-వి. ప్రకాశ్‌


లోకసభకు మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలని ప్రధాని ఇందిరా గాంధీ ప్రభుత్వం నిర్ణయించింది. 1971 ఫిబ్రవరి 28న లేదా మార్చి ఒకటిన దేశంలోని లోకసభ స్థానాలకు ఎన్నికలు జరపాలని ప్రధాని నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్‌లో వచ్చిన చీలిక కారణంగానే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ ఎన్నికల్లో భారీ విజయం దిశగా ప్రధాని ఇందిర పథకం సిద్ధం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణా ప్రజా సమితితో, తమిళనాడులో డి.ఎం.కె. పార్టీతో చర్చలు జరపడానికి డా|| చెన్నారెడ్డి, కరుణానిధిలను ఢిల్లీకి ఆహ్వానించారు.

1970 డిసెంబర్‌ 29న డా|| చెన్నారెడ్డి ఢిల్లీకి వెళ్ళారు. అప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి, ప్రాంతీయ సంఘం అధ్యక్షులు చొక్కారావు, శాసనమండలి ఛైర్మన్‌ పిడతల రంగారెడ్డి ఢిల్లీ చేరుకున్నారు.

డా|| చెన్నారెడ్డి పత్రికల వారితో మాట్లాడుతూ… ప్రత్యేక రాష్ట్రం కోరేవారెవరైనా తమతో సహకరించవచ్చునని, కొత్త కాంగ్రెస్‌ (ప్రధాని ఇందిరకు సంబంధించిన) తమ అభ్యర్థులకు వ్యతిరేకంగా పోటీకి నిలపకపోవడం మంచిదని అన్నారు. లోకసభతోపాటు శాసన సభకు ఎన్నికలు వచ్చినా తాము సిద్ధంగా వున్నామని డా|| చెన్నారెడ్డి తెలిపారు. ఎన్నికల అంశం చర్చించేందుకు ప్రజా సమితి రాష్ట్ర కార్యవర్గ సమావేశం జనవరి 10న జరుగుతుందని డా|| చెన్నారెడ్డి ప్రకటించారు.

తెలంగాణ ప్రజా సమితికి స్వంతంత్రపార్టీ మద్దతు

తెలంగాణలో కొత్త కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా తెలంగాణా ప్రజా సమితి అభ్యర్థులను నిలిపినట్లయితే ప్రజా సమితిని తమ పార్టీ బలపరుస్తుందని స్వతంత్ర పార్టీ ప్రధాన కార్యదర్శి సుంకర సత్యనారాయణ హైదరాబాద్‌లో డిసెంబర్‌ 30న ప్రకటించారు. ఆంధ్ర ప్రాంతంలో 17 స్థానాల్లో తమపార్టీ పోటీ చేస్తుందని ఆయన అన్నారు.

ప్రజాసమితికి దరఖాస్తులు – హయగ్రీవాచారి

తెలంగాణ ప్రాంతంలో పార్లమెంటరీ మధ్యంతర ఎన్నికల్లో ప్రజాసమితి నుండి ఎంపి టికెట్లు కోరేవారు దరఖాస్తులు పెట్టుకోవాలని ప్రజాసమితి ప్రధాన కార్యదర్శి టి. హయగ్రీవాచారి నాయకులకు విజ్ఞప్తి చేశారు. జనవరి 10 లోగా ఈ దరఖాస్తులను ప్రజా సమితి కార్యాలయానికి పంపించాలన్నారు.

ఢిల్లీలో చర్చలు: తెలంగాణపై ప్రధాని కొత్త పథకం

లోకసభ మధ్యంతర ఎన్నికల దృష్ట్యా ఇందిరా గాంధీ రాష్ట్రంలోని ఇరు ప్రాంతాల ముఖ్యనేతలతో డిసెంబర్‌ 31న ఢిల్లీలో చర్చలు జరిపారు. ముందుగా ప్రాంతీయ సంఘం అధ్యక్షులు జె. చొక్కారావును కలుసుకుని ఆయనను ఇరు ప్రాంతాల నేతలతో తన కొత్త ‘పథకం’ గురించి నచ్చచెప్పి ఒప్పించాలని కోరినట్లు పత్రికలు వెల్లడించాయి. ఆ తర్వాత ప్రధాని ఇందిర ప్రజా సమితి అధ్యక్షులు డా|| చెన్నారెడ్డితో, రాష్ట్ర ముఖ్యమంత్రితో విడివిడిగా చర్చించారు. రాత్రి పొద్దుపోయాక మరోసారి బ్రహ్మానంద రెడ్డితో చర్చించారు.

