు పెన్షన్‌లు ఇచ్చి ఆదుకొన్నారు. యువతకు ఉపాధి నిమిత్తం అనేక మార్గా లకు శ్రీకారం చుట్టారు. ప్రజల భాష అయిన ‘తెలుగు’లోనే పరిపాలన సాగేందుకు, తెలుగుభాషకు ఔన్నత్యాన్ని కలిగించేం దుకు వైభవంగా ప్రపంచ తెలుగు మహాసభలను ఏర్పాటు చేసి, ప్రపంచంలోని తెలుగువారందరినీ ఆకట్టుకొన్నారు.
బాధ్యతాయుతమైన పాలన, ప్రజల అభీష్టానికి అను గుణం గా ప్రభుత్వ విధానాలు, ప్రజా సంక్షేమంలో రాజీ లేని ధోరణి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వన్నె తెచ్చిన అంశాలు. దేశంలోనే అన్ని గుణాత్మక విషయాలలో అగ్రశ్రేణిలో కొన సాగుతున్న తెలంగాణ రాష్ట్రాన్నీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావునూ, రాష్ట్రా వతరణ విజయోత్సవ వేళ అభినందిం చక తప్పదు. భారతదేశ చరిత్రలో తెలం గాణ రాష్ట్రావిర్భావం ఒక సువర్ణాధ్యాయమే!

డా|| ఆయాచితం నటేశ్వరశర్మ

Other Updates