పాలమూరు జిల్లా గేయ కవయిత్రిగా, రచయిత్రిగా జొన్నవాడ రాఘవమ్మ సుప్రసిద్ధురాలు. రాధికా గీతాల సృష్టికర్తగా జొన్నవాడ రాఘవమ్మ లబ్ద ప్రతిష్టురాలు. నాలుగు దశాబ్దాలకు పైగా సాహితీ సృజన చేసిన రాఘవమ్మ గీతాలు ఆకాశవాణిలో వరుసగా ప్రసారమై ఆబాలగోపాలాన్ని అలరించాయి.అప్పట్లో రాఘవమ్మ గేయాలకోసం శ్రోతలు అమితాసక్తిగా ఎదురుచూశారంటే ఆమె గేయమార్థవం ఎలాంటిదో చెప్పవచ్చు. ఆమె బతికున్నపుడు తన ఇంటికి ఎవరు వచ్చినా తన గేయాలను వినిపించడమనేది ఆమెకున్న సాహిత్యాభిలాషను తెలియజేస్తుంది.

జొన్నవాడ రాఘవమ్మ పాలమూరు జిల్లా నవాబుపేట మండలం కేశవరావుపల్లెలో అక్టోబర్‌ 14, 1928న శ్రీ జినకుంట శ్రీనివాసాచార్యులు, శ్రీమతి రాగమ్మ పుణ్య దంపతులకు జన్మించారు. చిన్ననాటనే తన తండ్రి, పినతండ్రి దగ్గర భాగవతం, రామాయణం, భారతం మొదలైన పురాణాలను పారాయణం చేసేవారు. అప్పటి నుండి రాఘవమ్మకు దైవభక్తి ఎక్కువ కావడంతో భాగవత ప్రవచనాలను జీర్ణించుకొని శ్రీకృష్ణుడిపై భక్తిగేయాలకు శ్రీకారం చుట్టారు. తాను జీర్ణించుకొన్న విషయాలను భక్తి పారవశ్యంతో మధురగీతాలను రచించారు. బహుగ్రంథ పఠనం వల్ల నిరంతరం అభ్యాసంవల్ల రాఘవమ్మ ప్రతిభ మొగ్గ తొడిగింది. ప్రతిభ పరిమళించింది.జన్మత: సిద్ధించిన జానపదాది లలిత గీతికా రచనలతో తన గేయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అలా లలిత గేయాలను రచించి ఆబాలగోపాలన్ని అలరించారు. అధ్యాత్మిక జీవన చింతనతో భగవద్గీత మకరందాన్ని పంచారు.

జొన్నవాడ రాఘవమ్మ రచించిన గేయాలెన్నో ఆకాశవాణి శ్రోతలను రసావర్ణవంలో ఓలలాడించాయి. మృదుమధురమైన కర్ణపేయంగా రచించిన రాధికాగీతాలు మకరందం వలె ఆస్వాదింపజేశాయి.రాఘవమ్మ రాసిన గేయాల్లో దేశభక్తి, మాతృభక్తి,మాతృభాష, పండుగలు, పల్లె రైతులు, దైవభక్తి, దేవతలు మొదలైనవి ప్రసిద్ధాలు.సరళమైన భాషలో, చెవులకు ఇంపుగా అలతిఅలతి పదాలతో రాసిన గేయాలు అందరినీ అలవోకగా చదివిస్తాయి.హాయిగా పాడిస్తాయి.మనసును పులకింపజేస్తాయి.

జొన్నవాడ రాఘవమ్మ రాసిన రాధికా గీతాలు 1972లో, 2006లో ముద్రితం కాగా ఆమె రచనలన్నింటిని కలిపి 2014లో ‘భావ తరంగాలు’గా వెలువ రించారు. మొదటి రాధికాగీతాలు లో మొత్తం 48 గేయాలుండగా,రెండవసారి ముద్రించిన రాధికాగీతాలులో 131 గేయాలున్నాయి. భావతరంగాలులో 105 గేయాలు 4 రూపకాలున్నాయి.

రాఘవమ్మ భక్తి గేయాలతోపాటు దేశభక్తి, జానపద గేయాలను,భజన కీర్తనలను, రూపకాలును గేయనాటికలను రచించారు. జిల్లాలో జరిగిన పలు కవిసమ్మేళనాలలో తన గేయాలను వినిపించి శభాష్‌ అనిపించుకున్నారు. రాఘవమ్మ రాసిన ప్రతి గేయంలో మధురమైన పదాల కూర్పుతో ఉదాత్త భావనలుంటాయి.మృదుమధురంగా శ్రోతలను ఆకట్టుకుంటాయి. భక్తి పారవశ్యంతో రాసిన గేయాలు కోమలంగా ఉండి శ్రోతల్ని అలరింపజేస్తాయి. రాఘవమ్మకు కృష్ణుడంటే అభిమానం. అందుకే కృష్ణుడిపై అనేక గీతాలను రచించారు.ఈ కృష్ణుడి గీతాలను రాఘవమ్మ హైద్రాబాద్‌ ఆకాశవాణి కేంద్రంలో దాదాపు పదేళ్ళపాటు పాడించి అందరి అభిమానాన్ని చూరగొన్నది. ముద్దుకృష్ణునిపై మురిపించు భక్తిగీతాలను రచించి కృష్ణుని భక్తితత్వాన్ని తన గేయంలో ప్రచారం చేసింది.

