magaప్రతీ రోజు పేపర్లలో అక్రమంగా రవాణా అవుతున్న రేషన్‌ బియ్యం పట్టివేత అనే వార్తలు వస్తున్నాయి. రేషన్‌ బియ్యం పక్కదారి పట్టడంపై రోజూ వస్తున్న వార్తలు, వెలుగు చూస్తున్న అక్రమాలు మనోవేదన కలిగిస్తున్నాయి. ఇంత ఖర్చు చేసినా, ఎంతో శ్రమ చేసినా చెడ్డపేరు వస్తున్నదనే బాధ కలుగుతున్నది. ఈ పరిస్థితి పోవాలి. పేదల కోసం పెడుతున్న ఖర్చు నూటికి నూరు శాతం పేదలకే ఉపయోగపడాలి. ఇందుకోసం ఓ మంచి విధానం అమలు చేయాలి” అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచించారు. రేషన్‌ షాపుల ద్వారా అందే నిత్యావసర సరుకుల పంపిణీలో అవకతవకలు, అక్రమాలు తొలగించడానికి, లబ్ధిదారులకు సంపూర్ణ ప్రయోజనం అందించడానికి అనువైన విధానం అమలు చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అభిప్రాయ పడ్డారు. రేషన్‌ డీలర్లు సమ్మె నోటీసు ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రి ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహిం చారు. మంత్రి సి. లక్ష్మారెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.పి. సింగ్‌, ఎంపి బాల్క సుమన్‌, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌, పౌర సరఫరాల సంస్థ కమీషనర్‌ సివి ఆనంద్‌, సీనియర్‌ అధికారులు నర్సింగ్‌ రావు, రామకష్ణారావు, వాకాటి కరుణ, శాంత కుమారి, స్మితా సభర్వాల్‌, భూపాల్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నేరుగా లద్ధిదారులకు అందించే విధానం

ముఖ్యమంత్రి సూచన మేరకు అధికారులు స్పందించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజా పంపిణీ వ్యవస్థ అమలులో వచ్చిన మార్పులను వివరించారు. ముఖ్యంగా రేషన్‌ షాపుల ద్వారా సరుకులు అందించే బదులు నగదునే నేరుగా లబ్ధిదారులకు అందించే విధానం (Direct Benifit Transfer) అమలులో ఉందని చెప్పారు. చండీఘర్‌, పాండిచ్చేరి, దాద్రా హవేలి లాంటి కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సబ్సిడీతో అందే సరుకులకు బదులుగా నేరుగా లబ్ధిదారుల ఖాతాలోనే దానికి సంబంధించిన డబ్బులను జమచేస్తున్నారని వివరించారు. అదే విధానం అన్ని రాష్ట్రాలూ అమలు చేయాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ కూడా పిలుపునిచ్చారని గుర్తు చేశారు. 2013లో యుపిఎ ప్రభుత్వం తెచ్చిన ఆహార భద్రత చట్టం (ఫుడ్‌ సెక్యూరిటీ యాక్టు – యాక్టు 20/2013) కూడా సబ్సిడీల ద్వారా అందించే లబ్ధిని నగదు రూపంలో నేరుగా లబ్ధిదారులకు అందించాలనే సూచన ఉందని చెప్పారు. సరుకుకు బదులుగా నగదునే లబ్ధిదారు లకు అందించడం వల్ల కలిగే ప్రయోజనాలను కూడా వివరించారు. ప్రస్తుతం ఆహారం కోసం బియ్యం మాత్రమే సరఫరా చేస్తున్నామని, అదీ నిర్ణీత సమయంలో అంది స్తున్నామని చెప్పారు. బియ్యం కాకుండా నగదు అందిస్తే లబ్ధిదారులు వారి ఆహారపు అలవాట్లకు అనుగుణంగా సరుకులు కొనుగోలు చేసుకుంటారని, ఏది కొనాలి? ఎప్పుడు కొనాలి? అనే ఛాన్స్‌ కూడా లబ్ధిదారుడికే ఉంటుందని చెప్పారు. కాబట్టి, రాష్ట్రంలో రేషన్‌ షాపుల ద్వారా అందించే బియ్యం, ఇతర నిత్యావసర సరుకులకు బదులుగా అంతే మొత్తం నగదును నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసే విధానం అమలు చేసే అంశాన్ని పరిశీలించాలని వారు సీఎంకు సూచించారు. దీనికి స్పందించిన ముఖ్యమంత్రి రేషన్‌ షాపుల ద్వారా బియ్యం అందించడం ఉత్తమమా? నగదును లబ్ధిదారులకు నేరుగా అందించడం ఉత్తమమా అనే విషయంపై ఆలోచించాలని కోరారు.దానికి సంబంధించిన నగదును నేరుగా లబ్ధిదారులకే అందించే ఏర్పాట్లు చేయాలని అధికారులు భావిస్తున్నారు.

Other Updates