farmersమహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (ఎంజీకేఎల్‌ఐ) నిర్మాణం పూర్తవడంతో పదకొండేండ్ల రైతుల నిరీక్షణకు తెరపడింది. 3.6 లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు గత ప్రభుత్వాలు చేపట్టిన భారీ లిఫ్టుల్లో ఇదొకటి. 2005లో పనులను ప్రారంభించగా, 2014 వరకు పూర్తి చేయలేదు. స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం కేవలం రెండేండ్లలో భారీగా నిధులు కేటాయించింది. పాలమూరు జిల్లా పచ్చబడాలనే సంకల్పంతో పెండింగ్‌ ప్రాజెక్టుల పూర్తికోసం నడుంబిగించింది. పనులు వేగవంతం చేసేందుకు భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు తరచూ ప్రాజెక్టును సందర్శించి సమీక్షలు నిర్వహించడంతోపాటు ప్రాజెక్టు నిద్రచేశారు.

ఈ ఖరీఫ్‌లో నిర్ణీత ఆయకట్టుకు నీరిచ్చేందుకు సిద్ధమయ్యారు. నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు జొన్నలబొగుడ లిఫ్ట్‌ -2, గుడిపల్లి లిఫ్ట్‌-3ని సెప్టెంబర్‌ 8న ప్రారంభించారు. నాలుగు రోజులు ఇంజినీరింగ్‌ అధికారులు లిఫ్ట్‌-3 వద్ద ట్రయల్స్‌ చేశారు. ఈ లిఫ్ట్‌ ద్వారా 2.7 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఎంజీకేఎల్‌ఐ మూడుస్థాయిల్లో ఎత్తిపోతల పూర్తి కావడంతో ఇన్నాళ్లుగా సాగునీటికి తల్లడిల్లిన పాలమూరు రైతన్నల కల సాకారం కానున్నది. మూడు లిఫ్టుల్లో భాగమైన లిఫ్ట్‌-1 (ఎల్లూరు) 2012లో అందుబాటులోకి వచ్చి 13వేల ఎకరాలకు నీరందిస్తున్నది. ప్రస్తుతం ఈ లిఫ్ట్‌ నుంచి జొన్నలబొగుడ (లిఫ్ట్‌-2)కు నీటిని గ్రావిటీ ద్వారా తరలిస్తారు. లిఫ్ట్‌-1లోని శ్రీవారిసముద్రం (సింగోటం) నుంచి నీటిని తీసుకునే విధంగా రూపొందించిన లిఫ్ట్‌-2 (జొన్నలబొగుడ)కు సంబంధించిన పనులు పూర్తికావడంతో గత నెల 29న ట్రయల్స్‌ను పూర్తి చేసి, లిఫ్ట్‌-3కి నీటిని పంపింగ్‌ చేస్తున్నారు.

శ్రీశైలం బ్యాక్వాటర్‌ నుంచి రేగుమాన్గడ్డ వద్ద 820 మీటర్ల లెవెల్లో అప్రోచ్‌ కెనాల్‌ ద్వారా లిఫ్ట్‌-1 సర్జిపూల్లోకి నీరు చేరుతుంది. పంపుహౌస్లోకి చేరిన నీటిని ఐదు 30 మెగావాట్ల మోటార్ల ద్వారా 95 మీటర్ల ఎత్తున ఉన్న కాల్వలోకి ఎత్తిపోస్తారు. ఈ నీరు ఎల్లూరు జలాశయంలోకి, అక్కడి నుంచి శ్రీ వారిసమువూదానికి చేరుతుంది. ఈ లిఫ్ట్‌ కింద

13 వేల ఎకరాలకు సాగునీరందుతున్నది. ఎల్లూరు జలాశయం నుంచి కొల్లాపూర్‌ సెగ్మెంట్‌ మిషన్‌ భగీరథకు తాగునీటిని తీసుకునేందుకు ప్రస్తుతం జలాశయం ఒడ్డున ఫిల్టర్‌ బెడ్‌ పనులు కొనసాగుతున్నాయి. ఎల్లూరు రూ.495.20 కోట్లతో చేపట్టగా, ఈ లిఫ్టు 2012 సెప్టెంబర్‌ 16న అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు. శ్రీవారిసముద్రం నుంచి అండర్‌ టన్నెల్‌ ద్వారా లిఫ్ట్‌-2కు నీటిని తీసుకుంటారు.

