కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ బ్యారేజీ నుంచి మిడ్ మానేరు వరకు ప్యాకేజీల పనులు సత్వరం పూర్తి చేయాలని నీటి పారుదలశాఖా మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు. రికార్డ్ సమయంలో ఈ ప్రాజెక్టు పూర్తి చేసి చరిత్ర సష్టించాలని కోరారు. జూన్ 15న జలసౌధలో నల్లగొండ జిల్లా డిండి ప్రాజెక్టు సహా పలు ప్రాజెక్టుల పురోగతిని మంత్రి సమీక్షించారు. మేడిగడ్డ నుంచి మిడ్ మానేరు వరకు తలపెట్టిన ప్యాకేజీలను సమీక్షించారు.
కాళేశ్వరం, డిండి, ఎ.ఎమ్.ఆర్.పి, దేవాదుల, మిడ్ మానేరు, భక్తరామదాసు, నెట్టెంపాడు, కల్వకుర్తి, బీమా, అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, నాగార్జున సాగర్ ఆధునీకరణ, మూసీ ఆధునీకరణ పనులను, ఆయా ప్రాజెక్టుల కోసం చేపట్టిన భూసేకరణ పనులను హరీష్ రావు సమీక్షించారు. ఎ.ఎం.ఆర్.పి కెనాల్స్ పనులపై నల్లగొండ జిల్లా కలెక్టర్‌తో ఫోన్లో సమీక్షించారు. ఎ.ఎం.ఆర్.పి. లోలెవల్ కెనాల్ నుంచి 68 వేల ఎకరాలకు సాగునీరందించేందుకు గాను ఈ జూన్‌లోనే పంపు ట్రయల్ రన్ ప్రారంభించాలని నీటిపారుదల శాఖ యంత్రాంగాన్ని మంత్రి హరీష్ రావు ఆదేశించారు. ఎ.ఎం.ఆర్.పి. కెనాల్స్‌కు పూర్వ స్థితి తీసుకురావడానికి ఉపాధిహామీ పథకం కింద పనులు ప్రారంభించాలని, అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లీకేజీల మరమ్మత్తులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అన్నారు.
నాగార్జునసాగర్ ఆధునీకరణ పథకం జూలైలోగా పూర్తి చేయాలని కోరారు. నల్లగొండ జిల్లాలో చేపట్టిన ప్రాజెక్టులకు భూసేకరణ ప్రక్రియను మరింత ముమ్మరం చేయాలని అన్నారు.
మూసీనది ఆధునీకరణ పనులపై చర్చించారు. మూసీ ఆయకట్టు కాల్వలన్నీ అధ్యాన్నంగా ఉన్నందున ప్రక్షాళన చేయాలని పనుల వేగం పెంచాలని కోరారు. ఖమ్మం జిల్లాలో తలపెట్టిన భక్తరామదాసు ప్రాజెక్టుల పరిస్థితిని మంత్రి సమీక్షించారు. ఈ పథకాలకు టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణ కార్య క్రమం యుద్ధప్రాతిపదికన జరపాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్‌కు సూచించారు. ఎల్లంపల్లి, మిడ్ మానేరుల నుంచి జూలైలో రైతులకు నీరివ్వాల్సిందేనని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ఎత్తిపోతల పథకాల పురోగతిని కూడా మంత్రి సమీక్షించారు. కల్వకుర్తి లిఫ్ట్ 2, లిఫ్ట్ 3, డ్రై రన్ కోసం కావలసిన విద్యుత్ సరఫరా గురించి ట్రాన్స్‌కో ఉన్నతాధికారులతో చర్చించారు. నాగా ర్జునసాగర్ హిల్ కాలనీని గ్రామపంచాయతీగా మార్పు చేసే కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను మంత్రి హరీష్ రావు ఆదేశించారు.
కోనసీమను తలదన్నేలా కరీంనగర్ :
నీటిపారుదల శాఖ కరీంనగర్ జిల్లా కోనసీమను మరిపించ నుందని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఈ జిల్లా ప్రాజెక్టులు పూర్తయితే కరవు పారిపోతుందన్నారు. నిర్ణీత గడువులోపే ప్రాజెక్టులను పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. జూన్ 17న ఆయన వేములవాడ లో ఎల్లంపల్లి, మిడ్ మానేరు ప్రాజెక్టుల పరిస్థితిని సమీక్షించారు. రీ ఇంజనీరింగ్ లో ఈ ప్రాజెక్టు లే కీలకమని ఆయన అన్నారు. ప్రాజెక్టుల పురోగతి, భూసేకరణ వంటి అంశాలపై సమీక్షించా రు. భూసేకరణ పై ప్రతిరోజూ సమీక్షించాలని రెవిన్యూ అధికారులను మంత్రి ఆదేశించారు.
