telangana-womeసర్వే భవంతు సుఖిన:

సర్వే సంతు నిరామయా:

సర్వే భద్రాణి పశ్యంతు

మా కశ్చిత్‌ దు:ఖ భాగ్బవేత్‌

రెండేళ్ళ క్రితం జూన్‌ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కె. చంద్రశేఖరరావుగారు అనంతరం పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగిన రాష్ట్ర అవతరణోత్సవాలలో పాల్గొన్న సందర్భంగా ప్రసంగిస్తూ వ్యాసప్రోక్తమైన సూక్తిని పేర్కొ న్నారు. అందరూ సుఖంగా ఉండాలి. అందరూ ఆరోగ్యంగా ఉండాలి. అందరూ క్షేమంగా ఉండాలి. ఎవరికీ దు:ఖం కలగకూడదు. అని సూక్తి అర్థం. ఈ రెండేళ్ళ పరిపాలన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఆ సూక్తిని ఆచరణలో సార్థకం చేసింది. కులమత భాషా ప్రాంతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజల ఆదరాభిమానాలను ఆశీస్సులను పొందింది.

దేశంలోని మిగతా 28 రాష్ట్రాలలో పోల్చుకున్నప్పుడు ప్రజాభిమానంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అగ్రభాగాన నిలిచారు. ఈ రెండేళ్ళలో రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో ఓటింగ్‌ సరళిని పరిశీలిస్తే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు పై ప్రజలకు ఎంతటి అభిమానముందో అవగతమవుతుంది. రెండేళ్ళపాలనకు నిండైన ప్రజామోదం ఆ ఎన్నికలలో ప్రకటితమైంది.

కొత్తగా ఆవిర్భవించిన రాష్ట్ర ప్రభుత్వ రథసారధిగా ఆయన ముందు ఎన్నో పెను సవాళ్ళు, ఎన్నో విభజనానంతర సమస్యలు, ప్రత్యర్థుల సైంధవ పాత్రలు, కుట్రలు కుహకాలు, శాపనార్థాలు ఇలా లెక్కకుమించిన చిక్కుముడులు వాటిని అధిగమించగలిగే బలం ముఖ్యమంత్రి చంద్రశేఖర రావుగారికుంది.

అదే సంకల్ప బలం. ఎపుడో 16 సంవత్సరాల క్రితం ఆయనలో అంకురించిన తెలంగాణ రాష్ట్ర సాధన దీక్ష. 14 సంవత్సరాల నిరంతర ప్రజా ఉద్యమానికి సారధ్యం వహించిన ఫలితంగా సాకారం కావడానికి నేపధ్యం ఆ సంకల్పబలమే. అందుకే ముఖ్యమంత్రిగా ఎన్ని సవాళ్ళు ఎదురైనా అజేయుడుగా నిలిచారాయన.

ఒకచో నేలను పవ్వళించు నొకచో నొప్పారు పూసెజ్జపై

ఒకచో శాకము లారగించు నొకచో ఉత్కృష్ట శాల్యోదనం

బొకచో బొంతధరించు నొక్కకతరిన్‌ యోగ్యాంబరశ్రేణిలె

క్కకు రానీయడు కార్యసాధనకుడు దు:ఖంబున్‌ సుఖంబున్‌ మదిన్‌.

ఈ పద్యాన్ని ఆయన ఓ సందర్భంలో ఉటంకించారు. జీవితంలో కష్టసుఖాలెన్ని ఎదురైనా కార్యసాధకునకు లక్ష్యసాధన మాత్రమే ధ్యేయం అని పద్య సారాంశం. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు గారి జీవితాచరణ కూడ అదే.

రాష్ట్ర ఆవిర్భావం తరువాత ముసురుకున్న సమస్యలు ఇన్ని అన్నీ కావు. కరెంట్‌ కష్టాలు, ఉద్యోగుల విభజన, ఉన్నతాధికారుల కొరత, కరువు, న్యాయపరమైన చిక్కులు, హైదరాబాదులో స్థిరపడ్డ ఇతర ప్రాంతాల ప్రజల్లో నెలకొని ఉన్న భయాలూ, అనుమానాలు ఇలా సవాలక్ష సమస్యల మధ్య తొలి ఏడాది సతమతమయింది. రెండవ ఏడాది పరిపాలన గాడిలో పడింది. అంతే సంక్షేమం అభివృద్ధి రంగాలు సమాంతరంగా గాలికంటే వేగంగా దూసుకుపోయాయి. రెండేళ్ళ తెలంగాణ రాష్ట్రం దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. ప్రభుత్వ యంత్రాంగాన్నంతా ఒక్కతాటిమీద సమర్థవంతంగా నడిపిస్తూ అనితర సాధ్యమైన పథకాలను పరుగులు పెట్టించిన ముఖ్యమంత్రిగా కె.చంద్రశేఖరరావు గారు చరిత్ర సృష్టించారు.

