తెలంగాణ లోకాయుక్తగా జస్టిస్ చింతపంటి వెంకటరాములు, ఉపలోకాయుక్తగా రిటైర్డ్ జిల్లా జడ్జి వీ.నిరంజన్‌రావు రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేశారు. వారిచే గవర్నర్ తమిళిసై ప్రమాణస్వీకారం చేయించారు. ప్రమాణస్వీకారం అనంతరం లోకాయుక్త, ఉపలోకాయుక్తలకు గవర్నర్, ముఖ్యమంత్రి పుష్పగుచ్చం అందచేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, హైకోర్టు చీఫ్ జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్‌లు, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డితో పాటు పలువురు మంత్రులు పాల్గన్నారు.
మానవహక్కుల కమిషన్ ఛైర్మన్‌గా జస్టిస్ జి చంద్రయ్య బాధ్యతల స్వీకరణ
మానవహక్కుల కమిషన్ ఛైర్మన్‌గా జస్టిస్ జి. చంద్రయ్య బాధ్యతలు స్వీకరించారు. జ్యుడీషియల్ సభ్యులుగా విశ్రాంత జిల్లా జడ్జి ఆనందరావు, నాన్ జ్యుడీషియల్ సభ్యులుగా మహ్మద్ ఇర్ఫాన్ మొయినుద్దీన్ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి సంతోష్‌రెడ్డి, డీజీపీ మహేందర్‌రెడ్డిలు పాల్గన్న కమిషన్ ఛైర్మన్, సభ్యులను అభినందించారు.
లోకాయుక్తగా నియమితులైన జస్టిస్ సీవీ. రాములు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన వారు. బోధన్ సమీపంలోని అచ్చనపల్లిలో 1949లో జన్మించారు. హైస్కూల్ విద్యను బోధన్‌లో, డిగ్రీని నిజామాబాద్ గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో పూర్తి చేశారు. ఔరంగాబాద్ మరాఠ్వాడా వర్సిటీలో ఎల్‌ఎల్‌బి పూర్తి చేశారు. 1978లో న్యాయవాదిగా ప్రాక్టీసు ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 24 సంవత్సరాల పాటు ప్రాక్టీసు చేశారు. 2004లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులై 2011లో పదవీ విరమణ చేశారు. ఉపలోకాయుక్తగా నిమమితులైన రిటైర్డ్ జిల్లా జడ్జి నిరంజన్‌రావు అంతకు ముందు లా సెక్రటరీగా సేవలందించారు.
మానవహక్కుల కమిషన్ ఛైర్మన్‌గా నియమితులైన జస్టిస్ జి. చంద్రయ్య ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జన్నారం మండలం తిమ్మాపూర్‌లో 1954లో జన్మించారు. డిగ్రీ ఆదిలాబాద్‌లో పూర్తి చేసి, ఎల్‌ఎల్‌బి ఉస్మానియా యునివర్సిటీలో పూర్తి చేశారు. 1980లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బార్‌కౌన్సిల్‌లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. పలుశాఖలకు ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. 2005లో ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2006లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2016లో పదవీవిరమణ పొందారు.