magaముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు గ్లోబల్‌ అగ్రికల్చర్‌ లీడర్‌ షిప్‌ 2017 అవార్డు రావడం తెలంగాణ రాష్ట్రానికి లభించిన గౌరవమని రాష్ట్ర వ్యవసాయశాఖామంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. ఐ.సి.ఎఫ్‌.ఏ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన పదవ గ్లోబల్‌ అగ్రికల్చర్‌ లీడర్‌ షిప్‌ సదస్సు -2017 లో ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌ తరఫున వ్యవసాయశాఖామంత్రి శ్రీనివాస రెడ్డి, టి.ఆర్‌.ఎస్‌ లోక్‌ సభాపక్ష నేత జితేందర్‌ రెడ్డి ఈ అవార్డును స్వీకరించారు.ఈ కార్యక్రమానికి హాజరైన హర్యానా గవర్నర్‌ కె.ఎస్‌. సోలంకి చేతులమీదుగా ఈ అవార్డును ప్రదానంచేశారు. ముఖ్యమంత్రి తరఫున ఈ అవార్డు అందుకోవడం తన అదృష్టమని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.

తెలంగాణలో వివిధ పథకాల ద్వారా గ్రామీణ ప్రజలు, వ్యవసాయ దారుల జీవితాలలో మార్పు తెచ్చేందుకు విశేష కృషి చేస్తున్నందుకు ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్‌. స్వామినాథన్‌ నాయకత్వం లోని కమిటీ ఈ అవార్డుకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును ఎంపికచేసింది.

ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్‌, నీతి ఆయోగ్‌ సభ్యుడు (వ్యవసాయం) డాక్టర్‌ రమేష్‌ చంద్‌, ఇక్ఫా ఛైర్మన్‌ ఎం.జె. ఖాన్‌, ప్రపంచ ఆహార సంస్థ ఐ.ఓ.హెచ్‌.ఏ అధ్యక్షుడు డాక్టర్‌ కిన్నెథ్‌ క్విన్‌, తదితరులు ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్ఫా ఛైర్మన్‌ ఎం.జె. ఖాన్‌ ప్రసంగిస్తూ, తెలంగాణ ప్రభుత్వం రైతులకోసం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలుచేసిందని ప్రశంసించారు. భవిష్యత్తు పట్ల మంచి అవగాహన, దూరదృష్టి కలిగిన నాయకుని ద్వారా అభివృద్ధి ఫలాలను రైతులు అందుకుంటున్నారని అన్నారు.

రైతును రాజుగా చూడాలన్నదే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సంకల్పమని, ఇందులో భాగంగానే దేశంలో ఎక్కడా లేనివిధంగా తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపీటవేస్తూ, వచ్చే సంవత్సరం నుంచి వ్యవసాయ బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి ఈ సందర్భంగా చెప్పారు. రైతులకు బాసటగా నిలిచేందుకు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలే ఈరోజు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును గ్లోబల్‌ అగ్రికల్చరల్‌ లీడర్‌ షిప్‌ 2017 అవార్డు గ్రహీతగా నిలిపిందన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో 36 లక్షల మంది రైతులకు సుమారు 17 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన ఘనత ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌ కే దక్కిందని, ఇప్పుడు రైతు సమన్వయ సమితుల ఏర్పాటు, భూ రికార్డుల ప్రక్షాళన వంటి కార్యక్రమాలపై దృష్టి సారించామని తెలిపారు.

అవార్డు ప్రదాన కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్‌ జగన్‌ మోహన్‌, తదితరులు పాల్గొన్నారు.

Other Updates