కొత్త పథకం వివరాలు

తెలంగాణ అభివృద్ధికిగాను ప్రధాని సూచించిన అష్టసూత్ర కార్యక్రమం ఎంతవరకు సక్రమంగా అమలు జరిగేదీ అయిదు సంవత్సరాలు వేచి చూసిన పిమ్మట అసెంబ్లీలోని తెలంగాణ సభ్యులలో మూడింట రెండు వంతుల మంది సభ్యుల అభిప్రాయాను సారం తెలంగాణ భవిష్యత్తు తేలిపోతుంది.

దీనిపై జనవరి 1న ఆంధ్రప్రభ సంపాదకీయంలో ఇలా వ్యాఖ్యానించింది.

”లోకసభకు జరగనున్న మధ్యంతర ఎన్నికల దృష్ట్యా ఇందిరా గాంధీ ఇరు ప్రాంత నేతలతో జరుపుతున్న చర్చల ధోరణి సమైక్య రాష్ట్ర వాదులకు ఆందోళన కలిగించడం సహజం. తిరిగి ప్రధాని కావడానికి అవసరమైన మెజారిటీని సాధించడానికి శ్రీమతి గాంధి రాష్ట్ర విభజనకు సమ్మతించింది. ప్రధాని ప్రాపకం నిలుపుకునేందుకు ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు ముఖ్యమంత్రి కూడా అంగీకరిస్తున్నట్లు కన్పిస్తున్నది. ఈ పని రెండు సంత్సరాల క్రితమే చేసి వుంటే ఎందరో అమాయకుల ప్రాణాలు నిలిచి వుండేవి.

ప్రధాని పథకం పరిశీలిస్తాం – డా|| చెన్నారెడ్డి

ఈ పథకం వివరాలను ప్రధాని లేదా హోం మంత్రి ఇటువైపు చెన్నారెడ్డి ఎవ్వరూ వెల్లడించలేదు. ప్రధాని చెన్నారెడ్డి ఎవ్వరూ వెల్లడించలేదు. ప్రధాని చెన్నారెడ్డితో పలు దఫాలు చర్చలు జరిపారు. ప్రధాని రాత్రి బాగా పొద్దు పోయాక చెన్నారెడ్డి, ముఖ్య మంత్రితో సంయుక్త సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశాల్లో ఎలాంటి పరిష్కారం కుదరలేదు.

అర్ధరాత్రి తర్వాత డా|| చెన్నారెడ్డి పత్రికల వారితో మాట్లాడుతూ ”తెలంగాణకు సంబంధించి రానున్న కొద్ది రోజులలో కొన్ని నిర్ధిష్టమైన ప్రతిపాదనలు తమకు చేరగలవని ఆశిస్తున్నట్లు” తెలిపారు.

కొత్త కాంగ్రెస్‌ నుంచి ఏమైనా ప్రతిపాదనలు మీకు చేరినవా? అని పత్రికల వారు డా|| చెన్నారెడ్డిని ప్రశ్నించగా, కొత్త క్రాంగెస్‌ నాయకుల వద్ద కొత్తగా నిర్దిష్టమైన ప్రతిపాదనలు నిర్దిష్ట రూపంలో లేవని తమకు అభిప్రాయం కలిగినట్లు డా|| రెడ్డి జవాబిచ్చారు.

తెలంగాణలో కొత్త కాంగ్రెస్‌ అభ్యర్థులను నిలబెట్టే పక్షంలో పరిస్థితి మరింతగా క్లిష్ట రూపం దాల్చగలదని డా|| చెన్నారెడ్డి తెలిపారు.

”తమ భవితవ్యాన్ని తామే నిర్ణయించుకోవాలన్న తెలంగాణ ప్రజల మనోభావాలను తీర్చడానికి, ఆమోదయోగ్యమైన పరిష్కారం కుదరని పక్షంలో తెలంగాణలోని అన్ని లోకసభ స్థానాలకు ప్రజాసమితి పోటీ చేస్తుంద”ని ఆయన స్పష్టం చేశారు.