నిరాండబర జీవితాన్ని గడిపిన భక్త శిఖామణి. రాఘవమ్మ ఆకాశవాణిలో రాసిన భక్తి, లలిత గేయాలు భక్తిరంజని,ఈ మాసపు పాట, ఈ పాటను నేర్చుకుదాం, మహిళా కార్యక్రమం లలో విరివిగా వచ్చి బహుళ ప్రజాదరణ పొందాయి. ఈ గేయాలే గాక తుమ్మెద గోపికలు, తులసీమహాత్యం, శ్రీవనదుర్గ, గోపికల గేయాలు వంటి గేయరూపకాలు కూడా ఆకాశవాణిలో ప్రసారమయ్యాయి.ఇందులో అత్యధికంగా శ్రీ నవదుర్గ గేయరూపకం ప్రసారమై ఆబాలగోపాలాన్ని అలరించింది. రాఘవమ్మకు విశేష కీర్తి నార్జించిన గేయాలు రాధికా గీతాలు. ఇందులోని ప్రతి గేయాన్ని ఆమె అనుభూతి చెందుతూ రచించారు. ఆకాశవాణి హైదరాబాద్‌ కేంద్రంలో ఇవి దాదాపు పదేళ్ళపాటు పాడించి అందరినీ ఆకట్టుకున్నారు.

పిల్లనగోవి మెల్లన ఊదీ పుల్లము దోచిన దెవరో
నా పూలను దోచిన దెవరో
కనివిని ఎరుగని కమ్మని పిలుపుతో,రమ్మని పిలిచినదెవరో
నను రమ్మని పిలిచినదెవరో, అనురాగము చిలికిన దెవరో

అంటూ ఆ నందగోపాలుడిని, మనసుదోచిన మురళీధరుడిని ఆత్మీయంగా ఆనందాను భూతితో స్మరిస్తుంది. అంతేకాదు అలసిపోయిన శ్రీకృష్ణుడిని సేదతీరమంటూ చెబుతూ…

నాలోన నిమిషము నిదురించర స్వామి
ఆలమందల తోలి అలసి పోయితివేమో
చిగురుటాకుల బోలు చిన్ని నీ పాదాలు
కరుకు నేలను తగిలి కందితే కనలేను

అంటుంది. కృష్ణుడంటే రాఘవమ్మకు అమితమైన ప్రేమ. శ్రీకృష్ణుడి బాల్యలీలను కళ్ళకు కట్టినట్లుగా రాసిన అనేక గేయాలు ప్రతి హృదయాలను ఆనందపరవశుల్ని చేస్తుందనడంలో అతిశయము లేదు.

రాఘవమ్మ శ్రీకృష్ణుడిపై రాసిన గేయాలే గాక వివిధ అంశాలపై రాసిన గేయాలు కూడా ప్రాచుర్యం పొందాయి. శ్రీరాముడు, శ్రీ వేంకటేశ్వరుడు, శ్రీహరి, పాండురంగడు, ఈశ్వరుడు, పార్వతీదేవి, వరలక్ష్మీదేవి, అలవేలుమంగ వంటి దేవాతామూర్తులపైన భక్తి గేయాలను రచించి శ్రోతలు ఆకట్టుకుంది. శ్రీరాముని గురించి వర్ణిస్తూ…

రామనామ మధురరసం రమ్యమైన తారకం
వేగవాని చరణసేవ పదవి దొరికె పావనం
దధి నవనీతములకన్న మధురమైన నామం
ధరణి నేలు రమనామ పదవి దొరికె పావనం
కదళీ ద్రాక్ష మధువు కన్న మధురమైన నామం
కొదవ లేదు క్షీరపురీ దాస హృది నివాసం

అని చెప్పిన గేయం తారకరాముని నామనామాన్ని వెనోళ్ళ కీర్తిస్తుంది.
రాఘవమ్మ ప్రకృతి గేయాలు కూడా చాలా రాసింది. ఉదాహరణకు…

ఎవరు పెంచిన కల్పతరులివి
ఎవరు తీర్చిన సోయగములివి
ఎచట చూచిన ఊహకందని
అందమే కనివిందు చేసెను

అంటూ ప్రకృతి సౌందర్యాన్ని ఎంతో వైవిద్య భరితంగా రసాప్లవితం చేసింది. ఇంకా ‘పండుగల పాటలు’ శీర్షికలో సంక్రాంతి శ్రీలక్ష్మీ వచ్చిందోయ్‌ సస్యముల సంపదలు తెచ్చిందోయ్‌ అనే గేయం కూడా చేర్చబడింది.

