రాష్ట్ర-సమస్యలకు-తగినట్లుగా-కార్యాచరణ-ముఖ్యమంత్రుల-సదస్సులో1ప్రధాని నేతృత్వంలో ముఖ్యమంత్రుల మండలి (కౌన్సిల్‌ ఆఫ్‌ చీఫ్‌ మినిస్టర్స్‌) ఏర్పాటు చేయాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదనను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు స్వాగతించారు. ఈ విషయంలో పూర్తిగా సహకరిస్తామన్నారు. ప్రణాళికా సంఘం స్థానంలో కొత్త సంస్థ ఏర్పాటుపై డిసెంబరు 7న ఢల్లీిలో ముఖ్య మంత్రులతో ప్రధాని మోదీ ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మాట్లాడారు. ముఖ్యంగా సహకార సమాఖ్య వ్యవస్థ, వ్యూహాత్మక ప్రణాళిక, ఆవిష్కరణ, రాష్ట్రాలకు నిధులు, తదితర అంశాలపై ఆయన ప్రసంగించారు.
రాష్ట్రాలకు నిధులు ఉమ్మడిగా ఉంచాలని, ఇకపై ఆర్థికసంఘం సిఫార్సుల మేరకే నిధుల విడుదల జరగాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కోరారు. పంచవర్ష ప్రణాళికల స్థానంలో 10 నుంచి 15 ఏండ్లు ఉండేలా దీర్ఘకాలిక వ్యూహాలు అవసరమన్నారు.
రాష్ట్రాలు బలహీనంగా ఉంటే దేశం బలోపేతం కాజాలదు. ఈ నేపథ్యంలో రాష్ట్రాల సమగ్ర అభివృద్ధి దిశగా చర్యలు తీసుకోవాలని కె. చంద్రశేఖరరావు సూచించారు. ప్రతిపాదిత ముఖ్యమంత్రుల మండలి సమాఖ్య స్ఫూర్తికి సహకరించేలా ఉండాలన్నారు. ఈ మండలిలో అన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం కల్పించడంతోపాటు, పలు అంశాలపై మేధోమథనం చేయడానికి ఓ సహాయక వ్యవస్థ కూడా అవసరమని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.
విధానపరమైన నిర్ణయాలు సలహాలు తీసుకోవడానికి శాశ్వత సచివాలయం ఏర్పాటు చేస్తే బాగుంటుందని చంద్రశేఖరరావు సూచించారు. దేశంలో ప్రైవేటు రంగానిది కీలకపాత్ర అని, వాటికీ అనువైన వాతావరణం కల్పించాలని కోరారు.
ప్రజలను ప్రణాళికల్లో భాగస్వామ్యం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం ‘మన ఊరు`మన ప్రణాళిక’, ‘మన జిల్లా`మన ప్రణాళిక’, ‘మన బ్లాక్‌`మన ప్రణాళిక’ వంటి కార్యక్రమాలతో ముందుకు పోతోందని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సోదాహరణంగా వివరించారు. కొన్ని రాష్ట్రాల్లో విజయవంతమైన పథకాలు ఇతర రాష్ట్రాలలో అమలయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి కోరారు.
ప్రణాళికా సంఘానికి కొత్త రూపు

‘‘అంతర్జాతీయ పరిస్థితులు… అభివృద్ధిలో దూసుకెళ్ళడానికి భారత్‌కు అవకాశం కల్పించాయి. ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే దేశ బలగాలను తగినవిధంగా ఉపయోగించుకొనేలా ప్రణాళికా సంఘం స్థానంలో కొత్త సంస్థ రావాలి’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
ప్రణాళికా సంఘం స్థానంలో కొత్త సంస్థ ఏర్పాటు ప్రతిపాదనపై డిసెంబరు 7న ప్రధానమంత్రి మోది తన నివాసంలో ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటుచేసి సమాలోచనలు జరిపారు. దాదాపు 7 గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో పలువురు ముఖ్యమంత్రులు కొత్త వ్యవస్థ ప్రతిపాదనను బలపరుస్తూ పలు సూచనలు చేశారు.
ప్రస్తుత ప్రణాళికాసంఘం స్థానంలో ప్రతిపాదిత కొత్త సంస్థలలో రాష్ట్రాలకు ప్రముఖపాత్ర ఉండాలని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేశారు. విధాన ప్రణాళికా ప్రక్రియ ‘పైనుంచి క్రిందికి’బదులు ‘క్రిందినుంచి పైకి’ మారాలన్నారు. ప్రతిపాదిత సంస్థలో ‘టీమ్‌ ఇండియా’ భావన అంతర్భాగంగా ఉండాలన్నారు.
‘‘తమ భావాలు వ్యక్తం చేయడానికి వేదిక లేదని రాష్ట్రాలు కొన్నిసార్లు భావిస్తున్నాయి. అంతరాష్ట్ర వివాదాల పరిష్కారానికి ప్రభావవంతమైన యంత్రాంగం ఉండాలి’’ అని ప్రధాని అభిప్రాయపడ్డారు. సదస్సు అనంతరం ముఖ్యమంత్రులతో ప్రధాని ఇష్టాగోష్టిగా మాట్లాడారు.

Other Updates