రైతు సంక్షేమమే లక్ష్యం కావాలిరైతుల సంక్షేమానికి ఉపయోగపడేలా జాతీయ విత్తన కాంగ్రెస్‌ ప్రధాన ఎజెండాగా చర్చ జరగాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో హైదరాబాద్‌లోని హెచ్‌ఐసిసిలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న ‘8వ జాతీయ విత్తన కాంగ్రెస్‌’ను మంత్రి అక్టోబర్‌ 27న జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, జాతీయ విత్తన కాంగ్రెస్‌ రైతు సంక్షేమానికి ఉపయోగపడేలా సాగాలని కోరారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో 8వ జాతీయ విత్తన కాంగ్రెస్‌ సదస్సు నిర్వహణకు అవకాశం కల్పించిన కేంద్రప్రభుత్వానికి మంత్రి ముందుగా కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం సదస్సుకు హాజరైన వారినుద్దేశించి మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి తెలంగాణను ‘సీడ్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియా’గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు నాయకత్వంలో అనేక చర్యలు తీసుకొంటున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 400 విత్తన కంపెనీలున్నా యని, గంటకు 670 మెట్రిక్‌ టన్నుల విత్తనాలను ప్రాసెస్‌ చేసే సామర్థ్యాన్ని ఇవి కలిగి వున్నాయని, దేశానికి అవసరమైన విత్తనాలలో 60 శాతం తెలంగాణ రాష్ట్రం నుండే సరఫరా అవుతున్నట్లు వెల్లడించారు. అంతేగాక తెలంగాణ రాష్ట్రం నుండి 14 దేశాలకు విత్తనాలు ఎగుమతి అవుతున్నా యని మంత్రి అన్నారు. 29 లక్షల హెక్టార్లలో 2 లక్షల మంది రైతులు విత్తనాలను ఉత్పత్తి చేస్తునట్లు మంత్రి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలనే విత్తన గ్రామం కార్యక్రమాన్ని ప్రారంభించిందని, 2015 ఖరీఫ్‌కు1458 గ్రామాలను ఎంపిక చేసి 36,415 మంది రైతులను భాగస్వాములను చేసి 14,500 హెక్టార్లలో 3.30 లక్షల క్వింటాల విత్తనాన్నిఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు చెప్పారు.

తెలంగాణ రాష్ట్రాన్ని ‘సీడ్‌ బౌల్‌ ఇండియా’గా తీర్చిదిద్దడంలో భాగంగా ముఖ్య మంత్రి కె చంద్రశేఖరరావు ఇటీవల విత్తన కంపెనీల ప్రతినిధులు, శాస్త్రవేత్తలతో సమావేశం నిర్వహించారని, విత్తన కంపెనీలు ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకోవాలని కోరడం జరిగిందని, ఇది త్వరలో కార్యరూపం దాల్చుతుందని మంత్రి అన్నారు. ఈ సదస్సు విత్తన ఉత్పత్తి పెరగడానికి ఉపయోగపడాలని, రైతులకు లాభసాటిగా కావాలని ఆయన ఆకాంక్షించారు. కొత్త వంగడాలకు రూపకల్పన జరగాలని, గత 7 సదస్సుల్లో జరిగిన నిర్ణయాలపై సమీక్ష జరగాలని, పరిశోధన ఫలాలు గిరిజన, చిన్న, సన్నకారు రైతులకు ఉపయోగపడాలని అన్నారు. 8వ జాతీయ విత్తన సదస్సును రాష్ట్రంలోని రైతులతోపాటు దేశంలోని రైతులందరు గమనిస్తున్నారని, రైతులు ఉంటేనే విత్తన కంపెనీలకు మనుగడ వుంటుందని అన్నారు.

రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధికి, విత్తన పరిశ్రమకు ఉపయోగం కలిగేలా వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని బలోపేతం చేస్తామని, విత్తనాల ఉత్పత్తికి కూడా బీమా సౌకర్యం వర్తింపచేసే విషయమై సానుకూలంగా పరిశీలిస్తామని, విత్తనాలకు సంబంధించి వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పిజి కోర్స్‌ ప్రవేశపెడతామని అన్నారు. విత్తనరంగం విత్తనాల ఉత్పత్తికే పరిమితం కాకుండా రైతు అవసరాలు తీర్చేలా వుండాలని మంత్రి పోచారం అన్నారు.

