telangana‘తెలంగాణలో తీవ్ర పరిస్థితి దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని 1969 ఆగస్టు 18న జనసంఘం సభ్యుడు కె.ఎల్‌.గుప్తా తీర్మానాన్ని ప్రతిపాదించారు. దీనిపై లోకసభలో చర్చ జరిగింది. ఈ చర్చల్లో పాల్గొన్న పలువురు తెలంగాణ ఎం.పి.లు వెంటనే రాష్ట్రపతిపాలన విధించాలని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని, అవసర మైతే జనవాక్య సేకరణ(రెఫరెండం) నిర్వహించాలని ముక్తకంఠంతో కోరారు. పరిష్కారం కనుగొనేందుకు అఖిలపక్ష పార్లమెంటరీ సంఘాన్ని తెలంగాణకు పంపాలని కోరారు.

పాత మైసూర్‌ ప్రాంతానికి చెందిన సభ్యుడు ఎస్‌.వి. కృష్ణప్ప మాట్లాడుతూ వివిధ రాష్ట్రాలలోని ప్రాంతాల సాధక బాధకాల పరిశీలనకు రాష్ట్రాల పునర్‌ వ్యవస్థీకరణ సంఘం వంటి సంఘాన్నొకదాన్ని ఏర్పాటు చేయాలన్నారు.

‘పెరుగుతున్న ప్రాంతీయ అసమానతలను కేంద్రం సరిచేయనట్లయితే వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలన్న కోర్కెను తమ పార్టీ కూడా ప్రతిఘటించజాలద’ని కమ్యూనిస్టు పార్టీ సభ్యుడు యోగేంద్ర శర్మ అన్నారు.

తీర్మానం ప్రవేశపెట్టిన కె.ఎల్‌. గుప్తా (కన్వర్‌ లాల్‌ గుప్తా) మాట్లాడుతూ ”ఆర్థికాభివృద్ధి, ఉద్యోగావకాశాలు వంటి వాటి విషయంలో ఆంధ్రప్రదేశ్‌లోని తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాలను తొలగించేందుకు ఎలాంటి జాప్యం లేకుండా నిర్దిష్ట చర్యలు తీసుకోనాల”ని అన్నారు. బ్రహ్మానందరెడ్డి స్థానంలో ముఖ్యమంత్రిగా తెలంగాణా ప్రాంత వ్యక్తిని నియమించాలని ఆయన సూచించారు. అరెస్టయిన వారందరిని విడుదల చేయాలన్నారు.

ఆగస్టు 19న తెలంగాణ సమస్యపై మళ్ళీ లోకసభ చర్చించింది. స్వతంత్ర పార్టీ సభ్యుడు ఎన్‌.జి. రంగా మాట్లాడుతూ ”ప్రత్యేక తెలంగాణా ఆందోళనకు ప్రజా బాహుళ్యం మద్దతు కలదు. తెలంగాణను ఉపరాష్ట్రంగా చేస్తారా”? లేక ప్రత్యేక రాష్ట్రంగానా? అన్న సమస్యపై ముందుగా అభిప్రాయం ఏదీ తమకు లేద’ని ప్రభుత్వం ప్రకటించాలన్నారు.

”ఆంధ్రప్రదేశ్‌కు గవర్నర్లుగా వచ్చినవారు తమ బాధ్యతలను నిర్వర్తించలేదని, తెలంగాణా ప్రాంతానికి ఇచ్చిన రక్షణలు అమలు జరిగేటట్లు చేయడానికి వారు ఏమీ చేయలేద”ని రంగా అన్నారు. తెలంగాణా ఎం.పి. డాక్టర్‌ జి.ఎస్‌. మేల్కోటే (కాంగ్రెస్‌) మాట్లాడుతూ ”ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడం మినహా ఇతరత్రా ఎలాంటి ఆశలు లేవన్న నిర్ణయానికి తెలంగాణ ప్రజలు వచ్చారు. దానిని సాధించేవరకు వారు ఆందోళన సాగించగలరు. ప్రత్యేక రాష్ట్రం కోసం గత 8 నెలల్లో సుమారు 250 మంది ఆందోళనకారులు పోలీసుల తుపాకీ గుండ్లకు గురయ్యారు. లాఠీ దెబ్బల వల్ల 18 మంది మరణించారు. 9 వేల మంది మహిళలలతో సహా 50 వేల మంది కి పైగా అరెస్టయ్యారు. 10 వేల మందికి పైగా గాయపడ్డారు. పోలీసులు 3116 పర్యాయాలు లాఠీఛార్జీ చేసారు. అయినా ”దుండగుల ఉద్యమం”గా దానిని పేర్కొ న్నారు. బయటివారిని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని” అన్నారు. వివిధ శాఖలలోని అధికారులకు ప్రమోషన్లు ఇవ్వకుండా ఉన్న సంఘటనలను జి.ఎస్‌. మేల్కోటే ఉదహరించారు.

