tsmagazine

రైతుల అవసరాలు తీర్చడమే రైతు సమన్వయ సమితుల ప్రధాన విధులని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. కరీంనగర్‌లోని అంబేద్కర్‌ స్టేడియంలో జరిగిన రైతుసమన్వయ సమితుల ప్రాంతీయ అవగా హన సదస్సులో ముఖ్యమంత్రి కీలక ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, వ్యక్తిగా ఏమీ సాధించలేమని, సమష్టిగా ఉంటేనే కఠిన ప్రయత్నాలు కూడా సులభతరమవుతాయని అన్నారు. ‘బంగారు తెలంగాణ’ సాధనకు పాడీపంటా సమృద్ధిగా ఉండాలని, కూడూ,గుడ్డ, పాడి పంటలతో అందరు సుభిక్షంగా ఉండడమే బంగారు తెలంగాణకు తొలిమెట్టు అని కేసీఆర్‌ అన్నారు. రైతులు అప్పులు చేయకుండా ఉండాలని, నకిలీ విత్తనాల బారిన పడకుండా ఉండాలని, వరిపంటలకు కనీస మద్దతు ధర కల్పించే విధంగా అసంఘటిత రైతాంగాన్ని సంఘటిత పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతు సమన్వయ సమితుల ప్రక్రియకు శ్రీకారం చుట్టిందని అన్నారు. రైతాంగాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరచడానికి నియంత్రిత పద్దతిలో పని చేయాల్సిన అవసరముందని అన్నారు. మన దేశంలో, రాష్ట్రంలో సుసంపన్నమైన బంగారు నేలలు ఉన్నాయని, ఎర్ర, నల్ల, ఇసుకనేల, తేలికపాటి చౌడు భూములతో పాటు, అనేక జీవ నదులు ప్రవహిస్తున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. దేశంలో 40 కోట్ల ఎకరాల భూమి సాగవుతోందని, రాష్ట్రంలో కోటి 62 లక్షల ఎకరాలు సాగులో ఉందన్నారు. సాగుకు అనుకూలమైన నేలలు లేనప్పటికీ ఆహార రంగంలో చైనా స్వావలంబన సాధించిందని, విదేశీమారకాన్ని సాధిస్తోందని ముఖ్యమంత్రి అన్నారు.

సమైక్య రాష్ట్రంలో సాగునీటి రంగంలో రాష్ట్రం ఎంతో నష్టపోయిందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో జలవనరులను అభివృద్ధి పరిచే క్రమంలో చిన్న, మధ్యతరహా, భారీ నీటి ప్రాజెక్టులను చేపట్టామని ముఖ్యమంత్రి తెలిపారు. నిజాం కాలంలో నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులను, జలాశయాలను జలకళలతో సంతరించుకునే విధంగా మిషన్‌ కాకతీయ ద్వారా బృహత్తర పథకాన్ని చేపట్టామన్నారు. ఈ పథకం ద్వారా చెరువులలో పూడిక తీసిన మట్టిని రైతులు స్వయంగా తమ పొలాలకు తరలిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలలో భాగంగా కాళేశ్వరం, సీతారామా, దేవాదుల, నెట్టెంపాడు ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగు తున్నాయని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కరీంనగర్‌ జిల్లాతో పాటు వరంగల్‌ జిల్లాలో 95శాతం 365 రోజులు రెండు పంటలకు సాగునీటి సౌకర్యం కలుగుతుందని సీఎం తెలిపారు. కాళేశ్వరం ద్వారా ఈ సంవత్సరమే మిడ్‌మానేరు నీళ్ళు రావాలని, మిడ్‌మానేరు, లోయర్‌మానేరు క్రింద 90 కిలోమీటర్ల వరకు చెక్‌డ్యాంలను మంజూరీ చేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. దక్షిణ తెలంగాణలో 35వేల కోట్లతో చేపడుతున్న పాలమూరు ఎత్తిపోతల పథకం పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు.
tsmagazine
వ్యవసాయానికి ఉపాధి హామీ..
జాతీయ ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయరంగానికి అనుసంధానం చేయాలని, ఉత్తర తెలంగాణ 17 జిల్లాల ప్రాంతీయ సమావేశంలో ముఖ్యమంత్రి చేసిన తీర్మాణాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. దీనికోసం పలుమార్లు ప్రధానమంత్రితో పాటు సంబంధిత కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందని సీఎం తెలిపారు.

