తెలంగాణ ప్రజా సమితి పిలుపు మేరకు కొనసాగుతున్న సత్యాగ్రహాల్లో భాగంగా 1970 ఏప్రిల్ 29న చార్మినార్‌వద్ద సంస్థ ఉపాధ్యక్షుడు లాయక్ అలీఖాన్ నాయకత్వంలో తెలంగాణా ఉద్యమకారులు ‘జై తెలంగాణ’ నినాదాలు చేస్తూ ఊరేగింపు తీసారు. దారికి అడ్డంగా మోహరించిన సాయుధ పోలీసులు ఆందోళన కారులను అడ్డుకున్నారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘించారనే కారణంతో పోలీసులు వీరిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. పలుమార్లు పోలీసులు లాఠీచార్జీ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. రాళ్ళు, ఇటుకలను విసరడంతో ఒక పోలీస్ ఇన్‌స్పెక్టర్‌కు, కొందరు పోలీసులకు స్వల్పగాయాలైనవి. ఘర్షణ వాతావరణం నెలకొనడంతో చార్మినార్ ప్రాంతంలోని దుకాణాలు, హోటళ్లు అప్పటికప్పుడు మూసివేశారు. చార్మినార్ చుట్టూ వున్న రోడ్లపై ఉదయం నుండే పోలీసులు కాపలా కాశారు.
సికింద్రాబాద్‌లో ఆందోళనకారుల అరెస్టులు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదుట సుభాష్‌చంద్రబోస్ విగ్రహంవద్ద నిషేధాజ్ఞలను ఉల్లంఘించి సత్యాగ్రహం చేసిన మెట్టుగూడ ప్రజా సమితి కార్యకర్తలు ఆరుగురిని, గాంధీ విగ్రహంవద్ద తొమ్మిది మంది కార్యకర్తలను జంటనగరాల్లో మొత్తం 62మందిని పోలీసులు అరెస్టు చేశారు. జామీనుపై కొద్దిరోజుల క్రితం విడుదలైన టి. గౌరీశంకర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. విదార్థి నాయకుడైన గౌరీశంకర్ అరెస్ట్ కక్ష సాధింపు చర్యగా విద్యార్థి కార్యాచరణ సమితి నేతలు జీ సుదర్శన్, హృదయనాథ్‌సింగ్, ఎన్. సత్యనారాయణ పేర్కొన్నారు.
1969లో ఆర్టీసీకి జరిగిన నష్టం
1969 జనవరి నుండి డిసెంబర్ వరకు ఒక సంవత్సర కాలంలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు జరిగిన నష్టం నాలుగుకోట్ల 51 లక్షల రూపాయలు దీనిలో 76 బస్సులు పనికిరాకుండా ధ్వంసమైనందున కలిగిన నష్టం 30 లక్షల రూపాయలు కాగా, రక్షణ లేదని బస్సులు నడపక పోవడంవల్ల, ప్రయాణీకులు తగ్గినందువల్ల తగ్గిన ఆదాయం నాలుగు లక్షలపైనే వుందని ప్రభుత్వం ప్రకటించింది.
పోలీసు బందోబస్తుపై వ్యయం
తెలంగాణ ఉద్యమం సందర్భంగా పోలీసు బందోబస్తుకైన వ్యయం రెండు కోట్ల పందొమ్మిది లక్షల రూపాయలు కాగా, నక్సలైట్ ఉద్యమాన్ని అణచడానికి చేసిన వ్యయం కోటి ఐదు లక్షల రూపాయలని ప్రభుత్వం తెలిపింది.
సత్యాగ్రహుల అరెస్ట్‌లపై చెన్నారెడ్డి
ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సత్యాగ్రహుల పట్ల పోలీసులు, ముఖ్యంగా డిప్యూటీ కమిషనర్ల స్థాయిలో ఉన్న పోలీసు ఉన్నతాధికారులు క్రూరంగా ప్రవర్తించుతున్నారని, వారి ప్రవర్తన అవాంఛనీయ సంఘటనలకు దారితీస్తే సమితి బాధ్యత వహించబోదని ప్రజా సమితి అధ్యక్షులు డా|| ఎం. చెన్నారెడ్డి హెచ్చరించారు. సత్యాగ్రహులను పోలీసులు అమానుషంగా హింసించిన సంఘటనలను కొన్నింటిని డాక్టర్ చెన్నారెడ్డి పత్రికా ప్రతినిధులకు వివరించారు. శాంతియుతంగా సత్యాగ్రహాన్ని జరుపుతున్న స్థానిక నాయకులను బూటకపు కారణాలను చూపి క్రిమినల్ ప్రొసీజర్‌కోడ్ 151 సెక్షన్ క్రింద విచక్షణా రహితంగా అరెస్టు చేస్తున్నారని డా|| రెడ్డి అన్నారు.
