కాకతీయుల చరిత్ర, రాణి రుద్రమదేవి జీవిత చరిత్ర ఆధారంగా నిర్మించిన ‘రుద్రమదేవి’ చలన చిత్రానికి నూటికి నూరుశాతం వినోదపు పన్ను మినహాయింపు ఇవ్వాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు నిర్ణయించారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబించే చిత్రాలకు తగిన ప్రోత్సాహం అందిచాలన్న ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం గైకొన్నట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు.
రుద్రమదేవి చిత్ర దర్శకుడు గుణశేఖర్, ఆయన కుటుంబ సభ్యులు, నిర్మాత దిల్ రాజు అక్టోబర్ 8న క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసి, రుద్రమదేవి సినిమాను చూడవలసిందిగా ఆహ్వానించారు. అందుకు సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి కాకతీయ సామ్రాజ్య వైభవాన్ని, రాణి రుద్రమదేవి గొప్పదనాన్ని ప్రపంచానికి చాటేవిధంగా చిత్రీకరించినందుకు దర్శకుడు గుణశేఖర్‌ను అభినందించారు. ఇలాంటి చిత్రాలు మరిన్ని నిర్మించాలని కె.సి.ఆర్ సూచించారు. రుద్రమదేవి చిత్రాన్ని నిర్మించడానికి తాను తెలంగాణలోని పలు ప్రాంతాలలో పర్యటించానని, తెలంగాణ ప్రభుత్వానికి స్ఫూర్తిగా నిలచిన చెరువుల నిర్మాణం లాంటి అంశాలు కూడా ఈ చిత్రంలో ఉన్నాయని గుణశేఖర్ ఈ సందర్భంగా తెలిపారు. తాముతీసిన రుద్రమదేవి చిత్రానికి వినోదపు పన్ను మినహాయిస్తూ, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తీసుకున్న నిర్ణయం పట్ల గుణశేఖర్ ఆనందం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి ఆలోచనా విధానం ఎంతో గొప్పదని, ఆయన మాటల మనిషికాదు, చేతల మనిషని నిరూపించారని గుణశేఖర్ అన్నారు. ముఖ్యమంత్రి అందించిన సహకారం మరువలేనిదని , ఒకదశలో ఆయన భావోద్రేకానికి గురయ్యారు.