శ్రీపాద సాగర్ ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద మేడారం, గంగాధర ప్రాంతాలలో లక్షా 65 వేల ఎకరాల ఆయకట్టుకు సంబం ధించిన ట్రయల్ రన్‌ను జూలై మొదటి వారంలో ప్రారంభించా లని ఆదేశించారు. దీనికవసరమైన విద్యుత్తు సరఫరా కోసం విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి మాట్లాడారు. నెలాఖరులోగా ఈ పంపులకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని సూచించారు.
వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గంలో 57 వేల ఎకరాల ఆయకట్టును అందించే ఎల్లంపల్లి ప్యాకేజీ – 2 పై చర్చించారు. ప్యాకేజీ 1, 3 లలో మిగిలి ఉన్న భూసేకరణ సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆర్డ్డీవోను మంత్రి కోరారు. ఎల్లంపల్లి కింద ముంపునకు గురైన బాధితులకు వెంటనే పరిహారం చెల్లింపులను పూర్తి చేయాలన్నారు. ఎల్లంపల్లి పూర్తి సామర్థ్యం నీరు నిండే దాకా ప్రాజెక్టు గేట్లు తెరవకూడదని హరీష్ రావు సూచించారు. అలాగే ఎల్లంపల్లి పూర్తి రిజర్వాయర్ సామర్థ్యం 148 అడుగులు నింపుతున్నందున రాయపట్నం బ్రిడ్జి పై ట్రాఫిక్ రాకపోకలకు అనుమతించాలని ఆర్ అండ్ బి అధికారులను మంత్రి ఆదేశించారు.
మిడ్ మానేరు కింద అనుపురం గ్రామంలో ఆర్ అండ్ ఆర్ పనుల్లో అంచనాలు అనుమానాస్పదంగా ఉన్నందున విచారణ జరపాలని పంచాయతీరాజ్ ఇ.ఎన్.సి ని మంత్రి ఆదేశించారు. రుద్రారం, చీర్ల వంచ గ్రామాలలో ఆర్ ఎండ్ ఆర్ చెల్లింపులు త్వరగా జరగాలని హరీష్ రావు ఆదేశించారు. రెవిన్యూ శాఖ సమన్వయం చేసుకుంటూ భూసేకరణ సమస్యలను పరిష్కరించాలని ఇరిగేషన్ ఇంజనీర్లను ఆదేశించారు. వేమునూరు పంప్ హౌజ్ డ్రైరన్‌ను ఆగస్టులో ప్రారంభించాలన్నారు. మిడ్ మానేరు ప్రాజెక్టును 2017 జూన్ కల్లా పూర్తి చేయాలని హరీష్ రావు కోరారు. కరీంనగర్ ప్రాజెక్టుల సమీక్షలో ఎంఎల్‌ఏ రమేశ్ చెన్నమనేని, జడ్ పి ఛైర్ పర్సన్‌్ టి.ఉమ, ఎంఎల్ సి. నారదాసు లక్ష్మణరావు, చీఫ్ ఇంజనీర్ అనిల్, ఎస్. ఇ. శ్రీకాంతరావు, వెంకటరాములు, స్పెషల్ కలెక్టర్ వెంకటేశ్వర్లుతో పాటు ఇరిగేషన్, రెవిన్యూ అధికారులు పాల్గొన్నారు.
హైదరాబాద్‌కు పోటీగా వేములవాడ ట్యాంక్ బండ్ :
వేములవాడ గుడి చెరువు పై తలపెట్టిన ట్యాంక్ బండ్, సుందరీకరణ పనులు పూర్తయితే ఖచ్చితంగా హైదరాబాద్ హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ కు పోటీగా మారనుంది. వేములవాడ గుడి చెరువు ట్యాంక్ బండ్ మరో 18 నెలల్లో పూర్తి కానుంది. రూ. 62 కోట్లతో చేపట్టిన ట్యాంక్ బండ్, సుందరీకరణ పనులకు జూన్ 16న మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. ఇప్పటికే ఈ పనులకు టెండర్లు పిలిచారు. గుడి చెరువు కింద రెండు హైలెవల్ వంతెనలు నిర్మిస్తున్నారు. గుడి చెరువుకట్టను 150 అడుగుల కు వెడల్పు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో జరుగుతున్న మొత్తం ఎం.టి.బి.లలో వేములవాడ ఎం.టి.బి ప్రత్యేకత ను చాటుకోనున్నది.