ఆంధ్ర ఉద్యోగులపై చెన్నారెడ్డి వ్యాఖ్య
‘కార్పొరేషన్‌లోని ఆంధ్ర ఉద్యోగుల బదిలీని కోరడం ఆంధ్ర ప్రజలకు ప్రజా సమితి ఉద్యమం వ్యతిరేకం కాద’ని పూర్వంచేసిన ప్రకటనలకు భిన్నం కాదా?’ అని ఒక విలేకరి డా|| చెన్నారెడ్డిని ప్రశ్నించారు. దీనికి స్పందిస్తూ ‘తెలంగాణ ప్రాంతంలో నివసించే ఆంధ్రులకూ ప్రభుత్వ వ్యవస్థలో భాగంగా పనిచేసే ఆంధ్ర సిబ్బందికీ భేదం ఉన్నదని, ఆంధ్ర ఉద్యోగులు ప్రభుత్వంలోని ఆంధ్ర విభాగానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని, ఆంధ్రపాలన పోవాలని ప్రజా సమితి కోరుతున్న’దని డా|| చెన్నారెడ్డి వివరించారు.
డా|| చెన్నారెడ్డి అరెస్టు
‘దేశ పునాదులే కదులుతాయి’ – కోర్టులో హెచ్చరిక ఆబిడ్స్ సెంటర్‌లో సత్యాగ్రహం సందర్భంగా ఉద్యమకా రులకు, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు లాఠీఛార్జీ జరిపినందుకు నిరసనగా ప్రజలు రాళ్ళు విసిరినారు. ఈ సందర్భంగా 12 మంది పౌరులు, కొందరు పోలీసులు గాయపడ్డారు. దుకాణాదారులు ముందు జాగ్రత్తగా షట్టర్‌లు దించారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘించినందుకు ప్రజాసమితి అధ్యక్షుడు డా|| చెన్నారెడ్డిని, ప్రధాన కార్యదర్శి ఎస్. వెంకట్రామారెడ్డిని పోలీసులు అరెస్టు చేసి సిటీ మెజిస్ట్రేట్ కోర్టుకు తరలించారు.
డా|| చెన్నారెడ్డి మెజిస్ట్రేట్ కోర్టులో ఒక గంటసేపు తన అభిప్రాయాలను మెజిస్ట్రేట్‌కు గంభీరమైన స్వరంతో వివరించారు. ఆ అభిప్రాయాలు ఆయన మాటల్లోనే… ”ఈ ప్రభుత్వంలోనూ, ప్రభుత్వ పని తీరులో నాకు విశ్వాసంలేదు. పోలీసు అధికారులు అమానుషంగా దమనకాండ, లాఠీచార్జీ జరుపుతున్నారు. ‘తెలంగాణ ప్రజలు చేస్తున్న సత్యాగ్రహాలు, అహింస, శాంతి అనే మహోన్నత సాంప్రదాయాల కనుగుణంగా జరుగుతున్నాయి. సత్యాగ్రహులపట్ల పోలీసుల ప్రవర్తన ఇదే పద్ధతిలో కొనసాగితే దేశ పునాదులే కదిలిపోతాయి. నేను ప్రతిరోజూ సత్యాగ్రహులవద్దకు వచ్చి వీడ్కోలు ఇస్తున్నాను. నేను వారితో వుంటున్నందువల్లనే సత్యాగ్రహులు సంయమనం పాటిస్తున్నారని పత్రికలు పేర్కొన్నాయి.’ ‘తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం వుండాలని ఫజల్ అలీ కమిషన్ తమ నివేదికలో పేర్కొన్నది.
