తెలంగాణ రాష్ట్రంలోని రైతాంగంలో ఎక్కువమంది సన్న, చిన్నకారు రైతులే ఉన్నారు. వ్యవసాయమే వీరికి పూర్తి జీవనాధారం. ఏ కారణంవల్లనైనా ఆ రైతు మరణిస్తే ఆ రైతు కుటుంబాలు అనాథలవుతున్నాయి. చివరికి రోజువారీ కూటికి కూడా ఇల్లు గడవని పరిస్థితి. ఇటువంటి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకొనేందుకే రాష్ట్రప్రభుత్వం రైతుబంధు జీవితబీమా పథకాన్ని ప్రవేశపెట్టింది.
ఇటీవల భూ రికార్డులు ప్రక్షాళన చేసి, ప్రభుత్వం అందించిన పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్న రైతులలో 2018 ఆగస్టు 15 నాటికి 18 నుంచి 59 సంవత్సరాల వయస్సుగల రైతులంతా ఈ పథకంలో చేరేందుకు అర్హులే. ఈ బీమా పథకంలో చేరిన రైతు ఏ కారణంగా మరణించినా ఆ రైతు కుటుంబానికి పరిహారంగా 5 లక్షల రూపాయలు చెల్లిస్తారు. ఈ పథకాన్ని మిగిలిన అన్ని బీమా కంపెనీలకంటే మెరుగైన సేవలు అందిస్తున్న, దేశంలోనూ, ప్రపంచంలోనూ ఎంతో పేరుప్రఖ్యాతులు ఆర్జించిన భారత జీవితబీమా సంస్థ (ఎల్.ఐ.సి) ద్వారా అమలుచేస్తున్నారు. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వం, భారత జీవిత బీమా సంస్థ మధ్య, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు సమక్షంలో అవగాహనా ఒప్పందం కూడా చేసుకోవడం జరిగింది. ప్రభుత్వ రంగంలోని ఈ సంస్థ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం హామీ కూడా ఉంటుంది.
రైతుబంధు బీమా పథకంలో రైతులు చెల్లించవలసిన ప్రీమియం మొత్తాన్ని రాష్ట్రప్రభుత్వమే భరిస్తుంది. ఒక్కో రైతుకు ప్రీమియం కింద సంవత్సరానికి 1925 రూపాయ లు, దీనిపై 18 శాతం జి.ఎస్.టి కలిపి మొత్తం 2271.50 రూపాయల మొత్తాన్ని రాష్ట్రప్రభుత్వమే భరిస్తుంది.
రైతులు దరఖాస్తులో నామినీ పేరును పేర్కొంటే చాలు. బీమా స్కీములో చేరిన ఏ రైతైనా అనంతరం ఏ కారణం వల్లనైనా భూమిని కోల్పోయిన పక్షంలో మరుసటి సంవత్సరం బీమాపథకం రెన్యువల్ తేదీవరకూ బీమా వర్తిస్తుంది. ప్రతి ఏడాది ఆగస్టు 1వ తేదీన, లేదా అంతకు ముందుగానే రాష్ట్రప్రభుత్వం ఎల్.ఐ.సి కి ప్రీమియం మొత్తాన్ని చెల్లిస్తుంది. ఈ పథకం అమలుకు రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే 500 కోట్ల రూపాయల నిధులను విడుదలచేసింది.
ఈ బీమా పథకం అమలు కోసం రాష్ట్రప్రభుత్వం తరఫున రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు.ఈ పథకాన్ని భారత జీవితబీమా సంస్థ నిర్వహిస్తుంది. మొత్తం ఎంతమంది రైతులు ఈ పథకంలో చేరింది, వారి వివరాలను ప్రతినెలా ఎలక్ట్రానిక్ విధానంలో ఎల్.ఐ.సికి తెలియజేయడం జరుగుతుంది. వ్యవసాయ శాఖ విస్తరణాధికారులు ప్రతి రైతునుంచి నామినేషన్ ఫారాలు సేకరించే పనిని ఇప్పటికే ప్రారంభించారు. ఒకే రైతు ఒకటికంటే ఎక్కువ పట్టాదార్ పాస్ పుస్తకాలు కలిగి వున్నా, ఆధార్ కార్డు గుర్తింపు ద్వారా బీమా పథకంలో ఒక్క సభ్యునిగా మాత్రమే చేర్చుకుంటారు. జీనిత బీమా సంస్థ సభ్యులుగా చేరినవారి దరఖాస్తులు, వివరాలను పరిశీలించిన అనంతరం ప్రతి సభ్యునికి ఎల్.ఐ.సి తరఫున ఒక గుర్తింపు కార్డుతోపాటు, మాస్టర్ పాలసీ నెంబరును కూడా కేటాయిస్తారు. ఈ వివరాలన్నీ ప్రభుత్వం దగ్గర కూడా ఉంటాయి. ఈ కార్యక్రమాలన్నింటినీ వ్యవసాయ శాఖ కమీషనర్ పర్యవేక్షిస్తారు.