జొన్నలబొగుడ లిఫ్ట్‌-2 :

రూ.649.90 కోట్లతో చేపట్టిన జొన్నలబొగుడ లిఫ్ట్‌-2కు 2012 డిసెంబర్‌ 5న నాటి మంత్రి పొన్నాల లక్ష్మయ్య శంకుస్థాపన చేశారు. 46 వేల ఎకరాలకు నీరందించే ఈ లిఫ్ట్‌ ట్రయల్స్‌ ఆగస్టు 29న పూర్తి కావడంతో జలాశయంలో నీటిని నిల్వ చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో లిఫ్ట్‌ పనుల్లో అనేక అవాంతరాలు ఎదురవగా, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రత్యేకంగా ద ష్టి సారించి ముందుగా ఒక పంపు నుంచి సాగునీరివ్వాలని నిర్ణయించి అందుబాటులోకి తెచ్చారు. జొన్నలబొగుడ నుంచి గుడిపల్లి వెళ్లే 120 కిలోమీటర్ల పొడవున్న బ్రాంచ్‌ కెనాల్‌కు మూడుకిలోమీటర్ల దూరంలోని పస్పుల వద్ద కాల్వ మార్గం మార్చుకుని పస్పుల, బావాయిపల్లి, కోడేరు, జనుంపల్లి, నాగులపల్లి, ముత్తిడ్డిపల్లి, కదిపాడు మీదుగా పాన్‌గల్‌ మండలంలో 35వేల ఎకరాలకు సాగునీరు చేరుతుంది. జొన్నలబొగుడ స్లూయిస్‌ గేట్ల నుంచి 15 కిలోమీటర్ల పొడవు గల మరో కాల్వ పెద్దకొత్తపల్లి మండలం జొన్నలబొగుడ, సాసాపూర్‌, కొత్తపేట, చెన్నాపూరావుపల్లి, కల్వకోలు, తిర్ణాయపల్లి మీదుగా 12వేల ఎకరాలకు నీరందిస్తుంది.ఈ ఎత్తిపోతల పథకం ప్రారంభం సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగసభలో పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ, మన ముఖ్యమంత్రి పట్టుదల మూలంగానే జిల్లాలోని పెండింగ్‌ ప్రాజకక్టులు పూర్తవుతున్నాయని పేర్కొన్నారు. వచ్చే ఖరీఫ్‌ నాటికి పాలమూరు జిల్లాలోని నాలుగు ప్రాజక్టుల క్రింద ఆరు లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందేవిధంగా కార్యాచరణను రూపొందించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ పాటికే ఈ ప్రాజెక్టుకోసం వెయ్యి కోట్లు ఖర్చు చేశామని, యింకా మూడువేల కోట్లు ఖర్చుచేసి వాటిని సంపూర్ణంగా సాగులోకి తీసుకొస్తామని తెలిపారు.

పెండింగ్‌ ప్రాజెక్టులను మేము పూర్తి చేస్తూ వెళుతుంటే ప్రతిపక్షాలకు గుండెదడ పట్టుకుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ముఖ్యమంత్రి పట్టుదల ముందు ప్రతిపక్షాలు ఎన్నివేశాలు వేసినా అవి తుడిచిపెట్టుకుపోతాయని పేర్కొన్నారు.

ఆ తర్వాత పంచాయతీరాజ్‌శాఖమంత్రి జూపల్లి కృష్ణారావు ప్రసంగిస్తూ.. గత పాలకులు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారే తప్ప పనులు చేయలేదని తెలిపారు. దీనికి భిన్నంగా సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు రెండేండ్లలో ఈ పనులను పూర్తిచేశారన్నారు. గత పాలకుల పాలనలో ముగ్గురు మంత్రులు ఈ ప్రాజెక్టులను రెండుసార్లు మాత్రమే సందర్శిస్తే, మన మంత్రి హరీశ్‌రావు రెండేండ్లలో పదిసార్లు ఇక్కడికి వచ్చారని పేర్కొన్నారు. ఈ లిఫ్టులవల్ల కొల్లాపూర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, కల్వకుర్తి, అచ్చంపేట ప్రాంతాలు సస్యశ్యామలమవుతాయని పేర్కొన్నారు.

మహబూబ్‌నగర్‌ ఎంపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు సాగునీరు ఇస్తామని చెప్పిన మాటలను మన ముఖ్యమంత్రి ఈరోజు సాకారం చేసి చూపించారన్నారు. ఈ సభలో రాష్ట్ర ప్రణాళికా సంఘం అధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ బండారి భాస్కర్‌, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు మర్రి జనార్ధన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, ఆళ్ల వెంకటేశ్వరరెడ్డి, గువ్వల బాలరాజు, కలెక్టర్‌ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

Other Updates