‘సమైక్య రాష్ట్రంలో అన్యాయాలు జరిగినట్లు ప్రజలు భావించితే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయబడుతుందని అప్పటి ప్రధాని పండిట్ నెహ్రూ ఇచ్చిన హామీ దృష్ట్యా ఏపీ ఏర్పడింది. ప్రభుత్వ దమనకాండ, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను డా|| చెన్నారెడ్డి ఎంతో ఆవేదనతో మెజిస్ట్రేట్ కోర్టులో వివరించారు.
ఉప ఎన్నికలో ప్రజా సమితి అభ్యర్థి
హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ శాసనసభా నియోజకవర్గ ఎమ్మెల్యే బి.వి. గురుమూర్తి మరణించడంవల్ల జరుగబోయే ఉప ఎన్నికల్లో తెలంగాణ ప్రజా సమితి అభ్యర్థి పోటీ చేస్తారని డా|| మర్రి చెన్నారెడ్డి ప్రకటించారు.
విజయవంతమైన తెలంగాణా బంద్
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో భాగంగా మే ఒకటిన తెలంగాణా బంద్‌కు ప్రజా సమితి పిలుపునిచ్చింది. ఈ బంద్ నిర్ణయాత్మకమైన అంతిమదిశగా వుండబోతున్నదని ప్రజా సమితి ఆందోళనాకారులకు ఇచ్చిన పిలుపు ప్రకటనలో తెలిపింది. తెలంగాణా బంద్ సందర్భంగా జంటనగరాల్లోనూ, ఇతర పట్టణా ల్లోనూ హోటళ్ళు, దుకాణాలు, వ్యాపార సంస్థలు మూసివేశారు. బంద్ సందర్భంగా జంటనగరాల్లో పలు ప్రదేశాల్లో కాల్పులు, భాష్పవాయు ప్రయోగం, లాఠీచార్జీ జరిపారు. ఆందోళనాకారులు నిరసనగా పోలీసులపైకి రాళ్ళు విసిరారు. ప్రభుత్వ వాహనాల, ఆస్తుల విధ్వంసానికి పాల్పడ్డారు.ఆబిడ్స్ పోస్టాఫీసు దగ్గర పికెటింగ్‌లో పాల్గొన్న డా|| చెన్నారెడ్డిని పోలీసులు అరెస్టు చేయడంతో ఉద్రిక్త పరిస్థితులేర్ప డినాయి. ఆందోళనకారులు పోలీసుల దమనకాండను ప్రతిఘటిస్తూ ప్రతిదాడులకు దిగినారు. పోలీస్‌స్టేషన్‌పైన, రైల్వే స్టేషన్‌పైనా, రైళ్ళు, బస్సులపైన, ప్రభుత్వ కార్యాలయాలపైనా రాళ్ళు, చేతికందిన సామగ్రితో దాడులు చేశారు. రైల్వే స్టేషన్ మాస్టర్ గదికి నిప్పంటించారు. సుమారు 400మంది ఆందోళనకారులు ట్రూప్ బజారులోని పోలీస్‌స్టేషన్‌పై దాడిచేసి, స్టేషన్‌పై రాళ్ళ వర్షం కురిపించారు. స్టేషన్‌లోని గ్లాసు కిటికీలను, కుర్చీలను, ఇంకా ఇతర ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు కాల్పులు జరిపారు. ఎవరికీ గాయాలు కాలేదు.
రెడ్డి హాస్టల్‌వద్ద ఉన్న పోస్టల్ స్టోర్స్ ఆఫీసుపై ఆందోళన కారులు దాడిచేసి ఆ కార్యాలయాన్ని దగ్దం చేయడానికి ప్రయత్నించగా పోలీసులు కాల్పులు జరిపి వారిని చెదరగొట్టారు.