బీమా పొందేందుకు అర్హతలు
2018- 19 సంవత్సరానికి బీమా పొందేందుకుగాను ప్రభుత్వం జారీచేసిన పట్టాదార్ పాస్ పుస్తకం కలిగివుండి, 2018 ఆగస్టు 15 నాటికి 18 నుంచి 59 సంవత్సరాల వయసుగల రైతులు అర్హులు.అంటే, 1959 ఆగస్టు 14 నుంచి 2000 ఆగస్టు 15 వ తేదీ మధ్య పుట్టినవారై ఉండాలి. రైతు పుట్టిన తేదీని ఆధార్ కార్డులో పేర్కొన్న తేదీ ఆధారంగా నిర్థారిస్తారు. ఆధార్ కార్డులో సంవత్సరం మాత్రమే పేర్కొని ఉంటే, ఆ ఏడాదిలో జులై ఒకటవ తేదీని పుట్టిన రోజుగా పేర్కొంటారు. ఒక రైతు వివిధ గ్రామాలలో భూములు కలిగి వుండి, ఒకటికంటే ఎక్కువ పట్టాదార్ పాస్ పుస్తకాలు కలిగి వుంటే, ఆ రైతు ఎంపికచేసుకున్న గ్రామంలో మాత్రమే బీమా సౌకర్యం కల్పిస్తారు. ఒకే రైతు పేరు పునరావృతం కాకుండా ఆధార్ నంబరును ప్రమాణంగా తీసుకుంటారు. ఎవరైనా ఒక వ్యక్తి కొత్తగా భూమిని కొనుగోలుచేసి, పట్టాదార్ పాస్ పుస్తకం పొందినట్లయితే, అతనికి కూడా బీమా సౌకర్యం కల్పిస్తారు. అయితే, అతను అంతకుముందే ఆ పథకంలో సభ్యునిగా ఉండి ఉండకూడదు. ఈ పథకం ప్రారంభించిన అనంతరం 18 సంవత్సరాల వయసుకు చేరుకొనే వారికి వచ్చే ఏడాది నుంచి సభ్యత్వం కల్పిస్తారు.
వ్యవసాయ శాఖ విస్తరణాధికారులు స్వయంగా రైతు ఇంటికి వెళ్ళి దరఖాస్తులను పూర్తిచేసి, నామినేషన్ ఫారాలను కూడా రైతు సంతకంతో సహా సేకరిస్తారు. నామినీ మైనర్ అయిన పక్షంలో గార్డియన్ వివరాలు తెలపవలసి వుంటుంది. రైతులు ఆధార్ కార్డు కలిగి వుంటే, వారి పేరు, ఇతర వివరాలు ఖచ్చితంగా నమోదు అవు తాయి. అందువల్ల ఆధార్ కార్డు లేని రైతులు దానికోసం దరఖాస్తుచేసుకోవాలి. వ్యవసాయ విస్తరణాధికారులు సేకరించిన దరఖాస్తులను మండల వ్యవసాయ శాఖ అధికారి క్షుణ్ణంగా పరిశీలిస్తారు.ప్రతి గ్రామంలో బీమా పథకంలో చేరిన రైతుల జాబితా మొత్తాన్ని వ్యవసాయ విస్తరణాధికారులు సమర్పిస్తారు. దీన్ని క్రిందిస్థాయి అధికారులు జిల్లా వ్యవసాయ శాఖ అధికారికి పంపుతారు. జిల్లాల వారీగా తయారైన జాబితాలను బీమా కంపెనీకి అందజేస్తారు.
సర్పంచ్ లు, రైతు సమన్వయ సమితి సమన్వయకర్తలు ఈ పథకం గురించి గ్రామాలలో విస్పృతంగా ప్రచారం చేయడం ద్వారా అర్హతగల రైతులంతా జీవితబీమా సౌకర్యం పొందేలా కృషి చేస్తున్నారు.
ముందుగా 2018 ఆగస్టు 15 నుంచి 2019 ఆగస్టు 14వ తేదీ వరకూ ఈ రైతుజీవిత బీమా పథకం వర్తిస్తుంది. అటుతర్వాత ప్రతి ఏడాది దీనిని ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి పునరుద్ధరిస్తుంటారు. బీమా పొందిన రైతు ఏ కారణం వల్లనైనా మరణించిన పక్షంలో, బీమాకంపెనీకి లాంఛనంగా అందించవలసిన పత్రాలను అందించిన వెంటనే, ఆ రైతు పేర్కొన్న నామినీ ఖాతాకు పరిహారం మొత్తం 5 లక్షల రూపాయలు జమచేస్తారు.ఈ విషయంలో కూడా ఆ రైతు కుటుంబానికి వ్యవసాయ విస్తరణాధికారి సహాయపడతారు. దీనివల్ల కేవలం 10 రోజుల్లోనే రైతు కుటుంబానికి పరిహారం లభిస్తుంది. బీమా చేసిన వ్యక్తి మరణిస్తే, ఆరు నెలల లోగా పరిహారం కోరవలసి వుం టుంది. అంతకుమించి జాప్యం జరిగితే తగిన కారణాలు చూపడం, ప్రభుత్వం సిఫారసుచేయడం అవసరమవుతుంది.