ముఖ్యమంత్రి మానస పుత్రికలు మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ, రెండు పడక గదుల ఇండ్లు వంటి పథకాలు విదేశీ పాలకులను సైతం అబ్బురపరిచాయి. సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వమే అభివృద్ధి సంక్షేమ పథకాలు అద్భుతంగా అమలు జరుగుతున్న రాష్ట్రంగా తెలంగాణకు కితాబు నిర్వడమే కాకుండా ఇతర రాష్ట్రాధినేతలను ఒక సారి తెలంగాణకు వెళ్ళి ఆ పథకాలను అధ్యయనం చేసి రండని సలహా ఇవ్వడం తెలంగాణ ప్రభుత్వ పనితనానికి నిదర్శనం. మానిఫెస్టోలో చెప్పకపోయినా షాదిముబారక్‌, కళ్యాణలక్ష్మి, సన్నబియ్యం పథకాలు బడుగు బలహీన వర్గాలకు ఆశాదీపాలుగా నిలిచాయి. వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు వృత్తిపని వారలకు పెన్షన్‌లు, ఉచిత కరెంట్‌, ఉచిత విద్య, రైతులరుణమాఫి, మౌలిక సౌకర్యాల కల్పన, ఉద్యోగులకు సంతృప్తికరమైన వేతనాలు కార్మికులకు కర్షకులకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఇలా అన్ని వర్గాల ప్రజానీకాన్ని ఆదుకున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కింది. 2015-16 బడ్జెట్‌ రూ.లక్ష 15 వేల కోట్లు అయితే 2016-17 తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ రూ. లక్ష 30 వేల కోట్లుదాటింది.

సాధారణంగా ఏ బడ్జెట్‌ అయినా ప్రణాళికేతర వ్యయానికి పెద్ద పీటవేసి ఆ తరువాత ప్రణాళిక వ్యయానికి ప్రాధాన్యం ఇస్తుంది. కాని ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్‌లో ప్రణాళికా వ్యయమే అగ్రభాగం నిలిచింది. అంటే ఇతరత్ర వ్యయాల కంటే అభివృద్ధి సంక్షేమ పథకాలకు కేటాయించిన రూ. 67 వేల కోట్లు ప్రభుత్వ ప్రగతిశీల దృక్పదానికి అద్దం పడుతుంది. మొత్తం రూ. లక్ష 30 వేల కోట్ల బడ్జెట్‌లో కేవలం సక్షేమ పథకాలకే రూ. 35 వేల కోట్లు కేటాయించడం, నీటి పారుదల రంగానికి 25 వేల కోట్లు కేటాయించడాన్ని బట్టి ముఖ్యమంత్రి బడుగు బలహీన వర్గాలకు, రైతాంగానికి ఇచ్చిన ప్రాధాన్యం స్పష్టమవుతుంది.

ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం నిరంతర కృషి ఫలితంగా తెలంగాణ నీటి ప్రాజెక్టులు, అభివృద్ధి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. రెండేళ్ళ పాలనలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలపట్ల విశ్వాసం పెరిగిన ఫలితంగా ప్రపంచ పరిశ్రమ దిగ్గజాలు అమెజాన్‌, ఐటీసీ, మైక్రోసాప్ట్‌, గూగుల్‌, యాపిల్‌ వంటి సంస్థలు హైదరాబాదులో కార్యకలపాలు ప్రారంభించాయి. ఈ దిశగా మనరాష్ట్రం సుమారు రూ.35 వేల కోట్లు పెట్టు బడులను ఆకర్శించింది. ఇక్కడి సంక్షేమ, అభివృద్ది పథకాలను వివిధ రాష్ట్రాలలో ఎన్నికల సందర్భంగా అక్కడి నాయకులు వాగ్ధానాలు చేయడమే కాకుండ అభివృద్ధికి సంక్షేమానికి తెలంగాణను ఒక నమూనాగా పేర్కొనడం మనందరికీ గర్వకారణం. శాంతిభద్రతలు చక్కబడి రాష్ట్రంలో నివసిస్తున్న అన్ని ప్రాంతాల ప్రజలు సుఖసంతోషాలతో ఎలాంటి అనుమాలు భయాలు లేకుండా జీవించగలిగే వాతావరణ కల్పనకు ఈ రెండేళ్ళలో ప్రభుత్వం అంకితభావంతో కృషి చేసింది.

రాష్ట్రం వచ్చినంత మాత్రాన సమస్యలన్ని ఒక్కసారిగా తీరిపోవు. 60 ఏళ్ళుగా నిరంతరం శిథిలమవుతు వచ్చిన తెలంగాణను తీర్చిదిద్ది దేశంలోనే గొప్ప రాష్ట్రంగా రూపొందించాలంటే మరింత సమయం కావాలి.గోదావరి, కృష్ణ నదుల్లో మన రాష్ట్రవాట సుమారు 13 వందల టీఎంసిల నీరు వృధాగా సముద్రంలో కలువకుండా మన పంట పొలాలలోకి మళ్ళాలి. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మరింతగా పెరగాలి. అన్ని రంగాలలో తెలంగాణ మునుముందుకు సాగాలి. అమరుల ఆశయాలు ఫలించాలి. అందుకు నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుగారి ప్రభుత్వానికి అందరు అండదండగా నిలవాలి.

Other Updates