పికెటింగ్ చేస్తున్న డా|| చెన్నారెడ్డిని చూడడానికి పెద్దఎత్తున జనం ఆబిడ్స్ పోస్టాఫీస్ చౌరస్తావద్దకు తరలిరావడంతో పోలీసులు వారిని చెదరగొట్టడానికి భాష్పవాయు ప్రయోగం జరిపి లాఠీఛార్జీ చేశారు. ఈ సందర్భంగా 20మంది ఆందోళనాకారులకు, కొంత మంది పోలీసులకు తీవ్రంగా గాయాలు తగిలాయి. ఆందోళనకారులు సుల్తాన్‌బజార్‌లోని టెలిఫోన్ కార్యాలయంపై దాడిచేసి, చేతికి దొరికిన ఫర్నీచర్‌ను ధ్వంసం చేసి దగ్దం చేశారు. పోలీసులు ఆ స్థలానికి వెళ్ళి కాల్పులు జరిపి జనాన్ని చెదరగొట్టారు.
చెన్నారెడ్డి, ఇతరులకు జైలు శిక్ష
ప్రజా సమితి అధ్యక్షులు డా|| చెన్నారెడ్డి ఇంకా 52మంది ఆందోళనకారులను నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన నేరానికి, నగర మెజిస్ట్రేట్ 5 రోజుల జైలుశిక్ష విధించారు. వీరిలో డా|| చెన్నారెడ్డి సతీమణి శ్రీమతి సావిత్రిరెడ్డి, మాజీ మేయర్ శ్రీమతి కుముద్ నాయక్, మాజీ శాసనసభ్యురాలు శాంతాబాయిలతో సహా 34మంది స్త్రీలు కూడా వున్నారు.
ఆందోళనపై చర్చకు రాజ్యసభలో వి.బి. రాజు డిమాండ్
గత 8 నెలలుగా తెలంగాణా ఆందోళన జరుగుతున్నదని, దాన్ని పోలీసు చర్యల ద్వారా అణచివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని వి.బి. రాజు రాజ్యసభలో అన్నారు. తెలంగాణా సమస్యపై రాజ్యసభ చర్చించాలని వి.బి. రాజు రాజ్యసభలో మే 2న డిమాండ్ చేశారు. రాజకీయ ఆందోళనలను, కేంద్ర రిజర్వు పోలీసులు ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం ద్వారా తొక్కిపెట్టినట్లయితే ప్రజలకు ప్రజాస్వామ్యంపై నమ్మకం పోతుందని వి.బి. రాజు అన్నారు.
సత్యాగ్రహులపై పోలీసుల దమనకాండ
మే 2, 3 తేదీల్లో కూడా తెలంగాణ వ్యాప్తంగా ప్రజా సమితి పిలుపు మేరకు సత్యాగ్రహాలు కొనసాగినాయి. మే 2న ఆబిడ్స్ సమీపంలోని లా కాలేజీవద్ద విద్యార్థులకు, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు లాఠీఛార్జీ జరుపడంతో విద్యార్థులు ప్రతిఘటించారు. అనంతరం పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు. సెంట్రల్‌బ్యాంకువద్ద ఆందోళనకారులు బస్సులపై రాళ్ళు విసిరినారు. ఈ సంఘటనలో ముగ్గురు ప్రయాణీకులకు స్వల్ప గాయాలైనాయి.
ప్రత్యేక తెలంగాణ కోరుతూ రాష్ట్ర సచివాలయంవద్ద పికెటింగ్ జరిపిన శాసనమండలి సభ్యుడు జి.వి. సుధాకర్‌రావు, శాసనసభ్యులు జి. రాజారామ్ మరో 15మందిని పోలీసులు మే 2న అరెస్టు చేశారు. సత్యాగ్రహాల్లో పాల్గొన్న కొందరు స్త్రీలను కూడా అరెస్ట్ చేశారు.
హైదరాబాద్‌లో మేయర్ అరెస్ట్
నిషేధాజ్ఞలను ధిక్కరించారనే కారణంతో నగర మేయర్ లక్ష్మీనారాయణను, ప్రజా సమితి నేతలు ఎం.ఎం. హషీం, టి. అంజయ్య (శాసనసభ్యులు) మరో 20మంది సత్యాగ్రహులను ఆలిండియా రేడియో కేంద్రం ముందు పోలీసులు అరెస్ట్ చేశారు. గౌలీగూడాలో సత్యాగ్రహం చేస్తున్నవారిని అరెస్ట్ చేశారు.
