‘నీవు నన్ను మొదటిసారి ఎక్కడ కలుసుకున్నవో గుర్తుందా?’ అని నెహ్రూ ఒకసారి తన క్యాబినెట్ మంత్రి గుల్జారీలాల్ నందాను అడిగారు. పాత సంగతులను నెమరువేసుకుంటున్నాడు నందా.
1920 సం|| డిసెంబరు నెల చివరి రోజుల్లో కార్మికుల సమస్యల గురించి గాంధీజీతో చర్చించడానికి నెహ్రూ సబర్మతీ ఆశ్రమం వచ్చాడు. అక్కడ కూర్చున్న ఒక యువకుణ్ణి చూపుతూ ”ఇతడు ఇప్పుడిప్పుడే అహ్మదాబాద్‌లో ప్రాక్టీసు మొదలుపెట్టాడు. బాగా ఎదిగి వచ్చే అవకాశాలు విడిచిపెట్టి నేను వద్దన్నా స్వాతంత్య్ర సమరంలో దూకడానికి అనుమతి ఇవ్వమని వచ్చాడు” అని గాంధీజీ ఆ యువకుణ్ణి నెహ్రూకు పరిచయం చేశారు. అలా ఆనాడు నెహ్రూకు పరిచయమైన యువకుడే రెండుసార్లు భారతదేశపు తాత్కాలిక ప్రధానిగా పనిచేసిన గుల్జారీలాల్ నందా. అనంతరం కేంద్ర రాజకీయాలలో మూడు దశాబ్దాలు కీలక వ్యక్తి అయ్యాడు.
గుల్జారీలాల్ నందా 1898 సం||లో అహ్మదాబాద్‌లో జన్మించాడు. 1921లో అహ్మదాబాద్ మజ్దూర్ మహాజన్ అనే కార్మిక సంస్థను స్థాపించడంలో ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది. ఆనాటినుంచి ఆయన అన్ని స్వాతంత్య్రోద్యమాలలో పాల్గొన్నాడు. జైలుశిక్ష అనుభవించాడు. 1937లో బొంబాయి ప్రెసిడెన్సీలో బాబాసాహెబ్ ఖేర్ నాయకత్వంలో మొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఆ మంత్రివర్గంలో గుజరాత్ ప్రాంతంనుంచి మురార్జీదేశాయ్, నందాలకు స్థానం లభించింది.
అయితే మొరార్జీకి క్యాబినెట్ హోదా లభించగా నందాజీకి పార్లమెంటరీ కార్యదర్శి పదవితో తృప్తి పడవలసి వచ్చింది. 1946 ఎన్నికల అనంతరం ఏర్పడిన ఖేర్ మంత్రివర్గంలో యీ ఇద్దరూ క్యాబినెట్ మంత్రులయ్యారు. రాష్ట్ర రాజకీయాలలోనూ, దేశ రాజకీయాలలోనూ మొదటినుంచి మొరార్జీ, నందాలు పోటాపోటీ పడేవారు. ఈ ఇద్దరి మధ్య ఘర్షణను నివారించడానికి నెహ్రూ 1950లో మొరార్జీని రాష్ట్రానికి పరిమితంచేసి, నందాను కేంద్రానికి తీసుకుని ప్రణాళికసంఘం ఉపాధ్యక్ష పదవి ఇచ్చారు. 1952 ఎన్నికల అనంతరం మొరార్జీ బొంబాయి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు నందాజీని కేంద్రానికి తీసుకుని ప్రణాళికశాఖ మంత్రి పదవి ఇచ్చారు. కామ్‌రాజ్ ప్రణాళిక మొరార్జీ, ఎస్కే పాటిల్, జగ్‌జీవన్‌రాం, లాల్‌బహదూర్ శాస్త్రీలను కబళించగా కేంద్రంలో నందాజీ రెండవస్థానం దక్కించుకున్నాడు. ఈ అవకాశమే నందాను నెహ్రూ, శాస్త్రీల అనంతరం తాత్కాలిక ప్రధానిని చేసింది. ఇందిరాగాంధీ మొదటి రోజుల్లో కూడా నందాజీ ద్వితీయ స్థానంలోనే ఉన్నారు. అధికారం మరొకరికి అప్పగించడమేకానీ తాను అధికారం పొందడానికి నందా ఎన్నడూ ఎత్తులు వేయలేదు.
కాంగ్రెస్ చీలిక నందాకు బాధ కలిగించింది. ఆనాటినుంచి ఆయన రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. నెహ్రూకు నందాపై ఎంతో విశ్వాసం ఉండేది. ఒకసారి ఓ ఫైల్‌పై కృష్ణమాచారి అభిప్రాయానికి వ్యతిరేకంగా ప్లానింగ్ కమిషన్ ఉపాధ్యక్షుని హోదాలో నందాజీ నోట్‌రాసి ప్రధానికి పంపించారు. విచిత్రమైన విషయమేమంటే సంబంధితశాఖమంత్రి అభిప్రాయంకన్నా ప్లానింగ్ కమిషన్ ఉపాధ్యక్షుని అభిప్రాయానికే నెహ్రూ ఆమోదముద్ర వేశారు.
‘భారతరత్న’ బిరుదు పొందిన నందాజీ ఆ మరుసటి సంవత్సరమే 1998 సం|| మేలో నిండా నూరేళ్ళ జీవితం గడిపి పండుటాకులా రాలిపోయారు.
