kcrరాష్ట్ర వ్యాప్తంగా 60 మైనారిటీ రెసిడెన్షియల్‌ పాఠశాలలు 2016 జూన్‌ నుండి ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు ఆదేశించారు. బాలికల కోసం 30, బాలుర కోసం 30 కేటాయించాలన్నారు. మైనారిటీ సంక్షేమ శాఖ నిధుల ద్వారా నడిచే ఈ పాఠశాలల నిర్వహణ బాధ్యతను విద్యాశాఖ స్వీకరించాలని సిఎం చెప్పారు. ఇంగ్లీష్‌ మీడియంలో విద్యాబోధన జరగాలని, మొదటి ఏడాది 5,6,7 తరగతులలో ప్రవేశాలు కల్పించి ప్రతి ఏడాది ఒక్కో తరగతి పెంచుకుంటూ 12 వ తరగతి వరకు ఈ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో విద్యాబోధన జరపాలని సిఎం చెప్పారు.

మైనారిటీ సంక్షేమంపై ముఖ్యమంత్రి డిసెంబర్‌ 29న సచివాలయంలో సమావేశం నిర్వహించారు.

ఎట్టి పరిస్థితుల్లో వచ్చే జూన్‌ లో మైనారిటీ రెసిడెన్షియల్‌ పాఠశాలల ప్రారంభం కావాలని, ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, మైనారిటీ సంక్షేమ శాఖ, విద్యా శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఈ పాఠశాలలకు అవసరమైన బోధన, బోధనేతర సిబ్బందిని నియమించాలని, దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ కూడా డిఎస్సీ నోటిఫికేషన్‌ తో పాటే రావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వివిధ విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న ఉర్దూ టీచర్ల పోస్టులను కూడా భర్తీ చేయాలని ఆదేశించారు. మొదటి ఏడాది కిరాయి భవనాల్లో పాఠశాలలు నడపాలని 2017 విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి కొత్త భవనాలు నిర్మించాలని ఆదేశించారు. మైనారిటీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రెసిడెన్షియల్‌ పాఠశాలలు నిర్మించాలని, అందుకోసం అనువైన స్థలాలను గుర్తించాలని చెప్పారు. వక్ఫ్‌ బోర్డు స్థలాలను కూడా వినియోగించుకోవచ్చన్నారు. ఒక్కో భవనాన్ని రూ.20 కోట్లతో, కనీసం ఆరు ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తామన్నారు. ఈ బడ్జెట్‌ లోనే రెసిడెన్షియల్‌ పాఠశాలల కోసం నిధులు కేటాయిస్తామన్నారు. మైనారిటీ సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నందున కార్యక్రమాలు వేగంగా అమలయ్యేందుకు అవసరమైన సిబ్బందిని కూడా నియమించాలని చెప్పారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు తయారు చేస్తే వెంటనే ఖాళీలు భర్తీ చేస్తామని సిఎం స్పష్టం చేశారు.

చంచల్‌ గూడ జైలు, రేస్‌ కోర్స్‌ తరలింపుకు ఆదేశాలు

నగరంలోని చంచల్‌ గూడ జైలును చర్లపల్లికి తరలించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రేస్‌ కోర్స్‌ ను కూడా నగర శివారుకు తరలించాలన్నారు. ఈ రెండు స్థలాలను రెసిడెన్షియల్‌ పాఠశాలల నిర్మాణానికి ఉపయోగించాలని చెప్పారు.

ఈ సమీక్షాసమావేశంలో ఉప ముఖ్యమంత్రులు మహమూద్‌ అలీ, కడియం శ్రీహరి, మంత్రులు పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, ఈటెల రాజెందర్‌, జగదీష్‌ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మ, సిఎంఓ ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌ రావు, సీనియర్‌ ఐపిఎస్‌ అధికారి ఎకె. ఖాన్‌, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఉమర్‌ జలీల్‌, మైనారిటీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఎం.డి షఫి ఉల్లా, మైనారిటీ సంక్షేమ శాఖ డైరెక్టర్‌ అక్బర్‌, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌ రెడ్డి తదితరులు పాల్గన్నారు.

Other Updates