ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిధిలో గంగాధర – పూడూరు రైల్వే స్టేషన్ల మధ్య తల ఎత్తిన రైల్వే క్రాసింగ్ సమస్యను అధికారులు సమర్థవంతంగా 24 గంటలలో పరిష్కరించి చరిత్ర సష్టించారు. దీంతో గంగాధర, కొడిమ్యాల చెరువుల నుంచి రైతుల ఆయకట్టుకు నీరందించడానికి అవరోధం తొలగిపోయింది.
ఈ రెండు చెరువులు కరీంనగర్ – నిజామాబాద్ రైల్వే లైను మధ్యలో వున్నాయి. రైల్వేట్రాక్‌ను సుమారు 50 మీటర్ల మేర తొలగిస్తే తప్ప ఈ రెండు చెరువుల నుంచి సాగునీటి సరఫరాకు పైపులైన్లు నిర్మించలేరు. ఈ నేపథó్యంలో, జూన్ 15న రైల్వేశాఖ, కరీంనగర్ జిల్లా నీటిపారుదల శాఖల అధికారులు సమన్వయంతో 50 మీటర్లమేర రైల్వేట్రాక్ ను తొలగించి, ఆరు ఫిష్ ప్లేట్లను తొలగించి, పైపులు బిగించి, రైళ్ళ రాకపోకలకు ఆటంకం కలగనిరీతిలో త్వరితగతిన పనులు పూర్తిచేశారు. తవ్వకాల సమయంలో బండరాళ్ళు అడ్డురావటంతో వాటిని బ్లాస్టింగ్ జరిపి తొలగించారు.
ఈ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించిన నీటిపారుదల శాఖా మంత్రి హరీష్ రావు విజయం సాధించిన అధికారులను అభినందించారు.