నీతి ఆయోగ్ సమావేశంలో కే.సి.ఆర్
వ్యవసాయ రంగంలో సంక్షోభాన్ని నిర్మూలించడానికి, రాష్ట్రంలో ఆ రంగాన్ని పునరుద్ధరించడానికి తెలంగాణ ప్రభుత్వం పలుచర్యలు చేపట్టిందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పేర్కొన్నారు. వ్యవసాయ రంగంతోపాటు సాంప్రదాయంగా వస్తున్న గొర్రెల పెంపకం, మత్స్య పరిశ్రమ వంటి కార్యకలాపాలను ప్రోత్సహించడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టపరిచే చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు.
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో ఏప్రిల్ 23న ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశంలో రైతుల ఆదాయాన్ని రెట్టింపుచేసే విషయమై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రసంగిస్తూ, పలు సూచనలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 17,000 కోట్ల రూపాయల రైతుల రుణ బకాయిలను నాలుగు దఫాలుగా రద్దు చేయడం జరిగిందని, దీనివల్ల 36 లక్షల మంది రైతాంగానికి ప్రయోజనం చేకూరిందని తెలిపారు. దీనికి తోడు ఖరీఫ్, రబీ వ్యవసాయ సీజన్‌లలో విత్తనాలు, ఎరువులు, తదితర పెట్టుబడుల కోసం ఎకరాకు 4,000 రూపాయల ఆర్థిక సహాయం అందించాలని ఇటీవల నిర్ణయించామని, దీనివల్ల 55 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. నిరాశా, నిస్పృహలలో వున్న రైతులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేసే ఇటువంటి కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం మద్దతునివ్వాలని ముఖ్యమంత్రి కోరారు.
అన్నదాతల ఆదాయం రెట్టింపు చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం ఇప్పటికిప్పుడు సాధ్యం కాకపోయినా, సంస్కరణలు చేపట్టి, సకాలంలో వారిని ఆదుకుంటే భవిష్యత్తులో అది సాధ్యమేనని కె.సి.ఆర్ స్పష్టంచేశారు.
ఐదేళ్ళలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు.
దేశంలో ఏ ప్రాంతంలో ఏ పంట దిగుబడికి వాతావరణం, భౌగోళిక పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయో గమనించి , దానికి అనుగుణంగా క్రాప్ కాలనీలు ఏర్పాటు చేయాలి. ఏ పంట ఎక్కడ పండించాలో నిర్ణయించుకోవాలి. దీనివల్ల అవసరానికి మించి ఒకే పంటను ఉత్పత్తి చేయడాన్ని నివారించవచ్చు. ఫలితంగా రైతులకు కనీస మద్దతు ధరకు ఢోకా వుండదు. ఉత్పత్తిపై మాత్రమే కాకుండా, ఉత్పాదకత ను పెంచడంపై కూడా నిరంతరం పరిశోధనలు జరగాలి. వివిధ రాష్ట్రాలలోని సంస్థలు జరుపుతున్న పరిశోధనలకు కేంద్ర ప్రభుత్వం మద్దతునివ్వాలి.
పెండింగ్‌లో ఉన్న, ప్రస్తుతం కొనసాగుతున్న సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ సత్వరం పూర్తిచేయడానికి అవసరమైన మద్దతును రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం అందించాలి. రైతులకు సరసమైన ధరలకు తగినంత, నాణ్యమైన విద్యుత్‌ను సరఫరాచేయాలి. ప్రస్తుతం అమలుచేస్తున్న పంటల బీమా విధానంలో నిర్వహణాపరమైన సమస్యలున్నాయి. అందువల్ల ఆ విధానం రైతులకు లాభసాటిగా వుండేవిధంగా తీర్చిదిద్దాలి.
ప్రస్తుతం జరుగుతున్న విదేశాల నుంచి ఆహార ధాన్యాలు, నూనె గింజలు, నూనె ఉత్పత్తులు, జౌళి ఉత్పత్తుల దిగుమతిపై లోతైన సమీక్ష జరగాలి. దేశ అవసరాలకు అనుగుణంగా ఆయా పంటలు ఇక్కడే ఉత్పత్తి అయ్యేవిధంగా చూడాలి. ఫలితంగా మార్కెట్‌లో ధరల హెచ్చుతగ్గుల ప్రభావానికి లోనయ్యే పరిస్థితిని పూర్తిగా నివారించవచ్చు.
రైతుల ఆదాయాన్ని పెంచాలంటే వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను ప్రోత్సహించాలి. వాటి ఉత్పత్తులకు తగిన అదనపు విలువను చేర్చాలి. వ్యవసాయ రంగానికి ఎంతగానో సహకరించి, రైతులకు వెన్నుదన్నుగా వుండే గొర్రెల పెంపకం, మత్స్యపరిశ్రమ, కోళ్ళపెంపకం, పాడిపరిశ్రమ మొదలైనవాటిని వ్యవసాయ అనుబంధ రంగంగా పరిగణించాలి. ఆదాయ పన్ను నుంచి వాటిని మినహాయించాలి.
వ్యవసాయ రంగంలో కూలీల కొరత తీవ్రంగా వుంది. దీనివల్ల రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. దీనిని నివారించడం కోసం గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయరంగానికి కూడా విస్తరింప చేయాలి. నైపుణ్యం లేని కూలీకి ఉపాధిహామీ పథకం నుంచి 50 శాతం చెల్లిస్తే, మిగిలిన 50 శాతాన్ని వారిని పనికిపెట్టుకున్న రైతులు భరించేలా నిబంధనలు తీసుకు రావాలి. దీనివల్ల కూలీల కొరతను తీర్చడంతోపాటు ఉపాధి హామీ పథకంపై ఆధారపడిన లబ్ధిదారులకూ ప్రయోజనం కలుగుతుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సూచించారు.