tsps3‘నీళ్లు – నిధులు – నియామకాలు’ వీటి కోసమే ప్రధానంగా తెలంగాణ పోరాటం జరిగింది. ఆ పోరాట ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు. ఉమ్మడి రాష్ట్రంలోని ఆస్తులు, అప్పులు, నీళ్లు, నిధులు, ఉద్యోగులు, సంస్థలు అన్నింటినీ ఏపి, తెలంగాణకు పంచిన విభజన చట్టం, పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను మాత్రం ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని పేర్కొంది. దీంతో 2014 ఆగస్టు 8న తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అదే సంవత్సరం డిసెంబర్‌ 17న ప్రొఫెసర్‌ ఘంటా చక్రపాణిని ఛైర్మన్‌గా, ఇంకొక నలుగురిని సభ్యులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేయగా డిసెంబర్‌ 18న వారు ప్రమాణ స్వీకారం చేశారు. సర్వీస్‌ కమిషన్‌ ఏర్పడిన నాటి నుంచి లక్ష ఉద్యోగాల లక్ష్యంగానే పనిచేస్తోంది. అయితే సర్వీస్‌ కమిషన్‌ ప్రయాణం నల్లేరుపై నడక ఏమీ కాలేదు. సభ్యులు బాధ్యతలు అయితే స్వీకరించారుకానీ కూర్చోవడానికి సీట్లు మొదలుకుని, ఆఫీసు సిబ్బంది వరకు ఏ ఒక్కటీ వారికి సులువుగా లభించలేదు. ఎన్నో ఘర్షణల అనంతరం ఉమ్మడి సర్వీస్‌ కమిషన్‌లోని నాలుగు అంతస్తుల్లో రెంటిని తెలంగాణ సర్వీస్‌ కమిషన్‌కు కేటాయించారు.

అరకొర సౌకర్యాలతోనే అద్భుత ఫలితాలు

సర్వీస్‌ కమిషన్‌కు వసతి అయితే సమకూరిందికానీ ఉద్యోగులు లేరు. ఛైర్మన్‌, సభ్యులు ప్రమాణ స్వీకారం చేసిన పదిహేను రోజులకు ‘వర్క్‌ టు సర్వ్‌’ ఆర్డర్‌ కింద 121 మంది ఉద్యోగులను కేటాయించారు. ఏపీపీఎస్సీలో 450కిపైగా ఉద్యోగులు ఉంటే తెలంగాణ వారు 121 మంది మాత్రమే. ఉద్యోగుల నియామకం చేయాల్సిన సర్వీస్‌ కమిషనే అప్పుడు ఉద్యోగుల కోసం వెతుక్కునే పరిస్థితిలో ఉంది. తెలంగాణకు కేటాయించిన 121 మందిలో కూడా 60 మంది, జూనియర్‌ అసిస్టెంట్‌ మొదలుకుని నాలుగో తరగతి వరకు ఉన్న కింది స్థాయి ఉద్యోగులే. 40 మంది మాత్రమే మధ్య స్థాయి ఆఫీసర్‌ కేడర్‌ అధికారులు. ఇక ఆఫీసర్‌ పోస్టుల్లో కూడా అడిషనల్‌ సెక్రెటరీ, డిప్యూటీ సెక్రెటరీల్లో ఒక్క తెలంగాణ వ్యక్తి లేరు. అసిస్టెంట్‌ సెక్రెటరీల్లోని 25 మందిలో ఐదుగురు మాత్రమే తెలంగాణవారు. ఇలాంటి స్థితిలో బాధ్యతలు చేపట్టిన తెలంగాణ సర్వీస్‌ కమిషన్‌ తన పనితీరు ద్వారా ఒక అద్భుతమే సష్టించింది.

లక్ష ఉద్యోగాల లక్ష్యం దిశగా

తెలంగాణ వస్తే లక్ష ఉద్యోగాలు వస్తాయని ఎప్పటి నుంచో అంటున్నమాట. అది అన్నమాట కాదు ఉన్నమాటే అని చెబుతోంది ప్రభుత్వం. నిజంగానే తెలంగాణ రాష్ట్రం లక్ష ఉద్యోగాల లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నంలోనే ఉంది. ఈ లక్ష ఉద్యోగాలన్నీ తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా భర్తీ అవుతాయనికాదు. కానీ మెజారిటీ ఉద్యోగాలు మాత్రం ఇక్కడి నుంచే నిండుతున్నాయి. ఇప్పటి వరకు భర్తీ పూర్తిచేసినవి, ప్రస్తుతం నోటిఫికేషన్‌ వెలువడ్డవి, రాబోయే కాలంలో వెలువడనున్నవి అలాగే ఈ ఐదేళ్లలో టిఎస్‌పిఎస్‌సితోపాటు, పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌, ఎలక్ట్రికల్‌ బోర్డు తదితర సంస్థల నోటిఫికేషన్లని కలుపుకొంటే లక్షకు చేరుకునే అవకాశం ఉంది.

భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కూడా సర్వీస్‌ కమిషన్‌ ద్వారా భర్తీ అయ్యే ఉద్యోగాల సంఖ్య ఆరేళ్ళలో పది నుంచి పదిహేను వేలను మించదు. కానీ తెలంగాణలో మాత్రం టిఎస్‌పిఎస్‌సి మొదటి టర్మ్‌ పూర్తిచేసుకునే సరికి ఈ సంఖ్య యాభైవేలకుపైగా చేరుకునే అవకాశం ఉంది.

30 నెలల్లో 34 నోటిఫికేషన్లు

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఏర్పడి ఇప్పటికి 30 నెలలు మాత్రమే పూర్తయింది. ఇందులో తొలి ఆరునెలలు బాలారిష్టాలు దాటడానికి సరిపోయింది. ఆ తర్వాత 24నెలల్లో 34 నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. 2015 ఆగస్టు 20న తొలి నోటిఫికేషన్‌ వెలువడింది. ఇప్పటి వరకు జరిగిన నియామకాల ద్వారా 6000ఉద్యోగాలను భర్తీ చేయగా, ప్రస్తుతం 7306 పోస్టుల భర్తీ వివిధ స్థాయిల్లో ఉంది. మరో 3725 పోస్టుల నోటిఫికేషన్‌ రేపోమాపో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. 2017 సంవత్సరం చివరినాటికి ఇంకో 10,795 పోస్టులు వెలువడనున్నాయి.

గ్రీన్‌ పిఎస్సీ

ఉద్యోగాలకు దరఖాస్తులు అంటే వందల రూపాయల ఖర్చు. దరఖాస్తుల కొనుగోలు మొదలుకుని, జిరాక్స్‌లు, ఫోటోలు, పోస్టల్‌ స్టాంపులు ఇలా పలు రకాలుగా డబ్బు, సమయం, తెల్లకాగితాలపై వెచ్చించాల్సి వచ్చేది. పైనుంచి హాల్‌ టికెట్లు ఎప్పుడు వస్తాయో, ఏ చిరునామాకు వస్తాయో అని ఆందోళనగా ఎదురుచూడాల్సి వచ్చేది. టిఎస్‌పిఎస్‌సి చర్యలతో ఇవన్నీ దూరం అయ్యాయి. ఉద్యోగం కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని, కమిషన్‌ చెప్పిన సమయంలో హాల్‌ టికెట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటే సరిపోతుంది.

ఈ టెక్నాలజీ ఉపయోగం వల్ల ప్రతీ సంవత్సరం టిఎస్‌పిఎస్సీ పర్యావరణ పరిరక్షణకు కూడా కషిచేస్తోంది. టిఎస్‌పిఎస్సీ చర్యల వల్ల దరఖాస్తులు, ప్రశ్న పత్రాల తయారీ కోసం ఉపయోగించాల్సిన లక్షల సంఖ్యలో తెల్లపేపర్లు ఆదా అయి పర్యావరణానికి కొంతమేరకైనా మేలు జరుగుతోంది. గ్రూప్‌-4 తరహా ఉద్యోగాలకు కనీసం నాలుగైదు లక్షల దరఖాస్తులు వస్తాయి. అంటే ఒక్కో అభ్యర్థికి దరఖాస్తు, అర్హతలు, ఆదాయం, లోకల్‌, రిజర్వేషన్లు వంటి పత్రాల జిరాక్స్‌ల కోసం యావరేజీగా ఐదు పేజీలైన కావాల్సి వచ్చేది. అంటే ఐదు లక్షలను ఐదు సంఖ్యతో హెచ్చిస్తే 25 లక్షలు అవుతుంది. అంటే ఒక్క గ్రూప్‌ ఫోర్‌ లాంటి నోటిఫికేషన్‌ ద్వారానే 25 లక్షల తెల్లకాగితాలు ఆదా అవుతాయి అన్నమాట.