ఆమె రాసిన ‘ఆడపడుచు’ గేయం నిజంగా అందరిని ఆలోచింపచేసే గేయం.
నిప్పువంటి సీతమ్మకు – నిందయున్నదొక్క యుగం
నిండుసభలో ఒక్కసతిని – పరాభవించె ద్వాపరం
వరకట్నపు దురాచార -దురంతాలు చెలరేగెను కలియుగం
ఆనాటికి ఈనాటికి మారలేదు స్వార్థం
ఆడవారి గుండెలలో రగిలే ఈ అవమానం
ఈనాటిది కాదమ్మ ఆడబ్రతుకు జీవితం
యుగయుగాల శాపమిది-ఆరని అవమానం

అంటూ సమాజంలోని వరకట్న దురాచారమనే రుగ్మత ఎలా బలంగా ప్రబలిపోయిందో కళ్ళకు కట్టినట్లు రాఘవమ్మ రచించడం సాంఘీక దూరాచారాన్ని తేెటతెల్లం చేసింది.
రాఘవమ్మ తాను సామాన్యురాలిగా భావించుకుంటూ రాసిన గేయం ‘నిరాడంబరం’.

కవిగాను సాహిత్య గనిగాను నేను
కారుచీకటిలోన దారిగానగలేక
అలమటించే ఒక్క బాటసారిని నేను
నా కవితకే భాష నియమాలు లేవు
నా లోన చెలరేగే ఆవేదనే తప్ప

అంటూ కవిని గాను అంటూనే తనలోని ఆవేదనలకు అక్షర రూపం ఇస్తూ రాసిన గేయం రాఘవమ్మ పాండిత్యానికి,సౌశీల్యానికి,ఆమె జీవితానికి దర్పణమని చెప్పవచ్చు.

కవిత గురించి చెబుతూ…
కడలి వలె పొంగింది జలజలా పారింది
వెలలేని నా కవిత నాలోన వొదిగింది
అంటూ కవితా స్వరూపాన్ని గేయాత్మకంగా రచించింది. రాఘవమ్మ రాసిన ప్రతి గేయాన్ని స్పర్శించడమంటే చంద్రున్ని అద్దంలో చూపడమే అవుతుంది. రాఘవమ్మ కలానికి ఉన్న గొప్ప శక్తి గేయాలను సరళమైన పదాలలో రాయడం.

శ్రీకృష్ణుడికి తన జీవితాన్ని అంకితమిచ్చి, ఆయననే తన సర్వస్వంగా భావించి తనను రాధగా చేసుకొని తన జీవితాన్ని సార్థకం చేసుకున్న భక్తశిఖామణి జొన్నవాడ రాఘవమ్మ, భగవంతునిపై ఉన్న అచంచలమైన భక్తితో తన అంతరాత్మలోని అక్షరాలను శ్రీకృష్ణుడికి నైవేద్యంగా అభిషేకించిన తీరు రాఘవమ్మ భక్తి ప్రపత్తులకు నిదర్శనం.

రాఘవమ్మ కేవలం భక్తురాలే కాదు, నాయకత్వ శిరోమణి కూడా. 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ప్రముఖ మహిళా నాయకురాళ్ళతో 15 రోజుల పాటు జైలు జీవితాన్ని అనుభవించారు.

జొన్నవాడ రాఘవమ్మ సాహితీ సృజనకు హైద్రాబాద్‌ శ్రీ జ్ఞానసరస్వతీ మ్యూజిక్‌ అండ్‌ డ్యాన్స్‌ అకాడమి వారు ‘శ్రీకృష్ణ పదసుధానిధి’ అనే బిరుదుతో సన్మానించడం విశేషం. ఇంకా అనేక సంస్థలు సన్మానించాయి.తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 2014లో పాలమూరు జిల్లా స్థాయి సాహిత్య పురస్కారాన్ని అందుకున్నది.ఇంకా పాలమూరు సాహితి ఉగాది పురస్కారం,విశాలాంధ్ర స్వర్ణోత్సవ పురస్కారం, తదితర పురస్కారాలను అందుకున్నది.

అంతేకాదు రాఘవమ్మ గేయ కవితా వైశిష్ట్యాన్ని గుర్తించి తెలుగు విశ్వవిద్యాలయం వారు ఎం.ఎ సంగీతంలో పలు లలిత గీతాలను చేర్చడం ఆమె పాండితీ వైభవాన్ని చాటి చెబుతున్నది.

Other Updates