తెలంగాణ తొలి శాసన సభ రద్దయింది. రాష్ట్రంలో నాలుగేళ్ళ మూడు నెలల ఐదు రోజులపాటు కొనసాగిన శాసన సభ 6 సెప్టెంబర్‌ 2018న రద్దయింది. అసెంబ్లీని రద్దుచేస్తూ రాష్ట్ర మంత్రివర్గం అంతకు ముందు చేసిన తీర్మానాన్ని గవర్నర్‌ ఇ.ఎస్‌.ఎల్‌. నరసింహన్‌ ఆమోదించారు. పూర్తికాల ప్రభుత్వం ఏర్పడేవరకూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని నడిపించాలని గవర్నర్‌ చేసిన సూచనను కె. చంద్రశేఖర రావు అంగీకరించారు.

సెప్టెంబర్‌ 6వ తేదీ మధ్యాహ్నం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అధ్యక్షతన ప్రగతిభవన్‌లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర శాసన సభను రద్దుచేస్తూ ఏకవాక్య తీర్మానాన్ని ఆమోదించారు. అనంతరం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నేరుగా రాజ్‌ భవన్‌ కు వెళ్ళి గవర్నర్‌ నరసింహన్‌ను కలుసుకొని మంత్రివర్గం చేసిన తీర్మాన ప్రతిని ఆయనకు అందించారు. వెనువెంటనే గవర్నర్‌ మంత్రివర్గ తీర్మానానికి ఆమోదముద్ర వేశారు. తెలుగు రాష్ట్రాలలో కారణాలు ఏవైనా, శాసన సభలు ముందుగా రద్దు కావడం ఇది మూడవసారి. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి ముఖ్యమంత్రులు ఎన్‌.టి.రామారావు 1984లో, ఎన్‌.చంద్రబాబు నాయుడు 2003లో శాసన సభలను రద్దుచేశారు.

తెలంగాణ రాష్ట్రం సాధించిన అనంతరం ఏర్పడిన తొలి రాష్ట్ర శాసన సభ రద్దయిన సందర్భంగా గత నాలుగేళ్ళలో తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతి మనందరి మనోఫలకంపై కదలాడుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలలో మనకు జరిగిన అన్యాయం, రాష్ట్రం ఆవిర్భవించేనాటికి ఉన్న అస్తవ్యస్థ పరిస్థితులను నూతన ప్రభుత్వం చక్కదిద్ది, వినూత్నపథకాలను ప్రారంభించింది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేదిశలో ఎన్నో మైలురాళ్ళను అధిగమించింది. రాష్ట్రం ఆవిర్భవించిన స్వల్పకాలంలోనే అద్భుతాలను ఆవిష్కరించింది. దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావం అనంతరం 2014 జూన్‌ 2న కొలువుదీరిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నాయకత్వంలోని తొలి మంత్రివర్గం రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా సుపరిపాలన సాగించింది. ఉద్యమ ఆకాంక్షలైన నీళ్ళు, నిధులు, నియామకాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి రెండు చక్రాలుగా ప్రగతిరథాన్ని పరుగులు తీయించింది. వందలకొద్దీ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి దేశంలోనే పలురంగాలలో చరిత్ర సృష్టించింది.

ఈ నాలుగేళ్లలో రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరిగి ఆర్థిక పరిపుష్టి సాధించగలిగాం. 21.96 శాతం ఆర్థికాభివృద్ధితో రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ కేటాయింపులు కూడా గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగాయి. ప్రజాసంక్షేమ కార్యక్రమాలకు, కోటి ఎకరాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో సాగునీటి ప్రాజెక్టులకు, ఇప్పటికీ గుక్కెడు తాగునీరులేక అల్లాడుతున్న గ్రామాలు, పట్టణాలన్నింటికీ నల్లాలద్వారా ఇంటింటికీ శుద్ధిచేసిన తాగునీటిని అందించే మిషన్‌ భగీరథ వంటి వినూత్నపథకాలకు కనీవినని రీతిలో నిధులు కేటాయించి ముందుకు సాగుతున్నాం.

మన రాష్ట్ర ప్రభుత్వం జాతీయస్థాయిలో వివిధ రంగాలలో ముందుండి పలువురి ప్రశంసలు, అవార్డులు పొందడమేగాక, మన పథకాలు అనేక రాష్ట్రాలకు ఆదర్శప్రాయం కావడం తెలంగాణ ప్రజానీకానికి గర్వకారణం.

Other Updates