రైతురాజు కావడం ఖాయమని, భవిష్యత్తులో దేశంలో ధనిక రైతులు తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నారనే స్థితి రాబోతుందని దీనికిగాను రైతు సమన్వయ సమితులతో పాటు అధికారులు చిత్తశుద్ధితో తమ బాధ్యతలను నిర్వర్తించాలన్నారు. అన్నిరంగాలకు యూనియన్‌లు ఉన్నాయని, కేవలం అన్నదాతలకు మాత్రమే ఎటువంటి సంఘం లేదని, రైతు సంఘటిత శక్తిని ప్రజలకు తెలియచేయాలని, దీనికై రైతు సమన్వయ సమితులు ఎల్లప్పుడు ప్రజలకు అండగా ఉంటూ వారివిషయంలో కీలకపాత్ర పోషించాలన్నారు. ప్రధానంగా కల్తీ విత్తనాలతో రైతులను మోసం చేస్తున్న విక్రయదారులపై ఉక్కు పాదం మోపాలని సమితులను సీఎం ఆదేశించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రభుత్వం రైతులకు 12వేల కోట్లతో రెండు పంటలకు ఎకరానికి 8వేలు అందించనున్నామని, దీనికి గాను ఇప్పటికే భూ రికార్డుల ప్రక్షాళన ద్వారా రెవిన్యూ యంత్రాంగం వివరాలను సేకరించిందన్నారు. కోటి 62లక్షల ఎకరాల భూ రికార్డులను చూడగా వీటిలో కోటి 40లక్షల ఎకరాల పట్టాభూమి, 22 లక్షల ఎకరాల అసైన్డ్‌ భూములుగా నిర్దారించడం జరిగిందన్నారు. అసైన్డ్‌ రైతులకు కూడా పెట్టుబడులు అందిస్తామన్నారు. రైతుల పంటలను నిలువ చేసుకునేందుకు గత ప్రభుత్వంలో కేవలం 4లక్షల టన్నుల సామర్ధ్యం కలిగిన గిడ్డంగులు మాత్రమే ఉండగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 23లక్షల టన్నుల సామర్ధ్యం కలిగిన గిడ్డంగులను నిర్మించుకున్నామని ఆయన తెలిపారు. త్వరలోనే నియోజకవర్గ కేంద్రంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యునిట్‌లను, శీతల గిడ్డంగు లను కూడా ఏర్పాటు చేసుకోబోతున్నామని ఆయన తెలిపారు. రైతులు తమ ఉత్పత్తులను ఒకేసారి మార్కెట్‌కు తర లించడం ద్వారా ఇబ్బందులకు గురవుతు న్నారని, విడ తల వారీగా నియంత్రిత విధానాన్ని అవలం భించే విధంగా రైతు సమన్వయ సమితులు బాధ్యత తీసుకోవాలని ఆయన సూచించారు.

వచ్చే సంవత్సరం నుంచి రాష్ట్రంలో పంట కాలనీలను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. రాష్ట్ర ఆహార అవసరాలకు అనుగుణంగా మనమే ఉత్పత్తి చేసుకునే విధంగా శాస్త్ర వేత్తల నిర్ణయం ప్రకారం వ్యవసాయ వాతావరణ పరిస్థితుల ఆధారంగా, నేల స్వభావం ఆధారంగా పంటకాలనీల ద్వారా సాగుచేసుకునేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.

రైతాంగాన్ని సంఘటిత పరిచే దిశలో రైతులు నియంత్రిత పద్దతిని అలవాటు చేసుకోవాలని, పత్తి, వరి, మొక్కజొన్న పంటలు మన ప్రధాన పంటలని, వీటితో పాటు 12 లక్షల ఎకరాలలో పండ్ల తోటల సాగు జరుగుతుందని అన్నారు. ఈ యాసంగి నుండి ప్రతి పంటకు కనీస మద్దతు ధర కల్పిస్తామన్నారు. దీనితో పాటు పెట్టుబడుల కోసం పదివేల కోట్ల రూపాయలు సమకూర్చుకోవడానికి రాష్ట్ర సమన్వయ సమితికి ప్రభుత్వం పూచీకత్తు ఇస్తుందని సీఎం తెలిపారు. అయిదువేల ఎకరాలకు ఒకరు చొప్పున వ్యవసాయ విస్తరణాధికారులను నియమించామని, ఒక్కొక్క ఏఈఓ పరిధిలో 11 వందల మంది రైతులు ఉంటారని తెలిపారు. రైతు వేదికల నిర్మాణాలకు బడ్జెట్‌లో సుమారు 3 నుండి 4వందల కోట్లను కేటాయించ బోతున్నామని సీఎం తెలిపారు. రైతు వేదికల నిర్మాణాలకు ప్రభుత్వ భూములతో పాటు ఎవరైనా దాతలు భూములను ఇవ్వడానికి ముందుకు వస్తే అట్టి భూములను సేకరించాలని, అవసరమైతే భూ సేకరణకు జిల్లా కలెక్టర్లు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

రిజిస్ట్రేషన్‌ విధానంలో కూడా మార్పులు చేయబోతున్నామని, భవిష్యత్తులో రిజిస్ట్రేషన్‌ అధికారాన్ని తహసిల్‌దార్‌లకు కల్పిస్తున్నట్లు తెలిపారు. దీనితో పాటు మ్యూటేషన్‌ అధికారాన్ని కూడా తహసిల్‌దార్‌లకే కల్పిస్తున్నామని తెలిపారు. కేవలం గంట వ్యవధిలో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయి, ధరణి వెబిసైట్‌లో ఉండే విధంగా విప్లవాత్మకమైన ప్రక్రియను చేపడుతు న్నామన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాలలో శరవేగంగా ముం దుకు తీసుకువెళ్ళేందుకు ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు అహర్నిశలు అంకిత భావంతో, అత్యంత వేగంతో పనిచేస్తున్నారని ఈ సందర్భంగా సీఎం అభినందించారు.

రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ రైతు సమన్వయ సమితుల ఏర్పాటు ద్వారా దేశంలో రైతు భవిష్యత్తును మార్చబోతున్నామన్నారు. దేశంలోనే రైతులు ఆత్మగౌరవంతో జీవించడానికి గౌరవ ముఖ్యమంత్రి విశేషంగా కృషి చేస్తున్నారని ప్రశంసించారు. పలువురు మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

రైతు కార్పొరేషన్‌
‘తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి’ పేరిట రాష్ట్రంలో కొత్త కార్పొరేషన్‌ ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు నిర్ణయించారు. వ్యవసాయాభివృద్ధి – రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను క్షేత్రస్థాయికి తీసుకుపోవడంలో ఈ కార్పొరేషన్‌ కృషి చేస్తుందని ప్రకటించారు. లాభాపేక్ష లేని సంస్థ (నాన్‌ ప్రాఫిట్‌ ఆర్గనైజేషన్‌)లాగా ఈ కార్పొరేషన్‌ పనిచేస్తుందని, ఈ సంస్థకు సమకూరిన నిధులను ఈ సంస్థ ఏర్పాటు చేసిన లక్ష్యాల సాధన కోసమే వినియోగిస్తారని స్పష్టం చేశారు. గ్రామ, మండల రైతు సమన్వయ సమితుల మాదిరిగానే త్వరలోనే జిల్లా, రాష్ట్ర స్థాయి రైతు సమన్వయ సమితులు ఏర్పాటవుతాయని వెల్లడించారు. ఈ మేరకు కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.విత్తనం వేసిన దగ్గర నుంచి పంటకు మద్దతు ధర వచ్చే వరకు ప్రతీ దశలోనూ రైతు సమన్వయ సమితులు చురుకైన పాత్ర పోషించేలా వారికి విధులు, బాధ్యతలుంటాయని సీఎం స్పష్టం చేశారు. రైతు సమన్వయ సమితుల్లో కనీసం 51 శాతం మంది బలహీన వర్గాలు, మహిళలు ఉండేలా నిర్మాణం జరుగుతుందని చెప్పారు. రైతులు పరస్పరం తమ అభిప్రాయాలు పంచుకోవడం కోసం, నిరంతర అవగాహన సదస్సులు నిర్వహించడం కోసం ప్రతీ ఐదు వేల ఎకరాలకు ఒకటి చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 2,630 రైతు వేదికలు నిర్మించనున్నట్లు సీఎం తెలిపారు. ఈ రైతు వేదికలను వీలైనంత త్వరగా నిర్మించాలని అధికారులను ఆదేశించారు. రైతు వేదికల నిర్వహణ బాధ్యతలను మండల రైతు సమన్వయ సమితులు తీసుకోవాలని కోరారు. రైతు వేదికల నిర్మాణం కోసం అవసరమైన స్థలాలను ఎంపిక చేయాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. ప్రభుత్వ భూముల నుంచి గానీ, దాతల నుంచి గానీ, కొనుగోలు ద్వారా గానీ రైతు వేదికల కోసం స్థలం సేకరించాలని చెప్పారు.

రైతులకు రూ.5 లక్షలబీమా
రైతులుకు 5 లక్షల రూపాయల బీమాను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రకటించారు. కరీంనగర్లో జరిగిన రైతు సమన్వయ సమితుల ప్రాంతీయ అవగాహనా సదస్సు సందర్భంగా ముఖ్యమంత్రి ఈ విప్లవాత్మక ప్రకటన చేశారు. రాష్ట్రంలో 70 లక్షలకు పైగా ఉన్న రైతాంగానికి ఈ బీమా వర్తింపచేస్తామని, దీనికి సంబంధించిన మొత్తం ప్రీమియాన్ని కూడా ప్రభుత్వమే భరిస్తుందని కె.సి.ఆర్‌ ప్రకటించారు. ”కరీంనగర్‌ గడ్డ పైనుంచి నేను ఏది ప్రకటించినా సఫలీకతమైంది. ఇదే గడ్డపై నుంచి ఈ సంతోషకరమైన వార్త తెలంగాణ రైతులోకానికి చెపుతున్నా. రైతులు అనారోగ్యానికి గురైనా, అకాలమరణం చెందినా 5 లక్షల రూపాయల వ్యక్తిగత బీమా వర్తించే విధంగా రైతు బీమాపథకాన్ని ప్రకటిస్తున్నా”అని ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌ ప్రకటిండగానే సభాప్రాంగణమంతా చప్పట్లతో మార్మోగిపోయింది.

Other Updates