everestతెలంగాణలో గిరిజన, దళిత, బడుగు, బలహీనవర్గాలకు చెందిన బిడ్డలు మరో ఘనతను సాధించారు. హిమాలయాల్లో ఎతైన శిఖరాల్లో ఒకటైన ‘రెనాక్‌’ శిఖరాన్ని 31 మంది విద్యార్థినీ, విద్యార్థులు అధిరోహించి రాష్ట్ర ఖ్యాతిని దశదిశలా చాటారు. ఒకే రాష్ట్రం నుంచి ఇంత మంది విద్యార్థులు ఒకేసారి ‘రెనాక్‌’ శిఖరాన్ని చేరుకోవడం దేశంలో ఇదే మొదటిసారి. అద్భుత విజయాన్ని సాధించిన వారు డిసెంబరు 13న తిరిగి హైదరాబాద్‌ చేరుకున్నారు. వారికి నగరంలో ఘన స్వాగతం లభించింది. వారి ఖ్యాతిని తెలంగాణ ప్రజలు వేనోళ్ళా పొగిడారు. ఈ సెలక్షన్స్‌లో మన రాష్ట్రం నుండి 218మంది బాలబాలికలు పాల్గొంటే అందులో 31మంది ఎంపిక కాబడ్డారు. ఎంపికైన పిల్లలంతా ఎక్కడా అలసి పోకుండా తమ సూచనలు పాటిస్తూ ఎంతో సాహసంతో కష్టమైనా పర్వతాన్ని అధిరోహించారని ట్రెక్కింగ్‌ ఇన్‌స్ట్రక్టర్‌ ప్రేమ్‌కుమార్‌ అభినందించారు. ఎస్కార్ట్‌ పీఈటీ టీచర్‌గా ఉన్న ఉమ మాట్లాడుతూ విద్యార్థులు అందరూ మానసికంగా, శారీరకంగా బాగా సుశిక్షితులుగా తీర్చిదిద్దబడ్డారన్నారు. దీనితో అసాధ్యాన్ని సుసాధ్యం చేశారన్నారు. ఇది తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణమన్నారు.

పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సాధించవచ్చని గిరిజన, బడుగు, బలహీనవర్గాల బిడ్డలు నిరూపించారు. నాగరిక సమాజానికి దూరంగా ఉన్నా, కేవలం తాము లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదలే వారిని ఉన్నత శిఖరాలు అధిరోహించేలా చేసింది. గిరిజన తండాల్లో, అడవుల్లో, మారుమూల పల్లెల్లో నివసించే బిడ్డలు, ముఖ్యంగా ఆడపిల్లలు అత్యంత క్లిష్టమైన హిమాలయ పర్వతాలను అధిరోహించడం తెలంగాణ విద్యార్థులకు స్పూర్తిదాయకంగా నిలుస్తున్నది.

గిరిజనులు, బడుగు, బలహీనవర్గాలకు చెందిన 31 మంది విద్యార్థినీ, విద్యార్థులు (ఇందులో 16మంది బాలికలే) కఠోర శ్రమకోర్చి పర్వతారోహణంలో శిక్షణ పొందారు. భువనగిరి కోటపైకి ఎక్కే విధంగా దళిత, గిరిజన గురుకులాల కార్యదర్శి ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ వారికి మూడు వారాల శిక్షణ ఇప్పించారు. శిక్షణ అనంతరం వారిని నవంబరు 21న హిమాలయాలకు పంపించారు. అక్కడకు వెళ్ళిన బాల,బాలికలు డిసెంబరు మొదటి వారంలో డార్జిలింగ్‌ చేరుకుని రెనాక్‌ శిఖరాన్ని అధిరోహించడం ప్రారంభించారు. అంతా 15 సంవత్సరాలలోపు పిల్లలు కావడంతో అక్కడి అధికారులు ముందు అనుమతించలేదు. కానీ పూర్ణ, ఆనంద్‌ల విషయాన్ని చెప్పిన తరువాత వారికి శిఖరారోహణకు అనుమతి లభించింది. 31 మంది బృందం పర్వతాలు ఎక్కుతూ ఎక్కుతూ చివరకు డిసెంబరు 7వ తేదీన సముద్రమట్టానికి 17వేల అడుగుల ఎత్తులో ఉన్న రెనాక్‌ శిఖరాన్ని చేరుకున్నారు. అక్కడ తమ గురుకులాల జండాలను, భారత జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.

త్వరలో ఎవరెస్టు అధిరోహణ

ఈ విద్యార్థినీ, విద్యార్థులను త్వరలో ఎవరెస్టు అధిరోహణకు పంపుతామని దళిత, గిరిజన గురుకులాల కార్యదర్శి ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. మొదట రెనాక్‌ శిఖరాన్ని అధిరోహించాకే 2900వేల అడుగుల ఎతైన ఎవరెస్టుకు పంపుతామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అందించే ప్రోత్సాహంతోనే విద్యార్థులు రాణిస్తున్నారని ప్రవీణ్‌కుమార్‌ పేర్కొన్నారు.

51వేల నగదు రివార్డు

రెనాక్‌ శిఖరాన్ని అధిరోహించి రాష్ట్ర ఖ్యాతిని దశదిశలా చాటిన చిచ్చరపిడుగులు 31 మంది బాలబాలికలకు ఒక్కొక్కరికీ రూ. 51వేల చొప్పున నగదు రివార్డును ప్రభుత్వం ప్రకటించింది. హైదరాబాద్‌ వచ్చాక వారు గిరిజన సంక్షేమశాఖా మంత్రి అజ్మీరా చందులాల్‌ను కలిసి తమ అనుభవాలను తెలియపరిచారు. ఈ సందర్భంగా మంత్రి వారిని అభినందించారు.

సీఎం కేసీఆర్‌ అభినందన

ఇంతటి ఘనత సాధించిన విద్యార్థినీ, విద్యార్థులను ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభినందించారు. అతిపిన్న వయసులో దళిత, గిరిజన, బడుగు, బలహీనవర్గాల విద్యార్థినీ, విద్యార్థులు ఆణిముత్యాలని నిరూపించారన్నారు. క్రీడాభివృద్ధికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఆయన పేర్కొన్నారు.

Other Updates