magaఇంటింటికీ ఇంటర్నెట్‌. సాకారంకాబోతున్న కల. మనుషులమధ్యన కనెక్టివిటి అత్యంత కీలకంగా మారిన కాలమిది. ఆ కనెక్టివిటీకి ఇంటర్నెట్‌ వీలు కల్పిస్తోంది. దీన్ని గరిష్టంగా ఉపయో గించుకుంటున్న సమాజాలు అభివృద్ధి పథంలో కొనసాగుతున్నాయి. మొన్న అమెరికా, నిన్న చైనా, నేడు ఇండియా. అందులో అంతర్భాగమే తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటికీ ఇంటర్నెట్‌ అన్న ఆలోచన. ప్రపంచంతో కలిసి నడిచిన ప్పు డే, జ్ఞానం విప్పారుతుంది. జ్ఞానంతో సంపద పెరుగుతుంది. సంపద సర్వ సౌఖ్యాలకు తలుపులు తెరుస్తుంది. మనిషి అవసరాలను పూర్తి చేస్తుంది. నేటి అవసరం ఇదే.

రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ ఆధు నిక ఆలోచనలను ఆచరణలో పెడుతు న్నారు. అందరికీ సంపద సృష్టిలోభాగం కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంటిం టికీ ఇంటర్నెట్‌ అన్న ఆలోచన ఆయన ‘బ్రెయిన్‌ చైల్డ్‌’. అది క్రమంగా సాకార మవుతోంది.

ఒకప్పుడు ప్రాథమిక అవసరాలైన రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల గురించి ఆలోచించేవారు. 21వ శతాబ్దంలో, పాలనసైతం డిజిటల్‌ మయ మవుతున్న సందర్భంలో తదనుగుణమైన ఆలోచనలు చేయాల్సిన ఆవశ్యకత పెరిగింది.ఈ అవసరాన్ని ముందుగా పసిగట్టిన మంత్రి కేటీఆర్‌ అటువైపుగా దృష్టిసారించి నూతన దిశానిర్దేశం చేయడంతో, తెలంగాణ రాష్ట్రంలో డిజిటల్‌ అవగాహన పెరుగుతోంది. తాజా సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేసే విధంగా విధాన నిర్ణయం తీసుకుంటున్నారు. ఆ వాతావరణం రాజధాని హైదరాబాద్‌లో స్పష్టంగా కనిపిస్తోంది.

కేవలం మెట్రోసిటీ హైదరాబాద్‌ నివాసులకే సకల సౌకర్యాలు, అవకాశాలు అందించాలన్న ఆలోచనతో ఐటీ మంత్రిత్వశాఖలేదు. గత మూడు సంవత్సరాలనుంచి స్పష్టమైన దృక్పథంతో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలు, పల్లెలు సైతం ఏకకాలంలో ముందడుగు వేయాలన్న ముందుచూపుతో కదలడం ముదావహం. ఇందుకు ఉపకరించే పథకమే ఇంటింటికీ ఇంటర్నెట్‌. ఇంటింటికి రక్షిత తాగునీరు అందించే మిషన్‌ భగీరథ పథకం పైపులకోసం తవ్వుతున్న కందకాల్లోనే ఇంటర్నెట్‌కు అవసరమయ్యే ఫైబర్‌ ఆప్టిక్‌ కేబుల్‌ను వేస్తున్నారు. ఆర్థికంగా కొన్ని కోట్ల రూపాయల ధనాన్ని, శ్రమశక్తిని ఆదా చేస్తున్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఫైబర్‌ కేబుల్‌ వేసే పని ప్రారంభమైంది.

