గ్రేటర్‌ హైదరాబాద్‌లో ప్రధాన రహదారులు, వ్యాపార ప్రాంతాల్లోని రోడ్లపై చెత్తను, ప్లాస్టిక్‌ కవర్లను వేయకుండా ప్రతిఒక్క వీధి వ్యాపారి తప్పనిసరిగా చెత్త బుట్టను ఏర్పాటు చేసుకునేలా జీహెచ్‌ఎంసీ అధికారులు చేపట్టిన స్పెషల్‌ డ్రైవ్‌ సత్ఫలితాలను ఇస్తోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో దాదాపు 9వేల లేన్‌ కిలోమీటర్ల రహదారులు ఉండగా వీటిలో 2వేల కిలోమీటర్ల ప్రధాన రహదారుల్లో 30వేల మంది చిరు వ్యాపారులు ఉన్నారని అంచనా వేశారు. ఈ స్ట్రీట్‌ వెండర్లు రోడ్లపై చెత్తను వేయడంతో ఆయా పరిసరాలు నిత్యం చెత్తాచెదారాలతో ఉంటున్నాయి. దీంతో ప్రతి వీధి వ్యాపారి తప్పనిసరిగా ప్రత్యేకంగా చెత్తబుట్టను ఏర్పాటు చేసుకునేలా జీహెచ్‌ఎంసీ శానిటేషన్‌ సిబ్బంది చేపట్టిన ప్రత్యేక చర్యలతో అధిక శాతంమంది ప్రత్యేక డస్ట్‌బిన్‌లను ఏర్పాటు చేసుకున్నారు.

వీటితో పాటు కమర్షియల్‌ ప్రాంతాల్లోని దుకాణదారులు, బడా వ్యాపారులు కూడా తమ షాపుల ముందు ప్రత్యేక చెత్తబుట్టలను ఏర్పాటు చేసేలా చైతన్య పరుస్తున్నారు. చిరు వ్యాపారులు తాము ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా చెత్తబుట్టలను ఎంపికచేసి వాటిని విక్రయించే ఏజెన్సీలు, రేట్లను కూడా జీహెచ్‌ఎంసీ తెలియజేసింది. ముఖ్యంగా రూ. 300 నుండి రూ. 500 వరకు లభించే ఈ డస్ట్‌బిన్‌ల సమాచారాన్ని కూడా స్ట్రీట్‌ వెండర్స్‌కు జీహెచ్‌ఎంసీ అధికారులు వివరిస్తున్నారు. ముందుగా డస్ట్‌బిన్‌లను ఏర్పాటు చేసుకునేలా ప్రతి ఒక్కరిని చైతన్యపరుస్తున్నామని, అనంతరం నోటీసులు జారీచేస్తామని, అయినప్పటికీ చెత్తబుట్టలను ఏర్పాటుచేయని వారికి జరిమానాలు విధిస్తామని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. నగర వ్యాప్తంగా పలు చిరువ్యాపారులు టిఫిన్‌ సెంటర్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు, పళ్ల దుకాణాలు, కూరగాయ దుకాణాలు నిర్వహిస్తూ సాయంత్ర వేళలో వ్యర్ధాలను రోడ్లపైనే వదిలి వెళుతున్నారు. దీంతో రహదారులు చెత్తాచెదారంతో నిండిపోతున్నాయి.

ముఖ్యంగా ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక స్థలాలైన చార్మినార్‌, గోల్కొండలతో పాటు ఇతర ప్రాంతాల్లో స్ట్రీట్‌ వెండర్లు వేసే చెత్త అధికంగా ఉంటుంది. దీని నివారణకు ప్రతిఒక్క వీధి వ్యాపారి డస్ట్‌బిన్‌లను ఏర్పాటు చేసుకోవాలని ప్రత్యేక డ్రైవ్‌ను చేపట్టారు. దీంతో పాటు ప్లాస్టిక్‌ నిషేధంలో భాగంగా 50 మైక్రాన్ల కన్నా తక్కువ విడిది గల ప్లాస్టిక్‌ కవర్లను ఉపయోగించే వారికి జీహెచ్‌ఎంసీ పెద్ద ఎత్తున జరిమానాలు విధిస్తోంది. వీటితో పాటు భవన నిర్మాణ వ్యర్ధాలను రహదారుల వెంట అక్రమంగా డంప్‌చేసేవారికి, చెత్తను తగలబెట్టేవారికి, రోడ్లపై చెత్తను వేసేవారికి జరిమానాలను విధిస్తున్నారు. దీంతో పాటుగా హోం కంపోస్టింగ్‌ను ప్రోత్స హించేందుకుగాను కేవలం వెయ్యి రూపాయల విలువ గల కంపోస్ట్‌ ప్లాస్టిక్‌ బిన్‌ను నగరవాసులకు అందుబాటులో ఉంచారు. ఇందుకుగాను నిబంధనలను అతిక్రమించిన 88 మందికి రూ. 66,800 లను జరిమానాలుగా విధించారు.

 

Other Updates