మూసీ పరీవాహక ప్రాంతంలో పర్యటించిన మంత్రి కేటీఆర్
నిజాం కాలంలో మూసీ నది ఏ విధంగా ఆహ్లాదకర వాతావరణంలో చల్లని గాలులకు ఆలవాలమై, పరిశుభ్రమైన జలాలతో ప్రవహించిందో.. అలా తిరిగి మూసీ నదికి పూర్వ వైభవం తీసుకురావాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం మూసీ నది ప్రక్షాళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం చేపట్టాల్సిన ప్రణాళికలను రూపొందించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కెటి రామారావు మార్చి 7న హైదరాబాద్ మహా నగరంలోని మూసీ పరీవాహక ప్రాంతాలను సందర్శించారు. మూసీ నదిలోకి మురికి నీరు, పరిశ్రమల వ్యర్థాలు రాకుండా నివారించడానికి చేపట్టాల్సిన చర్యల గురించి అధికారులతో చర్చించారు. మూసీ సుందరీకరణ విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో పనులు చేపడుతుందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. నదిని శుద్ధి చేయడానికి రూ. 3వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. సబర్మతి నది ప్రక్షాళన స్పూర్తితో మూసీ నది సుందరీకరణకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు. గ్రీన్ క్లైమేట్ ఫండ్ (జీసీఎఫ్) నిధులతో పనులు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈనెల చివరలో డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టును (డీపీఆర్) రూపొందించి నాబార్డు సహాయంతో దక్షిణ కొరియాకు వెళతామని కేటీఆర్ పేర్కొన్నారు.
విడతల వారీగా పనులు..
మూసీ నదిని సుందరీకరించడానికి విడతలవారీగా పనులు చేపడతామని మంత్రి చెప్పారు. పరిశుభ్రమైన, స్వచ్ఛమైన నీటితో మూసీ కళకళలాడేలా తీర్చి దిద్దుతామని తెలిపారు. మూసీ ప్రాంతాల్లో దుర్వాసన, దోమల నివారణకు సుగంధ భరిత మొక్కలు నాటుతామని, ప్రగతినగర్ తరహాలోనే ఔషధ మొక్కలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. మంచి రేవుల నుంచి బాపూఘాట్ వరకు మంచినీటితో ప్రవహించేలా చేస్తామన్నారు.
మూసీపై ఈస్ట్-వెస్ట్ కారిడార్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం చేపడతామని, ఇప్పుడు ఉన్న ఎస్టీపీలకు అదనంగా మరో 10 నూతన ఎస్టీపీలను ఏర్పాటు చేస్తామని మంత్రి అన్నారు. నగరంలో మూసీ నది 30 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుందని తెలిపారు. 51 నాలాల ద్వారా మురుగునీరు నదిలోకి వస్తుందన్నారు. నగరం నుంచి వెలువడుతున్న 1250 ఎమ్‌ఎల్‌డిల మురుగునీటిలో 93శాతం మూసీలోనే కలుస్తుందన్నారు. ఇందులో సగం నీటిని మాత్రమే సీవరేజ్ ప్లాంట్ల ద్వారా శుద్ధి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. మిగిలిన మురుగునీటిని కూడా అదనంగా 10 ఎస్టీపీలను ఏర్పాటు చేసి శుద్ధి చేస్తామని, శుద్ధమైన నీటితో మూసీ నది కళకళలాడేవిధంగా చేస్తామన్నారు. మంత్రితో పాటు జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రాంమోహన్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.జి.గోపాల్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డి, హెచ్‌ఎండీఏ కమిషనర్ చిరంజీవులు, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, వాణిజ్యపన్నులశాఖ కమిషనర్ అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్‌లో కాగ్నిజెంట్ సెజ్
హైదరాబాద్ ఐటి రంగంలో మరో కొత్త సెజ్ ఏర్పాటు కాబోతోంది. రాజధానిలో ఐటీ/ఐటీఈఎస్ సేవలందించే సెజ్‌ను ఏర్పాటు చేయాలన్న అమెరికా ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. రంగారెడ్డి జిల్లాలో 2.51 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ సెజ్ ఏర్పాటు కానుంది. నగరంలో గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం, ఒరాకిల్, డెలాయిట్, టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, సీఎస్‌సీ, టెక్‌మహింద్రా వంటి అంతర్జాతీయ, దేశీయ దిగ్గజాలు తమ ఉద్యోగులతో కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. అంతర్జాతీయ దిగ్గజాలైన ఆపిల్, అమెజాన్ సంస్థలు త్వరలోనే తమ కార్యాలయాలను ఏర్పాటుచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అంగీకారం కుదుర్చుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కాగ్నిజెంట్ సెజ్‌కు కేంద్రం ఆమోదం తెలపడం హైదరాబాద్ కేంద్రంగా విస్తరిస్తున్న ఐటీరంగ వృద్ధిని మరోమారు దేశానికి చాటిచెప్పినట్లయింది.
అమెరికా ఐటీ సంస్థ అయిన కాగ్నిజెంట్ తెలంగాణలో తమ ప్రత్యేక ఆర్థిక మండలిని(సెజ్) ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపించి సెజ్ ఏర్పాటుకు అనుమతివ్వాలని కేంద్రానికి దరఖాస్తు చేసుకుంది. కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి రీటా టియోతియా అధ్యక్షతన ఫిబ్రవరి 23న ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో అనుమతుల బోర్డు(బీవోఏ) కాగ్నిజెంట్ దరఖాస్తుపై తుది నిర్ణయం తీసుకుంది.
150 కోట్ల పెట్టుబడులు… ప్రత్యక్షంగా 8వేలు, పరోక్షంగా 30వేల ఉద్యోగాలు…
కాగ్నిజెంట్ సెజ్ ద్వారా సుమారు 8,000 కొత్త ఉద్యోగాలు వస్తాయని ఐటీ రంగ నిపుణులు అంటున్నారు. పరోక్షంగా దాదాపు 30వేల మందికి ఉపాధి లభించనున్నది. ఐటీ వర్గాల ప్రకారం ఎకరా స్థలంలో సుమారు లక్ష చదరపు అడుగుల స్థలాన్ని ఐటీ కంపెనీలు తమ వ్యాపార అవసరాల నిమిత్తం అభివృద్ధి చేస్తాయి. ఈ లెక్కన 2.51 హెక్టార్లలో కాగ్నిజెంట్ అభివృద్ధి చేయనున్న స్థలాన్ని వ్యాపార, ఆహార, విశ్రాంతి విభాగాలుగా విభజించినప్పటికీ సగటున ఒక్కో ఉద్యోగికి కనీసం 100 చదరపు అడుగుల స్థలం వచ్చేలా నిర్మాణం ఉంటుందని భావిస్తున్నారు. ఈ భవన సముదాయానికే సుమారు 150 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్నారని భావిస్తున్నారు. కాగ్నిజెంట్ వంటి అంతర్జాతీయ దిగ్గజం ఏకంగా సుమారు 8వేల మంది ఉద్యోగులతో కార్యాలయం ఏర్పాటు చేయడం ద్వారా మరిన్ని బడా కంపెనీలు హైదరాబాద్ వైపు చూసే అవకాశం ఉంది.