తాజాగా మరో రూపంలో డిజిటల్‌ సౌకర్యం సిద్ధిపేట జిల్లాకు కలిగింది. రైల్వేశాఖ తనవంతుగా కనెక్టివిటీ కోసం పాటుపడుతోంది. కరీంనగర్‌నుంచి సిద్ధిపేట నియోజకవర్గంలోని పలు ప్రాంతాల రైల్వే స్టేషన్లకు ఆప్టిక్‌ ఫైబర్‌ కేబుల్‌ వేయడం పూర్తి చేసింది. ఇందులో భాగాంగా ఆయా గ్రామాల్లో వైఫై టవర్ల సెంటర్ల ఏర్పాటు దాదాపు పూర్తి కావచ్చింది. దాంతో 160 కి.మీ. పరిధిలోని ప్రజలు కనెక్టివిటికోసం ఏమాత్రం కష్టపడాల్సిన అవసరం లేదు. స్మార్ట్‌ఫోన్ల ద్వారా కనెక్టివిటీ పొందవచ్చు. జిల్లా, మండల, గ్రామ పంచాయతీ కార్యాలయాల పని సైతం వేగవంత మవుతుంది. పాఠశాలలు, వ్యవసాయ మార్కెట్ల పనులు సులువుగా జరిగే అవకాశాలు ఏర్పడ్డాయి. వీడియో కాన్ఫ రెన్స్‌లు సైతం నిర్వహించుకునే సౌలభ్యం ఏర్పడుతోంది.

ఏరకంగా చూసినా ఇది విప్లవాత్మక పరిణామం. దీన్ని భారత రైల్వేలకు చెందిన ‘రైల్‌నెట్‌’ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని కాచిగూడ, సికింద రాబాద్‌ రైల్వే స్టేషన్లలో చాలా రోజుల క్రితమే ఈ రకమైన వైఫై సౌకర్యాన్ని ‘రైల్‌నెట్‌’ సంస్థ కల్పించింది. అది కాస్తా జిల్లాలకు విస్తరించడం ఆహ్వానించదగ్గ అంశం.

సిద్ధిపేట నియోజకవర్గంలోనే నగదు రహిత చెల్లింపులు చేసిన తొలి గ్రామం నమోదయింది. ఇంకా అనేక అంశాలతో ఈ ప్రాంతం దూసుకు పోతుంది. ఈ పాజిటివ్‌ అంశాల్ని ప్రేరణగా తీసుకుని మిగతా గ్రామాలు, జిల్లాలు అనేక అంశాల్లో ఆదర్శ ప్రాయంగా ఎదుగు తున్నాయి. అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్‌ దత్తత తీసుకున్న నర్సన్నపేట, ఎర్రవల్లి గ్రామాల్లోనూ రిలయన్స్‌వారు ఇంటింటికీ ఇంటర్నెట్‌ సౌకర్యం అందిస్తున్నారు. ప్రస్తుతం పనులు వేగంగా జరుగుతున్నాయి. నేటి గ్లోబలైజేషన్‌ కాలంలో ప్రాథమిక విద్యతోపాటు కంప్యూటర్‌ విద్య, కంప్యూటర్‌ పరిజ్ఞానం తెలియాల్సిన అవసరం పెరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లోనూ డిజిటల్‌ విద్య అవసరాన్ని గుర్తించి బోధన చేస్తున్నారు. డిజిటల్‌ పద్ధతిలో పాఠాలను బోధిస్తున్నారు. అంటే అక్షరాస్యతే కాదు డిజిటల్‌ అక్షరాస్యత అత్యవసరమైన సందర్భంలో వర్తమాన తరాలున్నాయి. రాబోయే రోజుల్లో కొత్త కొత్త సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా జీవనం కొనసాగనుంది. అందుకుగాను ఇప్పటినుంచే అటువైపుగా దృష్టిసారించడం తెలంగాణాలోని కొత్త తరాల కర్తవ్యం. అప్పుడే ప్రపంచంతో కలిసి నడిచేందుకు వీలు కలుగు తుంది. అలాగే కేటీఆర్‌ కలలు, తెలంగాణ ప్రజల కలలు సాకారం అవుతాయి.

వుప్పల నరసింహం

Other Updates