”తెలంగాణ ప్రజల అభిప్రాయ సేకరణ జరిపించాల”ని ప్రతిపాదించి తీర్మానాలపై ఆగస్టు 21న సభ చర్చించింది. ఆదేవిధంగా 1969 ఆగస్టు 18న లోకసభలో జనసంఘం సభ్యుడు కె.ఎల్‌.గుప్త తెలంగాణపై ప్రతిపాదించిన మరో తీర్మానంపైకూడా చర్చ జరిగింది.

శాసనసభలో మళ్ళీ తెలంగాణ

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో 1969 ఆగస్టు 20న వరంగల్‌ శాసనసభ్యుడు(పి.డి.పి) డా.టి.ఎస్‌.మూర్తి (ఆంధ్రసెట్లర్‌) ప్రసంగిస్తూ ”ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం తప్ప ప్రస్తుత తెలంగాణ సమస్యకు వేరు పరిష్కారమార్గం లేద”న్నారు. ఇండిపెండెంట్‌ సభ్యుడు సి.వి.కె.రావు అడ్డుతగుల్తూ ”డా.మూర్తి ప్రత్యేక తెలంగాణ వాదిగా ఎప్పుడు మారార”ని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా డా.టి.ఎస్‌.మూర్తి మాట్లాడుతూ ”శాసనసభ్యులు నియోజకవర్గ ప్రజల అభిప్రాయాలను ప్రతిబింబించనప్పుడు ప్రజలే వాళ్ల చేతుల్లోకి పరిస్థితిని తీసుకుంటారు. దౌర్జన్య చర్యలను ఎవ్వరమూ ప్రోత్సహించడం లేదు. శాంతియుతంగా ఆందోళన జరపాలని చెబుతున్నాం. ఆంధ్ర ఉద్యోగుల అహంకారం వల్ల క్రింది ఉద్యోగులను న్యూనతా భావంతో తక్కువ చూపు చూచినందువల్ల ఉద్యమం వచ్చింద”ని డా.టి.ఎస్‌.మూర్తి అన్నారు. మధ్యలో అడ్డు తగిలిన ప్రగడ కోటయ్యకు బదులిస్తూ తాము కోరుకున్న ”ప్రత్యేక తెలంగాణ అంటే భూస్వామ్య, ధనస్వామ్యయుతమైన ప్రజాస్వామ్యంగాక సామాన్య ప్రజలు ఆధిపత్యం వహించే తెలంగాణ” అని డా.టి.ఎస్‌.మూర్తి నిర్వచించారు.

”కొంత కాలం క్రితం ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ హైదరాబాద్‌ వచ్చినపుడు గాయపడి ఆసుపత్రిలో ఉన్న ఆందోళనకారులను చూడాలన్న వాంఛ వ్యక్తం చేశారు. అప్పుడు అధికారులు గాయపడిన 100 మందిలో 85 మందిని శీఘ్రంగా ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ చేసార”ని డా.జి.ఎస్‌. మేల్కోటే ఆరోపించారు.

డి.ఎం.కె పార్టీ సభ్యుడు ఎస్‌.కె. దప్పన్‌ మాట్లాడుతూ ”భాష ఒక్కటైనంత మాత్రాన అది ఒక్కటే సమైక్యతా శక్తి కాజాలదన్న విషయాన్ని ఈ ఆందోళన రుజువు పరచింద”న్నారు

ఆంధ్రప్రాంత కాంగ్రెస్‌ సభ్యుడు ఎన్‌.పి.ఎస్‌. నాయుడు మాట్లాడుతూ ”అస్సాం కొండ రాష్ట్రం వలె తెలంగాణకు ఉపరాష్ట్ర ప్రతిపత్తి ఇవ్వాల”న్నారు.