ప్రశ్నపత్రాలు రూపొందించడానికి కూడా ఇంతకంటే ఎక్కువగానే పేపర్లు ఖర్చు అవుతాయి. వంద ప్రశ్నలతో తెలుగు, ఇంగ్లీషు కలగలిసిన ప్రశ్నపత్రాన్ని తయారు చేయాలంటే కనీసం 24 పేజీలు అవసరం అవుతాయి. ఎంత మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తే అంత సంఖ్యను 24తో హెచ్చించాల్సిందే. ఆన్‌లైన్‌ విధానం ద్వారా ఇవన్నీ ఆదాఅయినట్లే.

దీనితోపాటు దరఖాస్తుల పరిశీలన పేరిట ఉద్యోగుల పనిగంటలు కూడా ఆదా అవుతున్నాయి. ఇప్పటి వరకు టిఎస్‌పిఎస్సీ 34 నోటిఫికేషన్లు విడుదల చేయగా అందులో 24 పరీక్షలు నిర్వహించింది. ఈ 24 పరీక్షల్లో పెన్ను పేపర్‌ పరీక్షలు కేవలం ఆరు మాత్రమే. మిగిలిన 19 ఆన్‌లైన్‌ పరీక్షలే. ఒకే పర్యాయం 35 వేల మంది అభ్యర్థులకు ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించగల సామర్థాన్ని సంపాదించుకుంది.

సోషల్‌ మీడియాను వదల్లేదు

అభ్యర్థులకు అందుబాటులో ఉండడానికి టీఎస్‌పిఎస్సీ ఏ ఒక్కమార్గాన్ని వదల్లేదు. నేరుగా వచ్చి సందేహాలుతీర్చుకునే అభ్యర్థులను అనుమతిస్తూనే ఫోన్లద్వారా అడిగిన వారి సందేహాలను తీరుస్తోంది. దీనితోపాటు సోషల్‌ మీడియాను కూడా సమర్ధంగా వినియోగించుకుంటోంది. ఫేస్‌బుక్‌, ట్విట్టర్ల ద్వారా కూడా కమిషన్‌ అందుబాటులో ఉంటోంది.

సిలబస్‌ మార్పునకు అద్భుత కసరత్తు

పోటీ పరీక్షలకు సంబంధించిన సిలబస్‌ మార్పునకు టిఎస్‌పిఎస్‌సి పెద్ద కసరత్తే చేసింది. ఉమ్మడి రాష్ట్రంలోని ఏపీపీఎస్సీ సిలబస్‌ తెలంగాణ అంశాలకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వలేదు. ఎక్కడైనా ఉన్నా అరకొరగానో, అంతంత మాత్రంగానో, అసంపూర్ణంగానో ఉండేవి. అందుకే తెలంగాణలో పనిచేయాల్సిన అధికారులకు తమ రాష్ట్రం పట్ల అవగాహన ఉండాలి. స్థానిక సమస్యలు మాత్రమే కాదు ఉద్యమం, భాషా, యాస, సంస్క తి, సాహిత్యం, నైసర్గిక స్వరూపం, చరిత్ర అన్నీ తెలియాల్సిందే. అప్పుడే తెలంగాణ పునర్‌నిర్మాణం సాధ్యం అవుతుంది. దీనిని దష్టిలో పెట్టుకునే పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఛైైర్మన్‌ ఘంటా చక్రపాణి కొన్ని చర్యలు తీసుకున్నారు. తెలంగాణలోని ప్రముఖులు, ప్రొఫెసర్లవంటి 31 మంది విద్యావేత్తలతో ఒక కమిటీని వేసి తెలంగాణ కేంద్రంగా సిలబస్‌ను రూపొందించారు. టిఎస్‌పిఎస్‌సి రూపొందించిన ఈ సిలబస్‌ను ప్రస్తుతం పోలీస్‌ వంటి ఇతర రిక్రూట్‌మెంట్‌ బోర్డులేకాదు కొన్ని యూనివర్సిటీలు కూడా వాడుకుంటున్నాయి.

సిలబస్‌ రూపొందించడంలో టిఎస్‌పిఎస్‌సి కొన్ని జాగ్రత్తలు తీసుకుంది. అభ్యర్థులపై ఎక్కువ ఒత్తిడి లేకుండా ఉండడానికి తెలంగాణ అంశాలకు ప్రాధాన్యం ఇస్తూనే యూపిఎస్‌సి సిలబస్‌కు అనుసంధానంగా ఉండేలా చూసుకుంది. దీంతో రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించే పరీక్షలకు సిద్ధం అయ్యే విద్యార్థులు యూపిఎస్‌సితోపాటు ఇతర బోర్డులు నిర్వహించే పరీక్షలకు హాజరుకావడం సులభం అవుతుంది.

