gstవస్తువులు సేవల పన్ను (జీఎస్టీ) అమలువల్ల రాష్ట్రాలకు ఏర్పడే నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం భర్తీ చేసే విషయంలో డిసెంబర్‌ 23న ముగిసిన 7వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో స్పష్టత వచ్చిందని రాష్ట్ర ఆర్థికశాఖమంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు.

న్యూఢిల్లీలోని పార్లమెంట్‌ ప్రాంగణంలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ అధ్యక్షతన రెండురోజులపాటు జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ ఏడవ సమావేశం డిసెంబర్‌ 23న ముగి సింది. రాష్ట్ర వాణిజ్యపన్నులశాఖ అధికారు లతో కలిసి ఈ సమావేశంలో పాల్గొన్న అనంతరం మంత్రి ఈటల రాజేందర్‌ తెలంగాణభవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్రాలకిచ్చే పరిహారం విషయంలో స్పష్టత వచ్చిందని తెలిపారు. ఈ పరిహారాన్ని గతంలో వ్యాట్‌ అమలు చేస్తున్నప్పుడు ఇచ్చినట్లు అస్తవ్యస్థ పద్ధతిలో కాకుండా రాష్ట్రాలకు భరోసా కల్పించేవిధంగా ఇవ్వాలని సమావేశంలో పట్టుబట్టినట్లు ఆయన తెలిపారు. ఈ నష్ట పరిహారం ఇచ్చే అంశాన్ని చట్టంలో పొందుపరిచి జీఎస్టీ అమలు జరిగినప్పటినుండి ఖచ్చితంగా ఐదేళ్ల పాటు రెండు నెలలకోసారి రాష్ట్రాలకు చెల్లించేందుకు సమావేశంలో అంగీకారం లభించిందని ఆయన తెలిపారు. జీఎస్టీ వల్ల కలిగే నష్టాన్ని పరిహారం రూపంలో రాష్ట్రాలకు చెల్లించే మొత్తం సరిపోనప్పుడు గ్రాంట్‌ రూపంలో ఇచ్చి, దాన్ని ఎలా తిరిగి చెల్లించాలనే విషయంలో విధి విధానాలపై కూడా ఈ సమావేశంలో చర్చించామని ఆయన తెలిపారు. 2015-16 ఆర్థిక సంవత్సరాన్ని ఆధారం చేసుకొని ఈ ఆర్థిక సంవత్సరంలో వసూలయినటువంటి పన్ను మొత్తంలో 14 శాతం కంటే తక్కువ వృద్ధిరేటు వున్న రాష్ట్రాలకు మాత్రమే ఈ పరిహారాన్ని ఇవ్వాలని, 14 శాతంకంటే ఎక్కువ వృద్ధిరేటు నమోదు చేసిన రాష్ట్రాలకు ఇవ్వకూడదని సమావేశంలో నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.

జీఎస్టీ మీద కేంద్ర, రాష్ట్రాల అధికార పరిధులపై ఇంకా చర్చ జరుగలేదని తెలిపారు. రూ. 1.5 కోట్ల లోపు టర్నోవర్‌ కలిగిన డీలర్లనుండి పన్నులు వసూలు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండాలా లేక రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండాలా అనే అంశంపై పై ఇంకా ఏకాభిప్రాయం రావాల్సి ఉందని ఆయన అన్నారు. 90 శాతం పన్ను వసూలయ్యే 10 శాతం మంది డీలర్లపై కేంద్రం దృష్టి పెట్టాలని, 7 శాతం మాత్రమే పన్ను వసూలయ్యే 90 శాతంమంది డీలర్లను రాష్ట్రాలకే అప్పగించాలని విజ్ఞప్తి చేశామని ఆయన అన్నారు. పెద్దనోట్ల రద్దు ప్రభావంతో దేశ జీడీపీతోసహా రాష్ట్రాలవృద్ధి రేటు తగ్గిన విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించామని ఆయన చెప్పారు. అదే విధంగా జీఎస్డీపీ లెక్క ప్రకారం కొత్త నోట్లలో 5శాతం రాష్ట్ర వాటాకింద రాష్ట్రానికి 30వేల కోట్ల రూపాయల కొత్త నోట్లు రావాల్సి ఉండగా డిసెంబర్‌ 23 నాటికి కేవలం 20వేల 700 కోట్లు మాత్రమే వచ్చాయని, అందుచేత ఇకపై ఇచ్చే నోట్లు చిన్న నోట్లు ఇవ్వాలని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీని కోరామని రాష్ట్ర ఆర్థికశాఖమంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు.

ఈ సమావేశంలో మంత్రి ఈటల రాజేందర్‌తోపాటు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రు తెజావత్‌, వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌, వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌, సంయుక్త కమిషనర్‌ లక్ష్మీ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Other Updates