మార్కిస్ట్‌ పార్టీ నాయకుడు పి. గోపాలన్‌ మాట్లాడుతూ ”తెలంగాణ ఉద్యమం వెనుక పెట్టుబడి దారుల పాత్ర ఉన్నది. తెలంగాణా ప్రజలకు అన్యాయం జరుగుతున్నది. వనరుల పంపిణీ విషయంలో కోస్తా జిల్లాలు – తెలంగాణ మధ్య కుదిరిన ఒప్పందం గౌరవింపబడలేద”న్నారు. తెలంగాణ ఎం.పి. శ్రీమతి సంగెం లక్ష్మీబాయి (కాంగ్రెస్‌) మాట్లాడుతూ, ”తెలంగాణపై అణచివేత చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం స్వస్తి చెప్పాలి. పోలీసు అత్యాచారాలను తెలంగాణా ప్రజలు ఎంతకాలం భరిస్తారు? కేంద్ర దేశీయాంగ మంత్రి హైదరాబాద్‌కు రావడం వల్ల ఎలాంటి ఫలితం రాలేద”న్నారు. ప్రజా సోషలిస్టు పార్టీ నాయకుడు ఎస్‌.ఎన్‌. ద్వివేది తెలంగాణలోని అల్లర్లను ‘జలియన్‌ వాలాబాగ్‌’ ఉదంతాలతో పోల్చారు.

తెలంగాణ ఎం.పి. లక్ష్మీకాంతమ్మ మధ్యలో ద్వివేది ప్రసంగానికి అడ్డుతగులుతూ ఈ ఉపమానానికి నిరసన తెలిపి ‘తెలంగాణలో పరిస్థితి శాంతి, భద్రతల సమస్య’ అని అన్నారు. దీనితో పెక్కుమంది కాంగ్రెస్‌, ప్రతిపక్ష సభ్యులు ఆమెను కూర్చోమని కేకలు వేశారు. కొందరు ఆమె మాటలను సహించలేక ఆమెతో ఘర్షణకు దిగగా సభాపతి ‘ఆ మహిళా సభ్యురాలితో ఘర్షణ పడవద్ద’ని సభ్యులను కోరారు.

ఎస్‌.ఎన్‌.ద్వివేదీ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ”తెలంగాణ ప్రజల కోర్కెల పరిశీలనకు న్యాయవాదుల సంఘాన్ని, పార్లమెంటరీ సంఘాన్ని కాని వేయాల’ని కోరినారు. ”తెలంగాణలో సంఘటనలకు ప్రభుత్వానిదే బాధ్యత. ఇతర చోట్ల నుంచి వచ్చే ప్రత్యేక రాష్ట్ర ప్రతిపాదనలను ప్రభుత్వం తిరస్కరించి ఉంటే ప్రత్యేక తెలంగాణను వ్యతిరేకించడంలో ప్రభుత్వ చర్య సమర్థనీయమై వుండేద”న్నారు. ”తెలంగాణ ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం పట్ల విశ్వాసం కోల్పోయారు. ఆంధ్రలో రాష్ట్రపతి పాలన విధించడం కేంద్రం చేయవలసిన కనీస చర్య. అయితే కాంగ్రెస్‌లో చీలికల వల్ల పార్టీలో ఒక వర్గం రాష్ట్రముఖ్యమంత్రి మద్ధతు కోల్పోవడానికి ఇష్టపడనందున ఇది జరగలేద”ని ద్వివేదీ అన్నారు.

