తెలంగాణ రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచేందుకు రాష్ట్రప్రభుత్వం నాలుగేళ్ళుగా అమలుచేస్తున్న తెలంగాణకు హరితహారం కార్యక్రమం అప్రతిహతంగా కొనసాగుతోంది. నాలుగోసారి ఈ ఏడాది అమలుచేస్తున్న ఈ కార్యక్రమంలో కొత్తగా చోటుచేసుకున్న గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం ఎంతో మందికి స్ఫూర్తినిస్తోంది. హరితహారం కార్యక్రమానికి మద్దతుగా ఇగ్నైటింగ్ మైండ్స్ సంస్థ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్‌కు రాష్ట్రవ్యాప్తంగా విశేషస్పందన లభిస్తోంది. వివిధరంగాల ప్రముఖులతోపాటు లక్షలాది మంది ఈ గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించారు.ఈ గ్రీన్ ఛాలెంజ్ ను ఎవరైనా స్వీకరించవచ్చు, తమకు సన్నిహితులు, మిత్రులను నామినేట్ చేయొచ్చు. వారు చేయాల్సిందల్లా తాము స్వయంగా మూడు మొక్కలను నాటడం, వాటి పర్యవేక్షణ బాధ్యత తీసుకోవటం, దానితో పాటు మరో ముగ్గురిని ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయటం. ఈ కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్న ముఖ్యమంత్రి ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ మేడ్చల్ లో మూడు మొక్కలు నాటి, ముగ్గురికి గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. టీఆర్‌ఎస్ ఎం.పి కవిత, ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితా సబర్వాల్, మేడ్చల్ కలెక్టర్ ఎం.వి.రెడ్డిని నామినేట్ చేశారు. ఈ ముగ్గురూ కూడా గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించి తాము మొక్కలు నాటారు. మేడ్చల్ కలెక్టర్ ఎం.వి రెడ్డి మూడు మొక్కలు నాటడంతో పాటు, మల్కాజిగిరి ఎంపి మల్లారెడ్డి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ లను నామినేట్ చేశారు.
రాష్ట్ర ఐ.టి శాఖామంత్రి కె.టి.రామారావు మూడుమొక్కలునాటి ప్రముఖ క్రీడాకారులు సచిన్ తెందూల్కర్, వి.వి.ఎస్. లక్ష్మణ్‌లకు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. వారు ఈ ఛాలెంజ్‌ను స్వీకరించారు.అలాగే శాసన సభ్యుడు జీవన్ రెడ్డి విసరిన గ్రీన్ చాలెంజ్ ను ప్రముఖ సినీ హాస్యనటుడు బ్రహ్మానందం స్వీకరించి మొక్కలు నాటారు. ప్రముఖ సినీనటులు చిరంజీవి, మహేష్ బాబులు కూడా గ్రీన్ ఛాలెంజ్ లను స్వీకరించి మొక్కలు నాటారు.