తెలంగాణ సమస్యకు ఆమోదయోగ్యమైన పరిష్కారం లభించే పక్షంలో, తెలంగాణా ప్రజా సమితి నిరవధికంగా కొనసాగవలసిన ఆవశ్యకత ఏమీలేదని తాను ప్రధానికి స్పష్టం చేసినట్లు కూడా డా|| చెన్నారెడ్డి తెలిపారు. అందువలన ప్రస్తుత పరిస్థితులలో తెలంగాణా ప్రజా సమితి కొత్త కాంగ్రెస్‌తో విలీనం కావాలని లేదా మధ్యంతర ఎన్నికలలో కొత్త కాంగ్రెస్‌ అభ్యర్థులుగా పోటీ చేయడానికి సమితి సభ్యులకు స్వేచ్ఛనివ్వాలని తాను ప్రధానికి చెప్పినట్లు డా|| చెన్నారెడ్డి తెలిపారు.

తాము సూచించిన ప్రతిపాదన ప్రధానికి ఆమోదయోగ్యంగా లేని పక్షంలో తెలంగాణ సమస్యకు వెంటనే ఒక పరిష్కారాన్ని ప్రధాని ప్రకటించాలని ఆయన కోరారు.

తెలంగాణా అభివృద్ధికై ప్రధాని ప్రకటించిన అష్ట సూత్ర కార్యక్రమం పురోగతిని అయిదేళ్ళ పాటు వేచి చూసిన తర్వాత, రాష్ట్ర అసెంబ్లీలోని మూడింట రెండొంతుల మెజారిటీతో గైకొనే నిర్ణయానికి కట్టుబడి వుండాలన్న ప్రతిపాదన విషయమై వ్యాఖ్యానించడానికి డా|| చెన్నారెడ్డి నిరాకరించారు. ప్రధాని లేదా సి.ఎం. ఈ ప్రతిపాదనను నిర్దిష్టమైన రూపంలో చేసినప్పుడు మాత్రమే తాను ఆ ప్రతిపాదనపై వ్యాఖ్యానించగలనని అన్నారు.

ప్రధాని సూచించిన కొన్ని ప్రత్యామ్నాయాలపై డా|| చెన్నారెడ్డి వ్యాఖ్యానిస్తూ… ”నేనేమీ వాగ్దానం చేయలేదు. అలాగే ప్రధాని కూడా ఎట్టి హామీ ఇవ్వలేదు. కానీ ప్రధాని సూచించిన అనేక ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాలపై ఆమె తమ సహచరులతో చర్చిస్తారు. నేను నా సహచరులతో చర్చిస్తాను” అని అన్నారు.

”పది రోజుల్లో తెలంగాణపై పరిష్కారం కుదరకపోతే కొత్త కాంగ్రెస్‌ తన అభ్యర్థులను నిర్ణయించే యెడల టి.పి.ఎస్‌ 14 స్థానాలకు పోటీ చేస్తుంద”ని అన్నారు.

పత్రికలు వెల్లడించిన వివరాల ప్రకారం. ”తెలంగాణలోని 14 లోకసభ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యతను తెలంగాణా ప్రజా సమితికే వదిలి వేయాలని లేదా తెలంగాణా సమస్యకు వెంటనే రాజకీయ పరిష్కారం ప్రకటించాలని ప్రజా సమితి నాయకుడు డా|| చెన్నారెడ్డి పట్టుబట్టడమే శ్రీమతి గాంధీ ప్రయత్నాలు విఫలం కావడానికి కారణం.

డా|| చెన్నారెడ్డి మాటలు, పత్రికల వార్తలను బట్టి చూస్తే ఐదేళ్ళ తర్వాత శాసన సభ్యుల్లో మూడింట రెండు వంతుల మెజారిటీని బట్టి తెలంగాణ భవితవ్యం నిర్ణయించబడుతుంద’ని ప్రధాని ఇందిరా గాంధీ చేసిన ప్రతిపాదన ప్రజా సమితి నేతలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని డా|| చెన్నారెడ్డి భావిస్తున్నట్లు స్పష్టమవుతున్నది.

ఎన్నికలు సమీపిస్తున్నవి కాబట్టి ”అభ్యర్థులను నిర్ణయించే స్వేచ్ఛనిస్తే కొత్త కాంగ్రెస్‌ టికెట్లపై పోటీకి నిలపడం శ్రేయస్కరమని డా|| చెన్నారెడ్డి భావించారు.

తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే ప్రజాసమితి కొత్త కాంగ్రెస్‌లో విలీనం చేయడానికి సిద్ధమేనని స్పష్టం చేశారు.

14 లోకసభ సీట్లకు తెలంగాణా కాంగ్రెస్‌ పోటీ

కొండా లక్ష్మణ్‌ బాపూజీ నాయకత్వంలో వున్న తెలంగాణా ప్రదేశ్‌ కాంగ్రెస్‌ తెలంగాణలోని 14 లోకసభ సీట్లకు ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించింది.

త్వరలో తెలంగాణ సమస్య పరిష్కారం – జగ్జీవన్‌ రామ్‌

తెలంగాణా సమస్యకు త్వరలో పరిష్కారం లభించగలదన్న ఆశాభావాన్ని కొత్త కాంగ్రెస్‌ అధ్యక్షులు జగ్జీవన్‌ రామ్‌ జనవరి ఒకటిన ఢిల్లీలో విలేకర్లతో వ్యక్తం చేశారు. తెలంగాణ సమస్య పరిష్కారానికి కృషి జరుగుతున్నదన్నారు. ”తెలంగాణ సమస్యను త్వరలో పరిష్కరించక పోతే ప్రత్యేక రాష్ట్రం కావాలన్న కోర్కెపై తెలంగాణ ప్రజాసమితి వచ్చే లోకసభ ఎన్నికల్లో పోటీ చేయవచ్చునని తెలుస్తున్నద”న్నారు. ప్రధాని ఇందిరా గాంధీతో చెన్నారెడ్డి ఢిల్లీ చర్చలు, జగ్జీవన్‌రామ్‌ వ్యాఖ్యలు తెలంగాణ వాదులలో రాష్ట్ర ఏర్పాటు ఆశలను మరోసారి చిగురింపచేశాయి.

ప్రజా సమితి సమావేశం

జనవరి 10న రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన టిపిఎస్‌ ఢిల్లీ పరిణామాల నేపథ్యం కారణంగా జనవరి 2న అత్యవసర కార్యవర్గ సమావేశానికి పిలుపునిచ్చింది.

తెలంగాణపై రాజీలేదు – విద్యార్థుల ప్రకటన

ఢిల్లీలో చర్చల పరిణామాలను పరిశీలిస్తున్న జంటనగరాల తెలంగాణ విద్యార్థులు ”ప్రత్యేక తెలంగాణ విషయంలో సంప్రదింపులకు అవకాశం లేదని స్పష్టం చేశారు. విద్యార్థి నేత బి. పుల్లారెడ్డి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణకు ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తి లేకుండా మరే ప్రత్యామ్నాయ ప్రతిపాదనను రూపొందించినా అది తమకు ఎంత మాత్రమూ ఆమోదయోగ్యం కాద’ని ఢిల్లీ పెద్దలు, రాజకీయ వేత్తలు ఈ విషయం గుర్తించాలని వారు స్పష్టం చేశారు. ప్రత్యేక రాష్ట్రం సాధించేదాకా పోరాటం కొనసాగించాలని వారు తీర్మానించారు.

ఢిల్లీ ప్రతిపాదనలు అంగీకరించలేదు – చెన్నారెడ్డి

1971 జనవరి 2న ఢిల్లీ నుండి రాగానే డా|| చెన్నరెడ్డిని హైదరాబాద్‌ విలేకర్లు పలు ప్రశ్నలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా డా|| చెన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు :

”ప్రధాని సూచించిన ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు, చర్చల వివరాలు పత్రికలకు వెల్లడింపజాలను. ముందుగా వాటిని ప్రజా సమితి కార్యవర్గానికి నివేదించాల్సి వుంది”.

”ప్రధాని సూచించిన ఏ ప్రతిపాదనపై ఎలాంటి హామీని నేనివ్వలేదు”.

”తెలంగాణలోని 14 పార్లమెంటరీ స్థానాలకు కొత్త కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను నిలబెట్టరాదు. వాటిని తెలంగాణ ప్రజా సమితికే వదిలేయాలని ప్రధానికి సూచించాను. అయితే ఈ లోగా తెలంగాణా సమస్యకు ఏమైన పరిష్కారం లభిస్తే దానిని పరిశీలించగలమని ప్రధానికి స్పష్టం చేశాను”.