‘సి’క్లాసు ఖైదీగా చెన్నారెడ్డి
మే ఒకటిన తెలంగాణ బంద్ సందర్భంగా అరెస్టయిన డా|| చెన్నారెడ్డికి, ఆయన సహచర నాయకులకు మెజిస్ట్రేట్ 5 రోజుల జైలుశిక్ష విధించారు. మే 4న జైలునుండి 69 మంది సహచరులతో విడుదలైన చెన్నారెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ.. ‘తనను జైళోళ, ‘సి’ క్లాసులో వుంచారని, తరిమెల నాగిరెడ్డిని, ఆయన నాయకత్వాన పనిచేస్తున్న నక్సలైట్లను ‘ఏ’ క్లాసులో వుంచడం తనకు చాలా ఆశ్చర్యం కలిగించిందనీ, బహుశా, వాళ్ళంతా ఆంధ్రులైనందువల్లే ఇలాచేసి వుంటార’ని అన్నారు. ‘గత కొద్ది రోజులుగా ప్రజా సమితి నిర్వహించిన రిలే నిరాహార దీక్షలు, సత్యాగ్రహుల కార్యక్రమాలు విజయవంతంగా జరిగాయ’ని డా|| చెన్నారెడ్డి అన్నారు. తమ లక్ష్యసాధనకు ప్రజలు కృత నిశ్చయంతో వున్నారి ఋజువైందని అన్నారు. మే నెల 10వ తేదీనుండి రిలే నిరాహారదీక్షలతో తెలంగాణ ఉద్యమం కొనసాగుతుందని, తెలంగాణ అంతటా 6వేల దీక్షా శిబిరాలు ఏకకాలంలో ప్రారంభమౌతాయని డా|| చెన్నారెడ్డి అన్నారు. జంట నగరాల్లో 50 శిబిరాలు ఏర్పాటు చేయాలని ప్రజా సమితి నిర్ణయించిందని ఆయన అన్నారు.
ప్రజా సమితి సత్యాగ్రహం విఫలం: వెంగళరావు
‘విద్యార్థులు ఆందోళన చేసే ధోరణిలో లేరని, తెలంగాణా ఉద్యమం, నాయకత్వంపై ప్రజలకున్న భ్రమలు తొలగిపోయాయని, హోంమంత్రి జలగం వెంగళరావు పత్రికా విలేకర్ల సమావేశంలో అన్నారు. ఈ కారణాలవల్లనే ఏప్రిల్ 22 నుంచి తెలంగాణ ప్రజా సమితి ప్రారంభించిన 12 రోజుల ‘తుది పోరాటం’ విఫలమైందని ఆయన అన్నారు. ఈ 12 రోజుల్లో పోలీసులు ప్రదర్శించిన వైఖరిని హోంమంత్రి ప్రశంసించారు. అరాచకం ఏ స్థాయినుంచి ప్రారంభమైనా అణచివేయాలన్నారు.
డాక్టర్ చెన్నారెడ్డికి జైళ్ళో ‘ఏ’ క్లాసు ఎందుకివ్వలేదని విలేకర్లు ప్రశ్నించగా… ఆయన (డా|| చెన్నారెడ్డి) కేంద్రమంత్రిగా, రాష్ట్రమంత్రిగా గతంలో పనిచేసినప్పటికీ జైళ్ళో ఏ తరగతిలో ఉంచాలనేది కోర్టు పరిధిలో విషయమని వెంగళరావు అన్నారు. నాగిరెడ్డి తదితర వామపక్ష కమ్యూనిస్టు నాయకులకు ఒక తరగతి అంటూ ఇవ్వలేదని, వీరందరూ ఆంధ్రులు కారని అంటూ దేవులపల్లి వెంకటేశ్వరరావుకు డాక్టర్ ఎం. చెన్నారెడ్డికున్నంత ప్రఖ్యాతి ఉన్నది. అదీకాక చెన్నారెడ్డి, ఇతర తెలంగాణ డిటెన్యూలకు 7 రూపాయలు దినభత్యంగా యివ్వగా నాగిరెడ్డి తదితర కమ్యూనిస్టు నాయకులకు కేవలం రూ. 3లను మాత్రమే ఇచ్చార’ని హోంమంత్రి వెంగళరావు అన్నారు.