మంత్రముగ్ధం చేసే ప్రసంగాలు
స్వాతంత్య్రానంతరం దాదాపు నాలుగు దశాబ్దాలపాటు కమ్యూనిస్టు సిద్ధాంతానికి చిరునామాగా నిలిచిన హిరేన్ ముఖర్జీ వామపక్ష నాయకాగ్రజుడు. ధర్మంవైపు నిలబడి నేరుగా ఎంతటివారిపైనైనా వాగ్భాణాలు సంధించగల నేత హిరేన్. ఆయన విశిష్ట పార్లమెంటేరియన్. అద్వితీయ వక్త. బహు గ్రంథకర్త. ఆయన నిండా 97 ఏళ్ల జీవితం గడిపాడు. 1952 నుంచి 1977 వరకు లోక్‌సభ సభ్యుడు. సీపీఐ పక్ష ఉప నాయకుడుగా, తదుపరి నాయకుడుగా వ్యవహరించాడు.
ఆయన లండన్‌లో చదువుకున్నాడు. ఆంధ్ర విశ్వ విద్యాలయంలో రెండేళ్ళపాటు అధ్యాపక బాధ్యతలని నిర్వహించాడు. ఆ తరువాత కలకత్తా విశ్వవిద్యాలయం ఆచార్యుడయ్యాడు. అనంతరం లోక్‌సభ సభ్యుడయ్యాడు.
ఆయన ప్రసంగాలు సభ్యులను మంత్రముగ్ధం చేసేవి. సీపీఐకి అవి ప్రత్యేక గౌరవాన్ని కలిగించాయి. ఆయన ప్రసంగాలంటే నెహ్రూకు అమితమైన యిష్టం. హిరేన్ ముఖర్జీని ఆయన ‘వామపక్షాల ఆత్మ’ అని వర్ణించాడు. ముఖ్యంగా కళలు, సాహిత్యం, సంస్కృతి గురించి హిరేన్ ఎప్పుడు మాట్లాడినా సభలో సూదిపడినా వినిపిచేంత నిశ్శబ్దం ఆవరించేది. ఒక మాట వినలేకపోయినా ఎంతో కోల్పోతున్నట్లుగా ఆయన ప్రసంగాలు అందరూ శ్రద్ధాసక్తులతో వినేవారు. ఇంగ్లీషులో ఉద్దండులుసైతం ఆయన ఆంగ్ల ప్రసంగాలు విని ముక్కుమీద వేలువేసుకునేవారు.
‘నగరాలలో సంపన్నులు తిని మిగిలింది చెత్తబుట్టలలో పారేస్తే, దానికోసం వీధుల్లో అభాగ్యులు కుక్కలతో పోటీపడే విషయం గౌరవ ప్రధానమంత్రికి తెలుసా’ అని ఆయన సందర్భంలో నెహ్రూను పార్లమెంటులో ప్రశ్నించారు. ఆయన మాటల్లో వినిపించే మహనీయత, స్వపక్ష, విపక్ష తేడాలేకుండా అందరినీ ఆకట్టిపడేసేది. హిరేన్ సిద్ధాంతాలను సైతం విభేదించే వారు ఆయన మాటలను శ్రద్ధగా వినేవారు. హిరేన్ ముఖర్జీకి ప్రభుత్వం పద్మభూషణ్ (1990), పద్మవిభూషణ్ (1994) బిరుదులిచ్చి సత్కరించింది.
ఒకేసారి ఎన్నికలు సాధ్యమా?
ఇందిరాగాంధీ హయాంనుంచి రాష్ట్ర శాసనసభలకు, లోక్‌సభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేవారు. ఆ తరువాత ఈ విధానం మారింది. రాష్ట్రాల అంశాలనుంచి జాతీయ అంశాలను వేరు చేయడం అవసరమని, ప్రజలు ఓట్లు వేసేటప్పుడు గందరగోళం లేకుండా, స్పష్టంగా ఎంచుకునేం దుకు అప్పుడే వీలవు తోందని భావించారు. దీనితో శాసనసభ ఎన్ని కల్లో స్థానిక అంశాలకు ప్రాధాన్యం లభించింది. అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్రస్థాయి అంశాలకు పరిమిత మయ్యాయి. రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కేంద్రం మీద ప్రభావం చూపని పరిస్థితి ఏర్పడిపోయింది. దీని ఫలితంగా కేంద్రంలోని పాలకపక్షం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి పాలయినా కేంద్రంలో ఆ పార్టీ అధికారం కొనసాగడం అనే కొత్త విషయం అనుభవంలోకి వచ్చింది. శాసనసభ ఎన్నికల్లో వేర్వేరు అంశాలు ముందుకువచ్చినప్పుడు ఒకచోట తిరస్కారాన్ని అంతటికి వర్తింపజేయవలసిన అవసరం లేదనే వాదం బలపడింది. మన దేశంలో సంవత్సరానికో, రెండు సంవత్సరాలో ఒకసారి ఏదో ఒకచోట ఎన్నికలు జరుగుతున్నాయి. త్వరగా ఎన్నికలు జరిపే విధానం రాజ్యాంగంలోనే పొందుబరచబడి ఉంది. నిర్ణీత కాలంలోనేగాక, మధ్యలో ఎన్నికలు జరిగే పద్ధతిని రాజ్యాంగంలో చేర్చుకున్నారు. అయితే రాష్ట్ర అసెంబ్లీలను ముందుగానే రద్దు చేయాలని కేంద్రం రాష్ట్రాలపై ఒత్తిడి తేజాలదు.