”నా పత్రిపాదనను ప్రధాని అంగీకరించలేదు. కొత్త కాంగ్రెస్‌ పార్టీ టికెట్ల పై మాత్రమే పోటీ చేయాలని ఈ లోగా తెలంగాణ సమస్యకు ఒక పరిష్కారం కనుగొనవచ్చునని ప్రధాని అన్నారు”.

”తెలంగాణా ప్రాంతంలో ఎన్నికల ప్రధానాంశంగా ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర వాంఛను పరిగణించాలని, రెండు ఉప ఎన్నికల ఫలితాల ప్రాముఖ్యాన్ని అంగీకరించాలని డా|| చెన్నారెడ్డి పట్టుబట్టగా తెలంగాణా ప్రజల మనోభావాలను తాను అవగాహన చేసుకున్నానని ప్రధాని చెప్పినట్టు” పత్రికలు వెల్లడించాయి.

”తెలంగాణా ప్రజల మనోవాంఛను తీర్చడానికి ‘ఇతర పద్ధతులు’ వున్నవన్న ప్రధాని కొన్ని ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను డా|| చెన్నారెడ్డికి సూచించార”ని పత్రికలు పేర్కొన్నాయి.

హైదరాబాద్‌లో తెలంగాణ సమస్యపై తాను బేరసారాలు సాగిస్తున్నట్లు ఢిల్లీ చర్చలపై వినవస్తున్న విమర్శల విషయమై చెన్నారెడ్డి ప్రస్తావిస్తూ.. ”అట్టి విమర్శలు, వ్యాఖ్యలు సమస్యను సరిగా అవగాహన చేసుకోకుండా చేస్తున్నవే. నేను ఏ విధమైన ప్రత్యామ్నాయ ప్రతిపాదనను అంగీకరించలేదు. ప్రజాసమితి ఈ విధమైన విమర్శలను లోగడ తట్టుకొని నిలబడగలిగింది. ఇప్పుడు కూడా అదే జరగగలదు’ అని స్పష్టం చేశారు.

తెలంగాణ భవితవ్యంపై 1972లోనే తుది నిర్ణయం- ప్రజాసమితి కార్యవర్గం

1971 జనవరి 2న హైదరాబాద్‌లో ప్రజా సమితి నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో ప్రధాని ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను డా|| చెన్నారెడ్డి వెల్లడించారు.

ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు సమస్యపై తెలంగాణా ప్రాంతానికి చెందిన లెజిస్లేటర్లు, పార్లమెంట్‌ సభ్యులు అయిదేళ్ళ తర్వాత కాకుండా, 1972లోనే మూడింట రెండు వంతుల మెజారిటీతో ఒక నిర్ణయం గైకొనాలని తెలంగాణ ప్రజాసమితి కార్యవర్గ సభ్యులలోనూ, ఇతర ప్రముఖ సభ్యులలోనూ ఏకాభిప్రాయం వెల్లడైంది.

సభ్యుల అభిప్రాయాలను దృష్టిలో ఉంచుకొని డా|| చెన్నారెడ్డి ప్రధానికి ఒక ప్రత్యామ్నాయ ప్రతిపాదనను సమర్పించవచ్చునని పత్రికలు వెల్లడించాయి.

చెన్నారెడ్డితో ఇందిర కుట్ర – లచ్చన్న

ఆది నుండి ప్రత్యేక తెలంగాణను సమర్ధిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ స్వతంత్ర పార్టీ అధ్యక్షులు గౌతు లచ్చన్న ఢిల్లీ చర్చలను కుట్రగా అభివర్ణించారు.

”ఇందిరా గాంధీ తెలంగాణ సమస్యపై చెన్నారెడ్డితో కలిసి కుట్ర పన్నుతున్నారు. ఆమె వేసిన వలలో చెన్నారెడ్డి పడబోరనే తాను ఆశిస్తున్నాను. ఒకవేళ అలాగే జరిగినట్లయితే అది తెలంగాణ ప్రజలను మోసం చేయడమే కాగలదు. తెలంగాణ జనం జాగరూకులై వుండాల”ని లచ్చన్న హెచ్చరించారు.

”తెలంగాణ సమస్య జాతీయ సమస్య. ఇది రాజకీయ సమస్య కాదు. ఆపద్ధర్మ ప్రధానిగా వున్న ఇందిరకు ఈ సమస్యను పరిష్కరించడం సాధ్యం కాదని” అన్నారు.

Other Updates