sallonipalliమహబూబ్‌నగర్‌ జిల్లా హన్వాడ మండలం సల్లోనిపల్లి గ్రామాన్ని జిల్లా కలెక్టర్‌ సూచనల మేరకు పాలనా యంత్రాంగం అంతా కలిసి 48 గంటల్లో బహిరంగ మలవిసర్జన రహిత గ్రామంగా తీర్చిదిద్దడానికి నవంబర్‌ 18న శ్రీకారం చుట్టారు. గ్రామంలో మొత్తం 386 నివాసాలకుగాను కేవలం 52 నివాసాలలోనే మరుగుదొడ్ల సౌకర్యం ఉండగా మిగిలిన 332 నివాసాల్లో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టి 48 గంటల్లో పూర్తి చేయడానికి జిల్లా కలెక్టర్‌ ప్రణాళికలు సిద్ధం చేశారు. నవంబరు 10న సల్లోనిపల్లి గ్రామంలో చిన్నపిల్లలనుండి ప్రతి ఒక్కరితో సమావేశం ఏర్పాటు చేసి మరుగుదొడ్ల ఆవశ్యకత, పరిశుభ్రత లోపించడంవల్ల వ్యాప్తిచెందే రోగాలు, పాటించవలసిన జాగ్రత్తలు తదితర అంశాలపై అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న గ్రామస్థులంతా వారి గ్రామంలో ఇంటింటికీ మరుగుదొడ్ల నిర్మాణం కలిసికట్టుగా చేసుకుంటామని ప్రకటించగా, జిల్లా కలెక్టర్‌ గ్రామం మొత్తాన్ని బహిరంగ మలవిసర్జన రహిత గ్రామంగా మార్చడానికి కావలసిన పథకం రచన చేశారు. ఇందుకు అనుగుణంగా ఇద్దరు మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, తహశీల్దార్లతో ప్రతి ముగ్గురిని ఒక టీం క్రింద విభజించి 21 టీంలను ఏర్పాటు చేసి ఒక్కో టీంకు 16 నివాసాల చొప్పున కేటాయించడం జరిగింది.

మరుగుదొడ్ల నిర్మాణానికి అవసరమైన ఇటుక, ఇసుక, సిమెంట్‌, రేకులు, కుండిలు, రింగులు తదితర సామగ్రిని గ్రామం మొత్తానికి సరిపడేలా తెప్పించి 48 గంటల్లో 332 మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయడానికి నవంబర్‌ 18న ప్రారంభోత్సవం చేశారు. అనుకున్న ప్రకారంగానే నిర్ధారిత సమయంలో నిర్మాణాలు పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులంతా స్వచ్ఛంధంగా వారివారి పనులను మానుకొని స్వయంగా పాలుపంచుకున్నారు. ఈ కార్యక్రమాన్ని కేవలం ఒక గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీరిదిద్దే కార్యక్రమంగా కాకుండా జిల్లా మొత్తంలోని అన్ని మండలాలు, గ్రామాలలో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టి బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా మార్చాలని, అందుకు అవసరమైన సమైక్యత, స్వయంకృషి, గ్రామం అంతా కలసికట్టుగా పనిచేస్తే ఏదైనా సాధించవచ్చన్న విషయం అందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతో చేపట్టామని జిల్లా కలెక్టర్‌ అన్నారు. అలాగే వివిధ మండలాల అధికారులను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయడం వెనుక ఉద్దేశం ఆయా అధికారులు తమతమ పరిధిలోని గ్రామాలలో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టి జిల్లా మొత్తాన్ని బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా మార్చడానికి కావలసిన శిక్షణగా కూడా ఉపయోగపడుతుందని అన్నారు.

గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడుతూ.. నిర్మాణం చేపట్టి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడంతో బాధ్యత తీరినట్టు కాదని, మరుగుదొడ్లను విధిగా ఉపయోగించుకోవాలని, వేరే అవసరాలకు వాటిని మార్చవద్దని, అప్పుడే గ్రామం ఆదర్శ గ్రామం అవుతుందని కలెక్టర్‌ అన్నారు. ఈ కార్యక్రమానికి మహబూబ్‌నగర్‌ శాసనసభ్యులు వీ శ్రీనివాస్‌గౌడ్‌, దేవరకద్ర శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ కె. శివకుమార్‌నాయుడు, ట్రైనీ కలెక్టర్‌ గౌతం వివిధ మండలాల సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, జిల్లా అధికార యంత్రాంగం పాల్గొన్నారు.

Other Updates