raithuరైతు సేవలో రాష్ట్ర ప్రభుత్వం.. కె.సి.ఆర్‌ ప్రకటన

రైతులకు పెట్టుబడి భారంగా ఉంది. ఆ భారాన్ని కూడా పంచుకోవాలని నిర్ణయించాం. అందుకే ఈ రోజు చారిత్రక నిర్ణయం ప్రకటిస్తున్నాను. రాష్ట్రంలో 55 లక్షల మంది రైతులున్నారు. దాదాపు 25 లక్షల టన్నుల ఎరువులను వాడుతున్నారు. వారందరికి ఎకరానికి 4 వేల రూపాయల చొప్పున ఎరువుల కొనుగోలుకు ప్రభుత్వ సహాయంగా అందిస్తాం. వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి ప్రతీ ఏడాది మే చివరినాటికి రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తాం.

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం లాభసాటిగా మార్చేందుకు, రైతుల కడగండ్లకు చరమగీతం పాడేందుకు కంకణం కట్టుకున్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు రాష్ట్ర రైతాంగానికి మరో వరం ప్రకటించారు. రైతులు ఎరువు కోసం అరువు తెచ్చుకోవాల్సిన అవసరం ఇకపై లేదు. రాష్ట్రంలో రైతాంగానికి ఎకరానికి నాలుగు వేల రూపాయల చొప్పున ఎరువుల కొనుగోలుకు ప్రభుత్వమే ఆర్థిక సహాయం అందిస్తుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చారిత్రాత్మక నిర్ణయాన్ని ప్రకటించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి ప్రతీ ఏడాది ఖరీఫ్‌ కు ముందే మే నెల చివరి నాటికి నేరుగా రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు జమ చేయనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.

గత హామీకి అనుగుణంగా రాష్ట్రంలో 36 లక్షలమంది రైతాంగానికి రూ. 17,000 కోట్ల రుణమాఫీ అమలుచేసిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కింది. ఈ ఏటి రాష్ట్ర బడ్జెట్‌ లో రూ. 4,000 కోట్లు కేటాయించి, చివరిదఫా రైతురుణమాఫీ కిస్తీని కూడా ప్రభుత్వం విడుదలచేసిన నేపధ్యంలో వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున రైతులు ఏప్రిల్‌ 13న ప్రగతి భవన్‌ కు తరలివచ్చి ముఖ్యమంత్రి కేసిఆర్‌ కు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రైతులనుద్దేశించి మాట్లాడుతూ, ”మనమంతా కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఉద్యమ సమయంలో మనల్ని ఎన్నో రకాలుగా అపహాస్యం చేశారు. అవమానాల పాలు చేశారు. అయినా మనం వెరవకుండా పోరాడి తెలంగాణ సాధించుకున్నాం. నవ్విన నాప చేను పండింది అన్న చందంగా ఇప్పుడు తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగు వచ్చింది. రైతుల పరిస్థితి అత్యంత దీనంగా వుండేది. మా ఇంట రేపు లడ్డూల భోజనం అనే విధంగా రైతుల పరిస్థితి వుండేది. కానీ ఆ రేపు ఎప్పటికీ వచ్చేది కాదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత రైతుల పరిస్థితుల్లో మార్పు రావాలని దృఢంగా నిర్ణయించాం. అందుకే కోటి ఎకరాలకు సాగునీరు అందించాలని నిర్ణయించాం.

మిషన్‌ కాకతీయ ద్వారా చెరువులు బాగు చేసుకుంటున్నాం. వ్యవసాయానికి 9 గంటల విద్యుత్‌ ఇచ్చుకుంటున్నాం. నిండు ఎండాకాలంలో కూడా నాణ్యమైన కరెంట్‌ అందిస్తున్నాం. నిజాం సాగర్‌ ను మేడిగడ్డ ద్వారానే నింపడానికి ప్రణాళికలు వేశాం. చెరువులు నింపుతున్నాం. ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేస్తాం. నూటికి నూరు శాతం కోటి ఎకరాలకు నీరందించి తీరుతాం” అని ముఖ్యమంత్రి కేసిఆర్‌ శపథం చేశారు.

”దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 36 లక్షల మంది రైతులకు చెందిన 17 వేల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేసుకున్నాం. ఇప్పుడు రైతులందరూ రుణ విముక్తులయ్యారు. నాకు ఎంతో సంతోషంగా వుంది. మనం ఉద్యమ సమయంలోనే చెప్పుకున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంది. సంపద పెరుగుతున్నది. ఇదంతా రైతులకు దక్కాలి. రైతులకు సేవ చేసే అవకాశం నాకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నా. వ్యవసాయాన్ని నమ్ముకుని బతుకుతున్న రైతులకు సాధ్యమైనంత ఎక్కువ ప్రయోజనం చేయాలనేదే నా ఆలోచన.

రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్‌ అందించడంతో పాటు ఎరువులు, విత్తనాలు సకాలంలో అందిస్తున్నాం. మైక్రో ఇరిగేషన్‌కు ఎక్కువ సబ్సిడీలు ఇచ్చి ప్రొత్సహిస్తున్నాం. రుణ మాఫీ కూడా చేసుకున్నాం. రైతులకు పెట్టుబడి భారంగా ఉంది. ఆ భారాన్ని కూడా పంచుకోవాలని నిర్ణయించాం. అందుకే ఈ రోజు చారిత్రక నిర్ణయం ప్రకటిస్తున్నాను. రాష్ట్రంలో 55 లక్షల మంది రైతులున్నారు. దాదాపు 25 లక్షల టన్నుల ఎరువులను వాడుతున్నారు. వారందరికి ఎకరానికి 4 వేల రూపాయల చొప్పున ఒక్కో పంటకు ఎరువుల కొనుగోలుకు ప్రభుత్వ సహాయంగా అందిస్తాం. వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి ప్రతీ ఏడాది మే చివరినాటికి రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తాం. నూటికి నూరు శాతం ఈ కార్యక్రమం పారదర్శకంగా జరగాలి. ఇందుకోసం గ్రామాల్లో రైతులు సంఘాలుగా ఏర్పాడాలి. ఈ రైతు సంఘాలు గ్రామ స్థాయిలో వ్యవసాయం, రైతులకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను పర్యవేక్షించాలి ” అని ముఖ్యమంత్రి అన్నారు.

వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభోపన్యాసం చేసిన ఈ సభలో ఎంపి కవిత, మిషన్‌ భగీరథ వైస్‌ ఛైర్మన్‌ వేముల ప్రశాంత్‌ రెడ్డి, ప్రభుత్వ విప్‌లు గంప గోవర్ధన్‌, పల్లా రాజేశ్వరరెడ్డి, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్‌, ఏనుగు రవీందర్‌ రెడ్డి, జీవన్‌ రెడ్డి, షకీల్‌ తదితరులు పాల్గొన్నారు.

రైతు సంక్షేమానికి ప్రభుత్వం అమలుచేస్తున్న మరికొన్ని పథకాలు

ప్రతిగ్రామంలో రైతుసంఘాల ఏర్పాటు. ప్రతి ఏడాది వానాకాలం, యాసంగి పంటకు సబ్సిడీపై విత్తనాల సరఫరా . సీడ్‌ బౌల్‌ ఆఫ్‌ తెలంగాణ లో భాగంగా విత్తనోత్పత్తి కోసం సీడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు.

సకాలంలో రుణాలు చెల్లించే రైతులకు లక్ష రూపాయల వరకూ వడ్డీలేని రుణం. ఆపైన రుణాలకు పావలావడ్డీ వర్తింపు. సబ్సిడీపై ట్రాక్టర్లు, యంత్ర పరికరాల పంపిణీ. ఎస్‌.సి, ఎస్‌.టి లకు నూరుశాతం సబ్సిడీ వర్తింపు.

ప్రతి వ్యవసాయ విస్తరణాధికారి పరిధిలో మినీ భూసార ప్రయోగశాల ఏర్పాటు. ప్రతి రైతు భూమిలో ఉచితంగా భూసార పరీక్షలు జరిపి భూసారఫలితాల కార్డుల పంపిణీ. 1311 మంది వ్యవసాయ విస్తరణాధికారుల నియామకం. సాంకేతిక పరిజ్ఞానం పెంచడానికి 120 మంది మండల వ్యవసాయాధికారుల నియామకం.