రెండో హరిత విప్లవం రావాలి

రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సి.పార్థసారథి సదస్సుకు హాజరైన వారికి స్వాగతం పలుకుతూ, స్వయంగా రైతు అయిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిల సహకారంతో రైతుల సంక్షేమం కోసం రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని, ఇది ఎంతో సంతోషకరమని అన్నారు.

పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా ఉత్పాదకతను పెంచడానికి విత్తనం ముఖ్యపాత్ర పోషిస్తుందని, నాణ్యమైన విత్తనాల వల్లే 15 నుండి 20 శాతం ఉత్పత్తి పెరుగుతుందని అన్నారు. విత్తనాల ఉత్పత్తిలో రాష్ట్రం దేశంలో 15 శాతం, ప్రపంచంలో 3 శాతంగా ఉందని పేర్కొన్నారు. రెండవ హరిత విప్లవానికి సమయం ఆసన్నమైందని పార్థసారథి అభిప్రాయపడ్డారు.

రైతులందరికీ మేలైన, నాణ్యమైన విత్తనాలు చేరవేయడంలో ఉండే సవాళ్లను ఎదుర్కొనే విషయమై సదస్సులో చర్చ జరగాలన్నారు. వాతావరణ మార్పులు, చిన్న కమతాలు తదితర అంశాలపై కూడా చర్చ జరగా లన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగ స్వామ్యంపై కూడా అర్ధవంతమైన చర్చ జరగాలని కోరారు దేశ అవసరాలకు సరిపడే విత్తనాలు ఉత్పత్తి చేయడమే కాకుండా ఆసియా, ఆఫ్రికా దేశాలకు కూడా ఎగుమతి చేసేలా ముందడుగు వేయాలని కోరారు. విత్తన ఉత్పత్తి పెంపు, నూతన సాంకేతిక పరిజ్ఞానం, ప్రత్యామ్నాయ పంటల ఎంపిక, సవాళ్లు, అనుకూలతపై చర్చ జరగాలన్నారు.

ఈ సదస్సులో కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ కార్యదర్శి ఎ.కె.శ్రీవాత్సవ, కావేరీ సీడ్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ భాస్కర్‌ రావు, నూజివీడు సీడ్స్‌ సీఎండి ఎం. ప్రభాకర్‌ రావులు ప్రసంగించారు.

కాగా, మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ‘తెలంగాణ సీడ్‌ బౌల్‌ఆఫ్‌ ఇండియా’ బ్రోచర్‌ను, సదస్సులో చర్చించే అంశాలపై రూపొందించి, సమర్పించిన పత్రాలనువిడుదల చేశారు. మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సుకు సుమారు 600 మంది సీడ్‌ కంపెనీల ప్రతినిధులు, శాస్త్రవేత్తలు, నిపుణులు, విద్యార్థులు తదితరులు హాజరయ్యారు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ డాక్టర్‌. కెంట్‌, కేంద్రప్రభుత్వ క్వాలిటీకంట్రోల్‌ డిప్యూటీ కమిషనర్‌ ఆర్‌.కె.త్రివేది, ఆచార్య పద్మారాజు, జయశంకర్‌ విశ్వవిద్యాలయం స్పెషల్‌ ఆఫీసర్‌ ప్రవీణ్‌ రావు, సీడ్‌సర్టిఫికేషన్‌ డైరెక్టర్‌ విజయ్‌ కుమార్‌, ఎన్‌.ఎ.ఎ.ఆర్‌.ఎండీ ఉషారాణి, ఉద్యానశాఖ కమిషనర్‌ వెంకట్రామిరెడ్డి, 8వ జాతీయ విత్తన సదస్సు నోడల్‌ అధికారి కె. కేశవులు తదితరులు హాజరయ్యారు.

Other Updates