తెలంగాణ రాష్ట్రంలో పాడిపరిశ్రమను పరిరక్షించి, పాడిరైతులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. రాష్ట్రంలోని ప్రైవేటు డైరీల గుత్తాధిపత్యం వల్ల ఈరోజు దేశంలోనే అత్యధికంగా మన రాష్ట్రంలో ప్రైవేటు కంపెనీల పాల ధర లీటరుకు రూ.46గాఉంది. ప్రభుత్వ రంగ సంస్థ విజయ డైరీ మాత్రం ప్రస్తుతం లీటరు పాలను కేవలం రూ.38కే వినియోగదారులకు విక్రయిస్తోంది. తెలంగాణలో ప్రైవేటు పాల వ్యాపారుల గుత్తాధిపత్యాన్ని నిరోధించడానికి నడుం బిగించిన ప్రభుత్వం పాల సేకరణ ధర పెంచడం కోసం కర్ణాటక రాష్ట్రంలో మాదిరిగా పాడి రైతుకు లీటరుకు అదనంగారూ.4రూపాయలు ప్రోత్సాహకంగా ఇవ్వటానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రూ.4 ప్రోత్సాహక ధరను నవంబరు 1వ తేదీ నుండి రాష్ట్రంలో అమలు చేయడం కోసం, దీనికి సంబంధించి జీవో నెం.6ను కూడా విడుదల చేసింది ప్రభుత్వం.
సీఎంకు డెయిరీ అసోసియేషన్ కృతజ్ఞతలు
పాల సేకరణ ధరను రూ.4కు పెంచడంపై తెలంగాణ డెయిరీ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. సీఎం కేసీఆర్‌కు తెలంగాణ డెయిరీ అధికారుల అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పెంపు నిర్ణయంపై కృతజ్ఞతలు తెలిపారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రోత్సాహక ధరను ప్రారంభించిన మంత్రి పోచారం
రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ విజయ డైరీ పాల ఉత్పత్తి దారులకు ప్రోత్సాహకంగా ధరలో రూ.4 పెంపును వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి గారు నవంబరు 1న మహబూబ్‌నగర్ జిల్లా తలకొండపల్లి మండలంలోని చల్లంపల్లి గ్రామపంచాయతీ టాక్‌రాజుగూడలో ప్రారంభించారు. పాల దిగుబడిని పెంచి పాడి రైతును ఆదుకోవడమే తమ లక్ష్యమని మంత్రి అన్నారు… గతంలో ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో ఏ పథకమైనా మహబూబ్‌నగర్ జిల్లా నుంచి ప్రారంభిస్తామని అందుకే గ్రామ జనాభా కంటే ఆవులు ఎక్కువగా ఉన్న టాక్‌రాజుగూడను పాల ధర పెంపు అమలు కోసం ఎంపిక చేశామని మంత్రి అన్నారు. పాల ధర పెంపునకు సంబంధించి రూ.12 వేల చెక్కును తండా రైతులు మంత్రి చేతుల మీదుగా అందుకున్నారు. తండాలో పాడి అభివృద్ధికి ఆవులను కొనేందుకు 15 మంది మహిళలకు మంజూరైన రూ.12 లక్షల చెక్కును కూడా మంత్రి అందజేశారు.
రైతుకు ప్రోత్సాహకంతో ఉత్తేజంలో విజయడైరీ:
తెలంగాణ ప్రభుత్వం రైతులకు ప్రోత్సాహకంగా లీటరుకు రూ.4 పెంచడంతో విజయ డెయిరీ పాల సేకరణ గణనీయంగా పెరిగింది. ప్రోత్సాహక ధర అమలుతో మొదటి వారంలోనే ఏకంగా 40 వేల లీటర్ల అదనపు సేకరణ జరుగుతోందని విజయ డైరీ అధికారి ఒకరు తెలిపారు. ఈ లెక్కన నెలకు లక్ష లీటర్లకు పైగా పాలను గతంలో కంటే అదనంగా సేకరించడానికి అవకాశం ఏర్పడిరది. రానున్న రోజుల్లో మరో 3 లక్షల లీటర్ల సేకరణ లక్ష్యంగా ప్రణాళికను రూపొందించినట్లు ఆ అధికారి తెలిపారు. ప్రైవేట్ డెయిరీలు మార్కెట్‌ను శాసిస్తోన్న తరుణంలో ఈ పరిణామం విజయ డెయిరీకి లాభం కలిగించే అంశం. ఇప్పటి వరకు విజయడైరీ రైతులకు లీటరు పాలకు రూ.53 చెల్లించగా ప్రభుత్వ ప్రోత్సాహకంతో ఇది రూ.57కు చేరుకుంది.
అభివృద్ధి దిశగా:
తెలంగాణ రాష్ట్రంలో విజయడెయిరీని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. మిల్క్ గ్రిడ్‌లను ఏర్పాటు చేసి పాల ఉత్పత్తిని పెంచనుంది. ఇందులో భాగంగా మెదక్ జిల్లా గజ్వేల్‌లో రూ.30 కోట్లతో మిల్క్ గ్రిడ్ ఏర్పాటు చేస్తుండగా, సిద్దిపేట, దుబ్బాక నియోజవర్గాల్లోని ఏడు మండలాల్లో రూ.60 కోట్లతో మరో గ్రిడ్ ఏర్పాటు చేయనున్నట్లు ఇటీవల సిద్ధిపేటలో నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు తెలిపారు. ఇందుకోసం మూడేళ్లలో పదివేల పాడిపశువులను రైతులకు రాయితీపై అందిస్తామని తెలిపారు. మరోవైపు ప్రస్తుతం హైదరాబాద్‌లోని లాలాపేట్‌లో 2 లక్షల లీటర్ల సామర్థ్యంతో నడుస్తోన్న విజయ డైరీకి అదనంగా దాదాపు రూ.40 కోట్లతో శంషాబాద్‌లో 30 ఎకరాల్లో 5 నుంచి 10 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన మరో డెయిరీని అత్యాధునిక పరిజ్ఞానంతో ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. దీనికి కావల్సిన భూమిని కూడా అధికారులు సేకరించారు.
బంగారు తెలంగాణలో భాగంగా పాడిరైతుల జీవితాల్లో వెలుగులు నింపడంతో పాటు పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం రైతులకు రూ.4 ప్రోత్సాహకపు ధర అమలు కోసం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఒక ముందడుగుగా భావిద్దాం.