రైతాంగానికి పంటబీమా రాయితీ. రూ.1024 కోట్లతో 330 గిడ్డంగుల నిర్మాణం. వీటి సామర్ధ్యం 17.50 లక్షల టన్నులు

ఏడాదికి రూ. 25,000 కోట్లతో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం. రూ. 4,800 కోట్లతో 24 లక్షల వ్యవసాయ మోటార్లకు ఉచిత విద్యుత్‌ . మిషన్‌ కాకతీయ పథకంతో 46,000 చెరువుల పునరుద్ధరణ. పూడికమట్టితో భూములు సారవంతం.

కేంద్రం ప్రకటించిన మద్దతు ధరకు రైతుల ఉత్పత్తుల కొనుగోలు, మధ్యదళారుల నుంచి రైతులకు రక్షణ, సూక్ష్మ, బిందు, తుంపర సేద్యం ద్వారా రైతులకు తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి వచ్చే విధంగా రూపకల్పన. ఈ పథకం క్రింద ఎస్‌.సి, ఎస్‌.టి లకు 100 శాతం సబ్సిడీ, బి.సి లు, ఇతర సన్నకారు రైతులకు 90 శాతం సబ్సిడీ, మిగిలిన వారికి 80 శాతం సబ్సిడీ. మైక్రో ఇరిగేషన్‌ పరిమితి 2.5 ఎకరాలనుంచి 12.5 ఎకరాలకు పెంపు. ఈ ఏడాది రూ. 1300 కోట్లతో మైక్రో ఇరిగేషన్‌ అమలు.ఈ పథకానికి నాబార్డు రూ. 1,000 కోట్ల ఆర్థిక సహాయం.

పాలీహౌస్‌లకు దేశంలో 75 శాతం సబ్సిడీ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. రైతుకు ఎకరం నుంచి 3 ఎకరాలకు పెంపు. ఎస్‌.సి, ఎస్‌.టి లకు 100 శాతం సబ్సిడీ. శాశ్వత కూరగాయల పందిళ్ళకు 50 శాతం సబ్సిడీ.ఎకరాకు లక్ష రూపాయల వరకూ రాయితీ. హరితహారంలో భాగంగా రైతులకు ఉచితంగా పండ్ల మొక్కల పంపిణీ. నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ మండలంలో 40 ఎకరాలలో రూ. 31 కోట్లతో స్పైస్‌ పార్కు ఏర్పాటు.

సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడానికి కొత్తగా 75 మంది ఉద్యానవన శాఖ అధికారుల నియామకం

సుపరిపాలనలో భాగంగా జీడిమెట్లలో రూ. 12 కోట్లతో 10 ఎకరాల విస్తీర్ణంలో కూరగాయలు, పూలకు, ములుగులో రూ. 12 కోట్లతో పండ్లతోటలకు సెంట్రల్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీల ఏర్పాటు

రైతులకు గిట్టుబాటుధర, వినియోగదారులకు నాణ్యమైన ఆహారోత్పత్తుల కోసం రాష్ట్రంలో 54 క్రాప్‌ కాలనీల ఏర్పాటుకు సన్నాహాలు.

తెలంగాణ హార్టికల్చర్‌ డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు. ఈ కార్పొరేషన్‌ ద్వారా వ్యవసాయ ఉత్పత్తులకు మరింత విలువ జోడించడానికి వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటు. ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో పామాయిల్‌ ఫ్యాక్టరీ సామర్థ్యం 15 నుంచి 30 టన్నులకు పెంపు. అప్పారావుపేటలో 60 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంతో నూతన కర్మాగారం ఏర్పాటు. ఈ కర్మాగారాల ఏర్పాటుతో రైతుల పామాయిల్‌ ఉత్పత్తులకు అధిక ధరలతో లాభాలు.రైతుల ఆదాయం పెంచడానికి రాష్ట్రంలో నందిపేట, జడ్చర్ల, సత్తుపల్లిలో ఫుడ్‌ పార్కులు ఏర్పాటు. మల్బరీసాగు రైతులకు ప్రోత్సాహకంగా పట్టు గూళ్ళకు కేజీకి రూ. 75 అదనంగా రాయితీ.

జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో రెండు వ్యవసాయ కళాశాలలు,ఒక ఫుడ్‌ అండ్‌ టెక్నాలజీ, 4 పాలిటెక్నిక్‌ అగ్రీ కాలేజీల ఏర్పాటు.

Other Updates