ఇక తెలంగాణపై పుస్తకాలు లేవంటూ తొలుత అభ్యర్థులు ఆందోళన చెందినప్పటికీ రెండు, మూడు నెలల్లోనే దీనిపై కావాల్సినంత మెటీరియల్‌ అందుబాటులోకి వచ్చింది. తెలంగాణకు సంబంధించిన కొత్త కొత్త రచయితలు, రచనలు వెలుగులోకి వచ్చాయి. మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చిన పుస్తకాల్లో కూడా చరిత్ర అంతా రాజకీయ కోణంలోకాకుండా చారిత్రక కోణంలో రావడం మంచి పరిణామం. అంతేకాదు మలిదశ ఉద్యమ కాలంలో పత్రికల్లో ప్రచురితమైన వ్యాసాలు విద్యార్థులకు ఉపయోగపడి సిలబస్‌ కొరతను తీర్చడమేకాదు, తెలంగాణ పట్ల సరైన అవగాహనను కలిగించాయి.

నోటిఫికేషన్లన్నీ తెలంగాణ పునర్‌ నిర్మాణానికి అవసరమైనవే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాగానే ప్రభుత్వం కూడా ఇవ్వాలి కాబట్టి నోటిఫికేషన్లు ఇచ్చాం అన్నట్లు కాకుండా పునర్‌ నిర్మాణానికి అవసరమైనవే వెలువరించింది. పంచాయితీరాజ్‌, ఇరిగేషన్‌, ఎలక్ట్రిసిటీ, మున్సిపాలిటీ, టీచింగ్‌, వ్యవసాయం, సాగునీరు, విద్య, వైద్యం, రోడ్లు-భవనాలు ఇలా ఏ రకమైన నోటిఫికేషన్లు చూసుకున్నా తెలంగాణ పునర్‌నిర్మాణ లైన్లో ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ఉన్నాయి. ప్రభుత్వం టిఎస్‌పిఎస్‌సిపై ఉంచిన నమ్మకాన్ని నిజం చేస్తూ కమిషన్‌ కూడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా సమర్ధులైన అధికారులను ఎంపిక చేసింది.

ఆరోపణలు రాలేదు, న్యాయపర చిక్కులు లేవు

పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఉద్యోగాలంటే ఉద్యోగార్దులకు ఒక దురభిప్రాయం ఉండేది. ఇవన్నీ డబ్బుకో లేకుంటే రిఫరెన్సుల కారణంగా మాత్రమే భర్తీ అవుతాయని అనుకునేవారు. టిఎస్‌పిఎస్సీ ఏర్పడిన రెండున్నరేళ్లలో 34 నోటిఫికేషన్లు వెలువడితే ఏ ఒక్క ఉద్యోగానికి సంబంధించి, ఎలాంటి ఆరోపణ రాకపోవడం గమనార్హం. నిజాయితీగా, పారదర్శకంగా, మెరిట్‌ ప్రకారం వ్యవహరించడంతో అభ్యర్థులేకాదు విమర్శకులూ నోరు మెదపలేకపోయారు. ఇంటర్వ్యూలు చేసి ఆవిషయం కూడా మర్చిపోతే మీకు ఉద్యోగం వచ్చిందంటూ ఇంటికి అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌ పంపారంటూ అభ్యర్థులు ఆనందంతో సోషల్‌ మీడియాలో పంచుకున్న సంఘటనలు కోకొల్లలు ఉన్నాయి. ఇవన్నీ టిఎస్‌పిఎస్‌సి నిజాయితీకి నిలువుటద్దాలు.

అంతేకాదు సర్వీస్‌ కమిషన్‌ ఏర్పడి కొద్దికాలమే అయినప్పటికీ సంస్థ అమలు చేస్తున్న సంస్కరణలు, పారదర్శకత తదితరాల కారణంగా ‘సర్వీస్‌ కమిషన్ల జాతీయ సదస్సు’ ను నిర్వహించే అవకాశం కూడా టిఎస్‌పిఎస్‌సికే దక్కింది. రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ల నేషనల్‌ కాన్ఫరెన్స్‌ స్టాండింగ్‌ కమిటీ ఛైర్మన్‌గా టిఎస్‌పిఎస్‌సి ఛైర్మన్‌ ఘంటా చక్రపాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పదవిలో ఆయన మూడేళ్లపాటు కొనసాగనున్నారు. ఒకరకంగా ఇది తెలంగాణకు దక్కిన గౌరవంగా భావించాలి. వివిధ రాష్ట్రాల్లోని పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు అమలు చేసే విధానపరమైన నిర్ణయాలు రూపొందించే పీఎస్సీల అత్యున్నత నిర్ణాయక మండలి ఇది.

Other Updates