(ఆగస్టు, 19,20, 1969 ఆంధ్రపత్రిక)

ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని గౌతు లచ్చన్న అన్నారు. (ఆంధ్రపత్రిక, 21-8-1969)

లోకసభలో తెలంగాణ తీర్మానాలపై చర్చకు

హోంమంత్రి చవాన్‌ సమాధానం

1969 జూలై 24న, నిజామాబాద్‌ ఎం.పి (ఇండి పెండెంట్‌) యం.నారాయణరెడ్డి లోకసభలో ప్రతిపా దించిన తెలంగాణ పరిస్థితి అధ్యయనం చేసి నివేదిక నివ్వడానికి పార్లమెంటరీ సంఘాన్ని నియమించాలని, జూలై 25న ”తెలంగాణ ప్రజల అభిప్రాయ సేకరణ జరిపించాల”ని ప్రతిపాదించి తీర్మానాలపై ఆగస్టు 21న సభ చర్చించింది. ఆదేవిధంగా 1969 ఆగస్టు 18న లోకసభలో జనసంఘం సభ్యుడు కె.ఎల్‌.గుప్త తెలంగాణపై ప్రతిపాదించిన మరో తీర్మానంపై కూడా చర్చ జరిగింది. ఈ చర్చల సందర్భంగా వివిధ పార్టీల సభ్యులు లేవనెత్తిన పలు ప్రశ్నలకు, ఆరోపణలకు దేశీయాంగమంత్రి వై.బి.చవాన్‌ ఆగస్టు 23న లోకసభలో సమాధానం చెప్పారు.

పార్లమెంటరీ సంఘం ఏర్పాటుకు తిరస్కరణ

వై.వి.చవాన్‌ మాట్లాడుతూ తెలంగాణా సమస్యకు పరిష్కారాన్ని కనుగొనేందుకు పార్లమెంటరీ సంఘాన్ని నియమించాలనే ప్రతిపాదనను తిరస్కరించారు. ”ఇటు వంటి విషయాల్లో పార్లమెంటరీ సంఘాల వల్ల పరిష్కారం సాధ్యం కాదు. పైగా వ్యవహారాలు మరింత విషమించ వచ్చున”ని చవాన్‌ అన్నారు. ”పంజాబ్‌, హర్యానా సమస్యపై పార్లమెంటరీ సంఘాన్ని నియమించినప్పుడు, ఎలాగైనా రాష్ట్ర విజభనను నివారించాలనే ఉద్దేశ్యంతోనే నియమించడం జరిగింది కానీ, ఫలితం అందుకు విరుద్ధంగా వచ్చింద”ని చవాన్‌ అన్నారు.

పంజాబీ మాట్లాడే ప్రాంతాలతో ప్రత్యేక రాష్ట్రం కావాలని పంజాబీలు ఆందోళన చేసిన సందర్భంగా 23-9-1965న పార్లమెంట్‌లో అప్పటి హోంమంత్రి గుల్జారీలాల్‌ నందా ”ఉభయసభల్లోని సభ్యులతో పార్లమెంటరీ కమిటీని తమ అధ్యక్షతన నియమించి పంజాబ్‌ సమస్య పరిష్కరించాల”ని అప్పటి స్పీకర్‌ సర్దార్‌ హుకుంసింగ్‌ను కోరినారు. దీనితో 22 మందితో హుకుంసింగ్‌ అధ్యక్షతన పార్లమెంటరీ సంఘం ఏర్పడింది. ఈ సంఘంలో ప్రముఖులు అటల్‌ బీహారి వాజ్‌పేయి, హీరేన్‌ ముఖర్జీ, ఎస్‌.ఎన్‌. ద్వివేది, బన్సీలాల్‌, సాదిక్‌అలీ తదితరులు సభ్యులుగా ఉన్నారు.

ఈ కమిటీ పంజాబ్‌ రాష్ట్రంలో పర్యటించిన సంద ర్భంగా 2200 విజ్ఞప్తులు వచ్చాయి. పంజాబీ మాట్లాడే ప్రాంతాలతో ప్రత్యేక పంజాబ్‌ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని రాగా కేవలం 903 విజ్ఞప్తులు విభజనకు వ్యతిరేకంగా వచ్చాయి. ఈ పరిస్థితిని సమీక్షించిన సర్దార్‌ హుకుంసింగ్‌ అధ్యక్షతన గల పార్లమెంటరీ కమిటీ ఏకగ్రీవంగా పంజాబీ మాట్లాడే ప్రాంతాలతో పంజాబ్‌ రాష్ట్రాన్ని 15-3-1966న సిఫారసు చేసింది. ఈ కమిటీ ‘విభజన’ను సిఫార్సు చేస్తుందని తెలుసుకున్న ప్రధాని ఇందిరాగాంధీ 9-3-1966న కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశాన్ని ఏర్పాటుచేసి కమిటీ నివేదిక సమర్పించడానికి ముందే ప్రత్యేక పంజాబ్‌ రాష్ట్ర ఏర్పాటుకు సిఫార్సు చేసింది. 1-11-1966న పంజాబ్‌ రాష్ట్రం ఏర్పడింది.

తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఇదే పద్ధతిలో ఏర్పాటు చేయగల అవకాశం వుంటుందనే ఆశతో లోకసభలో నిజామాబాద్‌ ఎం.పి.(ఇండిపెండెంట్‌) యం.నారా యణరెడ్డిగారు తెలంగాణ సమస్యపై పార్లమెంటరీ సంఘం ఏర్పాటుకు పట్టుబట్టినారు. మధులిమాయే వంటి పెద్దలు కూడా (యం.నారాయణరెడ్డి గారి కృషివల్ల) పార్లమెంటరీ కమిటీ కోసం డిమాండ్‌ చేసినారు. ”కమిటీని వేయడం ఆంధ్రప్రదేశ్‌ ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమే”నన్న ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డిపై ”సభాహక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని కూడా గతంలో మధులిమాయే ప్రతిపాదించారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో అప్పటి సభాపతి నీలం సంజీవరెడ్డి కూడా ”పార్లమెంటరీ సంఘం’ ఏర్పాటు చేయాలన్నారు.

దీనిపై హోంమంత్రి చవాన్‌ ”పార్లమెంటరీ సంఘం తెలంగాణ సమస్యపై నియమించాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదు” అని అంటూనే ”మీరు కావాలని అనుకుంటే నియమించుకోవచ్చు” నని స్పీకర్‌ స్థానంలో వున్న నీలం సంజీవరెడ్డితో అన్నారు. ప్రభుత్వానికి ఇష్టం లేనప్పుడు ‘తనకెందుకులే’ అని ఇక ఆ విషయం ఎప్పుడూ ప్రస్తావించలేదు నీలం సంజీవరెడ్డి.

‘విభజన’ను సిఫార్సు చేస్తుందని తెలుసుకున్న ప్రధాని ఇందిరాగాంధీ 9-3-1966న కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశాన్ని ఏర్పాటుచేసి కమిటీ నివేదిక సమర్పించడానికి ముందే ప్రత్యేక పంజాబ్‌ రాష్ట్ర ఏర్పాటుకు సిఫార్సు చేసింది. 1-11-1966న ప్రత్యేక పంజాబ్‌ రాష్ట్రం ఏర్పడింది.

లోకసభలో తెలంగాణ, ప్రతిపక్ష ఎం.పి.ల వాకౌట్‌

తెలంగాణపై పార్లమెంటరీ సంఘం ఏర్పాటును 22-8-69న కేంద్రప్రభుత్వం తిరస్కరించడంతో 8 మంది కాంగ్రెస్‌ సభ్యులు (వీరిలో 7గురు తెలంగాణ ఎం.పి.లు మిగిలిన ఒక్కరు మైసూర్‌ సభ్యుడు ఎం.వి.కృష్ణప్ప), సోషలిస్టు, కమ్యూనిస్టు, జనసంఘం సభ్యులు సభనుండి వెళ్ళిపోయారు. వారి సవరణలన్నీ సభ తిరస్కరించింది. తెలంగాణ సభ్యులు: జి.వెంకటస్వామి, జి.ఎస్‌.మేల్కోటే, బాకర్‌ అలీ మీర్జా, రమాపతిరావు, పి.గంగారెడ్ది, ఆర్‌.సురేంద్రరెడ్డి, జె.రామేశ్వర్‌రావు.

‘తెలంగాణా ఆందోళనను నిర్వహిస్తున్నవారు దౌర్జన్యాలు ఆపివేయాలని, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దమన చర్యలను ఆపివేయాలని, కేంద్ర ప్రభుత్వం అష్టసూత్ర కార్యక్రమాన్ని వెంటనే అమలు జరపాలని, తెలంగాణా ప్రాంతీయ సంఘానికి చట్టబద్దమైన అధికారాలివ్వాలని ప్రతిపాదించిన ఎన్‌.జి.రంగా పట్టుదలపై వోటుకు పెట్టగా సభ తిరస్కరించింది.

Other Updates